అడుగు ముందుకు వెయ్యకు!
- Divakarla Venkata Durga Prasad
- May 2
- 7 min read
#DVDPrasad, #డివిడిప్రసాద్, #అడుగుముందుకువెయ్యకు, #AduguMundukuVeyaku, #కొసమెరుపు, ##TeluguCrimeStory

Adugu Munduku Veyaku - New Telugu Story Written By - D V D Prasad
Published In manatelugukathalu.com On 02/05/2025
అడుగు ముందుకు వెయ్యకు - తెలుగు కథ
రచన: డి వి డి ప్రసాద్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అకస్మాత్తుగా స్పృహ రావడంతో చటుక్కున కళ్ళు తెరిచింది దీప్తి. కళ్ళు నులుముకొని మరీ చూసింది. అంతటా గాఢాంధకారం అలముకొని ఉంది. ఒక్కక్షణం తను ఎక్కడుందో గుర్తుకు రాలేదామెకు. రాత్రా, పగలా కూడా తెలియడం లేదు. 'తను ఇక్కడికెలా వచ్చింది? అసలు తనకేం జరిగింది? ఇక్కడ తననెవరైనా బంధించారా? ఎవరు బంధించారు?' ఇలా పలు ప్రశ్నలు ఆమెను వేధించాయి. చుట్టూ తడమగా తనో మంచంపై పడుక్కొని ఉన్నట్లు తెలిసింది. తల భారంగా ఉంది. ఒక్కసారి తల విదిలించి, రెండు చేతులతో తల నొక్కుకుంది. ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగింది. రెండు నిమిషాల తర్వాత జరిగిన సంఘటనలు మెల్లమెల్లగా గుర్తుకు రాసాగాయి.
దినేష్, తనూ కలిసి రాత్రి డిన్నర్ కోసం హోటల్ మోతీకి వెళ్ళడం, ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తుండగా దినేష్ స్నేహితుడు సురేష్ రావడం గుర్తుంది. అప్పుడే తల తిరిగినట్లు అనిపించడం లీలగా గుర్తుకు వచ్చింది.
"ఏమైంది దీప్తీ?" అని దినేష్ తనను ఆదుర్దాగా అడిగాడు.
ఆ తర్వాత...ఆ తర్వాత ఏం జరిగింది? తనను నడిపించుకొని దినేష్ కారు వద్దకు తీసుకెళ్ళి వెనక సీట్లో పడుక్కోబెట్టడం వరకూ గుర్తుకువచ్చింది. ఆ తర్వాత తన కనులు మూతపడ్డాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో ఇప్పుడే స్పృహ వచ్చింది. అంటే...దినేష్ ఏడీ? ఏమైంది దినేష్ కి? ఈ గదిలోనే దినేష్ కూడా బందీ అయి ఉన్నాడా? వెంటనే, "దినేష్...దినేష్!" అని గట్టిగా పిలిచింది. తన అరుపే గదిలో ప్రతిధ్వనించింది కానీ, జవాబు లేదు.
అంటే, దినేష్ కూడా తను ఉన్న పరిస్థితిలోనే ఉన్నాడా! ఈ గదిలోనే ఉన్నాడా, లేక మరో గదిలో ఉన్నాడా? ఈ గదిలో అయితే మరెవరూ ఉన్నట్లు అనిపించలేదామెకు.
తడుముకుంటూ మెల్లగా మంచం దిగింది. కొద్దిసేపట్లో ఆమె కళ్ళు చీకటికి కొద్దిగా అలవాటు పడ్డాయి. మంచం మీద నుండి మెల్లగా లేచి అడుగులు లెక్కబెట్టుకుంటూ, చేత్తో తడుముకుంటూ మంచం నుండి ముందుకు కదిలింది. ఓ పదడుగులు వేసాక చేతికి గోడ తగిలింది. ఆ గోడను పట్టుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు జరిగింది. కొంచెం సేపు ప్రయత్నించిన మీదట తలుపు అమె చేతికి తగిలింది. గట్టిగా తలుపు లాగి చూసింది. బయట గడియపెట్టి ఉంది కాబోలు, తలుపు రాలేదు.
శక్తంతా కూడగట్టుకొని తలుపులు బాదుతూ అర్చింది, "హేయ్! ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి ప్లీజ్!” అంటూ.
ఆమె ప్రశ్నకు జవాబు లేదు. మళ్ళీ అడుగులు లెక్కపెట్టుకుంటూ మంచం దగ్గరకు వెళ్ళి గదిలో నాలుగు మూలలవైపుకి వెళ్ళింది. చేతికెక్కడా కిటికీ దొరకలేదు. ఎక్కడైనా కనీసం వెంటిలేటర్ ఉండొచ్చని ఊహించింది, లేకపోతే తనకు ఊపిరి ఆడకపోను. బహుశా రాత్రి వేళ అయి ఉంటుంది. అందుకే వెలుతురు కూడా లేదు.
అంటే...అంటే...ఆలోచించసాగిందామె, ఇరవైనాలుగు గంటలుగా తను స్పృహలో లేదా? ఆలోచనతో తల వేడెక్కిపోయింది కానీ, తన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లభించలేదు. తిరిగి మంచం వద్దకు మెల్లగా చేరుకొని కూర్చుంది. నిస్పృహతో మంచంపై వాలింది. చాలా నీరసంగా అనిపించింది. అలా ఎంత సేపు గడిచిందో తెలియదు కానీ, కొద్దిగా వెలుగు ఆ గదిలోకి ప్రసరించడంతో తెల్లారబోతోందని దీప్తికి అర్ధమైంది.
ఇంకొద్ది సేపు గడిచేసరికి అప్పుడు పైన చాలా ఎత్తులో ఉన్న వెంటిలేటర్ కనపడింది. వెంటిలేటర్ గుండా కాస్సేపటిలో గదంతా వెలుతురు వ్యాపించింది. ఆ వెలుతురులో ఒకవైపు ఎటాచ్డ్ బాత్రూం కనపడటంతో లేచి గబగబా అక్కడికెళ్ళింది, కానీ అక్కణ్ణుంచి కూడా బయటపడటానికి ఎటువంటి మార్గమూ కనపడలేదు.
సమయం ఎంతయిందో కూడా ఓ నిర్ధారణకు రాలేకపోతోంది దీప్తి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉంది. తన హ్యాండ్ బాగ్, ఫోన్ కూడా పక్కన లేవు. అవి ఏమయ్యాయో మరి! ఇప్పుడు తనున్న పరిస్థితి గురించి ఎవరికి చెప్పుకోగలదు? సమయం గడిచేకొద్దీ ఆకలి వెయ్యసాగింది. నిస్సత్తువతో పాటు దుఃఖం కూడా ముంచుకు రాసాగింది. ఆ గదిలో కనీసం మంచినీళ్ళు కూడా లేకపోవడంతో, వాష్ బేసిన్లో నీళ్ళతో మొహం కడుక్కొని, చేత్తో నీళ్ళు తీసుకొని తాగిన తర్వాత కొద్దిగా తేరుకుంది. సింక్ లోని నీళ్ళు తాగడానికి అసహ్యమనింపించినా తప్పలేదామెకు.
'అవును తనెందుకింత బేలగా ఆలోచిస్తోంది? కాలేజీలో చదివే రోజుల్లో కరాటేలో శిక్షణ పొందింది. ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న విద్య తనకిప్పుడు పనికి వస్తుందేమో చూడాలి! ఆటల్లో కూడా తను స్టేట్ లేవల్ ఛాంపియన్. అలాంటి తను ఇలా ఆలోచిస్తూ, ఎవరో వస్తారని, రక్షిస్తారని కాచుకోవడమా! తనిక్కణ్ణుంచి బయటపడాలి. దినేష్ పరిస్థితి కూడా ఏమిటో తెలుసుకోవాలి. తన కోసం పాపం దినేష్ ఏ ఆపదలోనూ చిక్కుకోలేదు కదా!
ముందు ఎలాగైనా తలుపులు తెరవగలిగితే ఇక్కణ్ణుంచి విముక్తి దొరుకుతుంది.' అని మూసి ఉన్న తలుపు వద్దకు చేరుకుందామె. తలుపును ఓ సారి తడిమి, ఐదడుగులు వెనక్కు వేసింది. ఆ తర్వాత వేగంగా ముందుకు ఉరికి బలమంతా ప్రయోగించి రెండు చేతులతోనూ, భుజంతోనూ గట్టిగా నెట్టింది.
సరిగ్గా అప్పుడే ఎవరో బయట నుండి గది తలుపు తీయడం జరిగింది. ఆ వెంటనే తలుపులు తెరిచిన వ్యక్తిని బలంగా ఢీకొంది దీప్తి. ఏం జరిగిందో తెలుసుకొనేలోగానే బాలన్స్ తప్పి ఇద్దరూ కింద పడిపోయారు. అతని చేతులో ఉన్న రివాల్వర్ ఖంగుమంటూ దూరంగా వెళ్ళి పడింది. జరిగిన ఈ హఠాత్ పరిణామానికి దిమ్మెరపోయాడు ఆ వ్యక్తి. లేచి నిలబడి కోపంతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన దీప్తి అతని మొహం చూస్తూనే అంతులేని విస్మయానికి గురైంది.
తనను ఢీ కొన్న వ్యక్తి మరెవరో కాదు, తనెవరి గురించి ఇప్పటివరకూ ఆలోచిస్తోందో ఆ దినేషే ఎదురుగా ఉన్నాడు. లేచి నిలబడి రివాల్వర్ అందుకోబోయిన దినేష్ ని చూసి, "దినేష్! నువ్విక్కడ? నువ్వేమైపోయావో తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా? థాంక్స్ గాడ్! సమయానికి వచ్చి నన్ను రక్షించావు. అసలు మనల్ని ఎవరిక్కడ బంధించారు? నువ్వెలా తప్పించుకున్నావు?" కిందపడిన రివాల్వర్ చేతిలోకి తీసుకొని ప్రశ్నల వర్షం కురిపిస్తూ అతని దగ్గరకు వెళ్ళిందామె.
దీప్తివంక చూస్తూ ఆమెకు దగ్గరగా రాబోతున్న దినేష్ అప్పుడే దూరం నుండి ఏదో కలకలం వినిపించగా ఆగిపోయాడు. గేటు బయట ఆగిన వ్యాన్ దిగి నలుగురు ఆగంతకులు పరుగులు పెడుతూ వాళ్ళున్న చోటుకు రాసాగారు. అందరి చేతుల్లోనూ పిస్టల్స్ ఉన్నాయి. రౌడీల్లా ఉన్న వాళ్ళను చూసి భయపడిన దీప్తి దినేష్ చాటుకెళ్ళి నిలబడింది తన చేతిలో ఉన్న రివాల్వర్ అతనికందిస్తూ.
"పద దినేష్! ఇక్కణ్ణుంచి పారిపోదాం! మనల్ని బంధించిన ఈ రౌడీ మూకకి మనం తప్పించుకున్నట్లు తెలిసిపోయినట్లుంది." అంది గాబరాగా.
"పట్టుకోండి! పట్టుకోండి! పారిపోకుండా పట్టుకోండి!" అంటూ గోలగోలగా అరుస్తూ ముందుకు వస్తున్న వాళ్ళను కనుసైగతో నిలువరించాడు దినేష్.
చేతిలో ఉన్న రివాల్వర్ ఎత్తిపట్టుకొని వాళ్ళని గురి చేస్తూ, "అక్కడే నిలబడండి, అడుగు ముందుకు వేసారో చస్తారు!" అర్చాడు.
పాతిక అడుగుల దూరంలో వాళ్ళందరూ ఠక్కున ఆగిపోయారు. దినేష్ చేతిలో మెరుస్తున్న పిస్తోల్ వంక విస్తుపోయి చూస్తూ నిలబడిపోయారు.
ఒకచేత్తో వాళ్ళను కవర్ చేస్తూ, మరో చేత్తో దీప్తి చెయ్య పట్టుకొని అక్కణ్ణుంచి కదిలాడు దినేష్. బయట ఉన్న కారు ముందు సీట్లో ఆమెను కూర్చోబెట్టి, తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారును వేగంగా ముందుకురికించాడు. భయంభయంగా వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది దీప్తి.
కొద్దిసేపట్లో వాళ్ళు కూడా వ్యానెక్కి తమని అనుసరించడం చూసి, "క్విక్, త్వరగా పద! వాళ్ళు మనల్ని వెంటాడుతున్నారు." అంది.
రియర్ మిర్రర్ లో చూసి, "వాళ్ళ మొహం! వాళ్ళనెలా బురిడీ కొట్టించి బయటపడతానో చూడు!" అని కారు స్పీడ్ పెంచాడు.
మధ్యమధ్యన వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది దీప్తి. దినేష్ మాత్రం కారు నడపడంలో ఏకాగ్రత చూపుతున్నాడు. సందులు గొందులూ తిరిగి తమ కారు వెంటపడుతున్న వ్యాన్ ను తప్పుదారి పట్టించడంలో మొత్తానికి సఫలీకృతుడైయ్యాడు దినేష్. వెనక్కి తిరిగి చూసిన దీప్తి ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది.
బయటకు చూసిన దీప్తికి తామెక్కడికి వెళ్తున్నామో అర్ధం కాలేదు. కారు సిటీ దాటి చాలా దూరం వచ్చేసింది. అప్పటివరకూ టెన్షన్ తో గడిపిన ఆమెకు ఒక్కసారి ఆకలి గుర్తుకు వచ్చింది.
"నాకు చాలా ఆకలిగా ఉంది దినేష్, ఎక్కడైనా రోడ్ సైడ్ దాబా ఉంటే అపవా?" అందామె.
కారు స్లో చేసి, తలతిప్పి ఆమె వైపు చూసాడు.
"ఓ సారీ! ఈ గొడవలో పడి నీ ఆకలి విషయం మర్చాను. కారు వెనక సీట్లో బిస్కెట్లు, అరటిపళ్ళు ఉన్నాయి, తిను. దార్లో ఎక్కడైనా తినడానికి దొరుకుతుందేమో చూద్దాం." అన్నాడు దినేష్.
అతనలా అనడమే తడువుగా వెనక సీట్లో ఉంచిన బిస్కెట్లు, అరటిపళ్ళూ తీసుకొని ఆవరావురుమంటూ తినసాగింది. పొలమారితే నీళ్ళు తీసుకొని తాగింది. "నాకూ కొంచెం మిగుల్చు, నాకూ ఆకలిగా ఉంది." నవ్వుతూ చెప్పాడు దినేష్.
తింటున్నదల్లా ఆగింది దీప్తి. "సారీ, బిస్కెట్లు అయిపోయాయి. ఈ అరటిపళ్ళు మాత్రమే మిగిలాయి." చూపిస్తూ అంది దీప్తి.
"పర్వాలేదు, నువ్వు తిను. అదిగో చూస్తుండగానే ఏదో దాబా వచ్చేసింది." అన్నాడు కొద్ది దూరంలో ఉన్న దాబాను చూపిస్తూ.
