పల్లె పిలిచింది - 3
- T. V. L. Gayathri 
- Apr 30
- 1 min read
Updated: May 3
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందం, #అంబురుహము, #ధృతవిలంబితము, #దోదకము #కావ్యము

Palle Pilichindi - 3 - New Telugu Poem Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 30/04/2025
పల్లె పిలిచింది - 3 - తెలుగు కవిత ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
పల్లె పిలిచింది 3
(స్వతంత్ర కావ్యము )
ప్రథమాశ్వాసము
******************************
11.
అంబురుహము.
భ,భ, భ, భ, ర, స వ.
యతి -13 వ అక్షరము.
పల్లెకు నుత్తర దిక్కున నిల్చెను పర్వతంబట ఠీవిగన్
జిల్లను నల్లని మబ్బులు కప్పగ జీవజాలము వర్థిలన్
జల్లని వాయువు లెల్లెడ వీచగ శైలమందున సాలముల్
వల్లెయటంచును సంతస మొందుచు పల్లవించెను హాయిగన్.//
తాత్పర్యము.
ఆ గ్రామమునకు ఉత్తర దిక్కుగా ఒక పర్వతము ఉంది. ఆ పర్వతము మీద నల్లటి మేఘాలు కప్పుకొని ఉన్నాయి. ఎన్నో జీవులు ఆ పర్వతము మీద నివాసము ఉంటున్నాయి.చల్లని గాలులు వీస్తూ ఉంటే ఆ పర్వతము మీది చెట్లు సంతోషంగా చివర్లు వేస్తూ ఉన్నాయి.//
12.
ధృతవిలంబితము.
న, భ, భ, ర.
యతి -7
తలలనూపుచు దంతిసమూహముల్
బిలములందున వృష్ణిమృగంబులున్
పులులు శూకరముల్ బహు శక్తిగన్
చెలగు చుండును చిందులు వేయుచున్ //
తాత్పర్యము.
ఆ పర్వత గుహల్లో ఎన్నో జంతువులు చిందులు వేయుచు హాయిగా నివాసముంటున్నాయి.//
13.
కందము.
ఆ గిరి సానువు లందున
భోగించుచు తిరుగుచుంద్రు పొలుపుగ దివిజుల్
యోగాభ్యాసాసక్తుల్
సాగిలి పడి జప తపములు సల్పుదురు మునుల్.//
తాత్పర్యము.
ఆ పర్వత ప్రాంతమందు దేవతలు సంతోషంతో తిరుగుతూ ఉంటారు. మునులు, సిద్ధులు అక్కడ తపస్సులు చేసుకుంటూ ఉంటారు.//
14.
దోదకము.
భ, భ, భ, గగ.
యతి -7.
ఖ్యాతిని నిల్పెడి గ్రామపు సీమన్
భాతిగ నిల్చిన పర్వత మాయెన్
ధాతువు లెల్లెడ దర్శనమీయన్
జాతికి కల్గెను సంపద లెల్లన్ .//
తాత్పర్యము.
ఆ పర్వతపు కీర్తి చాలా గొప్పది. ఆ పర్వతము నందు ఎంతో ఖనిజసంపద ఉంది. ఆ పర్వతము వలన జాతికి ఎంతో సంపద లభిస్తూ ఉంది.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:



Comments