ఇల్లాలే ఇంటికి జీవనజ్యోతి
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Apr 30
- 5 min read
#IllaleIntikiJeevanaJyothi, #ఇల్లాలేఇంటికిజీవనజ్యోతి, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Illale Intiki Jeevana Jyothi - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 30/04/2025
ఇల్లాలే ఇంటికి జీవనజ్యోతి - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
భార్యా భర్తలు కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండటమే సంసారం. యవ్వనంలో భార్యగా వచ్చి జీవితాంతం వీడని బంధంతో నీడగా ఉండేదే ఇల్లాలు. ఆ ఇల్లాలు ఇంటికి దీపమై దేదీప్యమానంగా వెలుగుతు భర్తకు వృద్దాప్యంలో చివరి రోజుల వరకు తోడుగా ఉంటుంది. అదే సంసార జీవిత గమనం.
శ్రీనివాసరావు గారి వయసు 60 సంవత్సరాలు దాటాయి. రెవెన్యూ శాఖలో తహసీల్దారుగా సుదీర్ఘ కాలం పని చేసిన తర్వాత రిటైర్మెంట్ జరిగి విశ్రాంత జీవితం గడుపుతున్నారు.
పదవిలో ఉన్నప్పుడు సౌమ్యుడు, నిజాయితీ, క్రమశిక్షణ గల వ్యక్తిగా తన సహచర సిబ్బంది ఉన్నతోద్యోగుల వద్ద మంచి పేరు సంపాదించారు. ఎవరు పని మీద ఆఫీసుకి వచ్చినా కూర్చోబెట్టి వారి ఇబ్బందులు తెలుసుకుని వీలైనంత తొందరలో ఆ పని పూర్తి అయేలా చూసేవారు.
అందువల్ల ఆఫీసు సిబ్బందే కాకుండా బయట కూడా ఆయనంటె గౌరవం చూపేవారు జనం. వారి వ్యక్తిగత పని మీద వచ్చే వ్యవసాయ రైతులు ఆయన మీద ఆదరణతో నెయ్యి,కాయగూరలు, ఫలాలు తెస్తే సున్నితంగా తిరస్కరించి ఇకపైన అటువంటి వస్తువులు తేవద్దని తెలియ చెప్పేవారు.
రెవిన్యూ శాఖ అంటేనే లంచాల పుట్టగా భయపడే వారు శ్రీనివాసరావు లాంటి నిజాయితీపరులు కూడా ఉంటారని ఆశ్చర్యం ప్రకటిస్తుంటారు. ప్రమోషన్ మీద వచ్చిన కొత్తలో శ్రీనివాసరావును కూడా ముందున్న యం.ఆర్.ఓ మాదిరి లంచం లేనిదే పనిజరగదని ఊహించిన సిబ్బందికి, జనానికి ఎదురుదెబ్బ తగిలింది.
శ్రీనివాసరావు యం.ఆర్.ఓ ఇంచార్జిగా డ్యూటీ తీసుకున్నప్పటి నుంచి ప్యూన్ మొదలు మిగత సెక్షన్ల సిబ్బందికి చెయ్యి తడిపేవారు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందరో స్టాఫ్ మెంబర్లు సర్వీస్ లో ఉండగా లంచాలతో ఆస్థులు సంపాదించి పదవీ విరమణ పొందారు. విలాస జీవితం సాగిస్తూ పిల్లల్ని పెద్ద చదువులు కొనసాగించారు. నిజాయితీ పరుడైన శ్రీనివాసరావు మాత్రం సాదాగా సర్వీసు పూర్తి చేసారు.
ఆయన భార్య జానకమ్మ కూడా భర్త మనస్తత్వానికి తగ్గట్టు నడుచుకుంటూ వారికి చేతోడుగా ఉంటూ ఆధ్యాత్మిక జీవనం సాగించారు.
శ్రీనివాసరావు గారి చరమాంకంలో అనుకోని దెబ్బ తగిలింది. వారి ధర్మపత్ని జానకమ్మ గుండె నొప్పితో బాధ పడుతు తనువు చాలించారు. వైద్యం కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. ఆ షాక్ నుంచి కోలుకోడానికి ఆయనకు చాల సమయం పట్టింది.
ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు కాలేజీలో చదువుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోగా ఉన్న ఒక్క కొడుకు శ్రీకాంత్ యం.కాం. పూర్తి చేసి ప్రభుత్వరంగ బేంకు సెలక్షన్ ఎగ్జామ్స్ రాసి ఆఫీసర్ హోదాలో ఉద్యోగం సంపాదించాడు. జానకమ్మ బతికి ఉన్నన్ని రోజులు పెళ్లి చేసుకోమంటె ఉద్యోగం, ప్రమోషన్లు అంటు కాలయాపన చేసాడు.
ఇంట్లో ఆడతోడు ఉండాలని శ్రీనివాసరావు కొడుక్కి పెళ్లి చేసారు. వచ్చిన కోడలు సుభద్ర కూడా శ్రీకాంత్ బేంకులో పనిచేసే అమ్మాయే. తండ్రికి ఒక్కగానొక్క కూతురైనందున గారాబంగా పెరిగింది. ఆధునిక భావాలతో మోడరన్ పద్దతులతో ఉండటానికి ఇష్టపడుతుంది.
చిరుతిళ్లు, జంక్ ఫుడ్ బాగా అలవాటు.పెద్దల సాంప్రదాయ పద్దతులంటే చిన్నచూపు. ఇదంతా గతం, ప్రస్తుత పరిస్థితుల్లో కొస్తే: "అమ్మా, సుభద్రా! నా కళ్లజోడు కనిపించడం లేదు. ఎక్కడ
పెట్టానో తెలియడం లేదు. చూసి పెట్టమ్మ"
"అసలే డ్యూటీకి లేటవుతోందని నేను చస్తుంటే, ఈ ముసలాయన ఒకడు నన్ను వేధించడానికి" అనుకుంటూ విసుగ్గా కిచెన్లో నుంచి హాల్లో కొచ్చిన సుభద్ర "మీ నెత్తి మీద కళ్లజోడు పెట్టుకుని ఊరంతా వెతకమంటే ఎలా చెప్పండి" శ్రీనివాసరావుకు క్లాస్ తీసుకుంది కోడలు.
"పెద్ద వయసు కదమ్మా, మతిమరపు వచ్చింది. ఏదీ జ్ఞాపకం ఉండటం లేదు". నెత్తి మీంచి కళ్లజోడు తీసుకుంటు సంజాయితీ ఇచ్చుకున్నారు.
"నాకు డ్యూటీకి టైమవుతోంది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టేను.టైముకి తినండి. టీవీ చూసిన తర్వాత స్విచ్ ఆఫ్ చెయ్యండి. మొబైల్ దగ్గర ఉంచుకోండి. ఎవరు కాలింగ్ బెల్ నొక్కినా వివరాలు తెలుసుకోకుండా డోర్ తీసెయ్యకండి. శ్రీకాంత్ కు ఆడిట్ జరుగుతోందని తొందరగా బేంక్ కి వెళిపోయాడు. "జాగ్రత్తలు చెప్పి డ్యూటీకి బయలుదేరింది
సుభద్ర.
మరొక రోజు
"అమ్మా, సుభద్రా! ఉదయం ఆరుదాటింది. బ్రష్ చేసుకున్నాను. ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా" ప్రాధేయ పడుతు బెడ్ రూమ్ లోని కోడల్ని కేకేసి అబ్యర్దిస్తున్నారు శ్రీనివాసరావు.
"అబ్బబ్బ, ఆదివారమైనా మరికాసేపు పడుకోనివ్వడు ఈ ముసలాయన. మిగతా వర్కింగ్ డేస్ లో ఎలాగూ ఆరు గంటలకు బెడ్ మీంచి లేవక తప్పదు. శలవు దినమైనా ఈయనది ఒకటే సొద" అనుకుంటూ చికాకుగా కిచెన్లో కెళ్లింది సుభద్ర.
తాపీగా నిద్ర లేచి హాల్లో కొచ్చిన కొడుకు శ్రీకాంతును చూసి
"బాబూ, మీ అమ్మ ఆబ్దీకం వచ్చే నెల పంచమి నాడు పడింది.నువ్వు ఆరోజు శలవు పెట్టి ఆ కార్యక్రమాలు చూడు" దివంగత భార్య మరణతిథిని కొడుక్కి జ్ఞాపకం చేసారు శ్రీనివాసరావు గారు.
దగ్గర్లో గోడకున్న కేలండర్ తీసి తేదీని చూస్తు " నాన్నా, నాకు ఆరోజు బెంగళూరుకు కేంప్ పడింది. వెళ్లక తప్పదు. ఒక పని చెయ్యండి, నేను రాఘవేంద్ర మఠంలో డబ్బు కట్టి అమ్మ తిథి బుక్ చేస్తాను. మీరెళ్లి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకు రండి "జవాబు చెప్పాడు.
శ్రీనివాసరావు మారు మాటాడలేకపోయారు. కొడుక్కి తల్లి మీదున్న గౌరవభావానికి ఏమనాలో బోధ పడలేదు.
"అమ్మా, సుభద్రా! కాస్త అన్నం మెత్తగా వండు. సాంబారులో కారం ఎక్కువనిపిస్తోంది, తగ్గించు. నాకు గేస్ట్రిక్ ప్రోబ్లం తల్లీ! వెల్లుల్లి పడదు." తిండిలో తన బాధలు చెబుతుంటే, 'వయసు మళ్లినా రుచులకు తక్కువ లేదు ఈయనకి' ఈసడించుకుంది మనసులో.
చిన్నప్పటి నుంచి ఫాస్టు ఫుడ్ జంక్ ఫుడ్ కి అలవాటు పడిన సుభద్ర, మొగుడు శ్రీకాంత్ కి కూడా అలవాటు చెయ్యడంతో ఆన్లైన్లో ఏవో ఒకటి ఆర్డర్సు వస్తూనే ఉంటాయి. చేసేది లేక
శ్రీనివాసరావు గారు బిస్కెట్లు, బ్రెడ్, పళ్లు తిని ఆకలి తీర్చుకుంటున్నారు.
"మామయ్యా, ఈరోజు వీకెండ్ ప్రోగ్రామ్ లో మా కొలీగ్ ఇంటికి డిన్నర్ కెల్తున్నాం. టీవీ, ఫేన్, లైట్లు ఆర్పి మీ బెడ్ రూమ్ కెళ్లి పడుకోండి. మేము డోర్ డిజిటల్ లాక్ చేసి వెళ్తాము" శ్రీనివాసరావును ఇంటికి కాపలా ఉంచి దంపతులిద్దరూ బయటకు వెళిపోయారు.
శలవు రోజునైన కొడుకుతో కష్టం సుఖం మాట్లాడుదామంటే కుదరడం లేదు. శలవు రోజున కూడా ఎవరో ఒకరు ఇంటికి రావడంతో వారితో సమయం గడిచిపోతోంది వారికి. తర్వాత
టీవీలు, సినేమాలు, బయటి రెస్టారెంట్లతో గడిచిపోతోంది. కొడుకు పెళ్లాం ఎలా చెబితే అదే చేస్తున్నాడు.
కొత్త దంపతులు వారి ఆనందాన్ని కాదనలేక సర్దుకుపోతున్నారు. కోడలి చిరాకులు, వంటల్లో మార్పులు, కొడుకు కోడలు డ్యూటీలకు వెళిపోతే ఏకాకిలా ఇంట్లో పడి ఉండటం కష్టసాద్యంగా మారింది శ్రీనావాసరావు గారికి. భార్య ఫోటో చూస్తు కంటతడి పెట్టుకుంటారు.
ఒకరోజు భార్యభర్తలిద్దరూ తన గురించి వాదించుకోవడం, ఓల్డేజ్ హోమ్ కి పంపే ఏర్పాట్లలో ఉన్నట్టు గ్రహించారు. అదే తనకు ఉత్తమమని భావించారు శ్రీనివాసరావు.. ఇంట్లో తన ఆరోగ్యానికి పడని వంటకాలు, ఏకాంత జీవితం, కోడలి చీదరింపులు, కొడుకు అనాదరణ తలుచుకుంటే వృద్దాశ్రమంలో తన వయసు వారి సహచర్యం, సమయానికి తగిన భోజనం వైద్య సదుపాయం అందుబాటులో ఉంటాయని ఇక్కడి కన్న ఆ జీవితమే నయం
అనుకున్నారు. తన నెల వారీ పెన్సన్ తో పాటు బేంక్ బేలన్స్ డబ్బు ఓల్డేజ్ హోమ్ కే రాయాలని నిశ్చయానికొచ్చారు.
మర్నాడు శ్రీనివాసరావు తన అభిప్రాయాన్ని కొడుకు కోడలుకీ తెలియ చేయగా ముందు ఇష్టం లేనట్టు నటించినా తర్వాత ఒప్పుకుని ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులతో మాట్లాడి లగేజీతో
సాగనంపేరు దంపతులిద్దరూ.
వృద్ధాశ్రమంలో చేరిన తర్వాత శ్రీనివాసరావు మనసు ప్రశాంతంగా ఉంది. అప్పడప్పుడు భార్యతో గడిపిన రోజుల్ని మననం చేసుకుంటూంటారు.
తన ధర్మపత్ని బతికున్న రోజుల్లో తనకేం కావాలో అన్నీ సమయానుకూలంగా సమకూర్చేది. తను పక్కమీంచి లేచి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేసరికి వేడివేడి చిక్కటి కాఫీ
కప్పుతో ప్రత్యక్ష మయేది. తర్వాత బాత్రూంలో వేడినీళ్లు సిద్ధం చేసి స్నానమవగానే పూజగదిలో కావల్సిన వస్తువులు సమకూర్చడం, అటుపైన వేడివేడి టిఫిను కొసరి కొసరి
తిని పించడం, తనకేది ఇష్టమో అవే వంటకాలతో భోజనం వండటం తలుచుకుంటే దుఃఖం ఆగడం లేదు.
వృద్ధాప్యంలో వంటరితనం ఎంత భయంకరమో అనుభవం చెబుతోంది. జీవిత చరమాంకంలో భార్యాభర్తల్లో ఏ ఒక్కరు లేకపోయినా ఆ జీవితాలు నరకప్రాయమవుతాయి. ఆడవారిలో ఓర్పు సహనశక్తి మూలంగా పరిస్థితులు తట్టుకోగలరు కాని మగవారికి భార్య లేని ఏకాంత జీవితం దుర్భరం.
ఏడడుగులు నడిచి మూడు ముళ్ల బంధంతో జీవిత భాగస్వామిగా ప్రవేశించి కష్ట సుఖాల్లో చరమాంకం వరకు తోడు నీడగా ఉండే భార్యే ' జీవనజ్యోతి'.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments