పల్లె పిలిచింది - 1
- T. V. L. Gayathri
- 6 days ago
- 2 min read
Updated: 3 days ago
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #సీసం, #తేటగీతి, #కావ్యము

Palle Pilichindi - 1 - New Telugu Poem Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 25/04/2025
పల్లె పిలిచింది - 1 - తెలుగు కవిత ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
పల్లె పిలిచింది.
(స్వతంత్ర కావ్యము )
ప్రథమాశ్వాసము
******************************
1.
సీసం.
ఆంధ్రదేశంబున కన్నపూర్ణగ వెల్గె
రాజుపాలెంబను గ్రామమొకటి
యారుకాలంబుల నాయూరి రైతులు
జాతికై శ్రమియించ సమధికముగ
పాడిపంటలు పొంగ పశుగణంబులు పొర్ల
పసిడి రాశులు నిండ పల్లె మురిసె
కలిమితో గృహములు కళకళలాడంగ
నూరిలోన జరుగు నుత్సవములు //
తేటగీతి.
సజ్జనాత్ములై నచ్చోటి జనులు కలసి
భవ్యమైనట్టి ప్రగతికి బాటవేయ
సకల మౌ వృత్తులఁ జనులు జయముఁ బొంద
కళలకాణాచిగా నూరు ఖ్యాతి బడసె.//
తాత్పర్యము.
ఆంధ్రదేశంలో రాజుపాలెము అనే ఊరు ఉంది. ఆ ఊరిలో చక్కగా పంటలు పండుతాయి. పాడిపంటలతో, పశుసంపదతో ఆ ఊరు కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఊరిలోని ప్రజలందరూ చాలా మంచివాళ్ళు. కష్టపడే మనస్తత్వం కలవాళ్లు. వారి వారి కులవృత్తులు చేసుకుంటూ ఆ ఊరి ప్రజలు దేశప్రగతికి తోడ్పడుతుంటారు. సకల కళలకు కాణాచిగా ఆ గ్రామము ప్రసిద్ధిపొందింది.//
2.
సీసం.
ఎడ్లపందాలలో నెదురన్నది కనని
కోడెగిత్తల జోరు గుబ్బతిల్ల
కబడీ కబడియని గంతులు వైచుచు
యువత చెల్గెదరు తా ముద్యమించి
బిళ్ళగోడులనాడి పిల్లవాండ్రు సతము
విస్మరింతు రహహ!వేళలెపుడు!
కోలాటములు వేయు కుఱ్ఱకారును గాంచి
పెద్దలు దీవింత్రు ప్రీతిమీర //
తేటగీతి.
రచ్చబండను జేరిన ప్రాజ్ఞులచట
మంచి చెడ్డలన్ వీక్షించి మానితముగ
తగిన సలహాల నందించి దారిచూప
ప్రభుతనడుపుదురా గ్రామ పాలకతతి//
తాత్పర్యము.
పెద్దవాళ్ళు ఎడ్ల పందాలు, కోలాటం ఆడుతూ ఉంటే, పిల్లలు కబడీ, బిళ్ళగోడులాంటి ఆటలు ఆడుతుంటారు. ఆ పిల్లల్ని చూచి పెద్దవాళ్ళు కుర్రవాళ్ళను ముద్దుగా దీవిస్తూ ఉంటారు. ఆ ఊరి రచ్చబండను చేరి పెద్దవాళ్ళు గ్రామ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు చర్చిస్తూ, చక్కగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు.//
3.
తేటగీతి.
కలిమితో విలసిల్లెడి గ్రామమందు
వేదవిద్యల నేర్పెడి విబుధవరులు
గురుకులంబులు నడుపంగ కూర్మితోడ
చదువుకొనుచుందు రా యూరి ఛాత్రులెపుడు.//
ఆ ఊరిలో అందరూ ధనవంతులే. గురుకులాన్ని నడుపుతూ అక్కడి పండితులు పిల్లలకు వేదవిద్యలు నేర్పిస్తూ ఉంటే అక్కడి విద్యార్థులు శ్రద్ధగా చదువుకొంటూ ఉంటారు.//
4.
తోవకము.
న, జ జ, య.
యతి -8.
వణిజులు సల్పగ వర్తక మెల్లన్
ఘనమగు సంపద గ్రామము గాంచెన్
ధనకనకంబులు దండిగ రాగా
జనులట పొందిరి శాంతిశుభంబుల్.//
తాత్పర్యము.
ఆ గ్రామము నందు ఉన్న వర్తకులు చక్కగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలా ఆ సంపన్న గ్రామములోని జనులు శాంతి,శుభాలతో విలసిల్లారు.//
5.
కందం.
అరుగులు కల గేహములట
నిరతముదానములుసల్పునియతిసుశీలుర్
పురుషోత్తములు కలరచట
మరియాదనుజూపుచుండిమసలెడి వారల్.//
తాత్పర్యము.
ఆ గ్రామములో ప్రతి ఇంటికి పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి. ఆ ఊరి ప్రజలు దానశీలురు. వారంతా చాలా మర్యాదస్తులు.మంచివాళ్ళు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments