top of page

ఒక కన్నె పిల్ల పరువు కోసం..

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #OkaKannepillaParuvuKosam, #ఒకకన్నెపిల్లపరువుకోసం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Oka Kannepilla Paruvu Kosam - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 19/06/2025

ఒక కన్నె పిల్ల పరువు కోసం - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


భోజనం చేసి వాష్ బేసిన్ లో చేతులు కడుక్కుని సోమశేఖరం తిరిగేటప్పటికి కాంతిమతి తువ్వాలు అందివ్వడానికి సిధ్ధంగా నిల్చుంది. తువ్వాలు అందుకుంటూ అన్నాడతడు- “నాకెందుకో ఆ కొత్త పని పిల్ల అదోలా ఉందోయ్! ”


కాంతిమతి నిజంగానే ఆశ్చర్య పోయింది. భర్త కావేరికి వ్యతిరేకంగా అలా చెప్పడం అది మూడవసారి. స్త్రీల పట్ల అందునా అమ్మాయిల పట్ల సహజంగా అతి సుతారంగా మెసలే సోమశేఖరం పని గత్తె విషయంలో ఎందుకంత కటువుగా మాట్లాడుతున్నాడో ఆమెకు బోధపడటం లేదు. ఇప్పుడైతే తన చెల్లి శ్వేత ఇంటి ఇల్లాలయింది గాని- అది పెళ్లవక మునుపు ఇంటికి వచ్చినప్పుడల్లా బావను ఆనవాయితీ ప్రకారం ఆటలు పట్టిస్తూ కవ్విస్తూ రెచ్చగొట్తుండేది. కాని ఏనాడూ స్పందించేవాడు కాడు సోమశేఖరం. దానికి మారుగా పెద్దరికంతో కూతురులా చూసుకునే వాడు. మరి ఇప్పుడేమయింది? 


కాంతిమతి చెప్పసాగింది- “విషయం అది కాదండీ! మనం వచ్చిందేమో కొ త్త పరిసరాలకు. అప్పటికిక్కడ ఈపిల్లే దొరికింది, మీకు చెప్పకుండా సెలెక్టు చేయడం తప్పే— కాని నాతో బాటు శ్వేతకూడా వచ్చిందిండీ కావేరి పూర్వాపరాలు తెలుసుకోవడానికి! ”


సోమశేఖరం ఇక మాట్లాడుకుండా ముందుకు కదలబోయాడు. కాని కాంతిమతి కదలనివ్వలేదు- “ఇంతకీ సమస్యేమిటండీ! ” 


“విసురెక్కువ--”


అంటే— అని అడుగుతున్నట్టు కనుబొగలెగరేసిందామె. 

“ఈ పిల్ల బాడీ లేగ్వేజీ నాకు ససేమిరా నచ్చలేదు. సౌమ్యత - సరళత్వం- ఏ మాత్రం కనిపించడం లేదు. కాఫీ కప్పు ఎలా పెడ్తుందో చూసావా- టీపాయ్ పైన మిర్రర్ విరిగిపోయేలా టప్పున 

పెడ్తుంది. వెళ్ళేటప్పుడు చెప్పాచెయ్యకుండా వాల్జడ విసురుకుంటూ తోసుకుంటూ వెళ్తుంది. ఈ మిడిసిపాటుంతా నేను గమనించలేదనుకునేవు. అందునా వయసులో ఉన్న నీ కొడుకులిద్దరూ కాలేజీ హాస్టల్ నుండి అడపాదడపా వచ్చి వెళ్లే అవకాశం ఉంది. ఇది మరచిపోకు”


అప్పుడు అక్కడకి శ్వేత దూసుకు వచ్చింది. ఊడిన బావ షర్టుకి గుండీలు వేస్తూ అడిగింది- “ఇంతకూ తమకున్న అభ్యంతరం ఏమిటి బంగారు బావా?”


“చెప్తాను. షర్టు గుండీలు వేసేసావా?”


