top of page
Original.png

దాయాది దేశ దారుణం

#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #DayadiDesaDarunam, #దాయాదిదేశదారుణం, ##TeluguArticleOnTerrorism

ree

Dayadi Desa Darunam - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 30/04/2025

దాయాది దేశ దారుణం - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


పహిల్గామ్ లో ఇటీవల జరిగిన దారుణ మారణ హోమం అత్యంత భయానకమైన, క్రూరమైన, మాటలకు అందని అమానవీయ చర్య. తీవ్రవాదాన్ని కట్టడి చేసే పోలీసులు, పాలకులు, సాయుధ భద్రతా సిబ్బందిని కాకుండా 26 మంది అమాయక పర్యాటకులను గురి పెట్టి పొట్టన పెట్టుకున్న ఘటనతో కాశ్మీర్ లోయ ఆసాంతం భద్రతా వలయంలో ఇరుక్కు పోయింది. కాశ్మీర్ ప్రయాణానికి బయలుదేరాలనుకున్న పర్యాటకుల రైలు మరియు ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్ లు రద్దైపోయాయి. కాశ్మీర్లో మకాం చేసిన పర్యాటకులు కాశ్మీర్ నుంచి తిరుగు ప్రయాణపు ఏర్పాట్లు చూస్తుంటే అత్యంత బాధాకరంగా ఉందని అక్కడ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాశ్మీర్‌ లోయలో స్వచ్ఛందంగా ఒకరోజు పూర్తి బంద్‌ పాటించారు. పర్యాటకులపై దాడికి పాల్పడటం ద్వారా తీవ్రవాదులు కశ్మీరీల ఆర్థిక మూలాల్ని చిదిమేసే ప్రయత్నం చేశారని నిరసనలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు వాపోయారు. కశ్మీర్‌ అందాలను ఆస్వాదించడానికి వచ్చిన మా సోదరుల్ని దారుణంగా కాల్చి చంపిన ముష్కరులు మా ఉపాధి మార్గాలను మూసివేసినందుకు చేసిన ప్రయత్నం. ప్రతి కశ్మీరీ ఈ దాడిపట్ల మౌన వేదన అనుభవిస్తున్నామని ఒక స్థానిక వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. 


నేపథ్యం: 

అసలు ఏమిటీ మారణ హోమం ? జరిపింది ఎవరు ? జరిపించింది ఎవరు ? గుర్తింపు కార్డు చూసి ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం వెనుక నేపథ్యం ఏమిటి ? ఉగ్రవాద ప్రేరేపిత దాడి ద్వారా పొరుగు దేశ ప్రధాన లక్ష్యం కాశ్మీర్లో అతి ముఖ్యమైన పర్యాటక రంగాన్ని దెబ్బతీసి, భారతదేశానికి కాశ్మీర్ కి మధ్య సాఫీగా కొనసాగుతున్న సంబంధ బాంధవ్యాలను విడదీయాలి. ఆర్టికల్ 370 రద్దయ్యి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయన్న భారత ప్రభుత్వ ప్రకటన తప్పు అని ప్రపంచానికి సంకేతాలు పంపాలి. కాశ్మీర్లో శాంతిభద్రతల సమస్య సమసి పోలేదని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పాలి. అంతేకాక అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ భిక్షాందేహి అంటూ అప్పుల కోసం దేశాలు పట్టి తిరుగుతున్న పాకిస్తాన్ పాలకుల అసమర్థతపై ప్రజల దృష్టిని మరల్చి, భారత్ పై వ్యతిరేకతను పెంచి లబ్ధి పొందాలి. కాశ్మీర్ ను ఎలాగూ తిరిగి పొందలేము కానీ అక్కడ రక్తపాతాన్ని సృష్టించి అల్లకల్లోలం చేయాలన్న పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేర్ మాటల్ని భారతదేశ ప్రజలు మరువలేరు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కాశ్మీర్ మా జీవనాడి అని ప్రకటించడం వెనుక అంతరార్ధాన్ని గ్రహించాలి. భారత్ కి పాకిస్తాన్ కి మధ్య కాశ్మీర్ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉందన్న భావాన్ని కలిగించి, ఇరు దేశాల్లో ఈ వివాదాన్ని శాశ్వతంగా రగిలిస్తూనే ఉంచాలనే మతఛాందస ఉన్మాద శక్తుల కుతంత్రాన్ని గ్రహించలేనంత అమాయకులు కారు భారతీయులు. 


పర్యవసానాలు:

కాశ్మీర్లో ఉగ్రవాద కట్టడి జరిగి పెట్టుబడులు, పర్యాటకులు పెరిగి ఆర్థిక వ్యవస్థ బాగుపడితే అది పాకిస్తాన్ పాలకులకు ఏ మాత్రం మింగుడుపడని వ్యవహారం. అక్కడ అల్లకల్లోలాన్ని సృష్టిస్తూనే వారి అభిమతం. కానీ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తిచేసుకొని ప్రజా ప్రభుత్వ ఏర్పాటు ప్రభావంతో కాశ్మీర్ లో పర్యాటక ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఆ విధంగా ఉపాధి పొందుతున్న కాశ్మీరి ప్రజల జీవన ప్రమాణాలును దెబ్బతీసి వారిలో అసంతృప్తి, అభద్రతా భావాన్ని పెంచి పోషించాలనే ఉద్దేశంతో ఇటువంటి కుటిల ప్రయత్నాలను మొదలు పెట్టింది దాయాది దేశం. తద్వారా స్థానికులలో ఉగ్రవాదాన్ని నూరిపోసి రావణ కాష్టాన్ని కాలుస్తూనే ఉంచి జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా రానివ్వకుండా ప్రతికూల పరిస్థితులను సృష్టించాలని వారి ఉద్దేశ్యం. రెండవది హిందువుల చారిత్రాత్మక పుణ్య స్థలమైన అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీ నుంచి మొదలౌతుంది. అత్యంత సుందరమైన దృశ్యాలతో లోయలతో కూడిన ఈ యాత్రకు వెళ్లే రెండు ముఖ్యమైన దారుల్లో ఒకటి ఎత్తుపల్లాలతో, ఇరుకుదారులతో, క్లిష్టతరమైన బాల్టాల్ మార్గమయితే మరొకటి కాస్త దూరమైనా సులభతరమైనది, అధికంగా వాడబడుతున్నది పహల్గామ్ మార్గం. అంతే కాకుండా కాశ్మీర్ కి వెళ్ళాలనుకునే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పహల్గామ్ ఒకటి. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు ముష్కరులు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 533 బ్యాంకుల్లో సుమారు రెండు లక్షల మందికి పైగా అమర్నాథ్ యాత్రకు నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య ఆరు లక్షల మేరకు భారీగా పెరగనుందని అంచనా. ఈ నేపథ్యంలో యాత్రికులలో భయాందోళనలు సృష్టించి సదరు యాత్రను విఫలం చేయాలనే ఉగ్రవాద సంస్థల కుట్ర కూడా ఈ సంఘటనతో మనకు తేటతెల్లమవుతోంది. 


దుష్ట పన్నాగం: 

భారత దేశంలో హిందూ ముస్లింల మధ్య విభేదాలు, ఘర్షణ వాతావరణం సృష్టించి మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలలో భాగంగా కూడా సదరు తీవ్రవాదులు ఈ దుర్ఘటనకు పాల్పడి ఉండవచ్చని భావించవచ్చు. తమ దేశంలో పరిస్థితులను చక్కబెట్టుకోలేక, మరోవైపు ఆఫ్గనిస్తాన్ తీవ్రవాద సంస్థలు, బలూచిస్తాన్ యుద్ధమేఘాలతో సతమతమవుతున్న పాకిస్థాన్ పాలకులకు పొరుగు దేశంలో భాగమైన కాశ్మీర్ లోయలో నెలకొంటున్న ప్రశాంత వాతావరణం కన్ను కుట్టడం సహజమే. తనకు ఒక కన్ను పోతే పొరుగు వాడికి రెండు కళ్ళు పోవాలని కోరుకోవడం వారి దుష్ట స్వభావానికి సంకేతం. రాజకీయ ఉగ్రవాదాన్ని పొరుగు దేశంపై ప్రేరేపించడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు వారు. అందులో భాగంగానే ఒక్కొక్కరి మతపరమైన గుర్తింపును పరిశీలించి చంపడాన్ని గమనిస్తే ఇరు వర్గాల మధ్య నిప్పురాజేయడం వారి ఉద్దేశంగా గ్రహించవచ్చు. కాపాడమని అర్థించిన వారిని వెళ్లి మీ ప్రధానితో మొరపెట్టుకోండి అని గద్దించడం వెనుక రాజకీయ ఉగ్రవాదం ఇమిడి ఉంది. మత ఉన్మాదాలను ప్రేరేపించడం, సమాజంలో మత విభజనలను పెంచడం, తద్వారా మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోయడమే ఈ భయానకమైన చర్య యొక్క లక్ష్యం. మనదేశంలో హిందువులు ఇప్పటికే దీనిని ఒక ఇస్లామిక్ తీవ్రవాద చర్యగా పరిగణించి అట్టుడికి పోతున్నారు. ఈ ఘటనని తదనగుణంగా చిత్రీకరిస్తూ మతపరమైన ద్వేషాన్ని సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే అసాంఘిక శక్తులు హింసను ప్రేరేపించే అవకాశం ఉంది. పొరుగు దేశం కోరుకుంటున్నది కూడా ఇదే కాబట్టి వారి మాయలో పడకుండా మనం సంయమనం పాటించాలి. 


దోషులపై కఠిన చర్యలు: 

ప్రత్యక్ష యుద్ధంలో నిలబడలేక తలవంచిన పాకిస్తాన్ ప్రభుత్వం ఇలాంటి తప్పుడు మార్గాల ద్వారా భారత సమాజాన్ని విభజించి మతసామరస్యాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తునే ఉంది. ఒకదాని వెంట మరొక హింసాకాండను ప్రోత్సహిస్తూ తమ దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలను మన దేశ శాంతి భద్రతలను దెబ్బతీయడానికి వాడుకోవడం దారుణం. ఈ ఘటనకు పాకిస్తాన్ చెందిన లష్కరేతోయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) బాధ్యత వహించింది.‌ సూత్రధారిగా వ్యవహరించిన సైఫుల్లా కసూరి లష్కరేతోయిబాకు సీనియర్ కమాండర్. ఇటువంటి వారికి ఆర్థిక సహాయం చేయడమే కాక తగిన వనరులను కూడా సమకూర్చుతూ మనపై ఉసిగొలుపుతోంది దాయాది దేశం. ఈ కుటిల యత్నాలను తిప్పి కొట్టి కులమత బేధాలతో సంబంధం లేకుండా భారత పౌరులందరూ సమిష్టిగా పహల్గామ్‌లో జరిగిన పిరికి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించడం సంతోషకరం. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, నిఘా వ్యవస్థను మెరుగుపరచుకోవడం, ప్రపంచ దేశాల సహాయ సహకారాలతో ఉగ్రవాదాన్ని రూపుమాపడం వంటి బహుళ విధానాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగాలి. వాఘా బార్డర్, అటారి బార్డర్ లను మూసివేసి పాకిస్తానీయులకు ప్రవేశం రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదుల కోసం తీవ్రమైన వేట మొదలుపెట్టి అణువణువు జల్లెడ పడుతోంది. పాక్ జాతీయులు భారత దేశం వీడి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేయడమే కాక, పాకిస్తాన్ కు షాక్ ఇచ్చే విధంగా భారత ప్రభుత్వం తీసుకున్న సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయం కుక్క కాటుకి చెప్పు దెబ్బ లాంటిదే. పాకిస్థానీ తీవ్రవాదులు ఇండియా దెబ్బకు భయపడి బంకర్లలో తలదాచుకుంటున్నారు అన్న వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం.


పౌర సమాజ సంఘీభావం:

ఈ ఉగ్రవాద చర్యకు ప్రతి చర్యగా కాశ్మీర్ పర్యటనను బాయ్ కాట్ చేయాలని, కాశ్మీరీల ఉపాధిని దెబ్బతీయాలని, అమర్నాథ్ యాత్రను మూడు నాలుగు సంవత్సరాలు వాయిదా వేసుకోవాలన్న తప్పుడు సలహాలతో సోషల్ మీడియాలో సందేశాలు చక్కర్లు కొట్టడం విచారకరం. ఇటువంటి పాక్ ప్రేరేపిత ఎత్తుగడలకు మనం లొంగకుండా, భూతల స్వర్గంగా పేరుగాంచిన సుందర కాశ్మీరం మన దేశంలో అంతర్భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అక్కడ పర్యాటక వాతావరణం త్వరలోనే మెరుగుపడాలని ప్రశాంత పరిస్థితులు నెలకొనాలని కోరుకోవాలి. త్వరలో ఉగ్ర ఘటనకు కారణమైన సూత్రధారులు పాత్రధారులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునే వరకు విశ్రమించదు. ప్రత్యక్ష యుద్దమా, మరొకటా అనే అంశాలపై మన స్థాయిలో చర్చ మానుకొని సాయుధ దళాలు, ప్రభుత్వం సరైన సమయంలో సరైన కార్యాచరణ చేపట్టగలరన్న విశ్వాసంతో వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ అందరం ఐక్యంగా ఉన్నామనే సంకేతాన్ని ఇవ్వాలి. అంతేగాని ఎవరూ ఆవేశకావేశకాలకు లోనై అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకూడదు. నేర్పరులైన మన నిఘా సంస్థలు, భద్రతాదళాలు, ఉగ్రవాద హంతకులను వెతికి వెతికి వేటాడడం ఖాయం. అంతటితో సరి పెట్టుకోకుండా అసలు సూత్రధారుల కూపీ లాగి అంతర్జాతీయ స్థాయిలో వారిని దోషులుగా నిలబెట్టగల సమర్ధులు మన పాలకులు. మన వంతుగా ఈ దుఃఖ సమయంలో మృతులకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాల కోసం దీవెనలు మరియు ప్రార్థనలు కొనసాగించాలి. భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలొంచదు, పొరుగు దేశానికి తగిన గుణపాఠం నేర్పడడంలో వెనుకాడదు అని నిరూపించగలగాలి. 


ధన్యవాదాలు 


ఆర్ సి కుమార్

సామాజిక వేత్త


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page