అపరాధ పరిశోధన - పార్ట్ 12
- Seetharam Kumar Mallavarapu
- Jun 5
- 6 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 12 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 05/06/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు.
ఇంటరాగేషన్ లో కిషన్, ఫయాజ్ లు తడబడతారు. మొదట లొంగని రంగా, బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు.
దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ ను ఉపయోగించు కోవాలనుకుంటాడు దాము. హంతకుడు రంగా, మునావర్ ను కాంటాక్ట్ చేస్తాడు. మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్.
రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు. దీక్షిత్ ఇంటికి డ్రైవర్ కోదండం సహాయంతో ఏసీ టెక్నీషియన్ లాగా వస్తాడు జాఫర్.
ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 12 చదవండి..
ఇందాక కాఫీ తాగుతుండగా, దీక్షిత్ చెప్పిన మాటలు నీతూ శర్మకు మళ్ళీ గుర్తొచ్చాయి.
“అమ్మా నాన్నా, జాగ్రత్తగా వినండి… నీతూ శర్మగారు, మీరు కూడా గమనించండి. ఇంకొన్ని నిమిషాల్లో నాపై హత్యాయత్నం జరుగుతుంది. ఇది మేము డిపార్ట్మెంట్ తరఫున రూపొందించిన స్ట్రాటజీ. నిజానికి ఇది గోప్యంగా ఉంచాల్సిన విషయం. కానీ మీరు ఆందోళన చెందకుండా ఉండేందుకు ముందే చెబుతున్నాను. హత్యాయత్నం జరగడం, నేను తప్పించుకోవడం అన్నీ మా ప్లాన్ ప్రకారం జరుగుతాయి.
అమ్మా నాన్నా, మీరిద్దరూ హాలులో ఉండండి. నేను, డ్రైవర్ కోదండం, ఆ వ్యక్తిని తీసుకొని నా గదిలోకి వెళ్తాము.
నీతూ శర్మగారు.. మీరు గది తలుపు దగ్గరే ఉండండి. ఆ వ్యక్తి రివాల్వర్ తీయగానే, నేను పక్కకు జారిపోతాను. కోదండం పెద్దగా కేకలు వేస్తూ — ‘సెక్యూరిటీ! త్వరగా రండి!’ అంటూ బయటికి పరుగెత్తుతాడు.
ఆ హంతకుడు గదిలోంచి బయటికి వచ్చి ఇంటి వెనక ప్రహరీ గోడవైపు పరుగెడతాడు. మీరు కూడా అతని వెనకే పరిగెత్తుతూ, ‘పట్టుకోండి!’ అంటూ కేకలు వేయాలి. అతను గోడ దాటి అవతలికి దూకి పారిపోతాడు. పారిపోతున్న అతన్ని మా పోలీసులు పట్టుకుంటారు.
ఇక ఇప్పుడు మొత్తం వివరాలు చెబుతుంటే టైం సరిపోదు. తరువాత వివరంగా చెబుతాను” అని చెప్పాడు దీక్షిత్.
ఏదో అడగబోతున్న నందితను ఒక సున్నితమైన సైగతో ఆపాడు రామ్మోహన్.
ఇంతలో కోదండం మరో వ్యక్తితో ఇంట్లోకి రావడం గమనించి నందిత నిశ్శబ్దంగా నిలిచిపోయింది.
కోదండం తన వెంట ఉన్న వ్యక్తిని ‘జావీద్’ అని పరిచయం చేశాడు. నిజానికి అతను జాఫర్. దీక్షిత్ వారిద్దరిని తీసుకొని నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళాడు.
దీక్షిత్ చెప్పినట్టు గదిలో గుమ్మం దగ్గర నిలబడింది నీతూ శర్మ.
ఆ వ్యక్తి తన బ్యాగ్‌లోంచి రివాల్వర్ తీస్తున్న దృశ్యం ఆమె గమనించింది.
“ఇంత సమీపం నుండి పేల్చితే తప్పించుకోవడం ఎలా సాధ్యం?” అనే అనుమానం ఆమెను కుదిపేసింది.
'ఈ ప్లాన్‌లో ఏదైనా మోసం ఉందా?..' అనే ఆలోచన ఆమెకు కలిగింది.
జాఫర్ గన్ తీయగానే, నీతూ శర్మ దీక్షిత్ ముందు అడ్డుగా నిలబడింది.
