పెళ్లి
- Parnandi Gopala Krishna

- May 29, 2025
- 9 min read
#PGopalakrishna, #Pగోపాలకృష్ణ, #Pelli, #పెళ్లి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Pelli - New Telugu Story Written By P. Gopalakrishna
Published In manatelugukathalu.com On 29/05/2025
పెళ్లి - తెలుగు కథ
రచన: P. గోపాలకృష్ణ
కథా పఠనం: A. సురేఖ
“ఈ మాఘ మాసం లో మంచి ముహూర్తాలున్నాయిట అన్నయ్యగారూ” ఉదయాన్నేఫోన్ చేసి మరీ చెప్పింది అంబుజం వాళ్లమ్మ గజలక్ష్మి.
“నేను కూడా నిన్ననే విన్నాను చెల్లెమ్మా ఈ విషయం. ఈ మాఘ మాసం లో పెళ్ళికి మా వైపు నుండి అభ్యంతరాలు ఉండవు లెండి” చెప్పాడు పెళ్లికొడుకు గణపతి వాళ్ళ నాన్న రామనాధం.
“నేను మీ బావగారిని ఇవ్వాళే పంతులు గారింటికి పంపించి మంచి ముహూర్తం పెట్టించమని చెప్తాను అన్నయ్య గారూ, వదిన గారిని అడిగానని చెప్పండి” అంది గజం అనబడే గజలక్ష్మి.
“ఉదయాన్నే ఎవరండీ ఫోనూ”, విసుక్కుంటూ మంచం దిగింది గణపతి వాళ్లమ్మ ఆండాళ్లు.
“ఒసేయ్ ఆండాళ్లు నెమ్మదిగా మంచం దిగవే . నీ ధాటికి అది విరిగిపోయేలా ఉంది, అసలు విషయం వదిలేసి, ఆమెను రాత్రంతా మోస్తూ, కిర్రు కిర్రు మని శబ్ధం చేస్తున్న తాతలనాటి పందిరిమంచాన్ని జాలిగా చూశాడు రామనాధం.
“అబ్బా, అడిగినడానికి సూటిగా జవాబు చెప్పరు కదా”, విసుక్కుంటూనే ఒక ఉదుటున పందిరి మంచం మీంచి కిందికి దూకింది ఆండాళ్లు. ఆమె అలా దూకడంలో మంచం కిర్రు మని శబ్ధం చేస్తూ అటూ ఇటూ కొట్టుకుంది. చాలా కాలానికి కొడుకు గణపతికి అంబుజంతో పెళ్లి కుదిరిన ఆనందంలో డాక్టర్ చెప్పిన డైటింగ్ కి వీడ్కోలు చెప్పిన ఆండాళ్లు ఈ మధ్య ఒక పది కిలోలు బరువు పెరిగి వంద కిలోల మార్క్ దాటింది గత వారమే.
మనిషి ఆకారం కొంచెం భారీగా ఉండి, కుదుమట్టంగా ఉండడం వలన ఆండాళ్లు కొంచెం పెద్ద ఆవిడ లాగా కనిపిస్తుందిగానీ, తిండి పుష్టి లో గానీ, నోటిని ధాటీగా వాడడంలో గానీ ఆండాళ్లు ని మించిన వాళ్ళు వాళ్ళ బంధువర్గం లో లేరని అందరూ చాటుగా చెప్తూ ఉంటారు. అందుకే ఎవరూ ఆమె ముందు నోరు విప్పరు. తానంటే అందరికీ భయం తో కూడిన వినయం అనుకుని తనంత గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరని అనుకుంటుంది.
“ఎవరండీ ఫోను”? అంటే బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడకుండా అలా వెళ్లిపోతారేంటండీ, భర్త రామనాధం వెనకాలే పెరట్లొకి నడిచింది ఆండాళ్లు. “ఓహో, అదా, మన వియ్యపురాలు లేదూ, అదే గజలక్ష్మి గారు.. ” అని రామనాధం చేప్పేలోపు, “ఆ.. ఏమైంది ఆవిడకి. కొంపదీసి పోయిందా”.. కంగారుగా అడిగింది ఆండాళ్లు.
“నీ మొహం మండా.. ఎప్పుడూ ఎవరు పోతారా అని చూస్తూ ఉంటావేంటే .. ఆవిడ ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉంది. ఈ మాఘమాసంలో మంచి ముహూర్తాలున్నాయని ఫోన్ చేస్తే, ముహూర్తం ఖాయం చేసేయమని చెప్పాను” అన్నాడు రామనాధం.
“హమ్మయ్యా, ఇన్నాళ్లకో మంచి పని చేశారు. పాపం వెర్రివెధవ, పెళ్ళొ, పెళ్ళొ అని ఒకటే కలవరింతలు. ఏదో ఆ పిల్ల పుణ్యమా అని ఈ సంబంధం ఖాయమైంది” అప్రయత్నంగానే పంకజం చేసిన సాయం గుర్తు చేసుకుంది. “అవునే ఆండాళ్లు, ఆ అమ్మాయికి మనం ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము” అంటూ వంతపాడాడు రామనాధం.
“మీ మొహం, మీకేం తెలీదు ఊరుకోండి, అందరికీ దానధర్మాలు చేయడానికి మనమేమీ ధర్మసత్రం నడపడం లేదు” భర్తని కసురుకుంది ఆవిడ.
భార్య హటాత్తుగా ఎందుకు ఉగ్రరూపం ధరించుతుందో ఎప్పటికీ అర్థం కాని రామనాధం మరో మాట మాట్లాడకుండా దంతధావనం పూర్తికానిచ్చి, భార్య కాఫీ ఎప్పుడిస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తూ కూర్చొన్నాడు.
“అవునూ, ఏడీ మనబ్బాయి? టైమ్ ఎనిమిది అయినా ఇంకా నిద్ర లేవలేదంటారా?” అంటూనే కొడుకు పడుకున్న బెడ్ రూమ్ వైపు వెళ్ళింది ఆండాళ్లు. బెడ్ మీద తలగడని గట్టిగా పట్టుకొని, నిద్రలోనే, “అంబూ, ఎంత ముద్దుగున్నావే.. ” అంటూ తలగడకి ముద్దులు పెడుతూ రొమాంటిక్ గా పాట పాడుతూ ఉన్నాడు.
ఆండాళ్లు కొడుకుని చూసి, “వెర్రినాగన్న అప్పుడే పెళ్ళయిపోయినట్లు, పెళ్ళాంతో డ్యూయట్ పాడుతున్నట్లు కలలు కంటున్నాడు” .. నవ్వుకుంటూ బెడ్ రూమ్ డోర్ దగ్గరగా వేసి వచ్చేసింది.
ఆ వెంటనే, ధబ్ మని శబ్ధం, దాంతోపాటే “అమ్మోయ్ .. చచ్చానే”.. అని అరుపు వినపడడంతో ఏమైందా అనుకుంటూ మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళింది.
అప్పటికే బెడ్ మీడినుండి కిందపడిన గణపతి, నేలకేసి కొట్టిన అరటిపండులా నేలకి అంటుకుపోయి ఉండిపోయాడు.
“అయ్యయ్యో ఏమైందిరా”? అంటూ వాళ్ళమ్మా నాన్నా ఎంతో అవస్థపడి లేవదీస్తే ఎలాగో మూలుగుతూ లేచి కూర్చొని, “ఇదంతా కలా? నిజం కాదా” ? అంటూ విచారంగా నిట్టూర్చాడు గణపతి.
“ఏమైందిరా?” అంటూ అడిగారు రామనాధం.
“ఏంలేదులెండి నాన్నా” అంటూ గబగబా బ్రష్ చేయడానికి వెళ్ళాడు గణపతి.
“వెర్రికుంక ఆ అంబుజం తో పెళ్ళయిపోయినట్లు, కలలు కంటూ డ్యూయట్ లు పాడుతున్నాడు. ముహూర్తాలు కూడా ఇవాళో రేపో ఖాయం చేసేస్తామని తెలిస్తే ఎగిరి గంతులు వేస్తాడేమో. సరిగ్గా మన ఫ్యామిలీ కి సరిపడే అమ్మాయిని ఇంటికోడలిగా చేసింది మన పంకజం”. మళ్ళీ నోరు జారింది ఆండాళ్లు.
“అవునే అమ్మా, నిజంగా పంకజం అక్క ఎంత సాయం చేసిందో. దానికి పెళ్లిసంబంధం కుదుర్చినందుకు గానూ ఘనంగా బహుమతి ఇస్తానని చెప్పాను. ఎన్ని వివాహ వేదికలు వాళ్ళ దగ్గరకి వెళ్ళినా సంబంధం కుదర్చలేక పోయారు. ఒక్క మాటతో సంబంధం ఖాయం చేసేసింది. అసలు పెళ్లివాళ్ళు కూడా మన సంబంధాన్ని కాదనకుండా ఒప్పుకోవడానికి కారణం పంకజం అక్కే కదా”! ఇంకా ఏదో అనబోయాడు అప్పుడే బ్రష్ చేసి వచ్చిన గణపతి.
“ఛ, ఊరుకో, బొత్తిగా లోకజ్ఞానం లేని మనుషులు. రేపు నేను లేకపోతే ఎలా ఉండేవారో ! ఏదో ఒక సంబంధం చూసి, కుదుర్చితే మనం ఇవ్వాల్సిన కమిషన్ ఇచ్చాను కదా దానికి అదే చాలా ఎక్కువ” చెప్పింది అండాళ్ళు.
తల్లి మాటకి గణపతి నొచ్చుకున్నాడు. “అమ్మా, ఇలాంటి బుద్ధులతోనే ఇన్నాళ్ళూ కావలసినవాళ్ళని దూరం చేసుకున్నాం. నీకు వాళ్ళు ఇష్టం లేకపోతే సంబంధం వద్దు ఏమీ వద్దు అని చెప్పేస్తా ఇవాళే” అన్నాడు.
“ఒరేయ్, బొత్తిగా వాజమ్మలాగా మాట్లాడకు. నీకేం తెలీదు ఊరుకో. పంకజం అంటే ఆషామాషీ అనుకోకు. నువ్వు ఒక్క వేలు చూపిస్తే అది చెయ్యి అంతా మింగేస్తుంది” అనవసరంగా పంకజం మీద ఆక్రోశం వెళ్లగక్కింది ఆవిడ.
*
ఆండాళ్లు పిన్ని చేసిన వంచన, మోసం మరిచిపోలేకపోతోంది పంకజం. “పోనీలే పంకూ డార్లింగ్, వాళ్ళ పాపానికి వాళ్ళని పోనీ” అంటూ భర్త గోవిందం ఊరడించినా అవమాన భారాన్ని తట్టుకొని తేలిగ్గా తీసుకోలేక పోతోంది పంకజం. ఎలాగైనా వీళ్ళకి ఇంతకీ ఇంతా దెబ్బ కొడతాను, మనసులోనే శపధం చేసింది పంకజం. తన సహాయాన్ని పూర్తిగా పొంది తనకు నష్టాన్ని కలిగించారు.
“పోనీలే, వాళ్ళ బుద్ధి బయట పడిందిగా, దూరంగా ఉందాం. మనం చేసింది ఒక్క మాట సాయమేగా” అన్నాడు గోవిందం. అయినా ఆమె మనసు అవమాన భారాన్ని సహించలేక పోయింది. భార్య ఏదైనా అనుకుందంటే చేసి తీరుతుందని ఆవిడ వ్యవహారంలో తలదూర్చకూడదని, గతంలో తగిలిన ఎదురు దెబ్బల సాక్షిగా ఒట్టు వేసుకున్నాడేమో, గోవిందం మౌనంగా ఉండిపోయాడు.
“అత్తయ్యా, అంబుజం కి మా తమ్ముడు వాళ్ళు ఎంత బంగారం పెడతామన్నారు? ఒకరోజు ఉదయం పనులన్నీ ముగించుకొని గజలక్ష్మి ఇంటికి వచ్చి తీరిగ్గా ఆరా తీసింది పంకజం. లౌక్యంగా మాట్లాడడంలో పంకజం తరవాతే ఎవరైనా. “ఆ .. మీ పిన్ని చాలా ఘటికురాలు లా ఉంది. పది తులాలవరకు పెడతానన్న ఆవిడ, ఇప్పుడు పెళ్ళిలో మూడు తులాలు బంగారం పెట్టి, మిగిలింది మొదటి బిడ్డ పుట్టాక అమ్మాయి ఒంటిమీద వేస్తానంటోంది.
అంతవరకు, మూడు తులాలు మాత్రమే ఇస్తుందిట . అయినా ఇంట్లో ఆడపెద్దరికం అనుకుంటా. అన్నయ్యగారు అన్నింటికీ తలూపడమే గానీ, ఒక్క మాటా మంతీ ఉండదు”. నిష్టూరమాడింది. పంకజం బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. “అలా ఎలా ఒప్పుకుంటారు అత్తయ్యా, మీరు ఒప్పుకున్నా,
నా పరువు పోదా, ఎంతకష్టపడి వాడికి సంబంధం చూశానని చెప్పానో, అయిన మన అంబు కి ఏం తక్కువని. మా పిన్ని కాదూ కూడదూ అంటే రేపీపాటికే ఇంకో సంబంధం తెచ్చి ఎల్లుండికల్లా మన అంబు ని పెళ్లి పీటల మీద కూర్చోపెట్టనూ. అసలు ఆవిడ పిల్లలు పుట్టిన తరవాత ఆ బంగారం పెట్టకపోతే మనం మాత్రం ఏం చేయగలం.
అప్పుడు అమ్మాయ్ పంకజం ఇలా చేశావేంటమ్మా అని మీరు, మీ వాళ్ళు నన్ను నిలదీస్తే నా పరువేమవుతుంది”. ఆవిడని ఆలోచనలో పడేయడానికి అన్నట్లు, కొంచెం నీళ్ళు తాగేసి వస్తాను ఉండు అత్తయ్యా, అంటూ చొరవగా లేచి, వంటగదిలోకి వెళ్ళింది.
పంకజం వేసిన అస్త్రం గజలక్ష్మి మీద బాగానే పనిచేసింది. కావాలనే కిచెన్ లో ఒక రెండు మూడు నిమిషాలు గడిపి, హాల్లోకి వచ్చింది పంకజం. అప్పటికే ఫోన్ చేయడానికి సిద్ధమవుతోంది గజలక్ష్మి.
చచ్చాను, నా మాటల్ని ఈ పిచ్చిది ఆవిడ తో వాగేస్తుందో ఎంటో అనుకుంటూ, “అలా చేస్తే బాగుండదు, దేనికైనా పట్టు విడుపు ఉండాలి, మామయ్య రానీ ఆయన చేత చెప్పిద్దాం” అంది పంకజం.
“మా ఆయన అంత పనిమంతుడే అయితే నాకెందుకులే అమ్మా ఈ అవస్థ. అతను ఒట్టి వెర్రి వెంగళప్ప. ఒట్టి వాజమ్మ” అంటూ భర్త ప్రయోజకత్వాన్ని కొట్టిపారేసింది.
“అయితే ఒక పనిచేయి. నేను నువ్వు మాట్లాడుకున్నట్లు చెప్పకుండా, మా తమ్ముడు అదే ఆ గణపతికి ఫోన్ చేయి, మీ అమ్మ ఇలా మెలికపెట్టింది. మీ సంబంధం మాకు సుతారమూ ఇష్టం లేకపోయినా పంకజం మొహం చూసి ఒప్పుకున్నాం” అని చెప్పు అంది.
“అల్లుడు కి ఫోన్ చేస్తే అతను తానే కొని పెడతాను అంటాడెమో”, అంది గజలక్ష్మి.
“అంటే అప్పుడు రెండు రకాలుగా లాభమే, ముందు గణపతి చేత బంగారం కొనిపించి, తరువాత మా పిన్ని పెట్టిన బంగారం పుట్టిన బిడ్డకు పెట్టేయాలని. దెబ్బకి ఆవిడ తిక్క కుదురుతుంది” అంది పంకజం.
ఆమె మాట పూర్తి అవ్వకుండానే గజలక్ష్మి నేరుగా వియ్యపురాలికే ఫోన్ చేసింది. కుశల ప్రశ్నలు అయ్యాక, అమ్మాయికి మెడలోకి నెక్లెస్ లేకపోతే బాగుండదని చల్లగా చెప్పింది గజం.
“నేను మొన్న చెప్పానుగా, పెళ్ళికి మూడు తులాలు బంగారం.. తొలి కాన్పు అయ్యాక మిగిలిన బంగారం పెడదామని నేను మీ అన్నయ్యా అనుకున్నాం” అంది ఆవిడ.
“అలా కుదరదమ్మా వదినగారూ, ఆ రోజు పెళ్లి చూపులప్పుడు మనం ఇలా అనుకోలేదు. అమ్మాయికి మీరు పది తులాలు పెట్టడానికి, మేము మా తరుఫున పది తులాలు పెట్టి, అబ్బాయికి బైక్ కొనివ్వడానికి అనుకున్నాం కదా. పోనీ మేము పెట్టాల్సింది కూడా అప్పుడే పెట్టి, బైక్ పుట్టబోయే బిడ్డ ని స్కూల్ లో వేసినాడు పెట్టమంటారా” అడిగింది గజం.
“అదెలా కుదురుతుంది, మీరు ఆడ పిల్లని ఇచ్చేవాళ్ళు. అలా అంటే కుదరదు” మొహమాటం లేకుండా చెప్పింది ఆండాళ్లు .
“అయితే మాకు మీ సంబంధం వద్దులెండి. నిన్ననే విజయవాడ సంబంధం వాళ్ళు బతిమాలుతూ తిరిగి వచ్చారు. అదే ఖాయం చేసుకుంటాం. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి” అంటూ టక్కున ఫోన్ పెట్టేసింది.
పంకజానికి గజలక్ష్మి వ్యవహారం మీద గట్టినమ్మకమే కుదిరింది. “శెభాష్ అత్తయ్యా, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అలా చూస్తూ ఉండు, ఆండాళ్లు పిన్ని గిలగిలా కొట్టుకుంటూ ఫోన్ చేస్తుంది. నువ్వు అసలు ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయకు. నాకు ఫోన్ చేస్తుంది కదా, నేను ఇంకా ఎక్కువ గుంజుతాను ఆవిడ దగ్గర”, భరోసాగా అంది పంకజం.
“ఏమోనే పంకజం, ఆ తిక్కలావిడ సంబంధం కాన్సెల్ అంటుందేమో అని భయంగా ఉంది” తనమనసులో భయం వెళ్లగక్కింది ఆవిడ.
“నువ్వు నిశ్చింతగా ఉండు అన్నానా, నేను చక్కబెడతానుగా” అంటూ ఉండగానే గణపతి ఫోన్ చేశాడు పంకజానికి.
కొంచెం దూరంగా వెళ్ళి, ఇంటిపక్కనే ఉన్న చెట్టుకింద నిలబడి మాట్లాడడం మొదలెట్టింది. “అక్కా, ఒకసారి అంబు తో మాట్లాడించు” అని అడిగాడు గణపతి.
“ఒరేయ్ తమ్ముడూ, మీ అమ్మ పెట్టాల్సిన బంగారం విషయం లో ఏదో మెలికపెట్టిందిట, ఇందాకే వాళ్ళు కబురు చేసి, విజయవాడ సంబంధం వాళ్ళు వెనక్కి వచ్చారు, వాళ్ళు కట్నాలు కానుకలు ఏమీ అడగలేదు. అమ్మాయికి పాతిక తులాలు బంగారం పెడతాము అన్నారుట. అదే ఖాయం చేసుకుంటారని తెలిసింది. వాళ్ళంతా ఉదయాన్నే బయలుదేరి విజయవాడ వెళ్తున్నాం అని చెప్పారురా” అంది చాలా మామూలుగా.
“అక్కా, నీకేమైనా మతిపోయిందా ఏమిటే, వాళ్ళు అలా చెప్పి వెళ్లిపోతూ ఉంటే నాకో మాట చెప్పాలి కదా!” నిష్టూరంగా కాస్త నిరాశగా, కంగారుగా అడిగాడు గణపతి.
“నాకెందుకురా తమ్ముడూ, అయినా నీ పెళ్లి కుదిరిస్తే నాకు కమిషన్ ఇంకా ఆడపడుచు లాంఛనాలు ఇప్పిస్తానని మాట ఇచ్చి, ముష్టి అయిదు వేలు ఇప్పించావు మీ అమ్మచేత. నీ డబ్బూ వద్దు, మీ విషయాల్లో నేను జోక్యం చేసుకోనూ వద్దు ఉంటా” అంటూ కాల్ కట్ చేసింది.
చెట్టుకింది నుండి మళ్ళీ గజలక్ష్మి ఇంటి దగ్గరకి వచ్చింది పంకజం. అప్పటికే గజలక్ష్మి టెన్షన్ పడుతోంది. “ఏమైంది పంకజం అంటూ అడిగింది .
“ఏమీ కాలేదు. తల్లీ కొడుకు డ్రామా ఆడుతున్నారు కానీ, నువ్వు వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకు. అసలు వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తానుగా. రేపు ఈ పాటికి నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను” అంది పంకజం.
“ఛా .. అదేమీ వద్దులే. ఈ సంబంధం ఏదో నీ దయవలన కుదిరింది అనుకుంటే ఆవిడ ఇలా మాట్లాడడం బాగోలేదు. పోనీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులుంటే తర్వాత చూసుకోవచ్చు” నాలుగు మెట్లు దిగింది గజం.
“అత్తయ్యా, కొంచెం టీ పెడుదూ” అంటూ ఆమెను మాటల్లో పెట్టి కిచెన్ లోకి పంపేసి, గజలక్ష్మి ఫోన్ లో ఆండాళ్లు నెంబర్ ని, గణపతి నెంబర్ ని బ్లాక్ చేసేసి, ఏమీ తెలియనట్లు కూర్చొంది.
“నేను సాయంత్రం వస్తానుగా. విజయవాడలో మా పెద్దమ్మ కొడుకు ఒకడున్నాడు. టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్. వాడితో కూడా మాట్లాడదాం”. భరోసాగా చెప్పింది పంకజం ఇంటికి వెళ్తూ.
“తిక్క మొహానికి తిక్క ఎక్కించేయనూ, పంకజమా మజాకానా, నన్నే దెబ్బ కొడతావా ఆండాళ్ళూ, నాకు కమిషన్ ఎలా వసూలు చేసుకోవాలో తెలుసు కదా”! తనలో తానే మాట్లాడుకుంటూ ఇంటికి తాళం తీసి, కాళ్ళు చేతులూ కడుక్కొని, ఫ్యాన్ కింద కూర్చొని సుష్టుగా భోజనం చేసింది.
*
గణపతికి ఒకపక్క చెమటలు కారిపోతున్నాయి. తల్లి చేసిన పనికి ఒళ్ళు మండిపోతోంది. ఫోన్ చేసి తల్లిని చెడామడా తిట్టిపోసాడు .
“అంతేరా.. పెళ్లి కాకుండానే ఆ పిల్ల నీకు బెల్లం లాగా కనిపిస్తోంది. నేనేమో దెయ్యాన్నయిపోయాను. నీ పెళ్లి చూసేసి, ఏ కాశీకో, రామేశ్వరానికో మీ నాన్నని తీసుకొని వెళ్లిపోతాను” అంటూ ఫోన్ లోనే శోకాలు పెట్టసాగింది.
“ముందు పెళ్లి సంగతి చూడమ్మా, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. నువ్వు చేసినపనికి వాళ్ళు వేరే సంబంధం కుదుర్చుకుంటున్నారుట” దాదాపుగా ఏడుస్తూ చెప్పాడు గణపతి.
“పాపం వెర్రి వెధవ, పెళ్ళవుతుందని సంబరపడిపోయి, అందరికీ పార్టీ కూడా ఇచ్చేశాడే ఆండాళ్ళూ”, అన్నాడు రామనాధం.
“ఇప్పుడేంటి సాధనమండీ, ఆవిడ ఫోన్ కూడా ఎత్తడం లేదు. పంకజానికి కాల్ చేద్దామా?” అడిగింది ఆండాళ్లు.
“నువ్వు చేసిన నిర్వాకానికి ఆ అమ్మాయి మళ్ళీ మన మొహం కూడా చూడదనుకుంటా. నువ్వే వెళ్ళి రేపు సంబంధం సంగతి తేల్చుకుని రా, చెడగొట్టింది నువ్వే కదా”!
భర్త కోపంగా ఉన్నాడని అర్థమైంది ఆవిడకి. ఎప్పుడో పెళ్ళయిన కొత్తల్లో భర్త కి కోపం తెప్పించినందుకు ఒళ్ళు హూనమైపోయేలా, గొడ్డుని బాదినట్లు బాదాడు. మళ్ళీ అలాంటి అవకాశం అతనికి ఇవ్వదల్చుకోలేదు ఆండాళ్లు.
“నేనే పంకజం తో మాట్లాడతాను కదా!” అంటూ పంకజానికి ఫోన్ చేసింది.
“ఏమైంది పిన్ని, ఇప్పుడు గుర్తొచ్చానా” నిష్టూరంగా అడిగింది పంకజం.
“అమ్మాయ్, వాళ్ళు మళ్ళీ వేరే సంబంధం వాళ్ళకి మాట ఇచ్చారుట, ఒకసారి విషయం అడిగి తెలుసుకో, ఈ రోజు ఉదయాన్నే, వాళ్ళు వేరే సంబంధం కోసం ఊరెళ్ళారని మీ తమ్ముడితో చెప్పావుట. వాళ్ళని ఆపాలి కదా పంకజం”. నిష్టూరంగా అడిగింది ఆండాళ్లు.
“అదేంటి పిన్నీ, అలా అంటావు. నువ్వే కదా చెప్పావు. ఈ సంబంధం కుదర్చడం లో నా ప్రమేయం ఏమీ లేదన్నావు గా. అలాంటప్పుడు నేనెందుకు జోక్యం చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం. రేపుదయం ఏమైనా అయితే వాళ్ళు నన్ను అడిపోసుకుంటారు. ఒకే ఊరు వాళ్ళం. మొహాలు చూసుకోకుండా అయిపోదూ, సరేలే నేను ఉంటా” చెప్పింది పంకజం.
“అదేంటే అలా అంటావు. వాడు నీకు తమ్ముడు కదే”.. , ఏదో చెప్పబోయింది అవతలివైపు నుండి ఆండాళ్లు.
“అవునా.. కానీ మీరంతా అలా అనుకోలేదు కదా, సంబంధం కుదుర్చితే నాకు కమిషన్ ఇవ్వాలని ముందే చెప్పాను, ఆడపడుచు లాంఛనాలు ఇవ్వాలని చెప్పాను. ముష్టి అయిదువేలు నా చేతిలో పెట్టి వెళ్లిపోయావు. నీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా”. అంది పంకజం.
“ఓహో, దానికోసం ఇప్పుడు అలిగావా, పోనీలే ఆ డబ్బులు ఏవో వాళ్ళకి చెప్పి ఇప్పించుతాను సరేనా” అంది ఆండాళ్లు చాలా తెలివిగా.
“వాళ్ళు ఏమీ అబ్బాయిలు దొరక్క బాధపడలేదు. కో.. అంటే కోటి మంది. వద్దు అనుకున్న సంబంధం వాళ్ళు మళ్ళీ వచ్చి బతిమాలారుట. వాళ్లేందుకు ఇస్తారు పిన్నీ . నేను ఇంక మీ విషయాల్లో జోక్యం చేసుకొను. మీరే ఆ బాధలేవో పడండి” . ఫోన్ పెట్టేసింది పంకజం.
అయిదు నిమిషాలు కూడా పూర్తవ్వకుండా గణపతి ఫోన్ చేసి, “అక్కా, నువ్వు వాళ్ళతో మాట్లాడి, వేరే సంబంధం గొడవ ఎందుకు అని చెప్పి, వాళ్ళని ఆపు చేయి. ముందనుకున్నట్లు నీకు ఇవ్వాల్సింది ఇప్పుడే ఇచ్చేస్తాను. అంబు కి పెట్టాల్సిన బంగారం అవీ కూడా మామూలుగా పెట్టేద్దామని చెప్పు”. దాదాపు ప్రాధేయపడుతునట్లు చెప్పాడు గణపతి.
“ఏమోరా తమ్ముడూ, నువ్వు మాటమీద నిలబడ్డా పిన్ని ఒప్పుకోదురా” అంది పంకజం.
“అమ్మ గొడవ నీకెందుకు చూడు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నా”, అంటూ అప్పటికప్పుడు పంకజం చెప్పిన కమిషన్ డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేశాడు.
“సరేరా తమ్ముడూ, నేను వాళ్ళతో మాట్లాడతానులే” అంటూ తమ్ముడికి భరోసా ఇచ్చేసి, “తమ్ముడు తమ్ముడే.. వ్యవహారం వ్యవహారమే. ఇలా నిక్కచ్చిగా ఉండకపోతే ఇవాళ ఎంత నష్టపడే దానివే పంకూ” అంటూ తనకి తానే చెప్పేసుకుని, తమ్ముడు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బు చూసుకొని ఇల్లంతా డాన్స్లు చేస్తూఉండగా, ఇంటికి వచ్చాడు గోవిందం.
“చూశారా నా తెలివితేటలతో వ్యవహారాన్ని మార్చేసాను” అంటూ గర్వంగా తన అకౌంటు లోని డబ్బు చూపించింది.
భార్య ప్రయోజకత్వం విని గుడ్లు తేలేసేసి, నేలమీద పడిపోయి గిలగిలా కొట్టుకున్నాడు గోవిందం.
తమ్ముడు కి భరోసా ఇచ్చిన పంకజం, ఆండాళ్లు కి ఫోన్ చేసి, “ప్రస్తుతానికి పెద్దవాళ్ల నగలు పెట్టి, పెళ్ళయ్యాకా వాటిని మళ్ళీ మారుస్తాం, మా ఇళ్ళల్లో ఆనవాయితీ ఇదే అని చెప్పు పిన్ని, నేను గజలక్ష్మి అత్తయ్య పక్కనే ఉండి, నీ మాటలు నా మాటలుగా చెప్తాను” అంటూ హామీ ఇచ్చింది.
కొడుకు పెళ్లి తప్పిపోతుందేమో అని అప్పటికే భయపడి పోయిన ఆండాళ్లు, పంకజం చెప్పిన మాటలకు తలూపింది.
“ఈ సాయం చేసి, ముహూర్తాలు పెట్టిస్తే నీ కష్టం ఉంచుకోనే పంకజం” అంటూ కాసేపు పంకజాన్ని పొగిడింది ఆవిడ.
“నువ్వు అలాగే అంటావు కానీ, నన్ను పట్టించుకుంటావా ఏమిటి. నువ్విచ్చిన డబ్బు సాయంత్రం మా ఆయన వచ్చాక వెనక్కి ట్రాన్స్ఫర్ చేస్తాలే, ఆడపిల్ల అన్న అభిమానం కూడా లేదు నీకు. అయినా వాడు నా తమ్ముడని ఏదో, నా వంతు సాయం చేస్తున్నా. అక్కడికీ మా ఆయన నీకెందుకు అనవసరమైన వ్యవహారం అన్నా, మనసొప్పలేదు” అంటూ జుర్రన ముక్కుచీది, పక్కనే ఉన్న గోడకి చేతులు తుడిచింది.
“అదేం లేదే పంకజం. నువ్వు ఇంకేం మాట్లాడకు అన్ని మరిచిపో, ఇప్పుడే నీకు డబ్బులు పంపిస్తానుగా” అంది ఆవిడ.
“పంపిస్తే పంపించావు కానీ ఇవేవీ వాడికి చెప్పకూ. మా అక్క కమిషన్ వ్యాపారం చేస్తోందని బాధపడతాడు” అంటూ లౌక్యంగా చెప్పింది.
“ఛ .. అవన్నీ ఎందుకు చెప్తాను. ఇదిగో ఇప్పుడే మీ బాబాయి చేత డబ్బులు వేయిస్తాను, పెళ్ళికి ఏదైనా చేయించుకో, నాకు చూపించాలి సుమా”, అంటూ అప్పటికప్పుడు ఏభైవేలు ట్రాన్స్ఫర్ చేయించింది ఆండాళ్లు.
“పిసినారి మనిషి దగ్గర వచ్చిందే గొప్ప” అనుకుంటూ మళ్ళీ డాన్స్లు మొదలెట్టింది పంకజం. భార్యకి పిచ్చి పట్టిందేమో, కరిస్తే ప్రమాదమని, చాలా సేపు బెడ్ రూంలో మంచం కింద దోమలు కుడుతున్నా, కదలకుండా దాక్కున్నాడు గోవిందం. ఎట్టకేలకు, భార్య చెప్పిన విషయం నమ్మి, ఆధారాలు చూపించాక, భార్య ప్రయోజకత్వాన్ని పొగుడుతూ మంచం కిందనుంది బయటికి వచ్చాడు.
“మీరు ఇంట్లోనే ఉండండి, నేను గజం అత్తా వాళ్లింటికి వెళ్ళి వ్యవహారం చక్కబెట్టి, అక్కడే మనకి భోజనాలు ఏర్పాటు చేసి, మీకు ఫోన్ చేస్తాను” అంటూ హడావుడిగా పరుగులు పెట్టింది.
అంబుజం చాలా విచారంగా ఉండడంతో “ఏమైందే ఆంబూ”, అంటూ పలకరించింది పంకజం.
అప్పటికే కట్టుకున్న చీర పైట తో కళ్ళు తుడుచుకుంటూ, గణపతి తో పెళ్లి జరగదని బెంగ పెట్టుకున్నట్లు చెప్పింది అంబుజం.
“నేనుండగా నీకెందుకు దిగులు” అంటూ దేవత లెవెల్లో పోజు పెట్టి, “నువ్వు నీ డ్రీమ్స్ లోకి వెళ్ళి డ్యూయట్ పాడుకో, నేను నీ పెళ్లి చేయిస్తానుగా” అంటూ తాను ఆండాళ్లు కి ఇచ్చిన సలహా, ఆండాళ్లు మాటలుగా గజం కి చెప్పి, అప్పటికప్పుడు ఇద్దర్నీ కలిపేసింది.
“అలా అయితే ఈ నెలాఖరు లోనే మంచి ముహూర్తాలున్నాయి అన్నారు పంతులుగారు. మనం తొందరగా వీళ్ళ పెళ్లి చేసేస్తే, బాధ్యత వదిలిపోతుంది” అన్నారు అంబు వాళ్ళనాన్న పరాంకుశం.
“అమ్మాయ్, పంకజం వంట అయిపోయింది ఇక్కడే భోజనం చేసి వెళ్ళు” అంది గజం.
“అయ్యో అత్తయ్యా, నాకు మీ పని అర్జెంట్ అనిపించి, ఇంట్లో వంట చేయకుండా వచ్చేశాను. మీ అల్లుడికి వంట కూడా చేత కాదు. నేను ఆయన్ని బయట తినమంటే బావుండదు కదా. నేను వెళతాను” అంది.
“అలా కుదరదు వదినా, అన్నయ్య గారిని ఇక్కడికే డిన్నర్ కి రమ్మని ఫోన్ చేయి” అంటూ అంబుజం కూడా గట్టిగా చెప్పడంతో, తన ప్రయోజకత్వాన్ని మనసులోనే మెచ్చుకుంటూ, భర్తని డిన్నర్ కి వచ్చేయమని ఫోన్ చేసి, పెళ్లి కబుర్లలో పడింది పంకజం.
***
P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ P. గోపాలకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna
యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:
నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.




Comments