అనసూయ ఆవకాయ
- Mohana Krishna Tata
- Jun 20
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #AnasuyaAvakaya, #అనసూయఆవకాయ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Anasuya Avakaya - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 20/06/2025
అనసూయ ఆవకాయ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
ఎండాకాలం రానే వచ్చింది. ఎక్కడ చూసినా ఆవకాయ హడావిడే. ఎప్పుడూ ఆవకాయ కొనడమే తప్ప పెట్టింది లేదు అనసూయ. భర్త ఆనంద్ ఎప్పుడూ బడ్జెట్ అని చెప్పి, బయట ఒక సీసా కొని తెచ్చేసేవాడు.. ఏమైనా అంటే, పొదుపు అనేవాడు.
"ఈ సంవత్సరం ఆవకాయ పెట్టలేదా?" అని అందరూ అడగడమే. ఆ మాటలకి తట్టుకోలేకపోయింది అనసూయ. వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఈసారి ఎలాగైనా ఆవకాయ పెట్టాలని గట్టిగా డిసైడ్ అయింది.
"ఏమండీ.. ! ఈసారి ఆవకాయ నేనే స్వయంగా పెట్టాలనుకుంటున్నాను.. కొనకండి"
"ఎందుకు? కొనుక్కుంటే తక్కువలో అయిపోతుందిగా.. అసలే నీకు వంట అంతంతమాత్రం వచ్చు.. ఎందుకు చెప్పు రిస్క్? నెలకొకసారి ఇలాగే ఏవో కొత్తగా చేస్తావు.. నాకు బోలెడంత నష్టం తెస్తావు. కిందటి నెల, నేను పొరపాటున కాఫీ బాగున్నాదని అంటే, కాఫీ షాప్ పెట్టేసావు. ఏమైంది? నీ కాఫీ నువ్వు నేను తప్ప ఎవరూ తాగలేదు"
"అప్పుడంటే, కాఫీలో పంచదార వేస్తారో, ఉప్పు వేస్తారో తెలియక రెండూ వేసేదానిని. జనాలకి నచ్చలేదు"
"అందుకే ఇప్పుడు ఈ ఆవకాయ ప్రయత్నం వద్దంటున్నాను.. "
"కాదండీ.. నేను ఆవకాయ పెడితే, కమ్మగా ఉంటుంది.. తక్కువలో అయిపోతుంది"
"కమ్మగా ఉండడం తర్వాత తెలుస్తుంది గానీ.. తక్కువలో ఎలా అవుతుందో చెప్పు?"
"మన ఎదురింటి పంకజం మామిడి చెట్టువి ఒక నాలుగు కాయలు అడిగితే సరి.. మిగిలిన సామానులు మీ బడ్జెట్ లోనే అయిపోతాయి.. "
"నువ్వు ఎన్ని చెప్పినా, నేను ఒప్పుకోను.. ఎప్పటిలాగానే, ఒక సీసా కొనేసి తెస్తాను.. నా మాట విను. సంవత్సరం నుంచి చేస్తున్న ప్రయోగాలు చాలు, పైగా నా ఎడమ కన్ను కూడా తెగ అదురుతోంది"
"నేను ఇంత చెప్పినా ఒప్పుకోరా.. ? ఒప్పుకోకపోతే.. నేను ఫేమస్ ఎప్పుడు అవుతాను? ఫ్రీగా మనం ఫ్లైట్ ఎలా ఎక్కుతాము చెప్పండి? " అని కోపంగా అంది అనసూయ
"బస్సు ఎక్కినా, పర్వాలేదు.. ట్రైన్ ఎక్కినా ఓకే. తేడా వస్తే, ఎలాగోల బతికి బయట పడొచ్చు.. గాలిలోకి ఎగిరితే, దిగుతామో లేదో తెలియదు. మెత్తటి సీట్ లో, ఏసీ లో కూర్చోని పైకి పోవడం ఎందుకు చెప్పు.. ? ఈ ఒక్కసారికి నీ ఆవకాయ ప్రపోజల్ కి ఒప్పుకుంటాను"
"నేనంటే ఎంత ప్రేమండి మీకు.. "
"నీకూ నాలుగు అవకాశాలు ఇవ్వాలిగా మరి" అని నవ్వుతూ అన్నాడు
('నిన్ను వద్దనుకున్న రోజు, నేనే నిన్ను ఒక డొక్కు ఫ్లైట్ లో ఎక్కించేసి, హ్యాపీగా ఉంటాను. నువ్వు పోతూ.. నన్ను కోటీశ్వరుడను చేస్తావు. నీ చావు ఫ్లైట్ అకౌంట్ లో పోతుంది. నేను కిల్లర్ ని అవనవసరం కూడా లేదు' - ఇది ఆనంద్ మైండ్ వాయిస్)
"హమ్మయ్యా ఒప్పుకున్నారు.. ! అయితే లిస్టు చెబుతాను.. మార్కెట్ కి వెళ్లి తీసుకురండి. నేను ఇలా వెళ్లి, అలా మామిడికాయలు తెచ్చేస్తాను"
"ఏమిటి.. నాలుగు ఐటమ్స్ అంతేనా.. ? బిల్ తక్కువే అవుతుంది.. " అని మురిసిపోయాడు ఆనంద్
హుషారుగా మార్కెట్ కు వెళ్లి.. అనసూయ ఇచ్చిన లిస్టు లో నాలుగు ఐటమ్స్ తీసుకున్నాడు. వెంటనే భార్యకు ఫోన్ చేసాడు..
