top of page

చేయి వదలకు నేస్తమా - పార్ట్ 2

Updated: 2 days ago

#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #CheyiVadalakuNesthama, #చేయివదలకునేస్తమా, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Cheyi Vadalaku Nesthama - Part 2 - New Telugu Web Series Written By - Veluri Prameela Sarma Published In manatelugukathalu.com On 25/04/2025

చేయి వదలకు నేస్తమా - పార్ట్ 2 - తెలుగు ధారావాహిక

రచన: వేలూరి ప్రమీలాశర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ..

సునీల, దొరబాబుల పెళ్లి పీల మీద ఆగిపోతుంది. ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది.

సునీల పరిస్థితికి జాలిపడతాడు తేజ.

ఇక చేయి వదలకు నేస్తమా - పార్ట్ 2 చదవండి. 


 సికింద్రాబాద్ స్టేషన్లో దిగి, అమీర్పేట్ వెళ్ళడానికి మెట్రో స్టేషన్ వైపు నడిచాడు తేజ. టికెట్ తీస్కుని, అప్పటికే ప్లాట్ ఫామ్ మీదున్న మెట్రోని క్యాచ్ చెయ్యడానికి పరిగెడుతూ, డోర్స్ క్లోజ్ అయిపోతుండగా… వింటి నారిని వీడి గగనంలోకి దూసుకెళ్లిన బాణంలా… ప్లాట్ ఫారం వదిలి ఒక్క అంగలో లోపలికి చేరాడు. 

 

 'హమ్మయ్యా!' అని ఊపిరి తీస్కుని, కూచోడానికి సీటేమైనా దొరుకుతుందేమోనని జనాన్ని నెట్టుకుంటూ ముందుకి కదులుతున్నాడు. రకరకాల పనులమీద మెట్రో ఎక్కి గమ్యం చేరాలనుకుంటున్న వారందర్నీ మోస్తూ, గుంభనంగా సాగుతోంది రైలు. 


 పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ, పక్కవారిని గమనించే స్థితిలో లేని కొందరు, పైనున్న హేంగర్స్ పట్టుకుని వేలాడు తున్నారు. 


రాడ్ కు చేరబడి ఫోన్ మాట్లాడుకుంటున్న ఓ అమ్మాయి చూపుడు వేలితో గాల్లో అక్షరాలు దిద్దుతూ, నాలుగడుగుల దూరంలో ఉన్న బాయ్ ఫ్రెండ్ కి ఏవో సైగలు చేస్తోంది. ఏమర్థమయ్యిందో… తలాడిస్తూ నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోదామన్నట్టు సైగ చేసాడు. సమాధానంగా ఆ అమ్మాయి బొటనవేలు పైకెత్తి చూపింది. అతను గాల్లోకి విసిరిన వలపు సంకేతాలకు, ఎర్రబడిన ఆమె బుగ్గల్లో మెరుపు, పెదవులపై చిరునవ్వు విరిసి, సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చింది.


 'హు! ఇరవై ఏళ్ళు కూడా రాకుండానే తెలివి మీరిపోతున్నారు. అంతా అరచేతిలో అంతర్జాలం మహిమ. వీళ్ళనెవరూ బాగుచెయ్యలేరు. చదువుకునే వయసులో ఎఫైర్ లు పెట్టుకుని తిరుగుతారు… తర్వాత బతుకుతెరువుకి డబ్బు సంపాదించే మార్గం తెలీక, మోసాలకు కూడా వెనుకాడరు. తల్లిదండ్రుల్ని తలదించుకునేలా చేస్తున్న ఇలాంటి యూత్, సమాజానికి ఉపయోగపడే వాటిపై దృష్టి పెడితే మనదేశం ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండేది' అనుకుంటూ, చిరాగ్గా మొహం తిప్పుకున్నాడు తేజ.

 

 మరోపక్క కూచోడానికి చిన్న జాగా దొరకబుచ్చుకున్న ఓ ఐటీ ఉద్యోగి, ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని, రెండు చేతుల వేళ్ళనూ కీప్యాడ్ మీద టకటకలాడిస్తున్నాడు. అక్షరాలకన్నా వేగంగా అతని ఆలోచనలు పరుగెడుతున్నాయి. కాలానికి గేలం వేసే రేసు గుర్రాల్లాంటి ఐటీ ఉద్యోగుల కోవకి చెందిన ఆ వ్యక్తి, భావోద్వేగాలకి అతీతుడైన మునిలా కనిపించాడు.


 జానెడు సీట్లో ఒద్దికగా ఒదిగిపోయి, ఓ పక్కగా చివరికి కూచున్న డబ్భై ఏళ్ల ముదుసలి, ఆసరాకోసం ఇనుప స్తంభానికి తల ఆనించి, కునికిపాట్లు పడుతూ నిద్దట్లోకి జారుకుంటోంది. కాలంతోపాటు జీవితంలో పరుగెత్తీ పరుగెత్తి… అలసిపోయినట్టున్న ఆమె శరీరంపై ముడుతలు, ఆటుపోటులకు చెదరిన అలలను తలపిస్తున్నాయి. రాలడానికి సిద్ధంగా ఉన్న పండుటాకులాంటి ఆ బక్కపల్చని ప్రాణం… అర్థ రూపాయి లాభం వచ్చినా చాలన్నట్టు సన్నని చెట్టు కొమ్మల్ని నున్నగా గీకి, బొమ్మలుగా మలిచి అమ్ముకుంటుందని, రెండుకాళ్ళ మధ్యనా కదలకుండా తొక్కిపట్టిన వెదురుగంపలో అందంగా పేర్చిన బొమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. 


 రకరకాల మనుషులు… కిటకిటలాడుతున్న మెట్రోలో, చెమట వాసనల మధ్య, ఒక్కసారిగా పరిమళభరితమైన సువాసన ముక్కుకి సోకడంతో తలతిప్పిచూశాడు తేజ. ఎర్రని గులాబీలు రెండు… వాటికి కొంచెం క్రిందగా గుచ్చిన సంపెంగల గుత్తిని జడ మొదట్లో అందంగా ముడిచి, పైకి వినిపించీ వినిపించనట్టుగా రెహమాన్ ట్యూన్ హమ్ చేస్తూ, పెదవులతో తాళం వేస్తోంది ఓ జవ్వని. ఆ పరిమళం ఆమె తలలో తురుముకున్న పూలనుంచి వస్తున్నదే అని గ్రహించాడు. అప్పుడు చూసాడు... సపోర్ట్ కోసం ఐరన్ పోల్ పట్టుకుని, క్రీగంట తననే గమనిస్తున్న ఆమె.... లావెండర్ కలర్ జార్జిట్ చీరలో, తెల్లని పాలరాతి బొమ్మలా మెరిసిపోతోంది. దృష్టి మరల్చుకుని తమాయించుకుని కొంచెం సర్దుకుని నుంచున్నాడు. 


 మరోసారి చూడాలని మనసు మారాం చేస్తుంటే, కళ్ళ చివరినుండి ఆమెను చూసాడు. పూల పరిమళాన్ని ఆస్వాదించాలని రెక్కలు ఆడిస్తూ తిరుగుతున్న సీతాకోకచిలుకలా మారిన అతని మనసు, చిత్రమైన ఆమె రూపలావణ్యానికి ఆకర్షింపబడి, ఆమె చుట్టూ విహరిస్తోంది. 'సందేహం లేదు... ఈమె ఆమే! అవును... ఈమె సునీల!!' మనసులోనే అనుకున్నాడు. 

 

 ఆరోజు పెళ్లి పీటల మీద కూచున్నప్పుడు అంతగా గమనించలేదు కానీ, ఆమెని ఇలా దగ్గరగా చూసినప్పుడు మాత్రం 'ఎంత అందంగా ఉంది!' అనుకున్నాడు.


"పున్నమి చంద్రుడిలా నిండుగా, గుండ్రంగా ఉన్న మొహం, కలువ రేకుల్లాంటి అందమైన కళ్ళకి, దిష్టి గీత గీసినట్టున్న కాటుక రేఖలు, గాలికి ఊయలలూగుతున్న లోలాకుల్ని బంధించాలని ఆరాటపడుతూ కిందకి ఉరికి, వ్రేలాడుతున్న రింగు రింగుల ముంగురులు... ముక్కుకి పగ్గం వేస్తున్న మువ్వల బుల్లాకును కవ్విస్తున్న ఎఱ్ఱని లేత పెదవులూ... ఓహ్! ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం మర్చిపోయి, మళ్లీ మామూలు స్థితికి వచ్చినప్పుడు గమ్మత్తుగా తాకిన ఆమె జడలోని జంట గులాబీల పరిమళం మత్తెక్కిస్తుంటే మోహితుడై పరవశంతో ఆమెనే చూస్తుండిపోయాడు.


 అతని చూపులు వలపు బాణాల్లా గుచ్చుకున్నాయేమో... తాచుపాములాంటి నల్లని, పొడవైన జడను విసురుగా వెనక్కు తోసి, కొద్దిపాటి అసహనాన్ని వ్యక్తం చేసింది సునీల. ఆమె ఇబ్బంది పడుతుండడం గమనించి గబుక్కున మొహం తిప్పుకుని, ముందున్నవారిని దాటుకుని కొంచెం ముందుకి కదిలాడు తేజ. అలా వెళుతూ వెళుతూ ఓసారి వెనక్కి తిరిగి చూసి… ఆమె ఒకకంట తనని గమనించడం చూసిన అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. అపురూపమైన ఆ రూపాన్ని కను రెప్పలచాటున పదిలంగా దాచుకుని, చేరవలసిన గమ్యం గురించి ఆలోచిస్తూ నిలుచున్నాడు. 


 మరో అయిదు నిముషాలలో మెట్రో రైలు, అమీర్ పేట స్టేషన్ కి చేరుకుంది. స్టేషన్లో దిగగానే సునీలను కలవడానికి వచ్చినామెను చూసి, ఆశ్చర్యపోయాడు. 'ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. బహుశా కవలలేమో' అనుకున్నాడు. కానీ ఇద్దరి ఆహార్యంలోనూ పొంతనలేదు. ఆ రెండవ ఆమె చాలా మోడ్రన్ గా, పూర్తి ఆధునిక వస్త్రధారణలో ఉంది. 'ఈ ఇద్దరిలో ఆరోజు పెళ్లిలో తాను చూసింది ఎవరైవుంటుంది' అనుకుంటూ, గెడ్డంమీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ వారినే గమనించసాగడు. 

 

 ఇంతలో తనను రిసీవ్ చేస్కోడానికి వచ్చిన తన స్నేహితుడు ప్రశాంత్ 'హాయ్!' అంటూ దగ్గరకు వచ్చి పలకరించడంతో, వారి గురించి ఆలోచించడం మానేసి, అతణ్ణి అనుసరించి, గేటు బయటకు దారితీసాడు తేజ.

************

 "ఏరా! ఇంక పర్మనెంట్ గా వచ్చేసినట్టేగా… సరిగ్గా ఆలోచించుకున్నావా? చేస్తున్న ఉద్యోగం వదిలేసి, తప్పు చేయడంలేదు కదా! నేనైతే ఎవరికీ సమాధానం చెప్పుకోనవసరం లేదు. కానీ నీ పరిస్థితి అలా కాదు కదా! 


బాగా ఆలోచించుకునే ఈ స్టార్ట్ అప్ పెట్టాలని నిర్ణయించుకున్నావా?" తాళం తీసి, రూమ్ తలుపులు ఓపెన్ చేస్తూ యధాలాపంగానే అన్నా, తేజతోపాటు అతని స్టార్ట్ అప్ కంపెనీ కో ఫౌండర్ గా ఉన్న ప్రశాంత్ మనసులో ఇంకేదో ఉండడం గమనించాడు తేజ. 


 కర్టెన్స్ పక్కకి జరిపి, వెలుతురు వచ్చేలా తలుపులు తీసి ఉంచి, వచ్చేటప్పుడు దారిలో మార్కెట్ లో కొనితెచ్చిన పళ్ళూ, కాయగూరలూ తీసి, ఫ్రిడ్జ్ లో సర్దేసి, స్ట్రాంగ్ గా టీ తాగితే కానీ బడలిక తగ్గదంటూ, పాల పేకెట్ తీస్కుని కిచెన్ వైపు దారితీసాడు ప్రశాంత్. 


 ప్రశాంత్, తేజాల స్నేహం ఈనాటిది కాదు. ఇద్దరూ హైస్కూలు చదువుల్లో ఉన్నప్పుడే, కొత్త కొత్త ఆవిష్కరణల గురించి ఆలోచించేవారు. కొంచెం సమయం దొరికితే చాలు… లైబ్రరీకి వెళ్లి పుస్తకాల్లో తలదూర్చేసేవారు. వీరిద్దరి ఆసక్తినీ గమనించిన టీచర్లు కూడా, సైన్సు సంబంధిత విషయాలపై వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తూ, ప్రోత్సహించేవారు. ఇద్దరి ఆలోచనలూ ఒకటే… ఇద్దరి అభిరుచులూ ఒకటే. ఎక్కడున్నా ఇద్దరూ ఒకే రూమ్ తీస్కుని కలిసే ఉండేవారు. ప్రతీ విషయం ఒకరితో ఒకరు పంచుకునేవారు.


 "బీటెక్ చేసి, మరొకరి కింద పనిచేస్తూ, ఎదుగూ బొదుగూ లేకుండా ఇలా ఎన్నాళ్ళని ఉంటాం? నీకు తెలుసు కదరా! ఈ స్టార్ట్ అప్ పెట్టాలన్నది నా డ్రీమ్. అందుకేగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్ కోర్సెస్ చేసింది. ప్రస్తుతం నిల్వ వేసిన డబ్బు... పెట్టుబడికి సరిపోతుంది. నేనెంచుకున్న రోబోటిక్స్ లో గృహ అవసరాలను తీర్చే రోబోలను డిజైన్ చేసి, సప్లై చేస్తే సంవత్సరం తిరిగేసరికి మనమొక స్థాయిలో ఉంటామన్న నమ్మకం నాకుంది. అనవసరంగా వర్రీ అవకు" అంటూ ప్రశాంత్ చేతిలోని పాలప్యాకెట్ తీసుకుని, గిన్నెలోపోసి స్టవ్ మీద పెట్టాడు తేజ.


 "ఏమో రా! చిన్నప్పట్నుంచీ నీ చదువుకైన ఖర్చంతా భరించి, నీ మంచి చెడులు చూసిన మీ మేనమామ గోపీకృష్ణ గారు, నిన్న నన్ను కలిశారు. ఒక్కసారి వాడికి నచ్చచెప్పి చూడకూడదా అని నాతో అంటేను..." ఆర్థోక్తిలోనే ఆపేశాడు. గోడకి చేరబడి, చేతులుకట్టుకుని, ఒకకాలు మడిచి వెనక్కి గోడకి తన్నిపెట్టి నుంచున్న ప్రశాంత్… తనతో ఆ విషయం చెప్పడానికి సంశయించడం గమనించకపోలేదు తేజ.


 "అదీ సంగతి! ఇలాంటిదేదో జరిగే వుంటుందనుకున్నాను. హు! నాతో చెప్పి ప్రయోజనం లేదని, నీచేత చెప్పిస్తున్నాడన్నమాట…


అరే! నా భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయం తీసుకునే హక్కు కూడా నాకు లేదా? డబ్బు ఖర్చు పెట్టి చదివించినంతమాత్రాన ఆయన చెప్పినట్టే వినాలనుకుంటే ఎలా? నాకూ ఓ వ్యక్తిత్వం అనేది ఉంటుంది కదా! అయినా చదివించమని మేమేమైనా ఆడిగామా? పల్లెటూర్లో కన్నా పట్నంలో మంచి ఎడ్యుకేషన్ వుంటుందంటూ మా మామయ్యే బలవంతంగా నన్ను తీసుకువెళ్లి చదివించాడు." తన మనసులోని ఆవేదననంతా వెళ్లగక్కాడు తేజ. 


 "అది కాదురా! నువ్వేదో సరైన ఉద్యోగంలో కుదురుకుంటే..." 


 "ఆ! కుదురుకుంటే...? ఆయన కూతుర్ని నా మెడకి తగిలిద్దామనుకుంటున్నాడు అంతేగా? అరె! వరసయినంత మాత్రాన ఇద్దరికీ ముడి పెట్టేయాలనుకుంటే ఎలా? ఒక ఇంట్లో కలిసి పెరిగిన వాళ్ళం… నాకైతే సురభి మీద ప్రత్యేకమైన అభిప్రాయమేదీ లేదు. అంతేకాదు ఆయనలా రైల్వే గార్డ్ లా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ... కొత్తదనం లేని జీవితం గడపడం నా వల్ల కాదు. నామీదే ఆశలు పెట్టుకోకపోతే బయటి సంబంధాలు చూసుకోవచ్చుగా... గంతకు తగ్గ బొంత దొరక్కపోరు.


నాకంటూ కొన్ని ఆశలు ఉంటాయి అని తెలుసుకోలేకపోతే ఎలా? కేవలం డిగ్రీ వరకూ మాత్రమే చదివిన ఆ అమ్మాయిని మాత్రం నేను చేసుకోను. నాలాగే ఉన్నత చదువులు చదువుకుని, నా కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటూ, ఇల్లూ-సంసారం చక్కదిద్దుకునే అమ్మాయి కోసం చూస్తున్నాను. నా ప్రతీ ప్రొడక్ట్ డిజైనింగ్ వెనుకా ఆమె సలహా ఉండాలి. ఎవరెన్ని చెప్పినా ఈ స్టార్టప్ ని మాత్రం ఆపేది లేదు" కరాఖండిగా చెప్పాడు తేజ.


 "ఎందుకురా అంత కోపం? నీ ఆశయాలు వదులుకోమనే హక్కు ఎవ్వరికీ లేదు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా మలచుకునే స్వాతంత్రం నీకుంది. నీమీద నమ్మకం ఉండబట్టే కదరా... ఏమాత్రం ఆలోచించకుండా నేనూ నీ వెనక వచ్చింది. ఒకరు నిన్ను చదివించారని వారికి నచ్చినట్టే వుండనక్కరలేదని నాకూ అనిపిస్తోంది. ఏదేమైనా మనం డిజైన్ చేస్తున్న ఈ కంపానియన్ రోబోస్, వయను మళ్లినవారికీ, జ్ఞాపకశక్తి లేక బాధపడేవారికి నిస్సందేహంగా సహాయపడతాయి. పదిమందికీ ఉపయోగపడే పని చేస్తున్నందుకు రేపు మీ మావయ్యే నిన్ను మెచ్చుకుంటారు చూడు."


 "...సరేకానీ! మన కొత్త కంపెనీకి బిసినెస్ అనలిస్ట్ గా ఉండడానికి ఇంటరెస్ట్ ఉందని నిన్న ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ నుంచి అప్లికేషన్ వచ్చింది. దానిని ఆఫీసులో ఉంచాను. వీలున్నప్పుడు ఒకసారి చూడు. రిఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో. ఊళ్ళోకి మా పెద్దత్తయ్య వాళ్ళు కొత్తగా షిఫ్ట్ అవుతున్నారు. దగ్గరుండి వాళ్లకి ఏం కావాలో అన్నీ చూడాలి. ఈ రాత్రికి అక్కడే ఉండి, రేపు తిన్నగా మన కొత్త ఆఫీసుకే వచ్చి కలుస్తాను" వెళ్ళడానికి బండి తీస్తూ చెప్పాడు ప్రశాంత్. 


 సరేనన్నట్టు బొటనవేలు పైకెత్తి చూపాడు తేజ. ఆ రాత్రి నిద్రకుపక్రమించాడే కానీ, కళ్ళనిండా ఆమె రూపమే నిండి ఉండడంతో కలత నిద్రతోనే తెల్లవారిందనిపించాడు తేజ.


=========================================================

ఇంకా ఉంది

=========================================================


వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ

నమస్తే!

సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.

రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.


వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.

మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.

వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.

ధన్యవాదములు. 🙏🏼

ఇట్లు,

వేలూరి ప్రమీలాశర్మ.




1 Comment


@prameelasarma970

•10 hours ago

నా రచనను మీ గళం లో అద్భుతం గా వినిపించారు. ధన్యవాదాలు sir. 🙏🏼🙏🏼

Like
bottom of page