top of page

జన్మ జన్మల బంధం

Updated: 4 days ago

#జన్మ జన్మల బంధం, #JanmaJanmalaBandham, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguHeartTouchingStories


Janma Janmala Bandham - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

Published In manatelugukathalu.com on 30/04/2025

జన్మ జన్మల బంధం - తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“ఏమిటి ధర్మారావు గారూ, ఈ మధ్యన నాటిక పోటీలు ఏమీ లేవా? పేపర్లో మీ పేరు కనపడటం లేదు?” అడిగాడు రాజారావు. 


“ఉన్నాయండి. పై నెలలో అమలాపురంలో ఒక పోటీ ఉంది. మా సమాజం తరుపున ఒక నాటిక ప్రదర్శించాలి, రిహార్సల్సు వేస్తున్నాం” వినయంగా అన్నాడు ధర్మారావు. రాజారావు తీసుకున్న బట్టలు ఒక కవర్లో పెట్టాడు. 


“మీకు వచ్చే బహుమతులు గురించి పేపర్లో చూసి చాలా ఆనందం కలుగుతుంది. నిజంగా మీరు శివపురంలో ఉండడం మా అదృష్టం” అన్నాడు రాజారావు మనస్ఫూర్తిగా. 


“అయ్యో, పెద్దలు మీరు అంతమాట అనకండి. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరు వచ్చాను.


వెంకట్రామయ్య గారు ఈ బట్టలకోట్లో ఉద్యోగం ఇచ్చారు. నాకు, నా కుటుంబానికి తిండి పెడుతున్న వెంకట్రామయ్య గారిని, ఆదరిస్తున్న ఈ గ్రామ ప్రజలకు నేను ఎంతో ఋణపడి ఉన్నాను” అన్నాడు ధర్మారావు రెండు చేతులూ జోడించి నమస్కరించి. 


“మీ వినయమే మిమ్మల్ని పైకి తీసుకువచ్చింది. అమలాపురం పోటీలో మీ నాటికకు మంచి బహుమతి రావాలని కోరుకుంటున్నాను” అన్నాడు రాజారావు. 


“అంతా మీ బోటి పెద్దల ఆశీస్సులు, ఆ భగవంతుడి దయ” అన్నాడు ధర్మారావు తలవంచి. 

రాజారావు కాష్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. ధర్మారావు ఆయన వెనకే వెళ్లి, రాజారావు కొన్న బట్టల వివరాలు చెప్పాడు. కేషియర్ బిల్ ఇచ్చాడు. రాజారావు డబ్బులు ఇచ్చి, బట్టల కవర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకో కస్టమర్ రావడంతో, ఆయనకు బట్టలు చూపించడానికి ముందుకు కదిలాడు ధర్మారావు. 


శివపురం లోని నవకళ బట్టలకొట్టులో సేల్స్ మాన్ గా, పనిచేస్తున్నాడు ధర్మారావు. ఇంటర్మీడియట్ చదువుకున్న ధర్మారావు కుటుంబ పరిస్థితులు వలన డిగ్రీ చదవలేక పోయాడు. తండ్రి అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబ బాధ్యత అతని మీద పడింది. తల్లిని, ఇద్దరి చెల్లెళ్ళనీ పోషించడానికి కొంతకాలం కూలి పనికి వెళ్ళాడు. నెల అంతా పని ఉండడంలేదు. ఒకోసారి అందరూ వంటిపూట మాత్రమె భోజనం చేసేవారు. 


ధర్మారావు తండ్రి సూర్యనారాయణ, రామమూర్తి మాస్టారు మంచి స్నేహితులు. ఆయనే ధర్మారావుని శివపురం తీసుకువచ్చి, బట్టలకొట్టులో ఉద్యోగం ఇప్పించారు. ధర్మారావు రోజూ జగన్నాధపురం నుండి సైకిల్ మీద శివపురం వచ్చేవాడు. కానీ వర్షాకాలం చాలా ఇబ్బంది పడేవాడు. మూడేళ్ళు గడిచాకా శివపురం మకాం మార్చాడు. 


రెక్కల కష్టం మీదే చెల్లెళ్ళు ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసాడు. వెంకట్రామయ్య గారు కూడా సహకారం చేసారు. బాధ్యతలు తీరాకా మార్టేరుకు చెందిన మహాలక్ష్మితో పెళ్లి జరిగింది ధర్మారావుకి. అప్పుడే రాంబాబుతో పరిచయం అయ్యింది. 


రాంబాబు ఫైనాన్సు కార్పొరేషన్ నడుపుతున్నాడు. మంచి నటుడు. హై స్కూల్, కాలేజీ ఉత్సవాలలో జరిగిన నాటిక పోటీలలో పాల్గొన్నాడు. పరిషత్ నాటికలలో పాల్గొనాలని ఎంతో ఉబలాటం. ధర్మారావు గంభీరమైన స్వరం, రూపం రాంబాబుని బాగా ఆకర్షించింది. మార్టేరు మిత్రులైన అచ్చిరెడ్డి, నాగిరెడ్డి లను కలుపుకుని ‘కళా స్రవంతి’ పేరుతో ఒక నాటక సమాజాన్ని ఏర్పాటుచేసాడు. 


మొదటి సారిగా, కప్పగంతుల మల్లిఖార్జున రావు రాసిన ‘జ్వాల’ నాటికని, రాజోలులో జరిగిన నాటిక పోటీలలో ప్రదర్శించారు. ఖండవల్లికి చెందిన భానుమతి హీరోయిన్ గా వేసింది. ఆ పోటీలలో ధర్మారావుకి ఉత్తమ నటుడిగా, భానుమతికి సహాయ నటిగా, రాంబాబుకి సహాయ నటుడిగా బహుమతులు వచ్చాయి. అప్పటినుండీ రాంబాబుకి, ధర్మారావు మీద గురి ఏర్పడింది. 

తర్వాత ఈ బృందం నాలుగు పరిషత్ పోటీలలో పాల్గొనడం, ఎన్నో బహుమతులు గెల్చుకోవడం జరిగింది. శివపురం, ‘కళా స్రవంతి’ వారు వచ్చారంటే, ఏదో ఒక బహుమతి తప్పక పట్టుకువెళ్తారని, పోటీలు నిర్వహించేవారికి అనుభవం అయ్యింది. 


వెంకట్రామయ్య గారు కూడా ధర్మారావు నాటక పోటీలకు వెళ్ళడానికి సెలవు ఇచ్చి, కొద్దో గొప్పో ఆర్ధిక సాయం కూడా చేసేవారు. ఆవిధంగా శివపురం పేరు తరుచూ పేపర్లో పడుతోంది. మహాలక్ష్మి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది. భర్త నాటిక పోటీలలో గెలిచిన షీల్డులు అలమారలో పెడుతూ మురిసిపోతుంది. 


ఇంటికి వచ్చిన వారితో ఏ షీల్డు ఏ ఊరి పోటీలలో ఇచ్చారో చెబుతూ ఆనందపడుతుంది. గుమ్మడిలా ఎంతో గంభీరంగా ఉండే భర్త గొంతు ఆమెకి చాలా ఇష్టం. ఎంతో సౌమ్యుడు, కళాకారుడు తనకు భర్తగా లభించడం తన అదృష్టంగా ఆమె పొంగిపోతుంది. 

***** 

అమలాపురం నాటక పోటీలు దగ్గర పడుతున్నాయి. ఇంకా పదిహేను రోజులే సమయం ఉంది. వర్తక సంఘం భవనం లో రిహార్సల్సు వేస్తున్నారు ధర్మారావు, రాంబాబు, అచ్చిరెడ్డి, నాగిరెడ్డి. ఈసారి హీరోయిన్ గా తణుకు నుండి భావన వచ్చి రిహార్సల్సులో పాల్గొంటోంది. 


మహాలక్ష్మి కి వంట్లో బాగుండటం లేదు. గుండెల్లో నొప్పి వస్తే ‘గ్యాస్ నొప్పి’ అనుకుని మాత్రలు వేసుకుంది. తన బాధని భర్తకి చెప్పలేదు, అతని రిహార్సల్సుకి ఇబ్బంది అని. కానీ ఒకరోజు గుండెల్లో నొప్పి ఎక్కువగా ఉంటె భర్తని నిద్ర లేపింది. 


“ఏమిటి లక్ష్మి ఏమయ్యింది ?” కంగారుగా అడిగాడు ధర్మారావు. 


“గుండెల్లో బాగా నొప్పిగా ఉందండి” అంది మహాలక్ష్మి ఆయాసపడుతూ. 


“కంగారుపడకు. ఆసుపత్రికి వెడదాం” అని ఆటో ప్రసాద్ కి ఫోన్ చేసాడు. అయిదు నిముషాలలో ఆటో రాగానే, ఆమెని డాక్టర్ రాజు ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు ధర్మారావు. కాంపౌండర్ మేడమీదకు వెళ్లి డాక్టర్ గారిని పిలుచుకు వచ్చాడు. 


డాక్టర్ రాజు మహాలక్ష్మిని పరీక్ష చేసి, ఇ. సి. జి. కూడా తీసారు. ధర్మారావుని పిలిచి “ప్రస్తుతం కంగారు పడవలసిన పని లేదు. ఒకరోజు ఆసుపత్రిలో ఉంచండి. చూద్దాం” అని తన దగ్గరున్న మందులు ఇచ్చి, రూమ్ అలాట్ చేసారు. 


కాంపౌండర్, నర్సుల సాయంతో మహాలక్ష్మిని రూమ్ కి తీసుకువెళ్ళాడు ధర్మారావు. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుని నిద్ర పోయింది మహాలక్ష్మి. తెల్లవార్లూ మేలుకుని, ఆమె మంచం పక్కనే స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు ధర్మారావు. నవ్వుతూ, ఎంతో ఆదరంగా మాట్లాడే భార్యని అలాచూసి చాలా దిగులుపడ్డాడు. 


తెల్లవారింది. నర్సుని మహాలక్ష్మికి తోడుగా ఉంచి, ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని, మహాలక్ష్మికి ఒక జత బట్టలు తెచ్చాడు ధర్మారావు. నర్సు సాయంతో మహాలక్ష్మి స్నానం చేసి బట్టలు మార్చుకుంది. డాక్టర్ రాజు వచ్చి చూసి, సెలైన్ పెట్టమని కాంపౌండర్ కి చెప్పి వెళ్ళారు. 

ధర్మారావు, వెంకట్రామయ్య గారికి ఫోన్ చేసి “మా లక్ష్మికి వంట్లో బాగుండలేదు. ఆసుపత్రిలో ఉంది. ఈరోజు షాపుకి రాలేను” అని చెప్పాడు. ఆయన ‘అలాగే’ అని, ‘డబ్బు అవసరం అయితే చెప్పు పంపుతాను’ అని కూడా అన్నారు. 


మహాలక్ష్మికి వంట్లో బాగుండలేదని తెలిసి రాంబాబు ఆసుపత్రికి వచ్చాడు. ధర్మారావు కి ధైర్యం చెప్పి, సాయంత్రం మరల వస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడు. సాయంత్ర రాంబాబు వచ్చేసరికి మహాలక్ష్మికి నీరసం తగ్గింది. డాక్టర్ రాజు మరలా ఆమెని పరీక్షించి, పదిరోజులకి మందులు రాసిచ్చి, అలసట వచ్చే పనులు ఏమీ చేయవద్దని చెప్పారు. 


“మీరు వెళ్లేముందు ఒకసారి రండి” అని రాంబాబుకి చెప్పారు డాక్టర్ రాజు. రాంబాబు ఆసుపత్రి బిల్లు

కట్టేసి, ధర్మారావు మహాలక్ష్మిలను ఆటో ఎక్కించి డాక్టర్ రాజు రూమ్ కి వచ్చాడు. 


“రాంబాబు గారూ, మీరూ ధర్మారావు ఫ్రెండ్స్ అని మీకు చెబుతున్నాను. మహాలక్ష్మి గారికి నిన్న వచ్చింది ‘హార్ట్ ఎటాక్’. వాళ్లకి పిల్లలు లేరని తెలిసింది. పదిరోజుల్లో ఆవిడకి ఆపరేషన్ చేయాలి. ధర్మారావు కి చెబితే కంగారు పడతారని మీకు చెబుతున్నాను. ఆవిడని ఒక మనిషి ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి” అన్నారు డాక్టర్ రాజు. ఆయనకీ ‘థాంక్స్’ చెప్పి బయటకు వచ్చాడు రాంబాబు. 