"అనసూయా.. ! లిస్టులోవి కొనడం అయిపోయింది.. స్టార్ట్ అవుతున్నాను.. "
"ఏమండీ.. ! పంకజం హ్యాండ్ ఇచ్చింది.. కాయలు ఇవ్వడానికి లేదంట. అది కాయలు ఇవ్వకపోతే, నేను ఆగిపోతానా.. అనసూయ ఇక్కడ! మీరు అక్కడే ఒక పది కాయలు కొని తీసుకురండి.. పంకజం చెట్టు కాయల కన్నా పెద్దవిగా ఉండాలి. మనింట్లో కాయలు కొట్టడానికి మంచి కత్తి కూడా లేదు.. ఒకటి కొనండి. తర్వాత మంచి ఆయిల్ తీసుకోండి.. ఆవకాయ కోసం సెపరేట్ గా ఉంటుంది.. మీరు ఎప్పుడూ తీసుకునేది వద్దు. ఐటమ్స్ అన్నీ కూడా అంతే.. మంచి కంపెనీవే అయి ఉండాలి"
"అలాగే.. "
బిల్ అమాంతం పెరిగిపోయింది. ఆనంద్ బీపీ కూడా బిల్ నే ఫాలో అయింది. ఈలోపు మళ్ళీ ఫోన్..
"ఏమండీ.. !ఉదయం బీపీ టాబ్లెట్ వేసుకున్నారుగా? "
"వేసుకున్నాను.. చెప్పు"
"అయితే వినండి.. నాకు ఒక మంచి చీర తీసుకోండి.. చూడడానికి చాలా బాగుండాలి. అలాగే, ఒక నెక్లెస్.. చూడడానికి బంగారం లాగే ఉండాలి. ఇప్పుడు బంగారం కొనమని మీకు బడ్జెట్ పెంచలేను కదా! చూడండి నేను ఎంత మంచిదాననో.. ! అలాగే ఇంకో నాలుగు సరుకులు కావాలి"
"ఇవన్నీ ఎందుకు.. ? నీ పుట్టిన రోజు కాదు, మన పెళ్ళిరోజు కూడా కాదు.. "
"మీకు చెప్పనే లేదుగా.. నేను ఒక శపధం పట్టాను. దానికోసమే ఈవన్నీ.. "
"శపధానికి చీరలు, నగలు ఎందుకో.. ?"
"ఉదయం ఎదురింటి పంకజం నన్ను అవమానించింది. వంటే సరిగ్గా రాని నీకు, ఆవకాయ ఎందుకు? నా చెట్టుకాయలు వేస్ట్ అయిపోతాయి.. నేను ఇవ్వను అంది"
"అవునా.. ? అలా అందా?" అన్నాడు ఆశ్చర్యంగా ఆనంద్
('నిజమే కదే.. నీ వంట సంగతి ఈ వీధిలో అందరికీ తెలుసు' - ఇది ఆనంద్ మైండ్ వాయిస్ )
"నేను చాలా హర్ట్ అయ్యాను. అప్పుడు నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మీరు నేను చెప్పినవన్నీ కొని ఇంటికి రండి. మీరు పెట్టిన మదుపుకి పదింతలు వస్తుంది సుమా. వచ్చేటప్పుడు మంచి కెమెరా ఉన్న ఫోన్ తెండి. ఫోటోలు, వీడియోలు అందంగా రావాలి.. కెమెరా లో నేను, నా చీర చాలా అందంగా కనిపించాలి సుమా.. "
ఇంటికి వచ్చిన ఆనంద్ కి ఇల్లంతా కొత్తగా కనిపించి, ఇది మా ఇల్లు కాదని వెళ్ళిపోబోయాడు..
"ఏమండీ.. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?"
"ఇది మన ఇల్లేనా?"
"అవునండి.. మీకు చెప్పిన సర్‌ప్రైజ్ ఇదే. ఈ అందమైన సెట్ లో ఇప్పుడు నేను ఆవకాయ పెట్టేదంతా వీడియో తీసి.. నెట్ లో అప్లోడ్ చేస్తాను. అలాగే, మైసూరు పాక్, జంతికలు కూడా చేసి అప్లోడ్ చేస్తాను. బోలెడన్ని వ్యూస్ వస్తాయి.. మీకు డబ్బులే డబ్బులు. ఆ ఎదురింటి పంకజానికి బుద్ధి చెప్పినట్టుగా కూడా ఉంటుంది.. ప్రపంచమంతా నా గురించి తెలుస్తుంది. నేను ఫేమస్ అయితే, ఫ్రీగా ఫ్లైట్ లో ఇంటర్వ్యూ కి పిలుస్తారు"
"నిజమా.. ! ఫ్లైట్ ఎక్కాలని నీ కోరిక చాలా బలంగా ఉందే"
"అవునుమరి.. మీరా డబ్బులు పెట్టి ఫ్లైట్ టికెట్ కొనరు.. నా టాలెంట్ తో నేనే ఫ్లైట్ ఎక్కుతాను.. ఫ్రీగా"
అన్ని వంట వీడియోలు తీసి అప్లోడ్ చేసింది అనసూయ. మర్నాడు బోలెడన్ని మెసేజెస్ ఇలా వచ్చాయి..
1. "నువ్వు చేసిన ఆవకాయ తిన్న తర్వాత, మావారు రాత్రంతా బాత్రూం లోనే ఉన్నారు.. మంచి విరోచనమందు లాగ ఉంది. హాస్పిటల్ బిల్ పంపిస్తాను.. కట్టు"
2. "ఉప్పు, కారం లెక్క తప్పింది.. కడుపులో అదోలాగా ఉంది.. వంట రాకపోతే, ఇంట్లో కూర్చో"
3. "ఇకమీదట వంట వీడియోస్ అప్లోడ్ చేస్తే, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను.. "
4. "మైసూరు పాక్ తో మా ఇంట్లో గోడకి మేకులు కొడుతున్నాము. బాగా చేసావు.
5. "జంతికలు తిన్న మా ఆవిడ పళ్లన్నీ ఊడిపోయాయి. డెంటిస్ట్ బిల్ నీకు పంపిస్తాను.. వెంటనే కట్టు.. లేకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతాను"
6. "రోజూ నీ వంట తింటున్న మీ ఆయన ఇంకా బతికే ఉన్నాడా.. ?"
అంటూ ఇంచుమించు అన్నీ ఇలాంటి మెసేజెస్ వచ్చాయి. కొన్నింట్లో అయితే, బూతులు నేర్చుకుని మరీ తిట్టినట్టుగా ఉన్నాయి.
"నీ వంటలు తిని జనాలకు అయింది చాలు. ఇంకా ఎవరికైనా ఏమైనా అయితే నేను తట్టుకోలేను" అంటూ బాధపడ్డాడు ఆనంద్
"చూడండి.. ! మీరు ఇలా బాధపడితే.. నేను కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్లిపోతాను.. బస్సు టికెట్ బుక్ చెయ్యండి. ఈసారి ఇంకో కొత్త ప్లాన్ తో మళ్ళీ వస్తాను"
"సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. నాకూ నీ కోరిక తీర్చే టైం వచ్చింది. నీకోసం ఫ్లైట్ లో నేనే టికెట్ బుక్ చేసి.. నిన్ను పైకి పంపిస్తాను.. " అంటూ ఆనందంగా అన్నాడు ఆనంద్.
************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments