top of page

అపరాధ పరిశోధన - పార్ట్ 7

Updated: May 3

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన


Aparadha Parisodhana - Part 7 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 27/04/2025

అపరాధ పరిశోధన - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. 


ఐజీ గారు కాల్ చేసి, గవర్నర్ ఆబ్లిగేషన్ ఒకటుందని, నీతూ శర్మను ఇంట్లో ఉంచుకొని ప్రొటెక్షన్ ఇమ్మని చెబుతారు. హోమ్ మినిష్టర్ బావమరిది రమేష్, తమ పార్టీ ఎమ్మెల్యే ని కూడా అనుమానించమని చెబుతాడు. 


కిషన్ అనే నిందితుడు, మురళి ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్ఫార్మర్ బషీర్ ను అడిగి మొబైల్ తీసుకొని, తన భార్యతో మాట్లాడుతాడు. కాల్పులు జరిపిన వ్యక్తి, దాము అనే క్రిమినల్ అనుచరుడు మునావర్ తో మాట్లాడుతాడు. 


ఇంటరాగేషన్ లో కిషన్, ఫయాజ్ లు తడబడతారు. మొదట లొంగని రంగా, బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు. 


ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 7 చదవండి..


సీఐ మురళి రంగా వంక చూస్తూ, "నా అనుమానం ప్రకారం బషీర్ ఇచ్చిన ఫోన్ నుండి నువ్వే కాల్ చేసి ఉంటావు. ఎలాగూ కాల్ రికార్డింగ్స్ వచ్చాక ఒప్పుకోక తప్పదు. నీ అంతట నువ్వే ఎవరికి కాల్ చేసావో చెప్పు. మా దర్యాప్తుకు సహకరించు" అన్నాడు. 


దీక్షిత్ కూడా రంగాతో "నిందితుడు నిజంగా నేరం చేశాడా లేదా అని సందేహం ఉన్నప్పుడు విచారించే తీరు ఒకలాగా ఉంటుంది. ఇక్కడ నువ్వే హత్య చేశావని ఒప్పుకుంటున్నావు. కాల్ రికార్డింగ్స్ వచ్చాక నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేసావో కూడా తెలుస్తుంది. కాబట్టి నిజం ఒప్పుకునేదాకా నిన్ను విచారించాల్సి ఉంటుంది. నువ్వుగా నీ చేత ఎవరు ఈ పని చేయించారో ఒప్పుకో.. వాళ్ల పేరు చెబితే నీకు ప్రాణహాని ఉంటుందని, మీకు ఇస్తామని చెప్పిన మొత్తం ఇవ్వరని భయపడుతున్నావు. నువ్వు వాళ్ళ పేరు బయటపెట్టినట్లు స్టేట్మెంట్ రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు బయట పెట్టావని కూడా మేము ఎక్కడా చెప్పము. మాకు ఎవరు సహకరించలేదో వాళ్లే చెప్పినట్టు వెల్లడి చేస్తాము" అన్నాడు. 


తర్వాత మురళి వైపు తిరిగి "ఇతన్ని కూడా కాసేపు ఆలోచించు కోనివ్వండి. అన్నట్లు మన కానిస్టేబుల్ మధు ఎప్పుడూ ఆ బషీర్ టీ కొట్టు దగ్గర ఉంటాడు. అతని మీద కూడా నిఘా ఉంచాలనిపిస్తోంది" అన్నాడు. 


దీక్షిత్ ఉద్దేశం అర్థం చేసుకున్న మురళి "లేదు సార్! మధు కొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్నాడు. ఈ సమయంలో ఇలాంటి పనులు చేయడు. అతన్ని నమ్మవచ్చు" అని చెప్పాడు. 


తర్వాత కానిస్టేబుల్స్ తో రంగాను తీసుకొని వెళ్లి విడిగా ఉంచమని చెప్పి పంపించాడు. 


అతను వెళ్ళాక దీక్షిత్, మురళితో "ఇతను ఖచ్చితంగా తమ మనుషుల్ని కాంటాక్ట్ చేసే అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. ఇతనికి మధు కనిపిస్తే సహాయం అడుగుతాడు. ఆ ఏర్పాట్లు చేయండి" అన్నాడు. 


"అలాగే సార్. మరొక మాట.. " అంటున్న మురళిని ఆపి, "లంచ్ కు వెళ్ళమంటావు, అంతేగా?" అన్నాడు దీక్షిత్ నవ్వుతూ. 


మురళి, "డ్రైవర్ కు చెప్పాను సార్. రెడీగా ఉన్నాడు" అన్నాడు. 


దీక్షిత్ కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్ కోదండం. 


"నిన్న జరిగిన మర్డర్ గురించి అప్పుడే చాలా పరిశోధన చేశారని డిపార్ట్మెంట్లో అందరూ అనుకుంటున్నారు సార్. నిజంగా మీరు చాలా గ్రేట్" అన్నాడు కోదండం. 


"థాంక్యూ కోదండం. డ్యూటీ ఎలా చేయాలో అలానే చేశాను. అంతకుమించి గొప్పేమీ లేదు" అన్నాడు దీక్షిత్. 


"అలా అనుకోవడం ఇంకా గొప్ప సార్. పొగుడుతున్నట్లు అనుకోకండి. నా సర్వీస్ లో మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ను చూడలేదు" అన్నాడు కోదండం. 


మరికొంత సేపట్లోనే దీక్షిత్ ఉన్న క్వార్టర్ కు చేరుకుంది కారు. 


వస్తున్నది దీక్షిత్ అని తెలిసినా సెక్యూరిటీగా ఉన్నవాళ్లు బాంబ్ డిటెక్టర్ తో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు దీక్షిత్. గుమ్మం బయటే అతని తల్లి నందిత, తండ్రి రామ్మోహన్, పక్కనే నీతూ శర్మ నిలబడి ఉన్నారు. 


ఇంటికి వచ్చే దారిలో నీతూ శర్మతో వాళ్ళ అన్నయ్యకు ఈ నేరంతో సంబంధం లేదని తేలే వరకు కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ తనను చూడగానే తల్లిదండ్రుల కంటే ముందుగా తన దగ్గరికి వచ్చి 'హాయ్' అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో తను కూడా ఆమెను చూస్తూ నవ్వుతూ 'హాయ్' అన్నాడు. 


మరుక్షణమే ఆమె నుండి దూరంగా జరిగి తల్లిదండ్రులని దగ్గరకు తీసుకున్నాడు. అందరూ ఇంట్లోకి నడిచారు. 


"రోజు లాగా హడావిడిగా రెండు మెతుకులు తిని వెళ్లిపోతానంటే కుదరదు. పాపం ఆ అమ్మాయి ఈరోజు నీకు ఇష్టమైన డిషెస్ ఏమిటో కనుక్కొని చేసింది. తృప్తిగా తిని ఎలా ఉన్నాయో చెప్పి గానీ వెళ్లడానికి వీల్లేదు" అంది నందిత. 


దీక్షిత్, నీతూశర్మ వంక చూస్తూ "చాలా శ్రమ తీసుకున్నారు. థాంక్స్" అన్నాడు. 


"భలేవారే. నా ప్రాణమే మీ దగ్గర ఉంది. ఆ మాత్రం చేయలేనా" అంది నీతూశర్మ.


అర్థం కానట్టు చూసాడు దీక్షిత్. 


"అదే.. మీ ఇంట్లో ఉంచుకొని నా ప్రాణాలు కాపాడుతున్నారు కదా" అంది నీతూశర్మ అతని వంక చూసి నవ్వుతూ. 


"గవర్నర్ గారి చేత ఆర్డర్ వేయించారు. తప్పుతుందా మరి" అన్నాడు దీక్షిత్, భోంచేయడం కోసం చేయి కడుక్కుంటూ. 


"మీకు ఇష్టం లేని పని, ఎంత పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు చెప్పినా మీ చేత చేయించలేరని అత్తయ్య గారు చెప్పారు" అంది నీతూశర్మ అత్తయ్య గారు అనే పదం వత్తి పలుకుతూ.. 


"అది సరే, అత్తయ్య గారు అని ఈ సంబోధన ఏమిటి?" అడిగాడు దీక్షిత్.. 


"నాకెందుకో మీ అమ్మగారిని చూడగానే మా అత్తయ్య.. అదే చనిపోయిన శివరాం శర్మ గారి భార్య గుర్తుకు వచ్చారు. మీ అమ్మగారి లాగే ఆవిడ కూడా లక్ష్మీదేవి లాగా కళకళలాడుతూ ఉంటారు" అంది నీతూశర్మ. 


పొగడ్తలతో తన తల్లిని బుట్టలో వేసినట్లు ఉంది అనుకొన్నాడు దీక్షిత్. 


"నువ్వు కూడా మాతోపాటు కూర్చో అమ్మా!. అందరం కలిసి భోంచేద్దాం" అన్నాడు రామ్మోహన్. 


"లేదులే మామయ్యా. నేను నిదానంగా భోంచేస్తాను. ఆలస్యమైతే మీ అబ్బాయికి కోపం వస్తుంది. అసలే నామీద కోపంగా ఉన్నట్లున్నారు" అంది నీతూశర్మ భయం నటిస్తూ. 


"మీమీద నాకెందుకు కోపం ఉంటుంది?" అడిగాడు దీక్షిత్. 


"ఎందుకో మీకు తెలుసు" అందామె. 


అంటే.. తనకు, హంతకుడితో వాళ్ళ అన్నయ్య కలిసిఉన్న ఫోటో చేరిందని ఈమెకు తెలుసా.. 


"నిజంగా నాకు తెలీదు" అన్నాడతను. 


"మిమ్మల్ని డైరెక్ట్ గా అడగకుండా గవర్నర్ గారితో చెప్పించినందుకు"


"అందులో తప్పేమీ లేదు. ప్రాణ రక్షణ కోసమే కదా చెప్పించారు. దాన్ని బట్టే తెలుస్తోంది ఇక్కడికి రావడం మీకెంత అవసరమో.. " అన్నాడతను. 


"హమ్మయ్య! నన్ను అపార్థం చేసుకోలేదు కదా. చాలా హ్యాపీగా ఉంది. నా మీద ఫస్ట్ ఇంప్రెషన్ పాజిటివ్ గానే ఉందన్నమాట. థాంక్ యు" అంది నీతూశర్మ. 


"నాకు ఎవ్వరి మీదా ఒకే అభిప్రాయమంటూ ఉండదు. ఆయా పరిస్థితుల్లో వాళ్ళ ప్రవర్తనను బట్టి ఉంటుంది" అన్నాడు దీక్షిత్. 


వడ్డన ప్రారంభించింది నీతూశర్మ. అన్ని పదార్థాలూ ఎంతో రుచిగా ఉన్నాయి. 


'అమ్మాయి నీ కాంప్లిమెంట్ కోసం ఎదురు చూస్తోంది. " అన్నాడు రామ్మోహన్. 


నీతూశర్మ వంక చూసాడతడు. తాను చెప్పబోయే మాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోందామె. 


"మిమ్మల్ని చేసుకోబోయే అతన్ని తలచుకుంటే జాలి వేస్తోంది. " అన్నాడతను. 


"అదేంట్రా ఆలా అంటావ్?" అంది నందిత. 


"అవునమ్మా! ఇంత రుచిగా చేస్తే పెళ్ళైన ఆర్నెల్లకే ఆ అబ్బాయి లావయిపోతాడు. తనేమో ఇప్పటిలాగే అందంగా స్లిమ్ గా ఉంటుంది. అప్పుడందరూ ఆ అబ్బాయిని చూసి కాకి ముక్కుకు దొండపండు దొరికిందంటారు. అందుకే అలా అన్నాను" అన్నాడు దీక్షిత్. 


అతని నోట పొగడ్త వినేసరికి సిగ్గుల మొగ్గే అయింది నీతూశర్మ. ముఖాన్ని చేతుల్లో దాచుకున్న ఆమె దేవకన్యలా అనిపించింది ముగ్గురికీ. 


"మిస్టర్ దీక్షిత్.. అప్పుడే పడిపోయావా ఏమిటి.. ? నువ్వు కాలేజీ కుర్రాడివి కాదు. ఎస్ పీ దీక్షిత్ వి" హెచ్చరించింది అంతరాత్మ. 


'ఎస్ పీ అయితే లవ్ లో పడకూడదా ఏమిటి?' గొణిగాడు అతనిలోని యువకుడు. 

***

తన జవరాలు మోనా తో సరసాలాడుతున్నాడు దాము. 


వెల్లకిలా పడుకొని ఉన్న అతని మీదకి పాములా పాకింది మోనా. 


అతని మీసాలని పైకి మెలి తిప్పుతూ "నీ మీసాలు ఇలా పైకి వుంటే చాలా బాగుంటుంది" అంది. 


"ఆ సంగతి నాకు కూడా తెలుసు. కానీ ఇప్పటికే ఫాలోయింగ్ తట్టుకోలేకుండా ఉన్నాను. ఇక మీసం పైకి తిప్పి మెలేస్తే వందమంది అమ్మాయిలు నా వెంట పడతారు" అన్నాడు దాము కాస్త గర్వంగా. 


"ఇలా పొగరుగా మాట్లాడితే మరీ బాగుంటావు.. " అతన్ని గట్టిగ హత్తుకుంది మోనా. 


"నీలా యాక్టివ్ గా వుండే అమ్మాయిలంటే తెగ మోజు నాకు" అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు దాము. 

మెలికలు తిరిగి పోయింది మోనా. 


మరో గంట తరువాత "మోనా డార్లింగ్.. నీకేదైనా ఇవ్వాలనుంది. పద.. ఒక డైమండ్ రింగ్ కొనిపెడతాను" అన్నాడు దాము ఆవేశంగా. 


"నువ్వే నా డైమండ్ రాజావి. వేరే డైమండ్ నాకెందుకు" అంది అతన్ని మళ్ళీ అల్లుకుపోతూ. 


"అలా కాదులే. పోనీ మరేదైనా అడుగు" అన్నాడు దాము. 


'ఏమీ వద్దులే. అన్నట్లు ఇవాళ ఉదయం మా ఇంటి ఓనర్ 'ఇంటికి ఎవరెవరో వచ్చి పోతున్నారు' అంటూ గొడవ పడ్డాడు” అంది మోనా. 


'వాడ్ని కూడా రమ్మనక పోయావా.. " అన్నాడు దాము సరదాగా. 


 ఒక్కసారిగా అతన్ని దూరంగా నెట్టింది మోనా. అంతలోనే అతన్ని పట్టుకుని "నెట్టినందుకు సారీ. కానీ నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఒకప్పుడు ఏమోగానీ నువ్వు పరిచయమయ్యాక మరో మగాడ్ని దగ్గరకు రానివ్వలేదు నేను. అయన ఎవరెవరో అన్నది నీ గురించే" అంది మోనా. 


"ఏదో పొరపాటున అన్నానులే. ఈ దాము లైఫ్ లో మొదటిసారి సారీ.. " అంటుండగా అతన్ని మాట్లాడనివ్వకుండా తన పెదవుల్తో అతని పెదవుల్ని మూసింది. 


మరో రెండు నిముషాల తరువాత ఆమెనుండి విడివడి, "మీ ఓనర్ గాడు పై పోర్షన్ లోనే ఉంటాడు కదూ.. " అన్నాడు దాము ఆవేశంగా. 


"ఆవేశపడకు. వాడ్ని చంపితే వాడి పెళ్ళాం ఓనరవుతుంది. ఇల్లు నాది కాదుగా. " అంది మోనా తన ఉద్దేశాన్ని బయట పెడుతూ. 


అర్థం చేసుకున్నాడు దాము. 


"నాక్కూడా నీకో ఇల్లు కొనివ్వాలని ఉంది. కానీ పెద్ద బడ్జెట్ కదా. కొంత టైం పడుతుంది" అన్నాడు. 


"ఊరికే అన్నానులే. నాకు నువ్వుంటే చాలు" అంటూ అతనికి దగ్గరగా జరగబోయింది. 


"కాస్త ఆగు. మన మునావర్ ఇప్పటికే రెండు సార్లు మెసేజ్ చేసాడు. మామూలుగా నీ దగ్గర ఉండేటప్పుడు డిస్టర్బ్ చెయ్యడు" అంటూ మునావర్ కి కాల్ చేసాడు. 


"పెద్ద అఫర్ వచ్చిందన్నా. అరగంట వెయిట్ చెయ్యమని చెప్పి మీకు మెసేజ్ చేసాను. మీరు రాలేదు. మళ్లీ మెసేజ్ పెట్టి ఇంకో అరగంట వెయిట్ చెయ్యమన్నాను. ఏమీ అనుకోకన్నా" అన్నాడు మునావర్. 


"ఎవరో వివరాలు కనుక్కు న్నావా?" అడిగాడు దాము. 


"అతని ఆధార్ కార్డు తీసుకొని అన్నీ చెక్ చేసాను. అతన్ని పంపించింది మనకు నమ్మకస్థుడే. బాడీ మొత్తం చెక్ చేసాను. ఆయుధాలేవీ లేవు" చెప్పాడు మునావర్. 


"ఇప్పుడే బయలుదేరుతాను" అని ఫోన్ పెట్టేసాడు దాము. 


మోనా బుగ్గమీద ముద్దు పెట్టుకుంటూ "పెద్ద బేరం దొరికినట్లుంది. అన్నీ బాగా జరిగితే నీకు ఇల్లు కొనివ్వడం ఖాయం" అని అక్కడినుంచి బయలుదేరాడు. 


అతను బయటకు రాగానే అనుచరులు కార్ ను స్టార్ట్ చేశారు. పది నిముషాల్లో తన స్థావరం చేరుకున్నాడు దాము. 


అతని కోసం వచ్చిన వ్యక్తిని మునావర్ స్వయంగా మళ్ళీ తనిఖీ చేసి తీసుకొని వచ్చాడు. 


"నా పేరు శక్తి. నన్ను రాజన్ సాబ్ పంపారు" చెప్పాడతను. 


"వచ్చే దార్లో నాకు కాల్ చేసి, నువ్వు తనకు బాగా తెలుసని చెప్పాడు రాజన్. విషయం చెప్పు" 


తన జేబులోనుంచి ఒక ఫోటో తీసి దాముకి అందించాడతను. 


ఆ ఫోటో వంక చూసి ఉలిక్కిపడ్డాడు దాము. 


"ఈయన.. "


"అవును. ఈయన ఎస్ పీ దీక్షిత్. ఇతన్ని రేపే లేపేయాలి" చెప్పాడతను. 


"ఇది చాలా పెద్ద పని. పైగా నిన్ననే శివరాంశర్మ మర్డర్ జరిగింది. పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. ఎస్ పీ చుట్టూ చాలామంది పోలీసులు ఉంటారు. పైగా రేపే అంటున్నారు. " అన్నాడు దాము. 


"అవును. అయన వుంటే ఆ మర్డర్ చేయించిన వాళ్ళు బయట పడతారు. అందుకే రేపే అయన పని ముగించాలి. పది కోట్లకు డీల్. అవుతుందా కాదా ఒక్కమాటలో చెప్పెయ్యాలి. కాని పక్షంలో మర్డర్ జరిగేవరకు ఈ విషయం ఎక్కడా బయట పడకూడదు. మరో కండిషన్.." అంటూ మరొక ఫోటోను బయటకు తీశాడు. 


"రేపు శివరాం శర్మ అంత్యక్రియలు. ఎస్ పీ దీక్షిత్ రేపంతా ఆ పని మీదే ఉంటాడు. ఈ ఫొటోలో ఉన్న ఆమె శివరాం శర్మ మేనకోడలు. ఎస్ పీ ప్రొటెక్షన్ లో ఉంది. కాబట్టి రేపంతా ఆమె అతని పక్కనే ఉండచ్చు. ఆమెకు ఏ ఆపదా జరక్కూడదు" చెప్పాడు శక్తి. 


"ఆలా అయితే చాలా కష్టం. దూరం నుండి బాంబ్ వెయ్యడానికి కూడా వీల్లేదు. " చెప్పాడు దాము నిరాశగా. 


"సరే. పదహైదు కోట్లు.. ఫైనల్.. ఆలోచించుకొని, 'గోధుమలు పదహైదు బస్తాలు పంప’మని మరో అరగంటలో ఈ నంబర్ కు కాల్ చేసి చెప్పు. తరువాత నేను మళ్ళీ కలుస్తాను" అంటూ వెళ్ళిపోయాడు శక్తి. 


ఆలోచనలో పడ్డాడు దాము. 

చెయ్యబోయే పనిలో రిస్క్ ఒకవైపు, పదహైదు కోట్ల డబ్బు మరో వైపు.. 


కిరాయి మనుషులకు రెండు మూడు కోట్లు, తరువాత వచ్చే ఎస్ పీ లొంగితే అతనికోసం, లొంగక పోతే కోర్టు ఖర్చులకు.. మరో రెండు కోట్లు ఖర్చవుతాయి. 


మిగతాదంతా మిగులుతుంది. 

ఒక యాభై లక్షలు పెట్టి మోనాకు ఒక ఇల్లు కొనిపెడితే చాలు.. తనను స్వర్గంలో ముంచేస్తుంది.. 


ఒక ఆలోచనకు వచ్చిన దాము మునావర్ అందించిన ఫోన్ నుండి ఓ నంబర్ కి కాల్ చేసి "పదహైదు బస్తాల గోధుమలు పంపండి. మిగతా విషయాలు నేరులో" అని చెప్పి పెట్టేశాడు. 


అలా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ హత్యకు కుట్ర మొదలైంది. 

=========================================================

ఇంకా ఉంది


=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 








Comments


bottom of page