అమలాపురంలో తమ నాటిక ప్రదర్సనకి ఇంక అయిదు రోజులే సమయం ఉంది. ఆరోజు రాత్రి తమ పనిమనిషి రత్తాలుని, మహాలక్ష్మికి ‘తోడు’ గా ఉండమని పంపించాడు రాంబాబు. ధర్మారావుతో “ఈసారి పోటీకి వెళ్ళడం మానేద్దామా ధర్మా?” అన్నాడు రాంబాబు. 


“వద్దు. మానద్దు. వెళదాం. మొదటిసారిగా నువ్వు ఈ నాటికని డైరెక్ట్ చేస్తున్నావు. నాటిక కూడా బాగా వస్తోంది. అందరం బాగా నటిస్తున్నాం. మన టీముకి మరియు నీకు ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డు వస్తుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. భావన గారు కూడా బాగా నటిస్తున్నారు. ఆవిడకి బెస్ట్ హీరోయిన్ గా అవార్డు వస్తుందని అనిపిస్తోంది. మా మహాలక్ష్మికి, రత్తాలు తోడుగా ఉంటోందిగా. ఏం ఫరవాలేదు. మనం రిహార్సల్సు కంటిన్యూ చేద్దాం” అన్నాడు ధర్మారావు. 


మిత్రుడి మాట కాదనలేక పోయాడు రాంబాబు. నాటిక ప్రదర్సన అయ్యాకా, మహాలక్ష్మి ‘ఆపరేషన్’ సంగతి చూడాలని నిర్ణయం తీసుకున్నాడు రాంబాబు. 


అదే సమయానికి భావన వచ్చింది. వెంటనే రిహార్సల్సు మొదలుపెట్టారు. అప్పుడు పరీక్షగా చూసాడు రాంబాబు, భావన నటనని. ధర్మారావు చెప్పినట్టు ఆమె పాత్రలో పూర్తిగా లీనమై నటిస్తోంది. 


“అద్భుతః” అనుకున్నాడు రాంబాబు ఆమె నటనను చూసి. నాలుగు రోజులూ ‘రిహార్సల్సు’ పకడ్బందీగా జరిగాయి. టీంలోని మిగతా వారు కూడా, ఒకరితో మరొకరు పోటీ పడుతూ నటించారు. ఈసారి పోటీలలో తమ నాటికకు ఎక్కువ బహుమతులు సంపాదించాలన్న ‘పట్టుదల’ టీంలోని వారిలో ఉండడం గమనించాడు రాంబాబు. 


మర్నాడే అమలాపురంలో నాటిక పోటీలు ప్రారంభం. పోటీకి ఎనిమిది నాటికలు ఎంపిక అయ్యాయి. ముందు రోజు నాలుగు నాటికలు, తర్వాత రోజు నాలుగు నాటికలు ప్రదర్శించాలి. రాంబాబు వాళ్ళ నాటిక ఎనిమిదో నాటిక. రెండో రోజు చివరగా ప్రదర్శించవలసిన నాటిక. 


“ధర్మా, మేము రేపు ఉదయమే బయల్దేరుతాం అక్కడికి. నువ్వు రేపు రెస్ట్ తీసుకుని, ఎల్లుండి బయలుదేరి రా. మహాలక్ష్మికి, రత్తాలుని తోడుగా ఉండమను. మేము రేపు అక్కడ ఉండి, రేపు ప్రదర్శించే నాటికలు చూస్తాం” అన్నాడు రాంబాబు. ‘అలాగే’ అన్నాడు ధర్మారావు. 


మర్నాడు ఉదయమే అందరూ టాక్సీలో బయల్దేరి అమలాపురం వెళ్ళారు. శివపురం నుండి అమలాపురం అయిదు గంటల ప్రయాణం. టాక్సీలో అయితే మూడు గంటల సమయం పడుతుంది. 

మర్నాడు ధర్మారావు బట్టలకోట్టుకి వెళ్లి డ్యూటీ చేసాడు. 


వెంకట్రామయ్య “ముందస్తు అభినందనలు ధర్మారావు” అని షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. 

“ధన్యవాదాలు సార్” అన్నాడు ధర్మారావు వినయంగా. ఈ నాటిక విజయానికి, తామే కాకుండా శివపురంలో చాలా మంది ఎదురు చూస్తున్నారని అర్ధమయ్యింది అతనికి. 


అమలాపురంలో మొదటిరోజు ప్రదర్శించిన నాటికలు చూసి రాంబాబు బృందం ఆలోచనలో పడ్డారు. మర్నాడు తాము అందరూ చాలా జాగ్రత్తగా నటించాలని మరోసారి నిర్ణయించుకున్నారు. 

మర్నాడు రాంబాబు, ధర్మారావు కోసం ఫోన్ చేస్తే ‘నో రిప్లై’ వచ్చింది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెంకట్రామయ్య గారు ఫోన్ చేసి చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాడు రాంబాబు.


అతని గుండె దడ దడ లాడింది. మనసు పరి పరి విధాల పోయింది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. 

సాయంకాలం ఆరుగంటలకు ధర్మారావు అమలాపురం వచ్చాడు బస్సులో. రాంబాబు అతన్ని చూసి ఆశ్చర్య పోయాడు. ఏదో అడగాలన్న రాంబాబుని అడ్డుకుని, నిన్న ప్రదర్శించిన నాటికల గురించి ‘గుచ్చి గుచ్చి’ అడిగాడు. రాంబాబు, భావన వాటి గురించి అతనికి వివరించి చెప్పారు. ధర్మారావు గంభీరంగా తల పంకించాడు. 


రాత్రి పదిన్నరకు అమలాపురం నాటిక పోటీ వేదిక మీద, ‘శివపురం కళా స్రవంతి వారి ‘బంధం’ నాటిక కొద్ది నిముషాలలో ప్రారంభం అవుతుందని ప్రకటించారు. పల్లెటూరిలోని ఒక రైతు కుటుంబానికి చెందిన కృష్ణారావు, వసుంధర తమకున్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి కొడుకులు ఇద్దరినీ పెద్ద చదువులు చదివిస్తే, వారు పెళ్ళిళ్ళు చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతారు. పిల్లలు పల్లెటూరు రారు, తల్లి తండ్రుల్ని తమ దగ్గరకు తీసుకువెళ్ళరు. 


రైతు దంపతులుగా ధర్మారావు, భావన నటించారు. రైతు పిల్లలుగా అచ్చిరెడ్డి, నాగిరెడ్డి నటించారు. కృష్ణారావు స్నేహితుడు ఆంజనేయులుగా రాంబాబు నటించారు. పిల్లల ప్రేమకోసం తల్లడిల్లుతున్న తల్లి పాత్రలో భావన నటనకు ప్రేక్షకుల గుండెలు బరువెక్కాయి, కళ్ళు చెమ్మగిల్లాయి. చివరకు పిల్లల గురించి కలవరిస్తూనే కన్నుమూస్తుంది వసుంధర. 


“వసూ, ఈ బంధాలన్నీ వట్టి బూటకం. రక్త సంబంధాలు అన్నీ ఏనాడో అదృశ్యం అయ్యాయి. ఇప్పుడు అంతా డబ్బుమయం. మమతలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ ఎండమావులే. నేను చెబుతుంటే నువ్వు నమ్మలేదు. చూడు, ఇప్పుడు ఏమయ్యింది? మీ అమ్మ చావు అంచులలో ఉంది, ఒక్కసారి రండిరా అంటే, ఏమన్నారో తెలుసా వసూ? 


విమానం టిక్కెట్లు దొరకడం లేదు రాలేమని చెప్పారు. ఆ విషయం దాచి నీకు అబద్ధం చెప్పాను. వాళ్ళు బయల్దేరారు రేపు వస్తారని. ఎందుకంటే నీ చివరి ఘడియలు ప్రశాంతంగా గడవాలని. నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వు కోరుకున్నట్టుగా నా చేతులలో వెళ్ళిపోయావు. 


నా పరిస్థితి ఏమిటి? నీ జ్ఞాపకాలలో బతకాలా? లేక పేగుబంధాన్ని మరిచిన కొడుకుల్ని తలుచుకుంటూ, కుమిలిపోతూ జీవించాలా? వద్దు.. ఆ నరకం నేను భరించలేను. నేనూ నీతోనే వస్తాను.. నీతోనే వస్తాను” అంటూ కృష్ణారావు గుండెలు బాదుకుంటూ భార్య మీదపడి రోదిస్తాడు. రెండు నిముషాలు గడిచాకా అతని రోదన ఆగిపోయింది. 


స్టేజి అంతా నిశ్శబ్దం. ప్రేక్షకుల చప్పట్లతో ప్రాంగణం మారుమోగింది. ‘తెర’ పడింది. వేదికముందు నాటిక పోటీల న్యాయనిర్ణేతలు ధర్మారావు ని ‘ఉత్తమ నటుడిగా’, భావనని ‘ఉత్తమ నటిగా’ నిర్ణయించారు. 


తెర వెనుక వేదిక మీద, ‘సార్ తెర పడింది. లేవండి’ అంది భావన. ధర్మారావు తల, ఆమె గుండెలమీద భారంగా ఉంది. ఆమెకి కష్టంగా కూడా ఉంది. 


“బాగా చేసావురా ధర్మా” అంటూ వచ్చిన రాంబాబు అతని భుజం మీద చేయి వేయగానే, పక్కకు ఒరిగిపోయింది అతని దేహం. “కెవ్వు” మన్నాడు రాంబాబు. భావన నిశ్చేష్టురాలై ధర్మారావు కేసి చూసింది. 


“భార్య చనిపోతే, ఆమె అంత్యక్రియలు చేసి, కొండంత దుహ్ఖాన్ని గుండెలలో దాచుకుని, ఇచ్చిన మాటకోసం ఇక్కడికొచ్చి, నీ నట విశ్వరూపం ప్రదర్శించి, వేదికకే అంకితమైపోయావా? నీ మహాలక్ష్మిని వెదుక్కుంటూ వెళ్ళిపోయావా?” అని భోరున విలపించాడు రాంబాబు. 


******

సమాప్తం

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





 

5 Comments


@umadevi8931

•4 hours ago

Story Chala chala bavundi 🎉🎉

Like

శ్రీ ఎం.ఆర్.వి.సత్యనారాయణమూర్తి గారి

జన్మ జన్మల బంధం కథ

" మనసును ఆకట్టుకున్నది " అని మాత్రమే అనలేను.

"మనసును కరిగించిందనీ , మనసును ఎప్పుడూ వెంటాడే కథల్లో ఇదీ ఒకటనీ " అనకుండా ఉండలేను.

ఆలోచించేకొద్దీ,

చిన్నకథైనా వామనుడి వలే విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నట్లు తోచింది.

చిన్నకథలో ఎన్నో వ్యవస్థలను చిత్రించారు.

అన్నీ పటిష్టమైనవే.

అన్నీ సక్రమమమైనవే.

ఉదారమైనవే ...

ఐనప్పటికీ కథలో శోకరసాన్నీ కరుణ రసాన్నీ పండించిన తీరు శ్లాఘనీయమైన అంశం.


కథలో శిరోభూషణమైన నాయికా నాయకుల బంధాన్నటుంచితే (అదో సుదీర్ఘాంశము. అందుకే చర్చించటము లేదు) బీదరికంలోనూ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చేందుకు కష్టపడటం చాలా సహజసుందర చిత్రీకరణ. అరుదుగా కనిపించే సహృదయులైన యజమాని పనివాళ్ళ చిత్రీకరణా అలాంటిదే.

కుల, మత, ప్రాంతీయ, ఆర్థిక తదితరమైన ఎన్ని అవరోధాలున్నా, ఒక్కో మారు వాటిలో సంపన్నులు కాని ప్రతిభా వంతుల ప్రతిభ పైకి ఉబికి రావచ్చు. దానిని తప్పక అంగీకరించవలసిన పరిస్థితులూ సంభవించ వచ్చు. అలా తన ప్రతిభను చపించగలిగాడు ధర్మారావు.

అతని భార్య అనుకూలవతి అని చెప్పిన రచయిత ఆమెలోని ఓర్పును, త్యాగశీలతనూ చిత్రించిన తీరు ఉదాత్తమము.

జరిగి…


Like


@vinayakkumarveluri9137

•49 minutes ago

Story baavundi. Baga chadivaaru🎉

Like

@mrvsmurthy311

•1 hour ago

చక్కగా చదివారు సార్.. రచయిత భావాలను మీ గళంలో అందంగా

Like


@bashabullracing

•11 hours ago

❤❤

Like
bottom of page