top of page

చేయి వదలకు నేస్తమా - పార్ట్ 1

#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #CheyiVadalakuNesthama, #చేయివదలకునేస్తమా, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Cheyi Vadalaku Nesthama - Part 1 - New Telugu Web Series Written By - Veluri Prameela Sarma Published In manatelugukathalu.com On 19/04/2025

చేయి వదలకు నేస్తమా - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: వేలూరి ప్రమీలాశర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సికింద్రాబాద్ స్టేషన్లో రెండో నెంబర్ ప్లాట్ ఫారం మీదకి గౌతమీ ఎక్స్ప్రెస్ గుంభనంగా వచ్చి ఆగింది. అయిదు నిముషాల తర్వాత, ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉందన్న అనౌన్సమెంటుతో ప్రయాణీకుల్లో కదలిక మొదలయ్యింది. కిటికీల వద్ద నుంచుని, తమ వారితో మాట్లాడుతున్నవారు, చేతులు ఊపుతూ బై చెబుతున్నారు. 

 

 సిగ్నల్ పడగానే నిండు గర్భిణిలా ఉన్న రైలు మెల్లగా ముందుకి కదిలింది. ఆఖరు బోగీకి వెనకగా ఉన్న క్యాబిన్ లోని సీనియర్ ప్యాసింజర్ రైలు మేనేజర్ (గార్డు), విజిల్ ఊది, పచ్చజెండా ఊపాడు. థర్డ్ ఏ. సి. బోగీ బి7 లో మొదటి రెండు కూపేలూ పెళ్ళివారితోనే నిండిపోయాయి. తిరుగు ప్రయాణంలో కాకినాడకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారందరూ, ఎవరికి కేటాయించబడిన బెర్తుల కిందకు వారి లగేజ్ సర్దుకుని, కూచున్నారు. పెళ్లి సారెతో, అడుగు పెట్టేందుకు కూడా ఖాళీ లేకుండా సామానులు బెర్తులకిందకి చేరాయి. 


 చేతిలో గుడ్డసంచి తప్ప లేని వేదాంతి గారు, పరుగు పరుగున వచ్చి… కదులుతున్న రైలులోకి ఎక్కబోయారు. రైలు మిస్సయిపోతానేమోనన్న కంగారులో ఒళ్ళుతూలినట్టుంది… ఒక్కసారిగా వెనక్కు విరుచుకు పడిపోయారు. ఆ పడటం పడటం, సరాసరి ప్లాట్ ఫార్మ్ కీ, ట్రైన్ కీ మధ్యలోకి జారిపోయారు. ఆరడుగుల ఎత్తుతో, కొంచెం లావుగా ఉన్న వేదాంతి గారిని, ఆ ఊబకాయమే పట్టు తప్పి, తూలిపడేలా చేసింది. రొప్పుతూ, నిస్సహాయంగా చూస్తూ, దిక్కుతోచని స్థితిలో భగవన్నామస్మరణ మొదలుపెట్టారు. 


 అక్కడున్నవారందరిలో కలవరం మొదలయ్యింది... చుట్టూ గుమిగూడిన జనానికి ఏం చెయ్యాలో పాలుపోవడంలేదు. వయసులో ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు ముందుకి వంగి, వేదాంతిని చెయ్యి అందించమంటుంటే… షాక్ కు గురైన ఆయన, అయోమయంలో స్తబ్దుగా ఉండిపోయాడు. ట్రైన్ కిందనుండి అంతటి భారీకాయాన్ని బయటకు ఎలా లాగాలో తెలీక గాభరాగా అటూ ఇటూ పరుగెడుతున్నారు మిగతా పాసింజర్లు.


 సరిగ్గా అప్పుడే ప్లాట్ ఫారం మీదున్న కుక్క ఒకటి మోరలెత్తి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి అలెర్ట్ అయిన గార్డు... సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ బ్రేకు నొక్కడం, ఒక్క ఉదుటన ట్రైన్ ఆగిపోవడం జరిగింది. ప్రమాదం తప్పినందుకు అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. చావు అంచుల వరకూ వెళ్లి, వెనుదిరిగి వచ్చి, ఆయాసంతో రొప్పుతున్న వేదాంతి గారిని, నలుగురు సాయం పట్టి పైకి లేపాల్సి వచ్చింది. అయోమయం నుంచి బయటకు వచ్చి, కాస్త తేరుకున్నాక… తన ప్రాణాలు కాపాడిన ఆ భైరవుడి(కుక్క)కి చేతులెత్తి మొక్కారు వేదాంతి గారు. 


 జరిగిన సంఘటన నుంచి వేదాంతి పూర్తిగా కోలుకోలేకపోవడంతో, మిగతావారిలో ఆందోళన మొదలయ్యింది. సాయంపట్టి మెల్లగా ట్రైన్లోకి చేర్చారు. తొమ్మిదో నంబరు లోవర్ బెర్త్ మీదకి చేరుకున్న వేదాంతి గారు… ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దయిపోతూ, అచేతనావస్థకి చేరుకోవడం గమనించి అందరిలోనూ కంగారు పుట్టింది. 

 

 "పాపం! షుగరు డౌనయినట్టుంది, దూరంగా జరగండి. కొంచెం గాలి తగలనివ్వండి" అంటూ, వేదాంతిని చేతి ఆసరాతో బెర్తుపై కూచోబెట్టిన పాపారావు మాస్టారు, గబగబా జేబులోంచి చాక్లేట్ ఒకటి తీసి నోట్లో పెట్టారు. ఇరవై నిముషాల తర్వాత కానీ ఆయన తేరుకుని, మనిషి కాలేకపోయాడు. ఒంటి మీదున్న తెల్లని కాటను షర్టు, పాతదైపోయి, చెమటకు తడిసి నీరుకాయ రంగు పట్టేసింది. కాషాయరంగు బొద్దంచు జరీపంచెను లుంగీలా చుట్టుతిప్పి కట్టుకున్న వేదాంతి గారి ముఖం మీద, రూపాయి బిళ్ళంత బొట్టు ఉన్నా కూడా ఆ మొహం కాంతి విహీనంగానే ఉంది. నొసటి ముడతల్లో దాగిన విభూతి రేఖలు, చెమటకు కరిగి మాయమైపోయాయి.

 

 కిటికీకి దగ్గరగా మూలకి జరిగి కూచుని, గుడ్డలో మూటకట్టుకుని తెచ్చుకున్న అటుకులు కాసిని నోట్లో పోసుకుని, ఆ నిముషానికి ఆకలి తీర్చుకుంటున్న వేదాంతి, కుచేలుడికి మారు రూపంగా ఉన్నాడు. పై బెర్తు మీద కూచున్న తేజ తననే గమనించడం చూసి, కాస్త ఇబ్బందిగా కదిలి, మంచినీళ్ల సీసా ఎత్తి గొంతులో నాలుగు చుక్కలు ఒంపుకుని, అటువైపు మొహం తిప్పుకుని కూచున్నాడు. రైలు వేగం అందుకోవడంతో బెర్తుపై పక్క పరుచుకుని నిద్రపోవడానికి సిద్ధమయ్యాడు తేజ.

 

 పెళ్లి బృందంలో ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేదు. "ఇలా జరిగిందేమిటి?" అన్న దిగ్భ్రాంతి నుంచి ఇంకా ఎవరూ పూర్తిగా తేరుకోలేదు. సైడ్ బెర్త్ లో కూచున్న పెళ్లి కొడుకు దొరబాబు ఆలోచన మరోలా ఉంది. కదులుతున్న రైలు కన్నా వేగంగా అతని ఆలోచనలు పరుగెడుతున్నాయి. కిటికీలోంచి బయటకు చూస్తున్నాడే కానీ, దృష్టి దేనిమీదా నిలపడం లేదు. 

 

 పుట్టినప్పట్నుంచీ శంఖవరం విడిచి ఎక్కడికీ వెళ్ళింది లేదు. డిగ్రీ చదవడం కోసం రాజమండ్రీలో వుండాల్సివచ్చిన మూడేళ్ళలోనూ, నెలకోసారి శంఖవరం వచ్చి వెళ్ళేవాడు. పోటీ పరీక్షలు రాసి, వీ.ఆర్.ఓ గా శంఖవరం గ్రామానికే వచ్చిన దొరబాబుని చూసి, తండ్రిలేని బిడ్డ అంత ప్రయోజకుడైనందుకు బంధువులందరూ చాలా సంతోషించారు. 

 

 దొరబాబు తల్లి సుందరమ్మ పెద్దగా చదువుకోలేదు. అందుకే కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు పాపారావు మాష్టారిని సలహా అడిగేది. రెండు కుటుంబాల మధ్యా పాతికేళ్లుగా ఉన్న స్నేహం, వారిని ఒకరికొకరు ఆసరాగా నిలబడేలా చేసింది. ఇప్పుడు దొరబాబుకి పెళ్లి సంబంధం కుదిర్చింది కూడా పాపారావు మాష్టారే. హైదరాబాద్ లో ఉంటున్న తన అక్క, మరిది కూతురు సునీలకి, సుందరమ్మ కొడుకు దొరబాబుతో వివాహం చెయ్యడానికి నిశ్చయించుకొన్నారు. 

 

 సునీల తండ్రి గోవిందరావు, తాను చదివిన ఐ.టి.ఐ చదువుకి, ఎలక్ట్రిసిటీ ఆఫీసులో జూనియర్ ఇంజనీరుగా ఉద్యోగం తెచ్చుకున్నా, పెద్దగా ఎదగలేకపోయాడు. ఈడొచ్చిన ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు చెయ్యడానికి కిందా మీదా అవుతున్న సమయంలో... పాపారావు మాష్టారి సలహామేరకు, బీ.టెక్ పూర్తిచేసి, ఉద్యోగాల వేటలో ఉన్న సునీలకి, దొరబాబుతో వివాహం కుదుర్చుకున్నారు. 

 

 ఉదయం తొమ్మిది గంటలా పన్నెండు నిముషాలకి ముహూర్తం. సరిగ్గా తాళి ముడిపడే వేళకి అక్కడికి వచ్చిన రేవతి... ఆ పెళ్లి జరగడానికి వీల్లేదనీ, తానూ… దొరబాబూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామనీ నానా రభసా చేసింది. సుందరమ్మతో సహా, అక్కడున్న వారందరూ విస్తుపోయి చూస్తుండిపోయారు. దొరబాబు, రేవతిని నిలువరించే ప్రయత్నం చెయ్యకపోగా, ఆమె వైపే నిల్చున్నాడు.

 

 కొడుకు నిర్వాకానికి స్థాణువై, కుంగిపోయిన సుందరమ్మని, పాపారావు మాష్టారు ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ, అటు సునీల తల్లిదండ్రులు కూడా కావాల్సినవారే కావడంతో పాపారావు మాష్టారికి ఎలా సర్దిచెప్పాలో పాలుపోలేదు. మొత్తానికి దొరబాబు పట్టుబట్టడంతో రేవతిని పెళ్లి పీటలమీద కూచోబెట్టక తప్పలేదు. 

 

 తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని చూసి, సునీల తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. పీటలమీద పెళ్లి చెడిపోయి, నలుగురిలోనూ నవ్వులపాలయ్యామన్న అవమానం తట్టుకోలేని గోవిందరావు, గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఒకరికి అపకారం చేసి ఎరగని సుందరమ్మకి జరుగుతున్నదేదీ జీర్ణం కాలేదు. విధి విలాపాన్ని ఆపడం ఎవరితరమూ కాదన్నట్టు అన్యమనస్కంగానే వేదమంత్రాలు చదువుతూ, పెళ్లి తంతు పూర్తిచేశారు వేదాంతి గారు. 

 

 పొందికగా, పుత్తడిబొమ్మలా ఉన్న సునీల మాత్రం, తాను చేయని తప్పుకి పడిన ఈ శిక్షకు ఏమాత్రం కుంగిపోలేదు. తన తండ్రి ప్రాణం నిలబడాలన్న ఆరాటంలో ఉన్న ఆమె, తనకు జరిగిన అవమానాన్ని ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేదు. తండ్రిని హాస్పిటల్ కు చేర్చే ప్రయత్నంలో కంగారుగా అంబులెన్స్ కి కాల్ చేస్తోంది.

 

 'ఈమెని ఓటమి ఎన్నడూ బాధించదు.' తనలో తనే అనుకున్నాడు తేజ. ఆ భావన సునీల మనసుని తాకినట్టుంది... కళ్ళెత్తి అతని వైపు చూసింది. గబుక్కున తల తిప్పుకున్నాడు. కర్తవ్యం గుర్తొచ్చినవాడిలా దొరబాబు చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి, ఆమెకు క్షమాపణ చెప్పించాడు తేజ. 

తాము నిర్ణయించిన పెళ్లికూతురు స్థానంలో, మరో అమ్మాయిని యింటి కోడలిగా తీసుకువస్తున్న దొరబాబు నిర్ణయం ఎవరికీ మింగుడుపడలేదు. అందరూ అయిష్టంగానే కాకినాడకు తిరుగు ప్రయాణమయ్యారు. 

 

 సైడ్ బెర్త్ లపై ఎదురెదురుగా కూచున్న దొరబాబూ, రేవతీ మౌనంగా కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. ‘ఒక నిర్ణయానికి వచ్చినవారు, పీటల వరకూ వచ్చాక ఇలా పదిమందిలో గొడవ పడకుండా, ముందే తేల్చుకుని ఉంటే బాగుండేదేమో…’ ఆలోచనలతో అలసటగా ఉన్న తేజ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.

****** ****** ***** ******

 ట్రైను కాకినాడ స్టేషనుకి చేరడంతో... క్రీచుమని శబ్దం చేస్తూ మెల్లగా ఆగింది. టైమ్ ఉదయం ఏడున్నర కావస్తోంది. గబగబా బెర్తుమీదనుంచి కిందకు దిగి, కిందున్న లగేజీ చేతిలోకి తీసుకున్నాడు తేజ. పెళ్ళివారు ఒక్కొక్కరుగా ట్రైన్ దిగుతున్నారు. ఇక వేదాంతి గారూ, తేజా మిగిలారు. 


"ఆ పిల్ల జీవితం అన్యాయం కాకుండా, భగవంతుడే ఏదో ఒక దారి చూపించాలి" గొణుక్కుంటున్నట్టుగానే అన్నా… ఆయన మాటలు తేజని చాలా ఆలోచింపచేసాయి. కానీ ఎవరి సమస్యలు వారికున్నాయి. మరొకరి గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది? రేపటికల్లా జరిగింది అందరూ మర్చిపోవచ్చు. సునీలకి మాత్రం మర్చిపోడానికి చాలా కాలం పడుతుంది. 


"తప్పు చేయకపోయినా శిక్ష ఈమెకి పడింది" అని కొందరు అనుకుంటే… "ఇలాంటివి ఆ మూడుముళ్ళూ పడకముందే తెలియడం వల్ల మంచిదయ్యింది. లేకపోతే జీవితాంతం ఉండలేకా, వదల్లేకా బాధపడాల్సి వచ్చేది. ఏదేమైనా సునీల లాంటి సంస్కారం ఉన్నమ్మాయికి ఇలా జరక్కుండా ఉంటే బాగుండేది" అని కొందరు అనుకున్నారు. అక్కడున్న అందరి మనసుల్లోనూ ఏదో తెలీని భావన... భారంగా వారిని వెనుదిరిగేలా చేసింది. 

 

 ఎవరిమటుకు వాళ్ళు ఆటోలు మాట్లాడుకుని, శంఖవరానికి బయలుదేరారు. ఇంటికి చేరాక తన తల్లి నిర్మలకు జరిగినదంతా చెబుదామనుకున్నాడు తేజ. అప్పటికే ఎవరో సమాచారం చేరవేసినట్టున్నారు... ఆమె పరుగు పరుగున సుందరమ్మ ఇల్లు చేరింది. కులాలు వేరయినా, నిర్మలకీ, సుందరమ్మకి మధ్య ప్రాణమిచ్చేంత స్నేహం ఉంది. ఒకరి కష్టానికి మరొకరు కన్నీరు పెట్టుకునేంత చిక్కని స్నేహ బంధం వారిది. 

 

 ఈ పెళ్లి తర్వాత కొద్ధి రోజులు తన తల్లి దగ్గర వుండాలనుకున్న తేజ... ఆమె స్థిమితంగా లేకపోవడం గమనించాడు. ఎప్పుడు చూసినా నిర్మలకు ఆ ఇంటి ఆలోచనలే. కొడుకు చేసిన నిర్వాకానికి సుందరమ్మ నలుగుర్లోకీ రావడం మానేసింది. చుట్టుపక్కల వారితో మాట్లాడ్డం కూడా తగ్గించేసింది. నిర్మల మాత్రం కూరో, పచ్చడో ఇచ్చే వంకతో అప్పుడప్పుడూ సుందరమ్మ గారింటికి వెళ్లి వస్తూ ఉండేది. కొత్తకోడలిని మనస్ఫూర్తిగా అంగీకరించలేక సుందరమ్మ ఎక్కువ సమయం గదిలోనే గడుపుతోందని తల్లి చెబితే, విని చాలా బాధపడ్డాడు తేజ. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక, నాలుగు రోజుల తర్వాత తేజ, తిరిగి హైదరాబాద్ కి ప్రయాణమయ్యాడు. 


=========================================================

ఇంకా ఉంది

చేయి వదలకు నేస్తమా - పార్ట్ 2 త్వరలో

=========================================================


వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ

నమస్తే!

సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.

రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.


వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.

మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.

వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.

ధన్యవాదములు. 🙏🏼

ఇట్లు,

వేలూరి ప్రమీలాశర్మ.




Comments


bottom of page