top of page

అపరాధ పరిశోధన - పార్ట్ 8

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన


Aparadha Parisodhana - Part 8 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 03/05/2025

అపరాధ పరిశోధన - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. 


ఐజీ గారు కాల్ చేసి, గవర్నర్ ఆబ్లిగేషన్ ఒకటుందని, నీతూ శర్మను ఇంట్లో ఉంచుకొని ప్రొటెక్షన్ ఇమ్మని చెబుతారు. హోమ్ మినిష్టర్ బావమరిది రమేష్, తమ పార్టీ ఎమ్మెల్యే ని కూడా అనుమానించమని చెబుతాడు. 


ఇంటరాగేషన్ లో కిషన్, ఫయాజ్ లు తడబడతారు. మొదట లొంగని రంగా, బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు. 

దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. 


ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 8 చదవండి..


మరో ఐదు నిముషాలకు దాము ఫోన్ మోగింది. 


"చెప్పండి రాజన్ సాబ్" అన్నాడు దాము. 


"అదే.. గోధుమలు పంపమన్నావట కదా.. అవి ఉంచడానికి మీ ఇంట్లో స్థలం ఉందా.. లేకుంటే మా గోడౌన్ కు చేర్చమంటాను. " అన్నాడు రాజన్. 


"థాంక్స్ సాబ్. నేనే మిమ్మల్ని ఆమాట అడుగుదామనుకుంటున్నాను. మీ గోడౌన్ లో వుంటే నా బ్యాంకు అకౌంట్ లో ఉన్నట్లే" అన్నాడు దాము. 


"సరే. ఇందాక వచ్చిన మనిషి.. శక్తి మళ్ళీ వస్తాడు. అన్ని విషయాలు పూర్తిగా చెబుతాడు" అని ఫోన్ పెట్టేశాడు రాజన్. 


మరి కొంత సేపటికే శక్తి వచ్చాడు. 

"ఒప్పుకున్నానే గానీ ఎలా ప్రొసీడ్ కావాలో అర్థం కావడం లేదు" అన్నాడు దాము. 


"నీకు చెప్పేదేముంది.. 'చంపాల్సింది ఒక మనిషిని' అని మాత్రమే మనసులో ఉండాలి. అతనెవరన్నది ఆలోచించకూడదు. ఎన్నో దేశాల్లో ఎందరో దేశాధ్యక్షులు హత్యకు గురయ్యారు. " చెప్పాడు శక్తి. 


"అది వేరు. అక్కడ చంపిన వాళ్ళందరూ, తాము చనిపోయినా పరవాలేదు అనుకునే వాళ్ళు. కానీ నేనలా అనుకోవడం లేదు" చెప్పాడు దాము. 


"తెలుసు. కానీ అలా అనుకునే వాళ్ళను ఈ పనికి నియమించు" అన్నాడు శక్తి. 


"ఇప్పటికిప్పుడు దొరకాలిగా.. " అన్నాడు దాము. 


"వాళ్ళ ప్రాణాలు పోతాయని వాళ్లకు చెప్పకుంటే సరి.. " వికృతంగా నవ్వాడు శక్తి. 


"నా మనిషిని బలి ఇస్తే మిగతా వాళ్లకు నమ్మకం పోతుంది కదా. " సందేహించాడు దాము. 


"అది అనుకోకుండా జరిగినట్లు ఉండాలి. అయినా ఖచ్చితంగా చనిపోవాలని లేదు. అదృష్టం బాగుంటే బతకవచ్చు. ఒకవేళ పోతే అతని అందమైన భార్యకు నువ్వు సహాయంగా ఉంటావుగా.. మోనాకు అండగా ఉన్నట్లు.. రిస్క్ చేయకుంటే పదహైదు కోట్లు ఊరకే రావుగా.. " నవ్వాడు శక్తి. 


'నా గురించి అన్నీ తెలుసుకొని వచ్చాడు వీడు' అనుకున్నాడు దాము. 