ఆ వ్యక్తి అది గమనించలేదు. ట్రిగ్గర్ నొక్కాడు.
ఢాం..
శబ్దం చేస్తూ బుల్లెట్ ఆమె భుజాన్ని తాకింది.
క్షణాల్లో నేలవైపు వాలిపోతున్న ఆమెను చటుక్కున పట్టుకున్నాడు దీక్షిత్.
‘నాకు ఏం కాలేదు’ అన్నట్టు ఆమె అతనికి చిన్నగా సైగ చేసింది.
ఆ వెంటనే తన కాళ్లమీద నిలబడి, గోడకు ఆనించి పెట్టిన లాఠీని పట్టుకుని, సివంగిలా ఆ అజ్ఞాత వ్యక్తి మీదికి దూకింది నీతూ శర్మ.
జావిద్ అనే పేరుతో వచ్చిన జాఫర్ — ఇక తన ప్రాణాలు పోయినట్లే అనుకున్నాడు!
నీతూ శర్మను ఆపేందుకు, ఆమె ఆవేశానికి జాఫర్ బలి కాకుండా ఉండేందుకు ముందుకొచ్చాడు దీక్షిత్.
ఆమె నడుం చుట్టూ రెండు చేతులు బిగించి, గట్టిగా పట్టుకున్నాడు.
అంత వేగంతో వెళ్తున్న మనిషి కూడా అతని పట్టు నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది.
“సెక్యూరిటీ! పట్టుకోండి!” అని పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తాడు కోదండం.
అదే సమయంలో, గదిలోంచి బయటకు జారిపోయాడు జాఫర్. ఇంటి వెనకవైపు ఉన్న ప్రహరీ గోడవైపు పరుగెత్తాడు.
దీక్షిత్, తన చేతుల్లో బందీ ఐన నీతూ శర్మతో..
"భయపడకు," అన్నట్టు ఆమె భుజాన్ని తడిమాడు..
“వాడింది రబ్బర్ బుల్లెట్ మాత్రమే. కొంచెం నొప్పి తప్ప, ప్రమాదం లేదు. అతను గోడ దాటి పారిపోతున్నా, మా పోలీసులు త్వరలోనే అతన్ని పట్టుకుంటారు. తరువాత మనం శివరాం శర్మగారి ఇంటికి వెళ్దాం. ముందు, అమ్మా నాన్నలకు నేను సురక్షితంగా ఉన్నాను అని చెప్పాలి,” అంటూ హాల్లోకి వెళ్లాడు దీక్షిత్.
అప్పటికే నందిత, రామ్మోహన్ ఆ గది వైపుగా వస్తున్నారు.
రామ్మోహన్ చేతిలో ఐరన్ రాడ్ కనిపించింది.
“ఏంటి నాన్నా! హంతకునిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారా?” అని చిరునవ్వుతో అడిగాడు దీక్షిత్.
“చింతించకండి. నాకేం కాలేదు. ఆ హంతకుడు కొద్దిసేపట్లో పోలీసుల చేతికి చిక్కిపోతాడు.” అంటూ ఇద్దరి భుజాలపై చెయ్యి వేసి వారిని హాల్లోకి తీసుకెళ్ళాడు.
వారు సోఫాలో కూర్చొనగానే, దీక్షిత్ ఎదురుగా కూర్చున్నాడు.
కోదండంతోపాటు వెనుక వైపు ప్రహరీ గోడవైపు కదిలారు సెక్యూరిటీ సిబ్బంది. అప్పటికే అతను అక్కడ సిద్ధంగా వేసి ఉంచిన నిచ్చెన ఎక్కి ప్రహరీ దాటి అవతలి వైపుకు దూకాడు. అక్కడ రెడీగా ఉన్న బైక్ లో వెనక కూర్చోగానే ఆ బైక్ వేగంగా కదిలింది.
కోదండం పరుగు పరుగున దీక్షిత్ దగ్గరకు వచ్చి “సార్! అతను తప్పించుకున్నాడు,” అన్నాడు.
“పర్వాలేదు కోదండం. మన వాళ్లు వెంటనే పట్టుకుంటారు,” అంటూ నవ్వాడు దీక్షిత్.
"నేను బయట వెయిట్ చేస్తాను సర్" అంటూ బయటకు వెళ్ళాడు కోదండం.
"నుంచుని ఉన్నావేం? కూర్చోమ్మా" అంది నందిత, సోఫాలో దీక్షిత్ పక్కన ఉన్న ప్లేస్ ను చూపిస్తూ.
మామూలుగా అయితే నీతుశర్మ నిస్సంకోచంగా అతని పక్కన కూర్చునేది.
అయితే, ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి ఆమె ఆగిపోయింది..
ఇందాక అతను తన నడుం చుట్టూ చేతులు వేసి బిగించడాన్ని తలుచుకొని సిగ్గుగా తలదించుకుంది.
దీక్షిత్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు.
తనకోసం ఆమె ప్రాణాలను సైతంలెక్క చెయ్యకుండా నిలబడిన తీరును గుర్తు చేసుకున్నాడు.
ఆమె ధైర్యంగా జాఫర్ మీదికి దూకడం.. ఆమె మెత్తటి మేని స్పర్శ.. అతని మనసులో ఏదో కొత్త భావనలను రేకెత్తిస్తోంది.
"ఇందాకటి దడ ఇంకా తొలగిపోలేదు. లేకపోతే నేనే వచ్చి అబ్బాయి పక్కన పక్కన కూర్చునే వాడిని" అన్నాడు రామ్మోహన్.
“వద్దు అంకుల్, మీరు విశ్రాంతి తీసుకోండి,” అంటూ తల దించుకుని,, చిరునవ్వుతో దీక్షిత్ పక్కనే సోఫాలో కూర్చుంది నీతూ శర్మ.
"రివాల్వర్ శబ్దం వినగానే గుండె ఆగినంత పని అయింది. కానీ నీ సమర్ధత మీద, ఆ దేవుడి దయ మీద నమ్మకంతో మనసు అదుపులో ఉంచుకున్నాను." చెప్పింది నందిత.
"నీతూ శర్మ తన భుజం రుద్దుకుంటూ ఉండటం గమనించిన మోహన రావు, "నీకేమైనా గాయమైందా అమ్మా?" అడిగాడు మోహన రావు.
""నాన్నా! అతను రబ్బర్ బులెట్ తో నన్ను కాల్చాడు. అది నిజం బులెట్ అనుకుంది నీతూశర్మ. నాకు తప్పించుకునే అవకాశం ఉండదని భావించి తాను అడ్డంగా నిల్చుంది" చెప్పాడు దీక్షిత్.
నందిత సోఫాలోంచి లేచి, నీతూశర్మ దగ్గరకు వచ్చి ఆమె తలను ఆప్యాయంగా నిమిరింది.
"మీ వాళ్ళు ఎప్పుడు వస్తారమ్మా.."అడిగింది నందిత.
గవర్నరుగారితో కలిసి రేపు ఉదయానికి ఫ్లైట్ లో వస్తారు. అత్తయ్య, మా బావలు వచ్చేశారు" చెప్పింది నీతూశర్మ.
"మీ పేరెంట్స్ ని ఒకసారి కలవాలని ఉంది. కానీ ఇది సందర్భం కాదు కదా.." అంది నందిత.
“మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వాళ్లే మీ దగ్గరకు వస్తారట" చెప్పింది నీతూ.
కొద్ది నిముషాల తరువాత దీక్షిత్ ఫోన్ మోగింది.
"సర్, నేను మురళిని మాట్లాడుతున్నాను. జాఫర్ బైక్ లో పారిపోయాడు.ఒక కిలోమీటర్ వెళ్ళాక బైక్ దిగి ఆటోలో వెళ్తూ ఉండగా మనవాళ్లకు దొరికాడు. అంతా అనుకున్నట్లు జరుగుతోంది. మీరు ఇక బయలుదేరవచ్చు" చెప్పాడు మురళి.
"ఓకే. నేను నీతూశర్మను తీసుకుని శివరాంశర్మ గారి ఇంటికి వస్తాను. అక్కడివాళ్ళతో ఓ అరగంట మాట్లాడి నేరుగా దాము వద్దకు వెళ్లి అతన్ని అరెస్ట్ చేస్తాను. అతని అరెస్ట్ కు తగిన ఆధారాలు ఉన్నాయి. నిన్న సాయంత్రం ఆరు గంటలప్పుడు శివరాం శర్మగారి హత్య జరిగింది.