కారును ఆ దాబా పక్కన ఆపాడు దినేష్. అతను దిగిన తర్వాత దీప్తి కూడా కారు దిగింది. ఇద్దరూ దాబాలోకి అడుగుపెట్టాడు. ఇద్దరి కోసం భోజనం ఆర్డరిచ్చాడు.
అప్పుడు గుర్తుకు వచ్చింది దీప్తికి ముందు రోజు జరిగిన సంఘటన.
"దినేష్, ఆ రోజు డిన్నర్ చేసిన తర్వాత ఏం జరిగింది? నాకు తెలివి తప్పుతుండగా కారు వద్దకు తీసుకెళ్ళావు. ఆ తర్వాతేం జరిగింది?" అడిగింది దీప్తి మంచినీళ్ళు తాగుతూ.
"అది..అది.." అని ఏదో చెప్పబోతూండగా భోజనం తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు సర్వర్.
"నాకు చాలా ఆకలిగా ఉంది. పైగా అలిసిపోయాను కూడా. బిస్కెట్లతో నీ ఆకలి కూడా తీరి ఉండదు. ముందు భోజనం కానీయ్. ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం." అంటూ భోజన పదార్థాల మీద పడ్డాడు దినేష్.
అతనివైపు చూసింది దీప్తి. అమెకింకా ఆ బందీఖానాలో జరిగిన అనుభవం మరుపుకు రాలేదు. అక్కడ చీకటి గదిలో తనెందుకు బంధించబడి ఉంది? దినేష్ కూడా అక్కడే ఉండేవాడా, లేక అప్పుడే తనని తప్పించడానికి వచ్చాడా ఆమెకర్ధం కాలేదు. ఆమె అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకోబోతూండగా ధూళి రేపుకుంటూ, పెద్ద శబ్దం చేసుకుంటూ దాబా ఆవరణలో ఆగింది వాళ్ళని వెంటాడిన వ్యాన్.
వ్యాన్ ఆగి ఆగగానే అందులోంచి బయటకు ఉరికారు ఆ నలుగురు ఆగంతకులూను.
"ఇదిగో ఇక్కడే కారు ఆగి ఉంది. వాళ్ళు ఇక్కడే ఉండి ఉంటారు." పరిగెట్టుకొని దాబా లోకి ప్రవేశించాడు అందులో ఒకడు. వాళ్ళని అనుసరిస్తూ మిగతా ముగ్గురూ కూడా దాబాలోకి ప్రవేశించారు.
వాళ్ళును చూస్తూనే వెంటనే కుర్చీలోంచి ఆదరాబాదరాగా లేచాడు దినేష్. దీప్తి చెయ్యపట్టుకొని, "పద, హర్రీయప్! వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసారు." అని ఆమెను లేవదీసి దాబా వెనకవైపుకి పరుగుపెట్టాడు.
ఇద్దరూ ఆ ఆగంతుకల కళ్ళు కప్పి కారు వద్దకు చేరుకున్నారు. వాళ్ళల్లో ఒక్కడైనా ఆ కారు వద్ద కాపలా కాసి ఉంటే వాళ్ళ చేతికి చిక్కి ఉందురిద్దరూ. అదృష్టం తమవైపు ఉందని అనుకున్నాడు దినేష్. ఇద్దరూ కారెక్కగానే, ఆఘమేఘాల మీద అక్కణ్ణుంచి కారును ముందుకురికించాడు దినేష్.
వ్యాన్ తమను వెంటపడకుండా వేగంగా కారును ముందుకు పోనిచ్చాడు దినేష్. గంటసేపు తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ఓ చోట కారాపాడు దినేష్. ఎదురుగా పాత కోటలా ఓ పెద్ద పాడుబడిన బంగళా చూసి ఆశ్చర్యానికి లోనైయ్యింది దీప్తి. అక్కడెందుకు దినేష్ కారాపాడో ఆమెకర్ధం కాలేదు. ఏదో పాత కిల్లాను తలపిస్తున్న ఆ బంగళావైపు చూసి, "ఇక్కడెందుకు కారాపావు దినేష్?" విస్మయంగా అడిగింది దీప్తి.
"ఇదే ప్రస్తుతం నువ్వుండవలసిన స్థలం. పద లోపలకు." అంటూ లోపలకు తీసుకెళ్ళబోయాడు దినేష్.
అతని చేతిని విడిపించుకొని, "ఈ పాత భవనం చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. ఇంకెక్కడికైనా వెళ్దాం పద!" అంది దీప్తి.
బిగ్గరగా నవ్వాడు దినేష్. "ఇక్కడుంటే నీ జోలికెవరూ రారు, పద లోపలకు!" అంటూ ఆమెను ముందుకు లాక్కెళుతూ జేబులోంచి రివాల్వర్ తీసేసరికి దీప్తి మొహంలో రంగులు మారాయి. భయంతో వణికిపోయిందామె.
"దినేష్, ఏమిటిది?" అరిచినట్లుగా అంది దీప్తి.
రివాల్వర్ ఆమెకు గురిపెట్టి, "నిన్ను రక్షించడానికి ఇక్కడికెవరూ రాలేరు. ఇప్పటికైనా నీకో నిజం చెప్పాలి, తప్పదు. నా అసలు పేరు దినేష్ కాదు, దావూద్. నీలాంటి అందమైన అమ్మాయిలను ప్రేమ-పెళ్ళి పేరు చెప్పి వల్లో వేసుకొని విదేశాలకు తరలించే ముఠా నాయకుణ్ణి నేను. నా స్నేహితుడు సురేష్ అసలు పేరు కూడా అది కాదు. అతను నా అసిస్టెంట్ సలీం. నీతో నేను నడిపింది లవ్ జిహాద్, ప్రేమ కాదు! ఇప్పటికైనా అర్ధమైందా, నోరుమూసుకు లోపలకు పద!" అని దినేష్ అనేసరికి మతిపోయింది దీప్తికి.
తనెలాంటి ట్రాప్ లో పడిపోయిందో అర్ధమైందామెకు. తననిక్కడ రక్షించేవారెవరు? ఆలోచిస్తూ భయాందోళనకు గురైందామె.
"ఊ...పద లోపలకు." రివాల్వర్ తో ఆమెను నెట్టుతూ ముందుకు తోసాడు దినేష్.
సరిగ్గా అప్పుడే లోపలనుండి వచ్చాడు సురేష్...ఊరఫ్ సలీం. "దావూద్ భాయ్! కొద్దిసేపట్లోనే లోపలున్న అందర్నీ తరలించడానికి బస్ వస్తుంది. బాస్ ఫోన్ చేసాడు." అంటూ అక్కడికి వచ్చాడు.
పరిస్థితి పూర్తిగా అర్ధమైంది దీప్తికి. ఆ పాత బంగళా లోపల తనలాంటి అభాగ్యులు ఇంకా కొంతమంది ఉన్నారని గ్రహించిందామె. భయంతో వెన్ను జలదరించింది. ఇప్పుడే తెగించాలి, లేకుంటే తన బతుకు ఏమౌతుందో ఊహించడానికే భయంగా ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న అదును చూసి వెనక్కు తిరిగి వేగంగా బయటకు పరుగు తీసింది.
"ఆగు...దీప్తీ! ఆగు." అమె వెంట పరుగు పెట్టాడు దినేష్. అతన్ని అనుసరించాడు సలీం.
వాళ్ళిద్దర్నీ ముందుకు రానిచ్చి చటుక్కున ఆగింది దీప్తి. ముందుకి అడుగు వెయ్యబోయాడు దావూద్.
"అక్కడే ఆగు! అడుగు ముందుకు వెయ్యకు! చస్తావ్!" బిగ్గరగా అరిచిందామె. ఒక్కసారి భయంకరంగా మారిందామె మొహం. చేతులు రెండూ నడుం మీద పెట్టి వెంటనే కరాటే షాట్ కి సిద్ధమైందామె. గట్టిగా షౌట్ చేస్తూ దినేష్ ని దగ్గరకు రానిచ్చి చేతిని కత్తిలా చేసి అతని మెడను గట్టిగా తాకింది.
ఆమెలా దాడి చేస్తుందని ఊహించని దావుద్ అప్రమత్తంగా లేకపోవడంతో బలమైన దెబ్బ తగిలింది. అంతే, మెడ తెగిన కోడిలా కిందపడి విలవిల్లాడాడు అతను. చేతిలోని రివాల్వర్ ఎగిరి దూరంగా పడింది. నివ్వెరపోయాడు అతను.
సలీం తేరుకొనేలోగానే అతనిపైన కూడా లంఘించిందామె అపర కాళికాదేవిలా. క్షణంలో అతన్ని కూడా మట్టి కరిపించింది. దూరంగా పడి ఉన్న రివాల్వర్ చేతిలోకి తీసుకొని, ఇద్దరికీ గురిపెట్టింది.
జరిగింది నమ్మలేకపోతున్నాడు దినేష్ ఊరఫ్ దావూద్. అతన్ని లేపి నిలబెట్టింది. రివాల్వర్ అతని తలకి గురిపెడుతూ, "ఏమనుకున్నావురా నన్ను? దీప్తి అంటే ఏదో సాదా సీదా అమ్మాయి అనుకున్నావా నీ ట్రాప్ లో పడటానికి. నీ అంతు చూసి, నిన్ను చట్టానికి పట్టివ్వడానికి నేనే నిన్ను ట్రాప్ చేసిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని తెలుసా. ప్రేమ పేరు చెప్పి మత్తులో ముంచి మాయ చేస్తారురా! నీ పాపం పండే రోజు వచ్చింది. నీ స్థావరం కనిపెట్టడానికే నీ వెంట ఇంత దూరం వచ్చాను తెలుసా!" అందామె ఆగ్రహంతో ఊగిపోతూ.
సరిగ్గా అప్పుడే వాళ్ళ కారును దాబా దగ్గరనుండి వెంటాడుతూ వచ్చిన వ్యాన్ అక్కడ ఆగింది. అందులోంచి బిలబిలమంటూ దిగిన ఆ నలుగురు ఆగంతకులు దీప్తికి సల్యూట్ చేసారు.
"వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళి అందులో బంధించబడిన అమ్మాయిలను రక్షించండి. అడ్డువచ్చిన వాళ్ళను బంధించండి, లేదా లేపెయ్యండి." అంది దీప్తి.
తలూపి ఆ భవనంలోకి అడుగుపెట్టారు ఆ నలుగురూ. కొద్దిసేపు ప్రతిఘటన అనంతరం అక్కడ ఉన్న అరడజను మంది రౌడీలు లొంగిపోయారు మఫ్టీలో ఉన్న స్పెషల్ పోలీసులకు. దాదాపు యాభై మంది అమ్మాయిలు ఆ చెర నుండి విముక్తి పొందారు.
మరో క్షణంలో నాలుగు పోలీసు వాహనాలు సైరన్ మోగించుకుంటూ ఒకదానివెంట ఒకటి వచ్చి ఆ భవంతి ఆవరణలో ఆగాయి.
"వెల్డన్ దీప్తీ! సంఘ విద్రోహులను పట్టుకొని చట్టానికి అప్పగించి నీకప్పగించిన బాధ్యత సక్రమంగా నెరవేర్చావు. ఐ ఆం ప్రౌడ్ ఆఫ్ యు." అని ఆమెను మెచ్చుకున్నాడు పోలీసు కమీషనర్ కులకర్ణి.
"సార్!" అంటూ అతనికి సెల్యూట్ చేసింది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దీప్తి.
******
దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
Comments