నాలుక చివర నుంచి
- Srinivasarao Jeedigunta

- Jun 20
- 7 min read
#JeediguntaSrinivasaRao, #NalukaChivaraNunchi, #నాలుకచివరనుంచి, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguStory, #తెలుగుకథ

Naluka Chivara Nunchi - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 20/06/2025
నాలుక చివర నుంచి - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
అది ఒక చిన్నపాటి టౌన్ కి ఆనుకున్న గ్రామం. అందులో పౌరహిత్యం చేసుకుంటున్న సకల శాస్త్రాలు చదివిన సోమయాజులు గారు అతని భార్య రుక్మిణి, ముగ్గురు కొడుకులతో అద్దె యింట్లో వుంటున్నారు. సోమయాజులు గారు ఆ గ్రామం లో మరియు టౌన్ కి కూడా వెళ్ళి అన్ని రకాల కార్యక్రమాలు అంటే పెళ్లిళ్లు, వ్రతాలు, గృహప్రవేశాలు చేయిస్తూ పిల్లలని చదివించు కుంటున్నాడు. అలా అని బీదవాడు కాదు, తండ్రి నుంచి వచ్చిన రెండు ఎకరాల భూమిలో కాలిఫ్లవర్, క్యాబేజి, వంకాయలు, నిలువెత్తు తోటకూర కాడలు, పొట్లకాయ, సొరకాయ లాంటి కూరగాయలు పండిస్తో వుండే వాడు.
సకల శాస్త్రాలు వచ్చిన సోమయాజులు గారిని ఆ వూరి జనం వాళ్ళ యింట్లో ఏ మంచి జరిగినా పిలిచి పూజలు చేయించుకుని ఘనంగా డబ్బులు యిచ్చి దీవెనలు పొందేవారు.
సోమయాజులు గారు శనివారం సాయంత్రం తన తోటకి వెళ్ళి అన్నిరకాల కూరగాయలు కోసుకుని యింటికి తీసుకొని వచ్చి, ఆదివారం ఉదయం కూరగాయల సంచులు అరుగు మీద పెట్టుకుని ఆ దారిన వెళ్లే వారిని పిలిచి, “ఈ కూరగాయలు మా తోటలో కాసినవి, ఆర్గానిక్ కూరగాయలు, మీ యింట్లో కి ఎన్ని అవసరమో చెప్పండి”, అంటూ వాళ్ళకి పంచిపెట్టేవాడు. కొంతమంది డబ్బులు ఇవ్వబోతే తీసుకోకుండా, “పర్వాలేదు ఆరోగ్యవంతమైన మా కూరగాయలు మాతో పాటు మీరు తినండి, అదే నాకు సంతోషం” అనేవాడు.
“ఎందుకండి ఉదయం లేచి కూరగాయలు అమ్మేవాడిలా అందరిని పిలిచి యివ్వడం, పెద్ద బజార్ లో షాప్ వాళ్ళకి చెప్పితే అంతో ఇంతో యిచ్చి తీసుకుని వెళ్తారుగా” అంది రుక్మిణి.
“తినే కూరగాయలు అమ్ముకునే ఖర్మ మనకి ఎందుకు, నా సంపాదన మనకి చాలు, మా నాన్న యిచ్చిన భూమిలో సరదాగా వేసిన మొక్కలకి వచ్చిన కూరగాయలు కూడా అమ్ముకోవాలా? నలుగురుకి కూరగాయలు పంచుతున్నప్పుడు వున్న ఆనందం అమ్ముకుంటే రాదు” అన్నాడు సోమయాజులు.
“ఏమో మీ చాదస్తం, ఎక్కడికి వెళ్లినా నన్ను ఆ కూరగాయలు యిచ్చే వాళ్ళ ఆవిడ అంటున్నారు, చివరికి నా పేరు నేనే మర్చిపోతానేమో అని భయంగా వుంది” అంది మంగళవారం పూజల కోసం శనగలు నానపోస్తో.
ముగ్గురు పిల్లల ఉద్యోగాలు హైదరాబాద్ లో వచ్చాయి. సోమయాజులు గారి పెంపకం లో పెరగడం తో పెళ్లిళ్ల గురించి తమ తల్లిదండ్రులకే బాధ్యత అప్పగించడం తో మంచి సంబంధాలు చూసి ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసేసాడు. కోడళ్ల ఆస్తులు చూడకుండా గుణం ముఖ్యం అనుకుని మధ్య తరగతి కుటుంబాలలో సంబంధం కలుపుకున్నాడు.
ఏడాది కి రెండు మూడు సారులు రుక్మిణి, కొడుకులు దగ్గరికి వెళ్ళి ఒక నెల వుండి వచ్చేది. సోమయాజులు గారికి వృత్తి లో ఖాళీ ఉండేది కాదు, ప్రతీ రోజు ఎక్కడో అక్కడ వ్రతం, లేదా ఉపనయనం, పెళ్లి లాంటివి ఉండటం తో భార్య, కొడుకుల దగ్గరికి వెళ్లినా భోజనం కి యిబ్బంది ఉండేది కాదు. ఏ శుభాకార్యం లేకపోతే తనే వండుకుని తినేవాడు. వంట చెయ్యడం లో అయన తరువాతే ఆడవాళ్లు అయినా.
రోజులు సవ్యంగా జరుగుతున్నాయి, ఒకరోజున భర్తకి భోజనం పెట్టి విసురుతో “ఏమండీ! పౌరహిత్యంలోకి యువకులు వచ్చేసారు, పూర్వం ఉన్నట్టు యిప్పుడు మీరు అంతగా బిజీగా లేరు, వయసు కూడా మీద పడింది, యింకా ఆ కూరగాయల తోట అంటూ తిరిగాటం, యిలా అద్దె కట్టుకుంటో అద్దె యింట్లో ఉండటం ఎందుకు చెప్పండి. పిల్లల డబ్బులు నాకు అక్కరలేదు, నిన్ను నన్ను పోషించగల శక్తి నాకు వుంది అని అంటారు, అందుకే నా మాట విని ఆ రెండు ఎకరాలు అమ్మేసి వచ్చిన డబ్బుతో యిల్లు కొనుక్కుని, కొంత బ్యాంకులో వేసుకుంటే వడ్డీతో మనం శేషజీవితం గడిపేసేయవచ్చు ఆలోచించండి” అంది రుక్మిణి.
భార్య వంక ఒకసారి చూసి “నిజమే. నాకు ఈ మధ్య మంత్రం చెపుతున్నప్పుడు కొద్దిగా ఆయాసం వస్తోంది. మంత్రం మధ్యలో ఆగితే దోషం, అయినా ఆ స్థలం మా నాన్న యిచ్చింది, రేపు పిల్లలు మా తాతయ్య యిచ్చిన పొలం మా నాన్న అమ్మేసుకున్నాడు అనుకుంటే బాగుండదు” అన్నాడు.
“మీ చాదస్తం కాని పిల్లలు ఈ పల్లెటూరు వచ్చి ఈ పొలం చూసుకుంటారా, మన తరువాత అయినా అమ్మేస్తారు. అదే మనమే అమ్ముకుని మామగారు యిచ్చిన దానికి మనం సుఖపడాలి, ఆ తరువాత పిల్లలే అమ్ముకుంటారో, నాన్న గారి ఆస్తి ఆని ఉంచుకుంటారో వాళ్ళ ఇష్టం” అంది.
“సరే నీ ఇష్టం, మొన్న మంత్రానికి వెళ్లిన రెడ్డిగారు తమ ఇల్లు అమ్మేసి నగరం లో కూతురు దగ్గరకి వెళ్ళాలి అనుకుంటున్నాము అన్నారు, అడిగి చూస్తాను, ఎంతకి అమ్ముతారో” అన్నాడు.
“పాత ఇల్లు కొనడం ఎందుకండి, కొత్త ఇల్లు కొనుకుందాం ఆ వైపు ప్రయత్నించండి” అంది.
“యిప్పుడు పల్లెటూరు లో కొత్త ఇళ్ళు ఎవ్వరు కడుతున్నారే, అందరూ పట్నం పోతున్నారు, ఏదో ఇల్లు కొనుక్కుని స్వంత ఇల్లు వుంది అనిపించుకోవాలి అంతే” అన్నాడు సోమయాజులు గారు.
ఆ రోజు సాయంత్రం రెడ్డిగారింటికి వెళ్ళాడు సోమయాజులు గారు. ఆయన్ని చూసి రెడ్డిగారు లేచి బయటకు వచ్చి, “నమస్కారం పంతులుగారు, రండి” అంటూ లోపలికి తీసుకుని వెళ్లి కూర్చోపెట్టాడు.
“నేను వచ్చిన విషయం ఏమిటంటే ఎన్నాళ్ళు అని కిరాయి యింట్లో ఉంటాము, అందుకే ఏదైనా మంచి ఇల్లు కొనాలి అని కోరిక, అదివరకు తమరు మీ ఇల్లు అమ్ముతాము అన్నారు కదా, ఆ నిర్ణయం లో ఏమైనా మార్పు లేకపోతే మాకు యిస్తారేమో” అని అన్నారు సోమయాజులు గారు.
“సరైన బేరం దొరకలేదు పంతులుగారు, మేము రాబోయే మూడు నెలలలో మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ సమయానికి సొమ్ము యిచ్చి రాతకోతలు పూర్తి కావాలి. అందరికీ, 25 లక్షలు చెప్తున్నాను, మీరు కొనుకుంటాము అంటే ఇరవై రెండు లక్షలకే యిచ్చేస్తాను, యింటి పురోహితుడితో బేరం ఏముంటుంది, వీలుంటే వూరికే యిచ్చేసేవారు పూర్వం మా రెడ్డి రాజులు, యిప్పుడు రోజులు మారిపోయాయి” అన్నాడు.
“సరే రెడ్డిగారు, నా రెండు ఎకరాల తోట బేరం పెడతాను, మీరు అన్నట్టుగా మూడు నెలల లోపున డబ్బులు యిచ్చేస్తాను” అన్నాడు.
“ఎందుకైనా మంచిది ఒకసారి అమ్మగారికి కూడా ఇల్లంతా చూపించండి” అన్నాడు రెడ్డి గారు.
“అలాగే” అంటూ రెడ్డిగారు యిచ్చిన మామిడి పళ్ల సంచి తీసుకుని ఇంటికి వచ్చి భార్యకి జరిగిన విషయం చెప్పాడు. మంచిరోజు చూసి ఈ తోట అమ్మబడును అని రాసిన బోర్డు తీసుకుని వెళ్లి తోటలో గేటుకి తగిలించి రోజు ఒంటిగంట వరకు అక్కడే కూర్చుని వచ్చిన వాళ్ళకి తోట చూపించేవాడు. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అన్నట్టుగా వచ్చిన వాళ్ళు తక్కువ ఖరీదుకి అడగటంతో నిరుత్యాహం వచ్చింది సోమయాజులుగారికి. రేపు ఎంత వస్తే అంతకు అమ్మేస్తాను, రోజు తోటలో కూర్చోవడంతో నేను చేసుకునే నిత్య కార్యక్రమాలు కి ఆటంకం కలుగుతోంది అన్నాడు భార్యతో.
మర్నాడు ఇడ్లీలు తిని తోటకు బయలుదేరి వెళ్లి కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటో ఉండగా కాలు మీద ఏదో కుట్టి పాకుతున్నట్టు అనిపించి చూసాడు. గుండె ఆగినట్టు అయ్యింది. నల్లటి నాగపాము పొదలలోకి వెళ్లడం చూసి, కెవ్వున అరిచాడు. యజమాని అరుపులు విని మొక్కలకి నీరుపడుతున్న పనివాళ్ళు పరుగున వచ్చి చూసే సరికి సోమయాజులుగారి నోట్లో నుంచి నురగలు రావటంతో ‘అయ్యో.. స్వామి కి పాము కరిచినట్టు వుంది’ అని వెంటనే మట్టి తరలించే ట్రక్ లో పడుకోబెడుతోవుండగా సోమయాజులుగారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంటిలో వంట చేస్తున్న సోమయాజులు గారి భార్యకి విషయం తెలిసి భర్త మరణం తట్టుకోలేక హార్ట్ ఆగిపోయింది.
తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి మరణించడం తట్టుకోలేక సోమయాజుల గారి పిల్లలు తోటని తెగనమ్మి వచ్చిన డబ్బుతో పట్నం వెళ్లిపోయారు.
సంవత్సరాలు గడిచాయి. అన్నదమ్ములు అరవై దాటేసారు. ఒకసారి తల్లిదండ్రుల తిధి నాడు అన్నదమ్ములు అందరూ తమ చిన్ననాటి వూరికి ఏదైనా ఉపకారం చెయ్యాలి అనుకున్నారు. సోమయాజుల గారి పెద్దకొడుకు తను చదువుకున్న కాలేజీ గ్రంధాలయం కి ఒక ఇరవై వేలు పెట్టి టెక్స్ట్ బుక్స్ కొని డొనేట్ చేస్తాను అన్నాడు.
రెండవ కొడుకు “నేను చదువుకున్న స్కూల్ లో ఫాన్స్ లేక చాలా యిబ్బంది పడ్డాము. అందుకే ఎన్ని ఫాన్స్ అవసరం అయితే అన్ని కొని యిస్తాను, మంచినీళ్లు కోసం ఒక కూలర్ కొని యిస్తాను” అన్నాడు. చివరి వాడు “నేను మన ఊరి శివాలయంకి కలర్ వేయిస్తాను” అన్నాడు.
“అనుకున్నారుగా వెంటనే బయలుదేరి మీ కోరికలు తీర్చుకోండి” అంది వదినగారు.
ఎలాగో రిటైర్ అయ్యాము కాబట్టి ఒక వారం రోజులు మన వూరిలో ఉండి అన్ని పనులు చేయించి వద్దాము అనుకున్నారు. ఈ విషయం తమతో చదువుకుని ఆ ఊరిలోనే వ్యసాయం చేసుకుని బాగా సెటిల్ ఆయిన కోటేశ్వరరావు కి చెప్పారు.
“చాలా సంతోషం. మీరు వచ్చి మా ఇంట్లోనే ఉండాలి, మేడమీద వున్న గదులు మీ కోసం సిద్ధం చేయిస్తా” అన్నాడు.
అనుకున్నట్టుగా తాము పుట్టిపెరిగిన ఊరు కి చేరుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు స్టేషన్ కి కారు పంపించడంతో శ్రమ లేకుండా బయలుదేరారు. ఊరు చాలా మారిపోయింది. అదివరకు ఎక్కువగా మిల్టరీ హోటల్స్ ఉండేవి, యిప్పుడు అన్నీ పెద్ద పెద్ద భవనాలు, సినిమా హాల్స్, రోడ్డు కూడా విశాలంగా ఉన్నట్టు ఉండటం తో “అబ్బాయి.. మనం మన వూరికే వచ్చామా?” అని ఆడిగాడు తమ్ముడిని.
“ఎప్పుడో ముప్పై ఏళ్ళ కి ముందు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాము, మార్పు సహజం” అన్నాడు తమ్ముడు.
కోటేశ్వరరావు యిల్లు అప్పటిలోనే డాబా, యిప్పుడు మూడు అంతస్థుల మేడ. కారు చప్పుడు వినగానే కోటేశ్వరరావు ఎదురువచ్చి స్నేహితులని లోపలికి తీసుకుని వెళ్ళాడు. మొదటి అంతస్థులో వున్న మూడు గదులు చూపించి “యిదిగో రా మీ ముగ్గరికి మూడు గదులు, ఫ్రెష్ అప్ అయ్యి, కిందకి రండి టిఫిన్ రెడీ అవుతుంది ఈ లోపు” అన్నాడు కోటేశ్వరరావు.
“అబ్బాయి.. శివాలయం కి కలర్ అంటే వారం పట్టవచ్చు. అందుకే ముందు నీ పనితో మొదలుపెట్టి తరువాత స్కూల్, కాలేజీ కి వెళ్దాం” అని అన్నగారు చెప్పటం తో సరే అని శివాలయం కి బయలుదేరారు. తాము వెళ్లిన చోట పెద్ద గుడి రంగు రంగు కలర్స్ తో మెరిసిపోతోంది.
“బాబూ యిక్కడ శివాలయం ఉండాలి కదా అది ఏమైంది” అని అడిగారు ఆటో అతనిని.
అతను ఒకసారి విచిత్రంగా చూసి “అదే ఈ గుడి, పది సంవత్సరాలనుండి గవర్నమెంట్ వారు నిర్వహించడం తో గుడి బాగుపడింది” అన్నాడు.
అదివరకు గుడి గుమ్మం లోకి అడుగుపెట్టగానే గర్భగుడి, శివుడు కనిపించేవారు. యిప్పుడు లోపలికి చాలా దూరం నడిచిన తరువాత గుడి మండపం, లోపల పూజారి గారు చాలా మందిని కూర్చోపెట్టి అభిషేకం చేస్తున్నారు. హడావుడి తగ్గిన తరువాత పూజారిగారిని ఆడిగాడు సోమయాజులగారి పెద్ద కొడుకు, “అయ్యా మేము ఈ వూరి వాళ్ళం, ముప్పై సంవత్సరాల ముందు. యిప్పుడు పట్నం లో ఉంటున్నాము. ఈ గుడిలో శంకరాచారి అని పెద్ద పూజారి వుండే వాళ్ళు. వాళ్ళ అబ్బాయి కైలాష్ మాతో చదువుకున్నాడు, వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా” అన్నాడు.
పూజారి ఒకసారి వీళ్ళని పరిశీలన గా చూసి, “మీరు సోమయాజుల పంతులు గారి పిల్లలా, నువ్వు వేణు కదూ” అన్నాడు సోమయాజుల గారి పెద్ద కొడుకుని గుర్తించి.
“అవును. అయితే నువ్వు కైలాష్ అన్నమాట, చాలా సంతోషం రా, పూజలు మీ శిష్యుడు కి అప్పగించి అలా కూర్చొని మాట్లాడుకుందాం రా” అని ఆప్యాయంగా చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళాడు.
“మీ నాన్నగారు ఈ గుడి పూజారిగా వున్నప్పుడు జనం లేక చెట్లు, గబ్బిలాలు తో వున్న గుడి, యిప్పుడు లైట్స్, కలర్స్, క్యూ లైన్స్ తో గుర్తుపట్టలేనట్టుగా వుంది” అన్నాడు వేణు.
“అవునురా అవి పాత రోజులు, ఈ గుడి పురాతనమైంది అవ్వడంతో గవర్నమెంట్ వారు కొంతమంది దాతల సహాయంతో ఈ విధంగా డెవలప్ చేశారు. యిప్పుడు నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయి నే అన్నాడు” నవ్వుతూ.
మిగిలిన విషయాలు మాట్లాడుకుని తరువాత పరమేశ్వరుడి దర్శనం చేయించి ముగ్గురికి మూడు కొబ్బరి చిప్పలు యిచ్చాడు పూజారిగారు. సోమయాజుల గారి మూడవ అబ్బాయి హుండీలో అయిదు వందలు, హారతి పళ్లెం లో అయిదు వందలు వేసి, పదండి అంటూ బయటకు బయలుదేరాడు.
బయటికి వచ్చిన తరువాత అన్నగారు అడిగారు “అదేమిటిరా గుడికి ఏదో ఖర్చు పెట్టి ఈ ఊరు ఋణం తీర్చుకుందాం అన్నవుగా, వెయ్యి రూపాయలతో సరిపెట్టేశావు” అన్నాడు.
“గవర్నమెంట్ తీసుకున్న గుడికి మనం ఏం చెయ్యగలం అన్నయ్య” అన్నాడు.
అలాగే స్కూల్ కి వెళ్ళి చూస్తే అదివరకు వున్న చోట స్కూల్ లేదు. “యిక్కడ స్కూల్ ఉండాలి ఏమైంది” అని అడిగితే అక్కడకి దగ్గరలో వున్న చింతతోపులో కి మార్చారు అని తెలుసుకుని చిన్నప్పుడు ఆ తోటలో ఉయ్యాల వేసుకుని ఆదుకునేవాళ్ళం అనుకుంటూ వెళ్లి చూసారు.
అదివరకు పాకలలో వున్న క్లాస్ రూమ్స్ యిప్పుడు పెద్ద బిల్డింగ్ లోకి వచ్చేసాయి, హెడ్ మాస్టర్ గది కూడా బాగుంది. తాము స్కూల్ తరగతి కి ఒక ఫ్యాన్ పెట్టిద్దాము అని వచ్చాము అయితే ప్రతీ క్లాస్ లో రెండు ఫ్యాన్స్ తిరుగుతున్నాయి, ఇహ మనం ఫ్యాన్స్ ఇవ్వడం ఎందుకు అనుకున్నాడు. వీళ్ళు స్కూల్ కి ఏదో డొనేషన్ ఇవ్వటానికి వచ్చారు అని తెలిసి, “మీరు నా రూమ్ లో ఏసీ పెట్టించండి” అన్నాడు హెడ్ మాస్టర్.
“ఏసీ గురించి మేము అనుకోలేదు, అయినా యిక్కడ యింకో వారం ఉంటాము, ఏసీ విషయం అలోచించి మీకు తెలియపరుస్తాము” అని బయటకు నడిచారు.
కాలేజీ దగ్గరికి వచ్చిన ముగ్గురు అన్నదమ్ములు తెల్లబోయారు. వెలవెలబోతున్న కాలేజీ వెలిసిపోయిన గోడలు చూసి. తాము చదువుకున్నప్పుడు సైకిల్ పెట్టుకోవడానికి కూడా చోటు ఉండేది కాదు, యిప్పుడు పది స్కూటర్లు మాత్రం కనిపించడం లేవు. లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ గారిని కలిసి తమ గురించి చెప్పి, కాలేజీ గ్రంధాలయం కు డిగ్రీ చదివే స్టూడెంట్స్ కోసం ఒక పదివేలు ఖర్చు పెట్టి టెక్స్ట్ బుక్స్ డొనేట్ చేద్దాము అని వచ్చాము అన్నారు.
ప్రిన్సిపాల్ గారు ఒక వెర్రి నవ్వు నవ్వి, “యిప్పుడు డిగ్రీ చేసే వాళ్ళు ఎవ్వరు వున్నారు, అందరూ ఇంజనీరింగ్ కి వెళ్లిపోతున్నారు. యిప్పుడు మా కాలేజీ లో బికామ్ లో పది మంది, బి ఎ లో పదిమంది వున్నారు. వాళ్ళకోసం పదిమంది లెక్చరర్లు వాళ్ళకి జీతం గంటకు యింత అని యిస్తున్నాము. మీరు చదువుకున్న కాలేజీకి ఏదైనా ఉపకారం చెయ్యాలి అనుకున్నారు కాబట్టి, ఒక లక్ష రూపాయలు డొనేట్ చెయ్యండి, ఈ నెల జీతాలకు సరిపోతుంది” అన్నాడు.
సోమయాజులగారి పెద్ద కొడుకు గుండె గుభేలు మంది. “సార్.. మేము చిన్న స్టేజి నుంచి ఈ స్టేజికి వచ్చాము. లక్షలు అంటే కష్టం. అయినా మా ఊరు వెళ్లిన తరువాత మా స్నేహితులు నుంచి కూడా డొనేషన్స్ వసూళ్లు చేసి ఎంతో కొంత కాలేజీ కి సహాయం పంపుతాము” అని చెప్పి బయటకు నడిచారు.
“ఇహ ఈ వూరిలో వారం రోజులు ఉండి ఏమి చేస్తాం, రాత్రి బస్సు కి వెళ్ళిపోదాం” అన్నాడు అన్నగారు.
పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ఈ ముగ్గురు అన్నదమ్ములు నిజంగా వూరికి ఉపకారం చెయ్యాలి అనుకుంటే చెయ్యగలరు, కాని ఆవేశం లో అనుకున్న దానాలు, నాలుక చివర నుంచి కార్యరూపం దాల్చవు.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments