అపరాధ పరిశోధన - పార్ట్ 11
- Seetharam Kumar Mallavarapu
- May 30
- 6 min read
Updated: Jun 5
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 11 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 30/05/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు.
ఇంటరాగేషన్ లో కిషన్, ఫయాజ్ లు తడబడతారు. మొదట లొంగని రంగా, బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు. ఆ రోజు సాయంత్రం శివరాం శర్మ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటాడు దీక్షిత్. తను కూడా వస్తానంటుంది నీతూ శర్మ.
దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ ను ఉపయోగించు కోవాలనుకుంటాడు దాము. హంతకుడు రంగా, మునావర్ ను కాంటాక్ట్ చేస్తాడు. మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్.
రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు.
ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 11 చదవండి..
"నిజానికి నేను శివరాం శర్మ గారి ఇంటికి వెళ్లే దారిలో సెక్యూరిటీ ఏర్పాట్లు చూడాలి. ఆయన ఇంటి దగ్గర ఈరోజు మీ పైన గాని మరెవరిపైన అయినా గాని దాడి జరిగే అవకాశాలు ఉన్నాయేమోనని పరిశీలించాలి. కానీ ఎందుకో మీ ఇంటికి రావాలనిపిస్తోంది" అన్నాడు సిఐ మురళి.
"మీ ఆందోళన నాకు అర్థమైంది కానీ నాకే ప్రమాదము జరగదు. మీరు నిశ్చింతగా శివరాం శర్మ గారి ఇంటికి వెళ్లి అక్కడి సెక్యూరిటీని గమనించండి. నేను ఇంటికి వెళ్లి నీతూ శర్మను తీసుకొని మీ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక బయలుదేరుతాను" చెప్పాడు దీక్షిత్.
"జాగ్రత్తగా ఉండండి సార్. ఏ సమయానికి ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేము" అని చెప్పి శివరాంశర్మ ఇంటికి బయలుదేరాడు మురళి.
అతను ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి ఎస్పీ గారి డ్రైవర్ కోదండం ఎవరో వ్యక్తితో మాట్లాడుతూ ఉండడం గమనించాడు. మురళి బయటకు రావడం గమనించిన ఆ వ్యక్తి ఏమీ తెలియని వాడిలా కాస్త దూరానికి వెళ్లి నిలుచున్నాడు.
కోదండం దగ్గరకు వెళ్లిన మురళి "ఏమిటి.. ఎవరితోనో బాతాఖాని వేస్తున్నట్లున్నావ్" అని అడిగాడు.
"అబ్బే.. అదేమీ లేదు సార్. అతనికి ఎవరితోనో గొడవలు ఉన్నాయట. తనకు సెక్యూరిటీ కావాలని ఎస్పీ గారిని అడగడానికి వచ్చాడు. నన్ను రెకమెండ్ చేయమని ప్రాధేయపడుతున్నాడు" అన్నాడు కోదండం.
"అలాంటి పైరవీ పనులు పెట్టుకోకు. నీ ఉద్యోగానికి ఎసరు వస్తుంది. దీక్షిత్ సార్ నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయవద్దు" చెప్పాడు మురళి.
"అయ్యో! నా గురించి మీకు తెలియదా? నా ప్రాణం పోయినా డిపార్ట్మెంట్ కు ద్రోహం చేయను" చెప్పాడు కోదండం.
"ఇప్పుడు నువ్వు మాట్లాడిన వ్యక్తిని పోలీసు రికార్డుల్లో ఎక్కడో చూసినట్లు గుర్తు. అందుకని కాస్త అనుమానించాను. నువ్వు కూడా బాగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. ఏమాత్రం అనుమానం కలిగినా నాకు కాల్ చేయి" చెప్పాడు మురళి.
"ఇన్నేళ్ల సర్వీస్ లో నాకు మనుషుల్ని అంచనా వేయడం బాగా వచ్చింది. ఇతను క్రిమినల్ కాదు. అంతవరకు నేను నమ్మకంగా చెప్పగలుగుతాను" అన్నాడు కోదండం.
"కాస్త దూరంగా వెళ్లి నిల్చున్న ఆ వ్యక్తి చెవుల్లో కోదండం చెప్పిన మాటలు వినపడ్డాయి.
'కోదండం తన ట్రాప్ లో పడ్డందుకు చాలా సంతోషించాడు. దూరానికి వెళ్లి ఎవరికో కాల్ చేశాడు.
"అంతా ఓకే. నేను విడిగా అక్కడికి వెళ్తాను" అని చెప్పి దూరంగా ఉన్న బైక్ స్టార్ట్ చేశాడు.
కోదండానికి మరోసారి జాగ్రత్తలు చెప్పాడు మురళి. "కాసేపట్లో ఎస్పీ సార్ వస్తారు. వారిని ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళు. అక్కడి నుంచి శివరాం శర్మ గారి ఇంటికి వాళ్ళను తీసుకొని రా. చెప్పానుగా.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు" చెప్పాడు మురళి.
"అలాగే సార్! ఈ కోదండం అంటే ఏమిటో నిరూపించుకుంటాను" చెప్పాడు కోదండం.
మురళి వెళ్లాక దీక్షిత్ రాక కోసం ఎదురుచూస్తూ ఆలోచిస్తున్నాడు కోదండం. ఇందాక వచ్చిన వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఒక స్లిప్పు తన చేతికి ఇచ్చాడు.
"అన్నా! నాకు చదువు సరిగ్గా రాదు. ఇందులో ఒకటి పక్కన ఏడు సున్నాలు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి?" అని అడిగాడు.
"కోటి రూపాయలు" అని చెప్పాడు తను.
"అంత డబ్బు నీకు ఇచ్చి ఏదైనా సహాయం చేయమంటే చేస్తావా?' అని అడిగాడు అతను.
"వూరుకోండన్నా! జోకులు వేయడానికి కూడా ఒక లిమిట్ ఉంది" అన్నాడు తను.
"ఇది జోక్ కాదు. మేము చెప్పిన పని చేశావంటే నీకు నిజంగా కోటి రూపాయలు ఇస్తాము. అన్నాడు అతను.
"లక్ష్మీదేవి కళ్ళ ముందుకొస్తే కాదనేంత పిచ్చోడిని కాదు. ఏం చేయమంటారు చెప్పండి" అన్నాడు తను.
అతను చెప్పింది విని తనకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు.
"ఏమిటి జంకుతున్నావా?" అడిగాడు అతను.
"అబ్బే! ఈ కోదండం భయపడేవాడు కాదు" చెప్పాడు తను..
దీక్షిత్ కారు ఎక్కడంతో ఆలోచనల నుంచి బయటపడ్డాడు కోదండం.
ఎప్పుడూ తను కారు దగ్గరకు వచ్చేసరికి డోర్ తీసి నమస్కరించే కోదండం, ఈరోజు తను కారు ఎక్కే వరకు గమనించకపోవడం చూసి నవ్వుకున్నాడు దీక్షిత్.
"ఏమీ లేదు సార్! ఇంట్లో ఏదో చిన్న సమస్య" అన్నాడు కోదండం.
"నీ సమస్య ఏమిటో నాకు అర్థమైందిలే. టెన్షన్ పడకు. అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి" అన్నాడు దీక్షిత్.
బదులు ఇవ్వకుండా మౌనంగా కార్ డ్రైవ్ చేశాడు కోదండం. ఎప్పటిలాగే కారు క్షుణ్ణంగా పరిశీలించి, దీక్షిత్ ఇంటి దగ్గరికి పంపారు సెక్యూరిటీ.
"అన్నట్లు నా గదిలో ఏసి పనిచేయడం లేదు. టెక్నీషియన్ ను పిలవమని నీకు చెప్పాను, గుర్తుందా" అడిగాడు దీక్షిత్.
"ఉంది సార్. మీరు ఉండేటప్పుడే రమ్మని చెప్పాను. ఒకసారి మీరు చూశాక, మనం బయటకు వెళ్లినా తన పని తను చేసుకొని వెళ్ళిపోతాడు. మరి కాసేపట్లో వస్తాడు. ఈలోగా మీరు ముఖం కడుక్కుని కాఫీ తాగుతూ ఉండండి" చెప్పాడు కోదండం.
"సరే. నువ్వు వెళ్లి ఆ టెక్నీషియన్ ను తీసుకునిరా" అన్నాడు దీక్షిత్.
"అలాగే సర్. మీరు కాస్త ఫోన్ చేసి ఆ సెక్యూరిటీ వాళ్లకు చెప్పండి. లేకుంటే అరగంట సేపు తనిఖీ చేస్తారు" అన్నాడు కోదండం.
"అలాగేలే" అన్నాడు దీక్షిత్.
ఇంట్లోకి వెళ్లిన దీక్షిత్ ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. అతనికి టవల్ అందించింది నీతూ శర్మ. ఆమెకు థాంక్స్ చెబుతూ "మీకెందుకండీ ఈ పనులన్నీ" అన్నాడు.
"నన్ను ఇంట్లో ఉంచుకొని కాపాడుతున్నారు. మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా" అంది నీతూ శర్మ.
ఒకసారి ఆమె వంక పరిశీలనగా చూసాడు దీక్షిత్.
శివరాం శర్మ గారి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయి ఉందామె.
వెళ్లే సందర్భానికి తగ్గట్లుగా సింపుల్ గానే తయారయి వుంది.
అయినా చూపు తిప్పుకోలేని అందం ఆమెది.
ఏ డ్రస్ వేసినా ఆ డ్రస్ కే అందం వస్తుంది.
అతని చూపులు గమనించిన నీతూ శర్మ కొద్దిగా సిగ్గుపడి, "హాల్లోకి పదండి. కాఫీ తెస్తాను" అంది.
ఆమె మీదనుండి చూపులు మరల్చుకుని హాల్లోకి నడిచాడు దీక్షిత్.
అప్పటికే అక్కడ అతని తలిదండ్రులు రామ్మోహన్, నందిత కూర్చొని ఉన్నారు.
కొద్ది సేపట్లో ఆ ఇంట్లో జరగబోయే పరిణామాలు వాళ్లకు చెప్పడం తన ధర్మం. లేకుంటే అనుకోని ఇబ్బందులు ఎదురవ వచ్చు.
మరి నీతూశర్మ సంగతి..? ఆమెకు కూడా చెప్పాలి. తనను పరాయి మనిషిగా చూడకూడదు.. అనుకున్నాడు.
ట్రే లో నాలుగు కాఫీ కప్పులతో వచ్చింది నీతూ శర్మ. అందరికీ సర్వ్ చేసి తనుకూడా ఓ కప్పు తీసుకొని నందిత పక్కన కూర్చుంది.
"మీ ముగ్గురికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆందోళన పడకుండా జాగ్రత్తగా వినండి." అంటూ పది నిముషాల పాటు వారికి తను చెప్పాలనుకున్నది చెప్పాడు.
మాట్లాడుకుంటూ వాళ్ళు కాఫీ పూర్తి చేసేసరికి కోదండం ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు.
"ఇతని పేరు జావీద్. ఏసీ మెకానిక్" అంటూ పరిచయం చేసాడు.
అతని వంక పరిశీలనగా చూసాడు దీక్షిత్.
అతనికి ముప్పై ఏళ్ళుంటాయి. నల్లగా దృడంగా ఉన్నాడు.
తనతో తెచ్చుకున్న బాగ్ ను కింద పెట్టి దీక్షిత్ కు సెల్యూట్ చేసాడతను.
"ఇతని బాగ్ ను తనిఖీ చేశారా?" అడిగాడు దీక్షిత్.
"ఓపెన్ చేసి చూడలేదు సర్. మీరు చెప్పారని సింపుల్ గా బాంబ్ డిటెక్టర్ తో చూసి పంపేశారు." చెప్పాడు కోదండం.
"పద.. రిపేర్ చెయ్యాల్సిన ఏసీ చూపిస్తాను" అంటూ అతన్ని తన గదిలోకి తీసుకొని వెళ్ళాడు దీక్షిత్.
అతని వెనకే బాగ్ తీసుకొని భయం భయంగా నడిచాడు ఆ వ్యక్తి.
కోదండం, నీతూ శర్మలు వాళ్ళను అనుసరించారు.
"ఈ ఏసీ నే, నువ్వు రిపేర్ చెయ్యాలి. కూలింగ్ రావడం లేదు" అన్నాడు దీక్షిత్.
"అలాగే సర్" అన్నాడా వ్యక్తి.
"ఆలస్యమెందుకు..పని ప్రారంభించు. మేము శివరాం శర్మ ఇంటికి వెళ్లి వస్తాము" అన్నాడు దీక్షిత్.
"శివరాం శర్మ ఇంటికి కాదు.. శివరాం శర్మ దగ్గరకే వెళ్ళండి" అంటూ బాగ్ లోనుండి రివాల్వర్ తీసి దీక్షిత్ ని షూట్ చేసాడు ఆ వ్యక్తి.
***
మోనా ఇంటికి వెళ్ళాడు దాము.
డోర్ తీసి, ఎదురుగా ఉన్న దాముని చూసి ఆశ్చర్యపోయింది మోనా.
పక్కకు తప్పుకుని అతన్ని లోపలికి ఆహ్వానించింది.
సోఫాలో కూర్చున్న దాము అటు ఇటు పరిశీలనగా చూస్తున్నాడు.
నీకు ముందే చెప్పానుగా డియర్.. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ వద్దు. నా దగ్గరకు ఎవరినీ రానివ్వను. నన్ను అనుమానించొద్దు" అంది అతని పక్కన కూర్చుంటూ.
"అదికాదేహే.. నీ ఇంటికెవరో చుట్టాలు వచ్చారంటేనూ ఒకసారి పలకరించి పోదామని వచ్చాను" అన్నాడు దాము మోనా వంక చూసి కన్ను గీటుతూ.
"అర్థమైంది. ఆ లూసీ కోసమేగా వచ్చిందీ.. నీ కోసం కాస్త రెడీ చేద్దామని బ్యూటీ పార్లర్ కు పంపాను." చెప్పింది మోనా.
"ఊరికే ఒకసారి చూద్దామని. అంతే. పని పూర్తయ్యేవరకు నాకు మూడ్ ఉండదు. ఆ సంగతి నీకు తెలుసుగా" అంటూ ఉండగానే అతని ఫోన్ మోగింది.
శక్తి దగ్గరనుండి ఫోన్.
“కాంపౌండ్ వాల్ బయట ఉన్న మా వాడు కాల్ చేసాడు. రివాల్వర్ శబ్దం వినిపించిందట. అంటే మీ జాఫర్ ఆ దీక్షిత్ ను షూట్ చేసి ఉంటాడన్న మాట. ఇంకా పూర్తి వివరాలు తెలీదు. ఆనందం పట్టలేక చేసాను" అన్నాడు శక్తి..
"ఆ జాఫర్ ను సెక్యూరిటీ వాళ్ళు షూట్ చేస్తారుగా?" అడిగాడు దాము.
"తప్పకుండా" చెప్పాడు శక్తి.
"సరే అన్నా. ఎప్పటికప్పుడు వివరాలు చెబుతూ ఉండు" అన్నాడు దాము.
=========================================================
ఇంకా ఉంది
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comentários