top of page

పల్లె పిలిచింది - 4

Updated: May 7

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందం, #అశ్వలలిత, #అశ్వగతి, #కావ్యము

Palle Pilichindi - 4 - New Telugu Poem Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 03/05/2025

పల్లె పిలిచింది - 4 - తెలుగు కవిత ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


 15.

కందం.


జలజల మను నాదముతో 

కులుకుచు గోదావరియట కొండలనడుమన్ 

కలిమిని కురిపించి సతము 

పలుసీమల నుద్ధరించి పరుగిడుచుండెన్//


తాత్పర్యము.


జలజలా అను శబ్దం చేస్తూ గోదావరీ నది ఆ కొండల నడుమ పారుతూ ఉంటుంది. చాలా ప్రాంతానికి సంపదల నిస్తూ పరుగుతీస్తూ ఉంటుంది.//



16.

అశ్వలలిత.

న, జ, భ,జ, భ, జ, భ, వ.

యతి -13.



బిరబిర పర్వులెత్తు ఘన సింధు వేగము మనోజ్ఞమౌ కులుకుతో 

తరగలు పొంగులెత్తు తమ రాగ తాళపు విభావరీ సుధలతో 

గిరగిర మీనముల్ మిడియు ఖంబు ఖేచరుల భంగి కేళిగ సదా 

వరముల నిచ్చు గౌతమి  జయంబు పల్కును జగంబుకై సుడులతో //


తాత్పర్యము.


ఆ గోదావరి అలలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఆ తరంగాల సవ్వడి తాళ రాగ గతులతో  మధురంగా సాగుతోంది. ఆ నదిలో చేపలు గరగిర తిరుగుతూ ఉంటాయి. ఆ నది సుళ్ళు తిరుగుతూ దేశానికి వరములిస్తూ జయనాదం చేస్తూ వెళుతోంది.//


17.

కందము 


జాలరు లెల్లరు ముదముగ

వీలుగ మీనముల బట్టి విభవము పొందన్ 

శ్రీలట పొంగగ సతతము 

జాలెత్తి నుఱుకును గంగ సత్వము నిడుచున్.//


ఆ నదిలో చేపలు పట్టి జాలరులు సంపదను పొందుతూ ఉంటారు. అక్కడ భూమికి శక్తి నిస్తూ ఆ నదీమతల్లి పరుగిడుతూ ఉంది.//


18.

అశ్వగతి 

భ, భ, భ, భ, భ, గ.

యతి -10.


తీరమునందున పల్లెలు దిక్కని కొల్వగ సం

సారము లెల్లను పొందగ సంపదలన్ ద్వరగా 

చేరగ సాగరు కౌగిట శ్రీనిధి గౌతమి తాన్ 

నీరమొసంగుచు పాఱును నిశ్చలమౌ గతిలో //


తాత్పర్యము.


ఆ నదీ తీరంలో ఉండే పల్లెలు ఆ నదియే తమకు దిక్కని కొలుస్తూ ఉండగా, భూమికి సంపదలిడుచు వెళ్లి సముద్రములో కలిసి పోవటానికి గౌతమి నిశ్చలంగా పారుతూ ఉంటుంది.//


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page