వీభోవరా - పార్ట్ 3
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Jun 15
- 6 min read
Updated: Jun 22
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Veebhovara - Part 3 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 15/06/2025
వీభోవరా - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ.
ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు.
కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారు. అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ.
ఇక వీభోవరా - పార్ట్ 3 చదవండి..
రామశాస్త్రి గారు పాఠశాల ఆవరణంలో మన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆ వూరి మోతుబరి రైతు, సద్గుణ సంపన్నుడు, బీదలపాలిటి పెన్నిధి గొప్ప దేశభక్తి కలవాడు అయిన శివరామయ్య గారి చేత జెండాను ఎగురవేయించారు. వారు ప్రసంగించారు. "బాల బాలికలారా!.... నేను గొప్పగా చదువుకోలేదు. మా నాయన వ్యవసాయి, మా అమ్మ నా చిన్నతనంలో చచ్చిపోయింది. నాకు మంచి చెడ్డలు మా నాయనే నేర్పినాడు. అవి ఏమిటంటే ఈ సృష్టిలో ఎన్నోకోట్ల జీవరాశులు వుండాయంట. అన్నిటికంటే గొప్పోడు మనిషి, అంటే మనం. సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, ప్రేమ, ఆదరం, అభిమానం సోదర భావాలతో అందరం ఎవరి పని వారు చేసుకొంటూ కలిసి మెలసి, ఒకరికి ఏదైనా ఆపద వచ్చిందంటే, మనం చేయగల సాయం వాడికి చేసి అందరూ ఆనందంగా కలిసి మెలసి బ్రతకాల.
మనలను ముస్లింలు, ఇంగ్లీషోల్లు ఎన్నో సంవత్సరాలు బానిసలుగా చూస్తూ పాలించినారు. ఎందరో గొప్పోళ్ళ పట్టుదల. కలసికట్టుతనం ఎన్నో ఏళ్ళ పోరాటంతో మనకు ఈ స్వతంత్ర్యం లభించినది. మనమంతా, మీరంతా కులమతాలను లెక్కచేయకుండా, అందరం మనుషులమే, భారతీయులమే అని తలుచుకొంటూ స్నేహంతో ఒకటిగా కలిసి బతకాల. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు. కొంతకాలంలో మీరు పెద్దోళ్ళు అవుతారుగా. ఇప్పటినుంచి మంచి ఆలోచనలు ఆచరణలు చేస్తూ, మీరంతా గొప్పోళ్ళు కావాలని నేను మిమ్మల్ని నా మనసారా దీవిస్తావుండా.
స్వామి రామశర్మ గారు గొప్ప పండితులు. మీకు నాకు గురువులు. వారు అనాదిగా మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎవరెవరు తమ జీవితాలను బలి చేశారో వారు మీకు వివరంగా చెబుతారు. ఈనాడు నన్ను శ్రీరామశర్మ గారు పిలిచి, నాచేత జెండాను ఎగరేయించినందుకు వారికి నా నమస్కారాలు. (చేతులు జోడించాడు) మీ అందరికీ నా దీవెనలు. జై జై భారత్, జయహో జయహో భరతమాత" శివరామయ్య గారు నవ్వుతూ వేదిక దిగారు.
రామశర్మగారు వేదికను ఎక్కారు. "గౌరవనీయులు పెద్దలు శివరామయ్యగారికి నమస్కారములు. నా చిన్నారి విద్యార్థులు, బాల బాలికలైన మీ అందరికీ నా శుభాశీస్సులు, దీవెనలు.
అన్యులు మహమ్మదీయులు, ఇంగ్లీషువారు మనదేశాన్ని 770 సంవత్సరాలు పరిపాలించారు. దాదాపు 90 సంవత్సరాలు ఆంగ్లేయులు అంతకుముందు 680 సంవత్సరాలు ముస్లిములు పాలించారు. ఆ పాలకులలో కొందరు మంచివారు వున్నారు. కొందరు చెడ్డవారూ వున్నారు. ఆంగ్లేయులు మన జాతీయ నాయకుల శాంతియుత పోరాటపు ధాటికి తట్టుకోలేక 1947 ఆగష్టు 15 వ తేదీ అర్థరాత్రి సమయంలో మనకు స్వతంత్ర్యాన్ని ప్రకటించారు. అంటే నేటికి మనకు స్వాతంత్ర్యం సిద్ధించి పద్నాలుగు సంవత్సరాలయింది.
మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం 1827-1947 వరకూ అవిరామంగా పోరాడిన ప్రముఖ ప్రజా నాయకులు పేర్లు వారి వివరాలను తెలియజేస్తున్నాను.
నం. పేరు జీవితకాలం బ్రతికిన సంవత్సరాలు నిర్యాణం
1. మంగల్‍పాండే 1827-1857 30 సంవత్సరాలు 19 జూలై 1857
2. రాణి లక్ష్మీభాయ్ 1835-1858 23 సంవత్సరాలు 19 నవంబర్ 1858
3. అనీబిసెంట్ 1847-1933 86 సంవత్సరాలు 01 అక్టోబర్ 1933
4. బాలగంగాధర తిలక్ 1856-1920 36 సంవత్సరాలు 23 జూలై 1920
5. మోతీలాల్ నెహ్రూ 1861-1931 70 సంవత్సరాలు 06 మే 1931
6. లాలాలజపతిరాయ్ 1865-1928 63 సంవత్సరాలు 17 నవంబర్ 1928
7. మహాత్మాగాంధీ 1869-1948 79 సంవత్సరాలు 02 అక్టోబర్ 1950
8. చిత్తరంజన్ దాస్ 1870-1925 55 సంవత్సరాలు 05 నవంబర్ 1925
9. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875-1950 75 సంవత్సరాలు 31 అక్టోబర్ 1950
10. జవహర్ లాల్ నెహ్రూ 1889-1964 75 సంవత్సరాలు 14 నవంబర్ 1964
11. అల్లూరి సీతారామరాజు 1897-1924 27 సంవత్సరాలు 4 జూలై 1984
12. సుభాష్ చంద్రబోస్ 1897-1943 48 సంవత్సరాలు 23 జనవరి 1945
13. చంద్రశేఖర్ ఆజాద్ 1906-1931 25 సంవత్సరాలు 23 జూలై 1931
14. భగత్ సింగ్ 1907-1931 24 సంవత్సరాలు 27 సెప్టెంబర్ 1931
15. అరుణా అసఫ్ అలి 1909-1996 87 సంవత్సరాలు 16 జూలై 1996
పై మహనీయులంతా మహాత్మాగాంధీజీ, సర్ధార్ వల్లభాయి పటేల్, జవహర్‍లాల్ నెహ్రూ, అరుణా అసీఫ్ అలి మనకు 1947 ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర్వం సిద్ధించినందుకు ఎంతగానో ఆనందించారు. మన ప్రధమ ప్రధానిగా శ్రీ జవహర్‍లాల్ నెహ్రూజీ ఎన్నికైనారు. శ్రీ రాజేంద్రప్రసాద్ గారు మన తొలి ప్రెసిడెంట్. మిగతావారంతా స్వాతంత్ర సమరంలో ఆంగ్లేయుల రాక్షస చర్యలకు బలైపోయినవారే. వీరేకాదు.... ఇంకా ఎందరో దేశభక్తిపరులు 1827 వ సంవత్సరానికి ముందు ముస్లిమ్స్ తో ఆంగ్లేయులతో పోరాడి రణరంగంలో వీరమరణం పొందారు. వారిలో స్త్రీ మూర్తులూ వున్నారు.
వారందరి మహోన్నత దేశభక్తి, త్యాగనిరతి కారణంగానే మనకు స్వాతంత్ర్యం లభించింది. మనం సర్వస్వతంత్రులమైనాము. మనచేత ఎన్నుకొనబడిన నాయకులు మనకు పాలకులైనారు. కానీ ప్రతి మనిషిలోనూ స్వార్థం వుంటుంది. ఆ స్వార్థం మనిషిలోని విచక్షణా జ్ఞానాన్ని నశింపచేస్తుంది.
నాడు స్వాతంత్ర్య పోరాటపు రోజుల్లో జనంలో వున్న సఖ్యత, ప్రేమాభిమానాలు నేడు లేవు. ప్రతి ఒక్కరికీ పదవీ ఆశ. ధనాన్ని ఎలాగైనా సంపాదించి గొప్పవాళ్ళం కావాలనే తపన. సాటి మనిషి మీద ద్వేషం. కుల వ్యవస్థతో అన్య కులాల వారిని నీచంగా చూడం. ముఠాతత్వాన్ని పెంచుకోవడం కొందరి నైజం అయిపోయింది.