తలూపింది శ్వేత


“ఐతే అటు కదులు. మొదట అక్కాచెల్లెళ్ళిద్దరూ ఒకటి గుర్తించండ. నేనేదో ద్వేషంతోనో- గుడిసె ప్రాంతపు అమ్మాయన్న దిగదుడుపు దృష్టితోనో ఇదేమీ అనడం లేదు. ఆ పిల్ల దేహభాష చెప్తుంది— దురుసుతనంతో అది దేనికైనా తెగించగల దిట్టని-- ”


ఇక భర్త అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఉచితం కాదని- చెల్లిని కూడా నోరు మెదపకని సైగ చేస్తూ అంది కాంతిమతి- 

“అలాగే—మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మరి మరొక మెయిడ్ సర్వెంటు దొరకడానికి రెండు నెలలైనా పడ్తుంది. అంతవరకూ కావేరితోనే సర్దుకు పోదాం. సరేనా?“”

అతడు తలూపుతూ మరదలు వేపు తిరిగి అడిగాడు- “నువ్వు ఊరికెళ్లడానికి ఎప్పుడు టిక్కెట్ బుక్ చేయ మంటావు? ఇప్పటికీ నిన్ను చూడకుండా ఉండలేనంటూ మాతోడల్లుడు రెండుసార్లు ఫోనుచేసాడు”


“మావారు అలాగన్నారా! అననియ్యి. మరి నాసంగతేమిటంట?”


అతడు అదోలా చూసాడు- అదేమిటన్నట్టు. 


“నిన్ను చూడకుండా నేనుండ లేను కదా బావా! ”


సోమశేఖరం చిరుకోపంగా చూసాడు- “మెతకవాణ్ణి చూస్తే మొత్తాలనిపిస్తుందట. ఇద్దరుబిడ్డలకు తల్లివయావు. నీ బుధ్ధి ఏమాత్రమూ పెరగలేదు” అంటూ కదిలాడతను. 


శ్వేత ఆపింది ””నిన్నెవరు మెతగ్గా ఉండమన్నారు బావా? గట్టిగానే ఉండొచ్చు గా!” 


ఆ మాటకు కాంతిమతి గుక్కతిప్పుకోకుండా నవ్వసాగింది. సోమశేఖరం గుర్రుగా చూసాడు “అక్కాచెల్లెళ్లిద్దరూ ఆటలు పట్టించడంలో తోడుదొంగలే!” అని మనసున అనుకుంటూ-- 


టూరుపైన రామవరం వెళ్లిన సోమశేఖరం మూడవ రోజు ఇంటినుండి అర్జంట్ ఎస్- ఎమెస్ అందుకున్నాడు. అది అందుకున్న వెంటనే అతడు ఇన్సెపెక్షన్ వ్వవహారాలన్నీ తన జూనియర్లకి అప్పచెప్పి ఎకాయెకిన ఊరు చేరాడు. 


చేరీ చేరిన వెంటనే భార్యపైనా మరదలు పైన ధుమధములాడాడు- “పోలీసుల జోక్యం కోరేముందు నాకొక మాట చెప్పవద్దూ! ” 

ఆ ఘాటైన మాటకు అక్కాచెల్లె ళ్ళిద్దరూ తలలు వంచుకున్నారు. 


“ఆడ పెత్తనం ఎక్కువైపోయిందీ ఇంట్లో! ”


అప్పుడు సంశయిస్తూ పెదవి విప్పింది శ్వేత- “అది కాదు బావా! గొలుసేమో ఖరీదై నది. మాఅత్తగారు నాకు ప్రేమతో పెట్టినది. అందులో నువ్వు ముందే చెప్పావుగా— కావేరి వ్యవహారం ఏ మాత్రమూ బాగలేదని— అందుకని-- ”


“నేనెప్పుడైనా ఆ పిల్లను దొంగపిల్లన్నానా? ఇంతకు మునుపెన్నడైనా కావేరికి క్రిమినల్ రికార్డుందని మీకెవరికైనా తెలుసా?”


ఈసారి కాంతిమతి భర్తవేపు దీనంగా చూసి “సారీ అండీ! శ్వేత గదిలోకి ఆపిల్ల తప్ప మరెవ్వరు వెళ్తారని- ” నసుగుతూ అంది. 


“అనుమానం వచ్చింది కదానని దగ్గరి బంధువుల్ని రప్పించినట్టు వెంటనే పోలీసుల్ని పిలిపించేయడమే? సరే దీనికి జవాబు చెప్పండి- ఆరోజు— అంటే గొలుసు పోయిన నాడు మనింటికి ఎవరెవరు వచ్చారు? బాగా గుర్తకు తెచ్చుకుని చెప్పండి. తోచినవారందరి పేర్లను ఎడాపెడా అప్పచెప్పకండి” 


అప్పడు శ్వేత ముందుకు వచ్చి చెప్పింది. “మొదట పాలవాడు- పిమ్మట గ్యాస్ కనెక్షన్ రిపేరు చేసేవా డు— అటు పిమ్మటేమో— మీ ఆఫీసు నుండి ప్యూను ఏదో పర్సనల్ ఫైలొకటి ఇచ్చి వెళ్లాడు”


“ఇంతమంది వచ్చి వెళ్ళినప్పుడు— కావేరిపైనే మీకెందుకు అనుమానం వచ్చింది? నోరు లేని పేద పిల్లనేగా! నేనేదో ఆ పిల్ల వ్యవహార శైలి నచ్చలేదన్నానేగా— మీలో అంతటి అనుమానపు పిశాచి నాట్యమాడిందీ? ఇప్పుడు కావేరి ఏదీ?”


“స్టేషన్ కి తీసుకెళ్లినట్టున్నారు“ అక్కాచెల్లెళ్ళిద్దరూ ముక్త కంఠంతో బదులిచ్చారు. 


అది విన్నంతనే నెత్తిపైన చేతినుంచుకున్నాడు 

సోమశేఖరం. ”నీకూ నీ చెల్లికీ పుట్టిన బిడ్డలందరూ మగపిల్లలేగా— ఆడకూతురు గాని మీ కడుపున పుట్టుంటే— కావేరి తల్లిదండ్రుల బాధ మీకూ తెలిసున్ను. రండి నాతో-- ” అంటూ అతడు పోర్టికోలో ఉన్న కారువేపు నడిచాడు. 


నడుస్తూనే కాంతిమతి సంజాయిషీ ఇవ్వసాగింది—“ కావేరీని స్టేషన్ కి తీసుకెళ్ళిన వారు మగ పోలీసులు కాదండీ— ఆడ పోలీసులే-- “


ఆ మాట విన్న సోమశేఖరం ఆగలేదు. బదులివ్వలేదు. చకాచకా నడుస్తూ కారులో కూర్చున్నాడు. కాంతిమతి మరు మాటకు తావులేకుండా ప్రక్కన కూర్చుంది. 


స్టేషన్ లో డిటిక్టివ్ ఇన్సెపెక్టర్ రాజారాం సోమశేఖరానికి సీటు చూపించాడు- చూపిస్తూ అన్నాడు— “ఇప్పుడిప్పుడే లేడీ ఎస్సై- మరొక ఇద్దరు లేడీ కానిస్టేబుల్సు మీ పనికత్తెను లోపలకు తీసుకెళ్లారు. త్వరలోనే విషయం బైటికొచ్చేస్తుంది”


ఆ మాట విన్నంతనే సోమశేఖరం చటుక్కున లేచి నిల్చున్నాడు. ఆ ఊపుకి ఇన్సెపెక్టరు కూడా లేచి నిల్చున్నాడు. 


“ప్లీజ్! వెంటనే ఇంటరాగే షన్ ఆపండి. మాఇంటి ఆడాళ్లు తొందరపడి మిమ్మల్ని పిలిచినట్టున్నారు. కంప్లెయింటు వాపస్ చేసుకుంటాం” 


ఇన్సెపెక్టర్ ఆశ్యర్యంగా చూసి ఇంటరాగేషన్ రూములోని పోలీసుల్ని పిలిపించి ఇంటరాగేషన్ ఆపమని ఆదేశాలు జారీ చేసాడు. 


“సారీ! రియల్లీ సారీ! ” అంటూ కంప్లెయింట్ వాపస్ చేసేలా తన స్వహస్తాలతో వ్రాసి అక్కాచెల్లిళ్లిద్దరి సంతకాలూ తీసుకుని ఇన్సెప్టెక్టర్ కి అందిచ్చాడు సోమశేఖరం. 


కంప్లెయింటు వాపస్ లెటర్ ని కాసేపు పరీక్షగా చూసి ఇబ్బందిగా ముఖం పెట్టి అన్నాడు ఇన్పెపెక్టర్- “ఇది మీరనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు సోమశేఖరంగారూ! మీరు సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్- మీకు తెలియనిదేముంది? కావేరి ఏ వర్గాని కి చెందిన అమ్మాయో ఏ పేటకు చెందినదో మీకు తెలుసు- ఆ వర్గపు నాయకులు గొడవలు లేవదీస్తారేమో! “


“ఔను. వాళ్ల కులుపోటోళ్ల అమ్మాయికి మర్యాదపోయిందని గొడవలు లేవదీసినా లేవదీస్తారు. ఇప్పుడు మేమేమి చేయాలి?”


“అవుటాఫ్ స్టేషన్ సెటిల్మెంటు కోసం కనీసం పాతిక వేలైనా ఎదురు చూస్తారు. ఎందుకంటే— ఇటువంటి కేసులు ఇంతకు ముందు రెండు మూడు చూసున్నాను” 


సోమశేఖరం మరు పలుకు లేకుండా చెక్ బుక్ తీసి కావేరి తండ్రి పేరడిగి అతడి పేర చెక్ వ్రాసి అందిచ్చాడు. ఇన్సెపెక్టర్ చెక్కుని అందుకోకుండా దానిని మూలన ఒదిగి ఉన్న కావేరికి కానిస్టేబుల్ ద్వారా అందిచ్చాడు.. 

సోమశేఖరం, మరొక సారి డిటెక్టివ్ ఇన్సెపెక్టర్కి థేంక్స్ చెప్పి కావేరి వద్దకు వెళ్లి- “భయపడకు. ఇకపైన ఏమీ జరగదు. మీ అమ్మానాన్నలెవరో నాకు తెలియదు. నేను సారి చెప్పానని చెప్పు. నేనిచ్చిన చెక్ ఓపెన్ చెక్కే- మీకు డబ్బు వెంటనే అందుతుంది’ అంటూ బైటకు నడిచాడతను. 


బైటకు వచ్చి కారులో కూర్చున్న తరవాత మరదలు వేపు తిరిగి అన్నాడు సోమశేఖరం- “నువ్వు ఊరుచేరుకునే ముందు అటువంటి గొలుసొకటి కొనిస్తాలే! ”


ఇంట్లో అడుగు పెట్టి పెట్టక ముందే కాంతిమతి భర్త చేయి పట్టుకుని తిన్నగా దేవుడి గదిముందుకి లాక్కు వెళ్లింది- “మొదట మీ మంచితనానికి జోహార్లు! ఇప్పుడు చెప్పండి- మీకు నిజంగానే కావేరి పైన అనుమానం కలగడంలేదూ?”

అతడు వెంటనే బదులి వ్వలేదు. భార్యావేపు మరదలు వేపూ తేరిపార చూసి- తలూపాడు. 


“అంటే?—మీకు కూడా కావేరి పైన అనుమానం ఉందనేగా-- ”


“ఔను. నాకు కూడా కావేరి పైనే అనుమానం- . అనుమానమేమిటి, అదే తీసుంటుంది“ కచ్చితమైన కంఠస్వరంతో అన్నాడతను. 


“మరెందుకు దానిని కాపాడారు?”


అతడు మరొక సారి అక్కాచెల్లెళ్లిద్దరి వేపు తేరి చూసి- “నాకు భోజనం పెట్టాలన్న ఉద్దేశ్యం ఉందా లేదా?”అంటూ అక్కణ్ణించి కదలి వెళ్లబోయాడు. 

కాంతిమతి అపింది- “కారణం చెప్పకుండా జారుకుంటే యెలా? మమ్మల్ని వెంగళమ్మలు చేయాలనా!”


“కారణం ముందే చెప్పాను. మీరిద్దరూ గమనించకపోతే అది నా పొరపాటెలా ఔతుంది ?” అతడిక ఆగకుండా డైనింగ్ టేబుల్ వేపు సాగిపోయాడు. 


మరునాడు ప్రొద్దుట ఇంటివాకిట కల్లాపు చల్లి ముగ్గు వేయడానికి తలుపు తెరచి బైటకు వచ్చిన కాంతిమంతికి గడప వద్ద పోలిథిన్ సంచీలో చుట్టిన పొట్లం కనిపించింది. 


అది చూసి “శ్వేతా! ఓసారి ఇలారావే! ” అని పిలిచింది. శేత వచ్చి చూసి పొట్లం విప్పింది. 


అందులో తన గొలుసూ—స్టేషన్లో బావ వ్రాసిచ్చిన పాతిక వేల చెక్కూ ఉన్నాయి. 

 

శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

ree





Comments


bottom of page