ఇప్పుడు సమయం ఐదు గంటలు. మరో గంటలో దాము అరెస్ట్ జరగాలి. ఇరవైనాలుగు గంటల్లోగా హంతకులను, వారిని ఎంగేజ్ చేసినవాళ్లను పట్టుకున్న కేసుగా ఈ కేసు రికార్డుల్లో నిలవాలి. అంతకంటే ముఖ్యం.. నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు శివరాం శర్మగారి హంతకులు అయన అంత్యక్రియలలోగా దొరికితే అయన అత్మ శాంతిస్తుంది. ప్రజలలో డిపార్ట్మెంట్ మీద నమ్మకం పెరుగుతుంది" ఆవేశంగా చెప్పాడు దీక్షిత్.
"ఓకే సర్. మీరు బయలుదేరండి. మరో విషయం.." అంటూ ఏదో చెప్పి ఫోన్ పెట్టేసాడు మురళి.
తలిదండ్రుల దీవెనలు తీసుకొని నీతూశర్మతో కలిసి బయటకు వచ్చాడు దీక్షిత్.
అతను ముందు సీట్ లో కోదండం పక్కన కూర్చోగా, నీతూశర్మ వెనుక సీట్ లో కూర్చుంది. కోదండం కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు.
***
శక్తి ఫోన్ వచ్చినప్పటినుండి ఉత్సాహం పట్టలేక పచార్లు చేస్తున్నాడు దాము. కొంతసేపటికే అతని ఫోన్ మోగింది.
"శక్తి సార్, ఏమైంది?" ఆతృత పట్టలేక అడిగాడు దాము.
"ఆ శివరాం శర్మ మేనకోడలివల్ల ప్లాన్ తారుమారు అయింది. మన జాఫర్ షూట్ చేసే సమయానికి ఆ అమ్మాయి అడ్డం వచ్చిందట. దాంతో ఆమె భుజం పైనుండి అతన్ని షూట్ చెయ్యాలని చూసే ప్రయత్నంలో గురి తప్పింది. ఇంతలో ఆ అమ్మాయి జాఫర్ మీద అటాక్ చెయ్యాలని చూడడంతో వాడు పారిపోయాడు." చెప్పాడు శక్తి.
“జాఫర్ ను అక్కడే చంపెయ్యల్సింది కదా" అన్నాడు దాము.
"వాడు దీక్షిత్ ను చంపి వుంటే ఆ ఆవేశంలో అతన్ని ఐరన్ రాడ్ తో ఆవేశంలో కోదండం చంపాలని ప్లాన్. కానీ దీక్షిత్ క్షేమంగా ఉండడంతో కోదండం ఏమీ చెయ్యలేక పోయాడు." వివరించాడు శక్తి.
"చ.. ప్లాన్ అంతా పాడయ్యింది. ఆ జాఫర్ ఏమయ్యాడు?" అడిగాడు దాము.
"ఆటోలో పారిపోతుండగా దొరికి పోయాడట." చెప్పాడు శక్తి.
“వాడు చచ్చి ఉంటే బాగుండేది. లేదా తప్పించుకొని ఉండాల్సింది. సిగ్గు లేకుండా దొరికిపోయి మనల్ని ఇరికించే లాగా ఉన్నాడు. ఇలాంటిదేదో జరుగుతుందని మరో ప్లాన్ సిద్ధం చేసి ఉంచాను" అన్నాడు దాము.
"ఏమిటది" ఆత్రంగా అడిగాడు శక్తి.
"గోడలకు చెవులు ఉన్నట్లే ఫోన్లకు కూడా చెవులు ఉన్నట్లు ఉన్నాయి. పని పూర్తయ్యాక చెబుతానులే" అన్నాడు దాము.
"మా ప్రమేయం లేకుండా చేసే పనిలో మా సహాయం ఉండదు, గుర్తుంచుకో" అన్నాడు శక్తి.
"నిజానికి ప్లాన్ ఏమిటి అనేది నాకు కూడా తెలియదు. నేను కొంత అమౌంట్ ఆశ చూపి ఒక మనిషిని మాట్లాడాను. అతను తను చేయబోయే దాని గురించి ఎవరికీ చెప్పడట" అన్నాడు దాము.
"సరే అయితే. జాగ్రత్తగా ఉండు. ఎప్పటికప్పుడు నాకు కాల్ చేస్తూ ఉండు" చెప్పాడు శక్తి.
=========================================================
ఇంకా ఉంది
అపరాధ పరిశోధన - పార్ట్ 13 త్వరలో..
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comments