ఎంతోకాలంగా ముస్లిములు మన వారు, కలిసి బ్రతుకుతున్నాము. వారు మనం వేరు కాదు. వారు మనం భారతీయులం.... మనమంతా కలిసి కట్టుగా ఒకటిగా వుండాలి. ప్రేమ సౌభ్రాతృత్వం.... ఆదరాభిమానాలను మనం మన సాటివారి పట్ల చూపించాలి. ఐక్యతను, సఖ్యతను సాధించాలి. కులం, మత భేదం తగదు. అది తప్పు.
ఈ గొప్పరోజున మనం ఈనాడు ఇంత ఆనందంగా వుండేదానికి కారకులైన మన కీర్తి శేషులైన కొందరి పెద్దలను తలుచుకొన్నాము. మీది ఇప్పుడు చిన్నవయస్సు. ఈ వయస్సు నుండి పెద్దలను గౌరవించడం, బాగా చదువుకోవడం, మంచి అలవాట్లను అలవరచుకోవడం, పేదల పట్ల జాలి చూపడం, వున్నంతలో కొంత దానం చేయడం, సత్యాన్ని ఎప్పుడూ పలకడం, ధర్మాన్ని పక్షపాత రహితంగా పాటించటం, కన్నతల్లి తండ్రులను, సోదరీ సోదరులను, గురువులను అభిమానించడం, గౌరవించడం అలవాటు చేసుకోవాలి. పాటించాలి.
మీరు పెరిగే కొద్ది ఆ భావాలు మీలో బలపడతాయి. మీరు ఉత్తమ పౌరులౌతారు. మీరంతా భావి భారత పౌరులు. ఎవరెవరు ముందు ఏం చదవబోతారో, ఏ హోదాలను సంపాదించబోతారో నేడు నేను చెప్పలేను. కానీ మీరు మనస్సున ఒక లక్ష్యంతో విద్యాభ్యాసాన్ని చేయాలి. లక్ష్యం అంటే సంకల్పం. మీ సంకల్పం మంచిదైతే అది తప్పక, మీ ఆచరణారీత్యా మీ అందరికీ సిద్ధిస్తుంది.
మన జాతీయ గీతాన్ని రచించినది రవీంద్రనాథ్ ఠాగూర్. వారు వెస్ట్ బెంగాలుకు చెందినవారు. (వారి జననం 1861, 7వ తేది మే నెల - నిర్యాణం 1941, 7వ తేది ఆగష్టు). వారు గొప్ప రచయిత. వారు బ్రహ్మ సమాజపు నాయకులు. అనేక గేయాలు, కథలు, నాటకాలు రచించిన మహనీయులు. వారి అపార సాహిత్య సేవకు బ్రిటీషర్స్ మెచ్చి 1913లో వారికి సాహిత్యపరంగా నోబెల్ ప్రైజ్ అవార్డును ఇచ్చారు.
మన జాతీయ జెండాను (డిజైన్స్) నిర్మాణం చేసిన వారు పింగళ వెంకయ్యగారు. వారు ఆంధ్రులు. స్వాతంత్య్ర సమరయోధుడు. వారి జననం 1876 ఆగష్టు 2వ తేది. నిర్యాణం 1963 జూలై 4వ తేది. వారు రచయిత జర్నలిస్టు. మచలీపట్నానికి దగ్గరలో వున్న భట్ల పెనుమర్రు, కృష్ణాజిల్లా వారు భూ విజ్ఞాన శాస్త్రవేత్త.
మరో ముఖ్య విషయం స్వాతంత్ర్యానికి ముందు, ఆంధ్ర అనే పదం ఉత్తర దేశ వాసులకు తెలియదు. మన ఈ దక్షిణ దేశవాసులను ఆంగ్లేయులు మదరాసీస్ అని పిలిచేవారు. కారణం నేటి దక్షిణ నాలుగు రాష్ట్రాలు వారి పాలనా కాలంలో ఒకటిగానే వుండేవి. వారి స్థావరం మద్రాస్. ఆ కారణం మనలనూ వారు మద్రాసీస్ అనే పిలిచేవారు.
స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత నెల్లూరువాసి శ్రీ పొట్టి శ్రీరాములు గారు భాషాపరంగా రాష్ట్ర విభజన జరగాలని నెహ్రూగారు ప్రధానిగా వున్నప్పుడు అమరణ నిరాహార దీక్షను సాగించారు. వారి జననం 1901 మార్చి 16వ తేదీన - నిర్యాణం 1952 డిసెంబర్ 15వ తేదీన. వారు నిరాహార దీక్షను కొనసాగించింది 58 రోజులు.
ఆ మహనీయుల ఆత్మ బలిదానంతో మనకు విశాల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. మీరంతా కూడా మీ జీవితకాలంలో మన దేశం పట్ల ప్రేమాభిమానాలతో వర్తించాలి. ఉత్తమ పౌరులనిపించుకోవాలి.
మీరు అందరికీ ముందు ముందు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడాలని నా మనసారా మిమ్ముల్నందరినీ దీవిస్తున్నాను. వందేమాతరం.... జయజయ జయహో భరతమాత. నమస్సుమాంజలి." చేతులు జోడించి కొన్నిక్షణాలు కళ్ళు మూసుకొన్నారు రామశర్మ.
పిల్లలంతా తదేక దీక్షతో చూస్తున్నారు.
రామశర్మ వేదికను దిగారు.
"శివరామయ్యగారూ!.... నేను మిమ్ములను విసిగించానా!...." వారిని సమీపించి చిరునవ్వుతో అడిగాడు రామశర్మ.
"అయ్యో సామీ! ఏంటా మాటలు. ఎన్నో గొప్ప విషయాలు నాకు తెలియనివి చెప్పారు. మనస్సుకు మహదానందంగా వుంది."
జవాబుగా రామశర్మగారు నవ్వారు. పిల్లల వైపు చూచి....
"పిల్లలూ!.... మన జాతీయ గీతాన్ని పాడండి...."
బాలబాలికలు ఏక కంఠంతో పాడసాగారు.
"జనగణమన అధినాయక జయహే
భారత భాగ్య విధాత
పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ
వింధ్య హిమాచల యమునా గంగ
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే
గాహే తవజయ గాధా
జనగణ మంగళదాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే....
జాతీయ గీతాన్ని పాడిన పిల్లలు మౌనంగా నిశ్చలంగా నిలబడి వున్నారు.
శివరామయ్య తన పాలేరు రంగ చేతిలో సంచిని తన చేతిలోకి తీసుకొని బాలబాలికలకు పంచారు.
తరువాత పిల్లలందరూ రామశర్మ గారికి చెప్పి తమ తమ ఇండ్ల వైపుకు బయలుదేరారు.
శివరామయ్య, రామశర్మను సమీపించారు. వారి చేతిని తన చేతిలోనికి తీసుకొని కొన్ని చాక్లెట్లను వుంచారు.
"శివరామయ్యా!.... ఏమిటిది... నేనేం చిన్నపిల్లవాడినా!" చిరునవ్వుతో అడిగాడు రామశర్మ.
"సామీ!.... మీ మనసు, మీ మాటలు ఎంతో మధురం. దానిముందు ఈ తీపి ఎంత? నోట్లో వేసుకోండి" నవ్వుతూ చెప్పాడు శివరామయ్య.
ఇరువురూ ఆనందంగా నవ్వుకొంటూ వారి ఇండ్లవైపుకు నడిచారు.
అది సాయంత్రం.... ఐదు గంటల సమయం.....
రామశర్మ, కాశ్యప్, విజయ్‍లు ఇంట్లోనే వున్నారు.
మాధవికి నెప్పులు ప్రారంభమైనాయి.
గమనించిన రామశర్మ పిల్లల్ని పిలిచి మాధవి దగ్గర ఉండమని చెప్పి తాను అతి వేగంగా సయ్యద్ ఇంటివైపు వెళ్ళాడు. సయ్యద్ తల్లి మంత్రసాని పేరు బేగం. తనకు ఎదురైన ఆమెకు విషయాన్ని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాడు. మాధవి నొప్పులతో బాధపడటం చూచి పిల్లలు విషయం అర్థం కాక ’అమ్మా.... అమ్మా...’ అంటూ ఏడవసాగారు.
మాధవిని చూచిన బేగం పిల్లలను, రామశర్మను ఆ గదినుండి బయటకు పంపేసింది బేగం తన జీవితకాలంలో ఎందరికో కాన్పులు చేసింది. మాధవికి ధైర్యం చెప్పింది. పరీక్షించింది. అరగంట లోపల మాధవి ప్రసవించి ఆడమగ కవలలు కన్నది. ఆ వార్త విని రామశర్మ పిల్లలు ఎంతగానో సంతోషించారు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments