చేయి వదలకు నేస్తమా - పార్ట్ 3
- Prameela Sarma Veluri
- May 1
- 6 min read
Updated: May 8
#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #CheyiVadalakuNesthama, #చేయివదలకునేస్తమా, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Cheyi Vadalaku Nesthama - Part 3 - New Telugu Web Series Written By - Veluri Prameela Sarma Published In manatelugukathalu.com On 01/05/2025
చేయి వదలకు నేస్తమా - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక
రచన: వేలూరి ప్రమీలాశర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ..
సునీల, దొరబాబుల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది. సునీల పరిస్థితికి జాలిపడతాడు తేజ. అనుకోకుండా మెట్రో ట్రైన్ లో ఆమెను చూస్తాడు. ఆమె తలపుల్లో మునిగిపోతాడు.
స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడుతేజ.
ఇక చేయి వదలకు నేస్తమా - పార్ట్ 3 చదవండి.
ఎనిమిదో ఫ్లోర్ లో లీజుకి తీసుకున్న ఆఫీస్ రూమ్స్ ని తన అభిరుచిమేరకు అందంగా తీర్చిదిద్దుతున్నాడు తేజ. టేబుల్ పైన గ్లాస్ మీదుంచిన పెన్ స్టాండ్ లో జెల్ పెన్స్ తోపాటు, ఒక రోజ్ కూడా ఉంచి, అందంగా ఉన్న ఆ పువ్వు వంక చూసి తృప్తిగా నవ్వుకున్నాడు. కిటికీలకున్న పలుచటి తెల్లటి కర్టెన్లు పక్కకి తొలగించి, అద్దం పక్కకి జరిపాడు.
చల్లని గాలి మొహాన్ని తాకింది. ఒక్కసారిగా అలసట అంతా మాయమైనట్టు అనిపించింది. దూరంగా కొండల్లోకి జారుతున్న సూరీడు, నారింజపండు రంగులో అందంగా కనిపిస్తున్నాడు. తనమీదుగా తాకుతూ వెళ్తున్న సంధ్య మబ్బుల్ని ప్రేమగా పలకరిస్తూ, విశ్రాంతి కోసం కొండల వెనుక సేద దీరుతున్నాడు. ఆ దృశ్యం మనసుకి ఎంతో హాయినివ్వడంతో కాసేపు అలాగే చూస్తూ నిల్చుండి పోయాడు.
గాలికి టేబుల్ మీదుంచిన పేపర్లు రెపరెపలాడుతుంటే ఆ చప్పుడుకి వెనక్కి తిరిగి చూసాడు తేజ. తను మెట్రో స్టేషన్లో చూసిన అమ్మాయి, గ్లాస్ డోర్ ఓపెన్ చేసి, ఛాంబర్ లోకి అడుగుపెడుతూ, ఒక్కక్షణం తటపటాయిస్తూ అక్కడే నిలబడిపోయింది. ఆశ్చర్యంతో తేజ కళ్ళు పెద్దవి అయ్యాయి. 'ఈ మె… ఇక్కడెలా?' అనుకుంటూ "యూ మే కమిన్ ప్లీజ్!" అంటూ లోనికి ఆహ్వానించాడు తేజ. మొదట ఆమెను అక్కడ అలా చూసి ఆశ్చర్యపోయినా, తర్వాత ప్రశాంత్ చెప్పిన బిజినెస్ అనలిస్ట్ ఆమేనని అర్థమయ్యింది.
"సర్! నా పేరు సుదతి. నా గురించి ప్రశాంత్ గారు చెప్పేవుంటారు. ఇవి నా క్యాలిఫికేషన్ డీటెయిల్స్" తన చేతిలోని ఫైల్లోంచి సర్టిఫికెట్స్ తీసి, టేబుల్ మీదుంచి ముందుకి జరిపింది.
"యా! ప్లీజ్ టేక్ యువర్ సీట్. మేం పెడుతున్న ఈ స్టార్టప్ కంపెనీ గురించి మీకు పూర్తి ఐడియా ఉందనే ఆనుకుంటున్నాను. మా స్టార్ట్ అప్ రన్ అవడానికి నేనూ, ప్రశాంత్ కాకుండా మరో ఇద్దరి సహకారం కావాలి. అందుకే యాడ్ ఇమ్మన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యా-భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే కానీ గడవడం కష్టం. ఇలాంటివారికి ఇంటి పనుల్లో ఆసరాగా ఉండేందుకు ఎవరో ఒకరు తోడుండాల్సిందే.
పెద్దతరం వారికీ ఓపికలు నశిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలూ ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే మనుషుల స్థానంలో పనిచేసే ఈ రోబోటిక్ మెషీన్లు. వాటినే మనం కంపానియన్ రోబోస్ అంటాం. ఈ కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు... కానీ మన దేశంలో ఇంకా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. అందుకే టెక్నీకల్ నాలెడ్జ్ ఉన్న నలుగురు కలిస్తే, వీటి ఉపయోగం నలుగురికీ అర్థమై, కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందనిపించింది." తన బిజినెస్ మోడల్ గురించి వివరంగా చెప్పాడు తేజ.
"నైస్ కాన్సెప్ట్! కాంగ్రాచ్యులేషన్స్. మనలాంటి యువత... కొత్త పోకడలకి, నూతనత్వానికి ఇది నాంది కావాలి. మీ స్టార్టప్ కంపెనీలో భాగస్వామ్యం వల్ల నా ఆశయం కూడా నెరవేరుతుందనిపించింది. నాకిలాంటి వాటిపట్ల చాలా ఇంటరెస్ట్ ఉంది. అండ్… మీలాగే, ఏదో సంపాదన కోసం ఒకరి కింద పనిచేసాం అన్నట్టుగా ఏదో ఒక జాబ్ లో జాయిన్ అవ్వడం కాకుండా, మన ఆలోచనలే మనకి పెట్టుబడి కావాలి అనుకుంటాను. అందుకే మిమ్మల్ని కలవాలని ఇంత దూరం వచ్చాను" అతనికి షేక్ హ్యాండిస్తూ, నవ్వుతూ చెప్పింది సుదతి.
మాట్లాడుతూనే అతని కనుముక్కు తీరుని ఓరకంట గమనిస్తూ, చిన్నగా నవ్వుకుంది సుదతి. వర్క్ పట్ల అతనికున్న శ్రద్ధ, మరొకరికి ఆదర్శంగా నిలవాలన్న ఆశయం, ఆమెని, అతనిపట్ల ఆకర్షితురాలయ్యేలా చేశాయి.
"గుడ్! మీలాంటివారికోసమే మేమూ చూస్తున్నాం. ఈ కమిట్మెంట్, డెడికేషన్ మన స్టార్ట్ అప్ కి చాలా అవసరం. వెరీ హ్యాపీ టు హావ్ యూ ఇన్ అవర్ టీమ్" తన అంగీకారాన్ని తెలియజేస్తూ, సుదతితో కెరీర్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు తేజ.
ఇద్దరూ మాట్లాడుకుంటుండగా, ప్రశాంత్ ఆ రూంలోకి వచ్చాడు. ఒక్క నిముషం వచ్చిన పని మర్చిపోయి, రెప్ప వెయ్యకుండా ఆమెనే చూస్తూ నిల్చుండిపోయాడు.
హై హీల్స్ వేసుకున్న నున్నటి పిక్కలపైకి సగం కవర్ చేసేలా వేసుకున్న మిడ్డీ… కాంట్రస్ట్ కలర్ టీ షర్ట్ టక్ చేసి, పై బటను వదిలేసింది సుదతి. భుజాలమీదుగా పడుతున్న జుత్తుని, మాటిమాటికీ వెనక్కి తోస్తూ, ఎడమ చేతికి ఉన్న బ్రేస్ లెట్ నుంచి వేలాడుతున్న చెయిన్ ను సవరించుకుంటోంది.
హార్ట్ షేప్ లాకెట్ తో ఉన్న సన్నని గోల్డ్ చెయిన్, పసిమి రంగులో ఉన్న మెడపై మెరుస్తూ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.
తాము పెడుతున్న స్టార్ట్ అప్ కోసం డిజైన్ చేస్తున్న కంపానియన్ రోబోల పని తీరుపై ఆమెకున్న ఆసక్తిని గమనిస్తున్నాడు ప్రశాంత్. స్ట్రాంగ్ ఒపీనియన్స్ తో ఉన్న ఆమెను కూడా ఈ స్టార్ట్ అప్ లో భాగస్వామిని చేస్తే ఆమె సూచనలు తమకు చాలా ఉపయోగిస్తాయనిపించింది.
రోబోల డిజైనింగ్ గురించి ఒక్కొక్క విషయం ఆసక్తిగా అడిగి తెలుసుకుంటోంది సుదతి. ఒకసారి ప్రోగ్రామింగ్ చేసిన ఈ రోబోల లైఫ్ టైమ్ ఎంతకాలం ఉంటుంది? వాటి కొనుగోలూ, నిర్వహణకు అయ్యే ఖర్చు గురించి అడిగి తెలుసు కుంటోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలలో కూడా మరొకరిపై ఆధారపడితే తప్ప, సొంతంగా పనులు చేసుకోలేనివారి కోసం ఈ రోబోలు ఉపయోగపడతాయని ఆమెకు విశ్వాసం కలిగింది.
ఇకపై అర్దర్లు తీసుకువచ్చే బాధ్యత తాను చూసుకుంటాననీ… వీటి తయారీలో కృషిచేస్తున్న తేజా, ప్రశాంత్ లకు మంచి కెరీర్ ఉంటుందనీ, ఇద్దరికీ అభినందనలు తెలిపింది.
ఆమెతో మాట్లాడుతుంటే సమయమే తెలియడంలేదు అనుకున్నాడు ప్రశాంత్. సాయంత్రం వరకూ ముగ్గురూ ప్రాజెక్ట్ విషయాలు డిస్కస్ చేస్తూ కూచున్నారు.
"తేజా! బాగా లేటయిపోయింది. రేపు మాట్లాడుకుంటే మంచిది. ఈరోజుకిక ఆఫీస్ క్లోజ్ చేద్దామా?" పాకెట్ లోంచి కార్ కీస్ బయటకుతీసి, సుదతిని డ్రాప్ చెయ్యడానికి సిద్ధమవుతూ అన్నాడు ప్రశాంత్.
"ఇట్స్ ఓకే సుదతి గారూ! రేపు కలుద్దాం. మరోసారి ముగ్గురం కూచుని, బిజినెస్ మోడల్ గురించి డీప్ గా డిస్కస్ చేసుకుంటే మంచిదనిపిస్తోంది. రోబో డిజైనర్ గా ప్రశాంత్, ప్రోగ్రామింగ్ నేనూ, సేల్స్ డేటా మీరూ చూసుకోవచ్చు. కానీ..." చెప్పడానికి సంశయిస్తూ ఆగాడు తేజ.
"చెప్పండి తేజ గారూ! నా ఎఫీషియెన్సీ మీద ఏదైనా సందేహమా? ఎం.బీ.ఏ చేశాక ఇదే మొదటిసారి వర్క్ టేక్ అప్ చెయ్యడం అని ఆలోచిస్తున్నారా?" కొంచెం గాభరాగా అడిగింది సుదతి.
"నో... నో! అదేం లేదు. మన ముగ్గురితోపాటు మరొకరి అవసరం కూడా ఉంటుంది. అది కూడా లేడీ ఎవరైనా అయితే శ్రద్ధగా చూస్తారని" ఆమె ముఖంలో భావాలను గమనిస్తూ అడిగాడు తేజ.
"ఓహ్! ఇంకేదో అనుకున్నాను. యాక్చువల్లీ మా సిస్టర్ సునీల కూడా బీటెక్ చేసింది. కానీ తనకెందుకో ఇటువైపు రావడానికి ఇంటరెస్ట్ లేదు. మరోసారి అడిగి చూస్తాను. అందరం కలిసి కూచుని మాట్లాడుకుందాం" అంటూ సెలవు తీస్కుని బయటకు నడిచింది.
లిఫ్ట్ లో ఆమెతోపాటే దిగిన ప్రశాంత్, నేరుగా పార్కింగ్ స్లాట్ వైపు నడుస్తూ, ఆమెని కూడా డ్రాప్ చేస్తాను... రమ్మని ఆఫర్ చేసాడు. సున్నితంగా తిరస్కరించిన సుదతి, తన టూ వీలర్ ని ముందుకి దూకించింది. వీధి మలుపు తిరిగేవరకూ, ఆమె వెళ్లిన వైపే చూస్తూ నిల్చుండిపోయిన ప్రశాంత్…
'వెరీ షార్ప్' అనుకుంటూ మనసులోనే నవ్వుకున్నాడు.
******** ******** ********
శివరాత్రి వెళ్లడంతోనే చలి మాయమైపోయి ఎండలు మొదలయ్యాయి. ఉదయం ఎనిమిదియ్యేసరికే సూర్యుడు చుర్రుమనేలా కంట్లో గుచ్చుకుంటున్నాడు. ఇంటిపనీ, వంటపనీ పూర్తిచేసుకుని కాస్తంత విరామం దొరకడంతో ముందుగదిలోకి వచ్చి కూచుంది నిర్మల. బాగా పొద్దెక్కి సూర్యుడు నడి నెత్తికి చేరుతున్నవేళ గుమ్మం ముందు ఎవరో వచ్చి ఆగిన అలికిడికి తలెత్తి చూసింది. కర్చీఫ్ తో చెమటలు తుడుచుకుంటూ లోనికి వస్తూ కనిపించాడు గోపీకృష్ణ.
"రా అన్నయ్యా! ఏవిటీ ఇంత సడన్ గా వచ్చావు? ముందుగా చెప్పివుంటే నీక్కూడా వంటచేసి ఉంచేదాన్ని కదా! ఇంట్లో అందరూ కులాసాయేనా?" దబ్బాకు వేసి నానబెట్టిన చల్లని మజ్జిగ చేతికి అందిస్తూ అడిగింది నిర్మల.
"అంతా బాగానే ఉన్నామమ్మా! ఊర్లో కాస్త పనిపడి ఇలా వచ్చాను. ఎలాగూ వచ్చాను కదాని, మనసూరుకోక నిన్ను ఓసారి చూసిపోదామని ఓ అడుగు ఇటు వేసాను అంతే. చాలా చిక్కిపోయావు నిర్మలా! ఒక్కదానివీ ఇలా ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే, మాతోపాటు కాకినాడలో ఉండొచ్చు కదా.
మీ వదినకి కూడా కాస్త సాయం ఉన్నట్టుగా ఉంటుంది. నీకూ వయసు మీద పడుతోంది. ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ వయసులో ఎవరో ఒకరి ఆసరా ఉండడం మంచిది" మజ్జిగ తాగాక, ఖాళీ గ్లాసును వెదురు మోడా మీదుంచుతూ అన్నాడు గోపీకృష్ణ.
"ఈ ఊరూ… ఈ వాతావరణం, ఇక్కడి మనుషులూ అలవాటైపోయింది అన్నయ్యా! పుట్టిపెరిగిన ఊరు విడిచి నేనెక్కడికీ రాలేను. తెల్లారి తలుపుతీస్తే అందరూ కనిపిస్తారు. జరుగుబాటుకి లోటేమీ లేదు కదా! పైగా తేజా కూడా నెలకోసారి వచ్చి, నాలుగు రోజులు ఉండి వెళుతున్నాడు. ఇంక నాకు బెంగ దేనికి చెప్పు?" నెమలి అంచుల విలసవల్లి చీరను భుజాలమీదుగా తిప్పి కప్పుకుని... లేత గులాబీ, తెలుపూ రంగుల లేసు దారాలను, సూదులమీదుగా వేగంగా చేతి వేళ్ళతో ముళ్ళు వేస్తూ చెప్పింది నిర్మల.
స్తంభానికి జారిపడి కూచుని, నిశ్చింతగా రోజులు వెళ్లదీస్తున్న చెల్లెల్ని చూసి, ఓ పక్క సంతోషంగానే ఉన్నా… పెరుగుతున్న వయసూ, తరుగుతున్న ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ మాటలన్నాడు గోపీకృష్ణ. ఒంటరితనం శాపమే అయినా, కష్టాన్ని కూడా నవ్వుతూ స్వీకరించే చెల్లెలి మనస్తత్వానికి కొంచెం ధైర్యంగానే ఉన్నా, రోజులు గడుస్తున్నకొద్దీ అలా ఒక్కదాన్నీ ఉండనివ్వడం అంత మంచిది కాదనిపించింది గోపీకృష్ణకి.
"సరే నీ ఇష్టం! పోనీ సురభి వచ్చి ఓ నెలరోజులు నీ దగ్గర ఉంటుంది. ఇంటిపనీ, వంటపనీ కాస్త అలవాటవుతుంది. రేపెలాగూ ఈ ఇంటి కోడలిగా రావాల్సిన పిల్లే కదా! దానికీ కాస్త ఈ ఇంటి పద్ధతులు అలవాటవుతాయి" తన మనసులోని ఉద్దేశాన్ని చూచాయగా బయటపెడుతూనే, ఆ యింటి కోడలైతే, తన బిడ్డ సంతోషంగా వుండగలదన్న ఆశతో అన్నాడు గోపీకృష్ణ.
"ఇప్పుడా మాటలన్నీ ఎందుకన్నయ్యా? పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా మనమొక నిర్ణయానికి రావడం మంచిది కాదేమో... ఆ దొరబాబు ఏం చేసాడో చూసావు కదా! ఈ కాలం పిల్లలకి పెద్దవాళ్ల అభిప్రాయాలతో పని లేకుండా పోతోంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకే తెలీదు" యధాలాపంగా అన్నట్టుగానే అన్నా, పిల్లల ప్రవర్తనను ఓకంట కనిపెట్టి, పెద్దవాళ్ళు తమ గౌరవం నిలబెట్టుకోవడం మంచిదన్న ఉద్దేశ్యంతో ఆ మాటలంది నిర్మల.
"తేజని కన్నది నువ్వే అయినా, వాడిని పెంచింది నేనే నిర్మలా! అనవసరంగా అలాంటి భయాలు పెట్టుకోకు. వాడి అభిరుచులన్నీ నాకు తెలుసు… ఒకవేళ తన మనసుకి నచ్చిన అమ్మాయిని ఎవరినైనా పెళ్లి చేసుకుంటానన్నా నేనేమీ అభ్యంతరం చెప్పను. ఎందుకంటే పిల్లల జీవితాలపై నిర్ణయం తీసుకుని శాసించే హక్కు మనకి లేదు. వారిని బాధ్యతగా పెంచడం వరకే… అలా అయితేనే మన పెద్దరికం నిలబడుతుంది.
కాకపోతే ఆడపిల్ల తండ్రిగా ఎక్కడో చిన్న ఆశ… అంతే! పైగా సురభికి కూడా తేజ అంటే చాలా ఇష్టం. అందుకే అలా అన్నాను. సరే లేటవుతోంది. నాకోసం మీ వదిన ఎదురుచూస్తూంటుంది. నేనిక బయలుదేరతాను. మరోసారి మళ్లీ వస్తాను" అంటూ కాకినాడకు తిరుగు ప్రయాణమయ్యాడు గోపీకృష్ణ.
=========================================================
ఇంకా ఉంది
=========================================================
వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ
నమస్తే!
సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.
రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.
వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.
మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.
వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.
ధన్యవాదములు. 🙏🏼
ఇట్లు,
వేలూరి ప్రమీలాశర్మ.
Comentários