శక్తి మాట్లాడుతూ "శివరాం శర్మ నిన్న మరణించాడు. అమెరికా నుండి అయన తమ్ముడు రావాలి కనుక రేపు అంత్యక్రియలు జరుగుతాయి. చాలా మంది ప్రముఖులు వస్తారు. గవర్నర్ గారు కూడా వస్తారని వినికిడి. కాబట్టి భద్రత గట్టిగా ఉంటుంది. ఎక్కువ మంది ఆ డ్యూటీలో ఉంటారు కాబట్టి రేపు ఎస్పీ ఇంటి దగ్గర నామ మాత్రంగా సెక్యూరిటీ ఉండవచ్చు. రేపు ఉదయం సెక్యూరిటీ వాళ్ళు తమ దైనందిన కార్యక్రమాల కోసం కాస్త రిలాక్స్ అవుతారు. తిరిగి అయన బయలుదేరేటప్పటికి రెడీగా ఉంటారు. ఆ గ్యాప్ లో ఇంట్లో అటాక్ చెయ్యడానికి ప్లాన్ చెయ్యండి" అన్నాడు. 


"భలేవాడివే శక్తి అన్నా.. సింహం బోనులోకి వెళ్ళమంటావా.. " అన్నాడు దాము. 


"అవును. అక్కడైతే తలిదండ్రుల్ని, ఆ అమ్మాయినీ కాపాడుకోవడం కోసం అయన అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. అయన ఇంట్లోకి ఫ్రీగా వెళ్లగలిగే మనిషిని నేను ఏర్పాటు చేస్తాను. మీ మనిషి అతనితో కూడా లోపలికి వెళ్ళాలి. సమయం చూసి ఎస్ పీ ని షూట్ చెయ్యాలి. వెనకవైపు ప్రహరీ గోడ దూకి బయట పడాలి. అక్కడ మరో మనిషి బైక్ లో రెడీగా ఉండాలి. కొద్ది దూరం వెళ్ళాక కార్ లోకి షిఫ్ట్ అయి ఒక వారం పాటు ఏదో ఒకచోట దాక్కోవాలి. తరువాత వూరు దాటొచ్చు" వివరించాడు శక్తి. 


"అయితే ఆ మనిషి గ్యారెంటీగా చావాలని లేదు. ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్" అన్నాడు దాము. 


"ఆలా అని అతన్ని ఒప్పించు. నిజానికి అతన్ని లోపలి తీసుకుని వెళ్లిన మా మనిషి సెక్యూరిటీకి అతను వెనుక వైపు నుండి పారిపోతున్నట్లు చెబుతాడు. " అన్నాడు శక్తి. 


"ఎందుకలా?" అడిగాడు దాము. 


"అతన్ని తీసుకొని వెళ్లిన మా మనిషి మీద అనుమానం రాకుండా ఉండటానికి ఆలా చెయ్యాలి. పైగా సెక్యూరిటీ కాల్పుల్లో అతను చనిపోతే మంచిదే. నీ పేరు బయటకు రాదు. " చెప్పాడు శక్తి. 


"ఇంతకీ ఎస్ పీ ఇంట్లోకి తీసుకొని వెళ్లగలిగే ఆ మనిషి ఎవరు?" అడిగాడు దాము. 


శక్తి చెప్పిన పేరు విని ఆశ్చర్యపోయాడు. 


*** 

నీతూ శర్మ కొసరి కొసరి వడ్డించడంతో తృప్తిగా భోంచేశారు మోహనరావు, నందిత, దీక్షిత్. 


"ఇంక నువ్వు కూర్చో అమ్మా. నేను వడ్డిస్తాను" అంది నందిత. 


"నాకు ఆకలిగా లేదు. కాస్సేపు ఆగి తింటాను" అంది నీతూ శర్మ. 


"మీ మామయ్య చనిపోయాడనే బాధలో నీకు తినాలని లేదు. ఆ విషయం నాకు అర్థం అయింది. కానీ కాస్తయినా తినక పోతే నీరసం వస్తుంది. పైగా రేపు అంత్యక్రియలు కదా. అక్కడ అసలు తినలేవు" అంది నందిత. 


"అలాగే అత్తయ్యా! కానీ కాస్సేపు ఆగి తింటాను" అంది నీతూ శర్మ. 


"అసలు ఆ అమ్మాయి బాధలో ఉంది కదా. వంట చేయించడం ఏమిటి?' అన్నాడు దీక్షిత్. 


"నేను కూడా ఆ మాటే చెప్పాను. కానీ పనిలో పడితే కాస్త తెరిపిన పడతానని అంది ఆ అమ్మాయి" చెప్పింది నందిత. 


"నేను ఇంతవరకు శివరాం శర్మ గారి భార్యతో మాట్లాడ లేదు. ఇప్పుడు భోపాల్ నుండి పిల్లలు కూడా వచ్చినట్లు ఉన్నారు. సాయంత్రం అందరినీ ఒకసారి కలవాలి. వాళ్లకు ఎవరి పైనన్నా అనుమానం ఉందేమో తెలుసుకోవాలి. అన్నట్లు మిమ్మల్ని కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి మిస్ నీతూ శర్మ గారూ. అలా పక్క గదిలోకి వస్తారా?" అన్నాడు దీక్షిత్. 


"అలాగే పదండి. కానీ నన్ను గారూ అని అనకండి. నీతూ అంటే చాలు" అందామె. 


ఇద్దరు పక్క గదిలోకి వెళ్లారు. 


నీతూ శర్మ అన్నయ్య ప్రణవ్, హంతకుడు రంగాతో ఉన్న ఫోటో చూపించాడు. 


"ఈ ఫొటోలో ఉన్నవాళ్లలో హంతకుడితో పాటు ఉన్నదెవరో చెప్పగలరా?" సూటిగా అడిగాడు. 


""మా అన్నయ్య ప్రణవ్" చెప్పిందామె ఎలాంటి తడబాటూ లేకుండా. 


"తెలుసు. కానీ అతనితో మీ అన్నయ్యకు ఎలా పరిచయం?" అడిగాడు దీక్షిత్. 


"మామయ్య ఇంటికి సంబంధించిన సీసీ కెమెరా రికార్డింగ్ లను సెక్యూరిటీ హెడ్ తో పాటు మా అన్నయ్య కూడా చూస్తూ ఉంటాడు. అందులో ఈ హంతకుడు మామయ్య ఇంటి ముందు నాలుగైదుసార్లు తచ్చాడుతూ ఉండటం గమనించాడట. అతన్ని కలిసి ఏంచెప్తాడో తెలుసుకుందామని వెళ్ళాడట. ఈ విషయం అప్పుడే మా మామయ్య, అత్తయ్యలకు చెప్పాడట. అన్నయ్య నంబర్ ఇస్తాను. పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు" చెప్పింది నీతూ. 


"ఓకే. కేవలం తెలుసుకుందామనే అడిగాను. అనుమానంతో కాదు" అన్నాడు దీక్షిత్. 


"భలేవారే. నేను మీ ఫ్యాన్ ను. నా వీడియోలో కూడా మీ గురించి చెప్పానుగా. చూసే ఉంటారు. ఒకవేళ నన్ను ప్రశ్నించకుండా ఉండి వుంటే మీ మార్కుల్ని వంద నుంచి తొంభై తొమ్మిదికి తగ్గించేదాన్ని" అంది నీతూ. 


"సరే. ఇక నేను ఆఫీసుకు బయలుదేరుతాను. ఇంటరాగేషన్ పూర్తి చెయ్యాలి" అన్నాడు దీక్షిత్. 


"సాయంత్రం నేను కూడా మామయ్య ఇంటికి వస్తాను. సెక్యూరిటీ పేరుతొ ఇలా దూరంగా ఉండి పోవడం బాధగా ఉంది" అందామె. 


క్షణం అలోచించి, "అలాగే రండి. కానీ నాతోపాటు తిరిగి వచ్చెయ్యండి. కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. కేసు ఓ కొలిక్కి వచ్చాక నార్మల్ లైఫ్ లోకి రావచ్చు. " అన్నాడు దీక్షిత్. 


"అన్నయ్యకు కాల్ చేస్తారా? లేదంటే నేనే కాల్ చేసి ఇస్తాను" చెప్పింది నీతూ. 


"ఆఫీసుకు వెళ్ళాక చేస్తాను. ఇక నేను బయలుదేరుతాను" అన్నాడు దీక్షిత్. 


ఇద్దరూ గది నుండి బయటకు వచ్చారు. అందరికీ బై చెప్పి కార్ ఎక్కాడు దీక్షిత్. 


అతను వెళ్ళాక నందిత బలవంతం మీద నాలుగు మెతుకులు తిన్నది నీతూ. 


"నువ్వు కాసేపు పడుకోమ్మా. సాయంత్రం అక్కడకు వెళ్ళాలన్నావుగా" అంది నందిత. 


సరేనని గదిలోకి వెళ్ళింది నీతూ. 

తన అన్నయ్యకు కాల్ చేసింది. 

***


"ఆఫీసుకు వెళ్ళమంటారా.. లేక శివరాం శర్మగారి ఇంటికా?" అడిగాడు డ్రైవర్ కోదండం. 


"ఇంటరాగేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఆఫీసుకే పోనియ్యి. అక్కడికి సాయంత్రం వెళదాము" చెప్పాడు దీక్షిత్. 


ఆఫీసుకు వెళ్ళాక మురళిని పిలిచాడు. 


"ఇంటరాగేషన్ పూర్తి చేద్దాం. అన్నట్లు సాయంత్రం శివరాం శర్మ గారి ఇంటికి వెళ్ళాలి. అయన ఫ్యామిలీ మెంబర్స్ ని కలవాలి. నీతూ శర్మ కూడా మనతో వస్తుంది. " చెప్పాడు దీక్షిత్. 


"సర్, మన మధు ఆ రంగాకు అందుబాటులోకి వెళ్ళాడు. ఒకసారి ఫోన్ చేసుకునే అవకాశం ఇమ్మని కోరాడు రంగా. బషీర్ పోలీసుల అదుపులో ఉన్నాడనీ, అతన్ని విడిచి పెడితేగానీ మొబైల్ ఇప్పించలేననీ చెప్పాడట మధు" అన్నాడు మురళి. 


"గుడ్. కొద్ది సేపటి తరువాత బషీర్ బయటకు వచ్చాడనీ, ఒక మొబైల్ ఇచ్చాడనీ రంగాకు ఎప్పటిలానే ఆ చెట్టు కింద మొబైల్ అందివ్వమను. ఆ మొబైల్ లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఉంచి, మొబైల్ చెక్ చేసే అవకాశం రంగాకు ఇవ్వకుండా తొందర పెట్టమను. ఈ లోగా మనం కిషన్, ఫయాజ్ లను, నాలుగో వ్యక్తిని మళ్ళీ విచారిద్దాం" అన్నాడు దీక్షిత్. 

***

శక్తితో మాట్లాడుతూ ఉండగానే దాము అనుచరుడు మునావర్ కు ఫోన్ వచ్చింది. 


డోర్ దగ్గర నుంచుని దాము దగ్గర పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చాడు మునావర్. 


"అన్నా! రంగా చేస్తున్నాడు. అర్జెంట్ గా మాట్లాడాలట. కిషన్, ఫయాజ్ లు భయపడి, నిజం చెప్పేటట్లు ఉన్నారట" అన్నాడు. 


"వాళ్లకు నేనెవరో తెలీదు. నా పేరు జాఫర్ గా మాత్రమే తెలుసు. జాఫర్ గతంలో నన్ను డబల్ క్రాస్ చేసినవాడు. పోలీసులు వాడ్ని పట్టుకునే లోగా నేనే వాడ్ని లేపేస్తాను. కేసు క్లోజ్ అవుతుంది. ఈ రంగాతో 'జాఫరన్న నిద్ర పోతున్నాడు. అని చెప్పు. మరీ టార్చర్ పెడితే జాఫరన్న పేరు చెప్పెయ్యమని చెప్పు. అర్థం చేసుకొని జాఫర్ పేరు చెబుతాడు" అన్నాడు దాము. 


అర్థం చేసుకున్న మునావర్ బయటకు వెళ్ళిపోయాడు. 


"నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి" అన్నాడు శక్తి. 


అంతలో అతని ఫోన్ మోగింది. 


'ఇప్పుడే వస్తాను" అంటూ కాస్త దూరంగా వెళ్ళాడు శక్తి. 


ఓ ఐదు నిముషాల తరువాత తిరిగి వచ్చాడు. 


"ఈ రోజు సాయంత్రం ఆ ఎస్ పీ, శివరాం శర్మ ఇంటికి వెళ్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళడానికి ఇంటికి వస్తాడు. ఆ టైం లో ఏదైనా ప్లాన్ చెయ్యగలిగితే మరో ఐదు బస్తాల గోధుమలు అదనంగా రాజన్ గారి గోడౌన్ కు చేరుతాయి. ఆలోచించుకో" దాముతో చెప్పాడు శక్తి. 


=========================================================

ఇంకా ఉంది


అపరాధ పరిశోధన - పార్ట్ 9 త్వరలో.. 

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 








Comentários


bottom of page