top of page

వీభోవరా - పార్ట్ 2

Updated: 3 days ago

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika


Veebhovara - Part 2 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 08/06/2025

వీభోవరా - పార్ట్ 2 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. 

ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. 

కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ. 

గతం గుర్తుకు తెచ్చుకుంటారు.

ఇక వీభోవరా - పార్ట్ 2 చదవండి.. 


కాశ్యప శర్మ తండ్రిగారి పేరు రామశర్మ. వారి ఇల్లాలి పేరు మాధవి. వారు ఉపాధ్యాయులు. సనాతనులు. వేదపండితులు. ఐదేళ్ళ ప్రాయంలో కాశ్యపశర్మను స్కూల్లో చేర్చారు. 

ఒకనాడు.. ఆ స్కూలుకు సయ్యద్ అనే ముస్లిమ్, ఒక బాలుని స్కూల్లో చేర్చడానికి తీసుకొని వచ్చారు. 


రామశర్మ గారికి సయ్యద్ మంచి పరిచయం ఒకే గ్రామవాసులైన కారణంగా.. 

"స్వామీ!.. నమస్కారం.. " వినయంగా చేతులు జోడించాడు సయ్యద్. 


"శ్రీ రామార్పణమస్తు!.. "


సయ్యద్ ప్రక్కన వున్న దాదాపు కాశ్యపశర్మ వయస్సు వాడైన బాలుని చూచాడు రామశర్మ. 

"సయ్యద్! ఈ అబ్బాయి ఎవరు?.. "


"అనాధ స్వామి. వీరిది మా అత్తగారి వూరు. ఈ బాబు తండ్రి వీడి వయస్సు రెండు సంవత్సరాల ప్రాయంలో మరణించాడు. వారి పేరు వసంతరాయ. ఒకప్పుడు బాగా బ్రతికిన వంశం వారిది. వసంతుడు నాకు మంచి స్నేహితుడు. నేను ఏదో నాకు తోచిన సహాయం ఆ తల్లికి నా మిత్రుడు గతించిన నాటినుండి చేస్తూ వచ్చాను. రెండు వారాల క్రితం ఆమె మరణించింది. ఆ సమయంలో నేను అక్కడే వున్నాను. వీడి చేతిని నా చేతిలో వుంచి ఆ తల్లి కన్నుమూసింది. వారికి అయినవారు ఎవరూ లేరు. వారిది ప్రేమ వివాహం. ఇరు కుటుంబాల వారూ (పెద్దలు) వీరిని వెలివేశారు. ఆ తల్లి అంతిమ సంస్కారం అయిన తరువాత వీడిని నాతో తీసుకొని వచ్చాను. మీకు తెలుసు కదా. నాకు ఆరుగురు సంతానం. నా ఇల్లాలు వీడిని నిరాదరణగా చూస్తూ వుంది. మీరు ధర్మ ప్రభువులు. వీడికి మీరే రక్షణ కల్పించాలి. " విచారంగా చెప్పాడు సయ్యద్. 


రామశర్మ సయ్యద్‍ను.. ఆ బాబును కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు. నిట్టూర్చాడు. 

"బాబు పేరు ఏమి సయ్యద్?.. "


"విజయ్ శర్మ"


పెద్ద నేత్రాలు, విశాలమైన ఫాలభాగం. ఏదో దివ్యకాంతి వర్చస్సు విజయ్ ముఖంలో గోచరించింది రామశర్మకు. 


’నాకు దైవం ఒక మగబిడ్డను ఇచ్చాడు. వాడికి తోడుగా వీడు. నేను పెంచుకొంటే తప్పేముంది. జగన్నాటక సూత్రధారి ఆ సర్వేశ్వరులు. ఎవరిని ఎవరితో ఎప్పుడు ఏ రీతిగా కలుపుతాడో, విడదీస్తాడో వారికే ఎరుక. నా అంతరాత్మ వీడిని పెంచుకోమని చెబుతూ వుంది. పెంచుకోవాలి. పెంచుకొంటాను’ అనుకొన్నాడు రామశర్మ. 


మౌనంగా ఆలోచనలతో వున్న రామశర్మను చూచి సయ్యద్.. 

"స్వామీ!.. నేను తప్పుగా మిమ్మల్ని కోరానా!.. " దీనంగా అడిగాడు. 


రామశర్మ పెదవులపై చిరునవ్వు.. 

"సయ్యద్! మీరు ఒప్పుగా మాట్లాడారు. తప్పుగా మాట్లాడలేదు. నొచ్చుకోకండి. ఈ క్షణం నుండి ఈ విజయ్ శర్మ నా రెండవ బిడ్డ. ఇతన్ని నేను పెంచుకొంటాను. విద్యాబుద్ధులు కాశ్యప్‍కు చెప్పినట్లుగానే ఇతనికీ నేర్పుతాను. ఇది ఆ దైవ సంకల్పంగా నేను భావిస్తున్నాను సయ్యద్" చిరునవ్వుతో చెప్పాడు రామశర్మ. 


సయ్యద్ ముఖంలో ఎంతో ఆనందం. 

’సోదరా వసంతరాయ! నీ బిడ్డను నేను చేర్చవలసిన చోటికే చేర్చాను. ఇకపై వాడి జీవితం చాలా బాగుంటుంది’ అనుకొన్నాడు సయ్యద్ మనస్సున. రామశర్మకు చేతులు జోడించి నమస్కరించాడు. 

"స్వామీ! మీరు చాలా గొప్పవారు. మీ మనస్సు ఎంతో విశాలం. నా కోర్కెను తమరు మన్నించినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. ఆ అల్లా ఈశ్వర్ మీ రూపంలో వీడిని కాపాడబోతున్నారు. ధన్యవాదాలు స్వామీ!.. " ఆనంద పారవశ్యంతో చెప్పాడు సయ్యద్. 


"అంతా దైవ నిర్ణయం సయ్యద్!.. మనదంటూ ఏమీ లేదు. మనం నిమిత్తమాత్రులం.. "


"అవును స్వామి.. అవును.. వెళ్ళొస్తాను. "


"మంచిది సయ్యద్. ఆ సర్వేశ్వరులు నిన్ను నీ ఇల్లాలు సంతతిని చల్లగా సదా చూస్తాడు" మనసారా ఆనందంగా పలికారు రామశర్మ. 


సమయం ఒంటిగంట.. 

ఇంటికి వెళ్ళి భోజనం చేసే సమయం. 

"కాశ్యప్!.. " పిలిచారు రామశర్మ. 


కాశ్యప్ వారిని సమీపించాడు. స్కూల్లో తండ్రిని ’నాన్నా’ అని పిలువకూడదు ’సార్’ అని పిలవాలనేది రామశర్మ కాశ్యప్ శర్మకు ఇచ్చిన శిక్షణ. 


"సార్!.. " అన్నాడు కాశ్యప్. 


"ఇతని పేరు విజయ్. ఇకపై ఇతను మన ఇంట్లోనే మనతో కలిసి వుంటాడు. విజయ్ నీకంటే పెద్దవాడు. నీకు సోదరతుల్యుడు. అతని నీవు ’అన్నా’ అని పిలవాలి. "


"అలాగే సార్!.. "


"పద ఇంటికి వెళ్ళి భోంచేసి వద్దాం. విజయ్ బాబు! మాతో రా నాన్నా. "


విజయ్ తలాడించాడు. 

స్కూల్ లాంగ్ బెల్ మ్రోగింది. 

ముగ్గురూ ఇంటివైపుకు బయలుదేరారు. 

కాశ్యప్ విజయ్ ముఖంలోకి చూచాడు నవ్వుతూ.. 

"నాపేరు కాశ్యప్!.. నీ పేరు?.. " ప్రక్కప్రక్కన నడుస్తూ మెల్లగా అడిగాడు కాశ్యప్. 


"విజయ్!.. " ముక్తసరిగా చెప్పాడు. 


"మంచిపేరు!.. " చేతిని అతని వైపుకు సాచాడు కాశ్యప్. 


"ఇకపై మనం అన్నతమ్ములం. నేను మీ తమ్ముణ్ణి. " అన్నాడు కాశ్యప్. 


విజయ్ కాశ్యప్ చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు. 

ఇరువురూ చిరునవ్వుతో రామశర్మ గారిని అనుసరించారు. 

పావుగంటలో వారు రామశర్మ గారి ఇంటిని సమీపించారు. 

వరండాలో రామశర్మ గారి అర్థాంగి మాధవి. 


కుర్చీలో కూర్చొని వారి రాకకై ఎదురుచూస్తున్న మాధవి లేచి నిలబడింది. అప్పటికి ఆమె ఆరుమాసాల గర్భిణి. 


ముగ్గురూ వరండాను సమీపించారు. 

చిరునవ్వుతో "రండి.. " స్వాగతం పలికింది మాధవి. 


వరండాలో ప్రవేశించి భార్యను సమీపించి రామశర్మగారు.. 

"మధూ!.. ఈ బాబు పేరు విజయ్. ఇకపై అతనికి మనమే తండ్రి తల్లి.. " చిరునవ్వుతో చెప్పాడు రామశర్మ. 


మాధవికి రామశర్మ మనోభావం పూర్తిగా అర్థం అయ్యింది. 

చిరునవ్వుతో విజయ్ ముఖంలోకి చూస్తూ.. 

"చాలా సంతోషం అండి. బాబూ నీ పేరేమిటి?.. " అడిగింది. 


"విజయ్!.. నాకంటే పెద్దవాడు. నాకు అన్న అమ్మా!.. " చిరునవ్వుతో చెప్పాడు కాశ్యప్. 


కాశ్యప్ కలుపుగోలు తనానికి రామశర్మ, మాధవీలు ఒకరినొకరు చూచుకొన్నారు. వారి పెదవులపై చిరునవ్వు. 

"రా బాబూ!.. " తన చేతిలోకి విజయ్ చేతిని ఆప్యాయంగా తీసుకొంది మాధవి. 


నలుగురూ ఇంట్లోకి నడిచారు. 

ముందు రామశర్మ, వెనుకాల కాశ్యప్, అతని వెనుకాల అయోమయంగా చూస్తూ విజయ్ పెరటివైపుకు నడిచాడు. ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొన్నాడు. 


వారి వెనకాలే వచ్చిన మాధవి రామశర్మకు టవల్ అందించింది. వారు తుడుచుకొని కాశ్యప్‍కు ఇచ్చారు. కాశ్యప్ తుడుచుకొని విజయ్‍కి ఇచ్చాడు. 


విజయ్ చేతిలోని టవల్‍ను తన చేతిలోనికి తీసుకొని మాధవి ప్రీతిగా అతని ముఖాన్ని చేతులను తుడిచింది. 


ఆ తల్లిప్రేమ మాధుర్యాన్ని చూచిన విజయ్ ఆశ్ఛర్యపోయాడు. 

అతనికి తన తల్లి గుర్తుకువచ్చింది. కళ్ళల్లో కన్నీరు. 

అతని ఆ స్థితిని చూచిన మాధవి.. 


"ఏం బాబూ!.. ఏమిటా కన్నీరు. కళ్ళల్లో ఏమైనా పడిందా.. చూడనీ" వంగి అతని కళ్ళల్లోకి చూచింది. 


"ఏం పడలేదు.. " నడిచాడు విజయ్. 


నలుగురూ హాల్లోకి వచ్చారు. కంచాలు పెట్టి భోజన పదార్థాలను వడ్డించింది మాధవి. ముగ్గురూ కూర్చున్నారు. 


వారంతా క్రొత్తవారయినందున విజయ్ బిడియంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా తినసాగాడు. 

"విజయ్!.. " పిలిచాడు రామశర్మ. 

"సార్!.. "

"సార్ కాదు నాన్నా!.. స్కూల్లోనే నన్ను కాశ్యప్ సార్ అని పిలుస్తాడు. నీవూ నన్ను అలాగే పిలవాలి బాబూ!" అనునయంగా చెప్పాడు రామశర్మ. 


తలాడించాడు విజయ్. 

"ఈరోజు ఇంట్లో విశ్రాంతి తీసుకో. ఆఁ.. అవును ఏ క్లాస్ వరకు చదివావు?"


"మూడు.. "


"రేపటి నుంచి నీవు కాశ్యప్‍తో కలిసి స్కూలుకు రావాలి. చదువుకోవాలి. నేను నీకు అన్నీ కొనిస్తాను. నాల్గవ తరగతిలో చేరుస్తాను. కాశ్యప్ కూడా అదే క్లాసు. ఇరువురూ కలిసి బాగా చదువుకోవాలి. సరేనా!.. "


అమాయకంగా తల ఆడించాడు విజయ్. 


"బాబు విజయ్!.. ఏ విషయానికి నీవు భయపడకు. బాధపడకు. మేమంతా నీవాళ్ళం. ఈ ఇల్లు నీదే అనుకో. నేను మీ అమ్మ లాంటి దాన్ని. " చిరునవ్వుతో ప్రీతిగా చెప్పింది మాధవి. 


భోజనాలు ముగిశాయి. 

రామశర్మ, కాశ్యప్‍లు స్కూలుకు బయలుదేరారు. 

"మధూ!.. "


"ఏమండీ?.. "


"విజయ్‍కి కాశ్యప్ గది చూపించు. నిద్రపొమ్మను. "


"అలాగేనండి. "


రామశర్మ, కాశ్యప్‍లు స్కూలుకి వెళ్ళిపోయారు. 

"బాబూ విజయ్!.. " ప్రీతిగా పలుకరించింది మాధవి. 


విజయ్ ఆమె ముఖంలోకి దీనంగా చూస్తూ.. 

"నేను మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా!" మెల్లగా అడిగాడు. 


"అడుగు బాబూ!.. "


"నేను మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చునా?" దీనంగా మాధవి ముఖంలోకి చూచాడు. 


"నీకు సందేహం ఎందుకయ్యా!.. నీవు నన్ను ’అమ్మ’ అనే పిలవాలి" నవ్వుతూ చెప్పింది మాధవి.


అతని చేతిని తన చేతిలోనికి తీసుకొంది. కాశ్యప్ గదిలోనికి తీసుకొని వెళ్ళింది. 

"హాయిగా మంచంపై పడుకొని నిద్రపో. నేను నిన్ను ఐదుగంటలకు లేపుతాను" మాధవి గదినుండి వెళ్ళిపోయింది. విజయ్ మంచంపై వాలాడు. నిద్రపోయాడు. 

=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page