పల్లె పిలిచింది - 2
- T. V. L. Gayathri
- Apr 28
- 2 min read
Updated: Apr 30
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందం, #ధ్రువకోకిల, #కావ్యము

Palle Pilichindi - 2 - New Telugu Poem Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 25/04/2025
పల్లె పిలిచింది - 2 - తెలుగు కవిత ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
పల్లె పిలిచింది 2
(స్వతంత్ర కావ్యము )
ప్రథమాశ్వాసము
******************************
6.
కందం.
త్రావగ మంచి జలము లిడు
బావులు కుంటలు చెరువట వరలగ పల్లెన్
జీవము నిడగా స్వచ్ఛపు
వీవలి నూళలను వేసి వీవెన వీచున్.//
తాత్పర్యము.
ఆ పల్లెలో త్రాగటానికి మంచి నీరును ఇచ్చెడి బావులు, కుంటలతో పాటు చెరువు కూడా ఉంది.అక్కడ స్వచ్ఛమైన గాలి రివ్వుమని వీస్తూ ఉంటుంది.//
7.
కందం.
జలములు నిండిన చెఱువున
కలువలు తామరలు విరియ కళకళలాడెన్
పులకించుచు భృంగములట
నలుదిక్కుల మూగి యుండ నవ్వును సుమముల్.//
తాత్పర్యము.
ఆ చెరువు కలువ, తామర వంటి పూవులతో కళకళలాడుతూ ఉంటే, ఆ పూవులు చుట్టూ తుమ్మెదలు మూగి ఉంటాయి. వాటిని చూచి ఆ పూవులు నవ్వుతూ ఉంటాయి.//
8.
కందం.
మీనములను వేటాడగ
మౌనుల భంగిని బకతతి మర్మము చూపన్
కనిపెట్టక తిరుగాడెడి
మీనములా చెఱువునందు మిసమిసలాడెన్.//
తాత్పర్యము.
ఆ చెరువు నందు చేపలు తిరుగుతూ ఉంటాయి. వాటిని తినటానికి కొంగలు మునులలాగా నిలుచుని ఉంటాయి.//
9.
కందం.
చెఱువు సమీపములో పలు
తరువులు విలసిల్ల నూరి తరుణులమితమై
మురియుచు నూయలలూగన్
జిఱు సవ్వడితోడ నగుచు చెఱువట పొంగున్.//
తాత్పర్యము.
ఆ చెరువు సమీపంలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు ఊయలలు కట్టి ఆ ఊరి ఆడపిల్లలు ఊగుతూ ఉంటే ఆ చెరువు కూడా కొద్దిగా సవ్వడి చేస్తూ ఉంటుంది.//
10.
ధ్రువకోకిల.
చెఱువు గట్టున మఱ్ఱి మామిడి చింత చెట్లను గాంచుచున్
బరుగు పెట్టుచు వచ్చుచుందురు బాల బాలిక లెల్లరున్
తరువు లెక్కుచు దూకుచుందురు దండుగా సడి చేయుచున్
మరపు రానిది బాల్య మన్నది మంచి జ్ఞాపకమౌ కదా!//
తాత్పర్యము.
ఆ చెరువు గట్టున ఉన్న మర్రి, మామిడి చింత చెట్ల దగ్గరికి పిల్లలు పరిగెత్తుకొని వచ్చి ఆ చెట్ల మీద కెక్కి దూకుచూ ఆటలాడుతూ ఉంటారు. మనకు కూడా బాల్యము చాలా మంచి జ్ఞాపకం కదా!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments