చేయి వదలకు నేస్తమా - పార్ట్ 4
- Prameela Sarma Veluri
- May 8
- 6 min read
Updated: 2 days ago
#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #CheyiVadalakuNesthama, #చేయివదలకునేస్తమా, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Cheyi Vadalaku Nesthama - Part 4 - New Telugu Web Series Written By - Veluri Prameela Sarma Published In manatelugukathalu.com On 08/05/2025
చేయి వదలకు నేస్తమా - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక
రచన: వేలూరి ప్రమీలాశర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ..
సునీల, దొరబాబుల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది. సునీల పరిస్థితికి జాలిపడతాడు తేజ. అనుకోకుండా మెట్రో ట్రైన్ లో ఆమెను చూస్తాడు. ఆమె తలపుల్లో మునిగిపోతాడు.
స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడుతేజ. అతన్ని సునీల సోదరి, బిజినెస్ అనలిస్ట్ సుదతి కలుస్తుంది.
ఇక చేయి వదలకు నేస్తమా - పార్ట్ 4 చదవండి.
ప్లాట్ ఫామ్ మీద నీరసంగా పడుకుని, వచ్చే పోయే జనాలవంక దీనంగా చూస్తోంది తెలుపు, నలుపూ మచ్చలతో ఉన్న ఆ కుక్క. బాగా ఆకలి మీద ఉండడం వల్ల దాని డొక్కలెగిరి పడుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల ఎటూ కదలలేకపోతోంది. ట్రైన్ దిగి, అడ్మినిస్ట్రేటివ్ వింగ్ వైపు నడవబోయిన గార్డు గోపీకృష్ణ, ఒగురుస్తున్న కుక్కని చూసి, అక్కడే ఆగిపోయాడు.
చేతిలోవున్న వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి, అరచేతిని గుంటగా చేసి, అందులో నీళ్లు పోసి కుక్కముందుంచాడు. గబగబా కతుకుతూ దప్పిక తీర్చుకుంటున్న దాని వీపుమీద, చేత్తో ప్రేమగా నిమిరాడు. ప్రతిగా తోక ఊపుతూ దాని కృతజ్ఞతను తెలియజేసింది. ప్లాట్ ఫామ్ మీదున్న స్టాల్ లో బ్రెడ్ ప్యాకెట్ ఒకటి కొనితెచ్చి, ఆ కుక్కకి వేసాడు గోపీకృష్ణ. తినడానికి ఇష్టం లేదన్నట్టు మొహం పక్కకి తిప్పుకుంది.
అప్పుడు చూసాడు... దాని వెనక కాలికి గాయమయ్యి, రక్తం కారుతోంది. బాధతో కుక్క కళ్ళవెంట నీళ్లు కారుతున్నాయి. గబగబా జేబులోంచి కర్చీఫ్ తీసి, గట్టిగా కాలుకి బిగించి కట్టు కట్టాడు.
అప్పుడే అక్కడికి వచ్చాడు... సన్నగా, బక్క పలచగా ఉన్న పదమూడేళ్ల కుర్రాడు. శరీరం మీద మాసిపోయి, చివికిపోయిన నిక్కరు తప్ప, ఒంటిమీద మరే ఆచ్ఛాదనా లేదు. వచ్చే పోయే రైళ్లలోకి ఎక్కి, అడుక్కుంటూ బ్రతికెయ్యడానికి అలవాటుపడ్డాడని చూడగానే అర్థమవుతోంది. ఆకలి బాధ బాగా తెలిసిన వాడు… చెయ్యి చాపి అడుక్కుని తెచ్చిన చపాతీ ముక్కని, చిన్న చిన్న ముక్కలుగా తుంపి, కుక్కనోట్లో పెడుతూ, ప్రేమగా తినిపిస్తున్నాడు.
తినాలని లేకపోయినా, తన నేస్తం మనసు నొచ్చుకోకూడదనుకుందో ఏమో, బలవంతంగా ఓ ముక్కని పళ్ళమధ్యలో కరుచుకుని, ఆ కుర్రవాడి చేతిలో మొహం పెట్టుకుని, మూగగా రోదించింది కుక్క. ఆ దృశ్యం చూసిన గార్డు గోపీకృష్ణ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కానీ టైమవుతుందడంతో డ్యూటీ గుర్తొచ్చిన గోపీకృష్ణ ముందుకి కదిలాడు.
ఆ రాత్రి షిఫ్టు పూర్తిచేసుకుని, స్టేషన్లో సంతకం పెట్టడానికి రైలు దిగిన గార్డు గోపీకృష్ణకి, ప్లాట్ ఫార్మ్ మీద ఉండే ఆ కుక్క చనిపోయి కనిపించింది. దాని పక్కనే మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని కూచుని, ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. ఈ భూమ్మీద రుణం తీరిపోయిన ఆ కుక్క, నిర్జీవంగా కొయ్యలా బిగిసిపోయి, కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూస్తుండిపోయింది. ఆ దృశ్యం చూసి, గోపీకృష్ణ మనసు ద్రవించిపోయింది.
మెల్లగా పిల్లవాడి దగ్గరకి వెళ్ళి... "బాబూ! ఏడవకు. దానికి రుణం తీరిపోయింది… చనిపోయింది. పాపం గాయాలతో ఎంత గిలాగిల్లాడిందో. ఇప్పటికైనా దానికి విముక్తి కలిగింది. అదిసరే… చూస్తుంటే అనాథలా ఉన్నావు. నీ పేరేంటి బాబూ?" అని అడిగాడు.
ఆ పలకరింపుకి తలెత్తి చూసిన ఆ పిల్లవాడు కళ్ళు తుడుచుకున్నా, దుఃఖం ఆగకపోవడంతో ముక్కు ఎగబీలుస్తూ, ఎక్కిళ్ళ మధ్యన... "అ బ ద్ధం!" అని సమాధానమిచ్చాడు.
"అ బ ద్ధ మా!? అదేం పేరు?" అయోమయంగా చూసాడు గోపీకృష్ణ.
నాపేరు అదేనన్నట్టు తలూపాడు ఆ పిల్లాడు. ఏ పూటకాపూట ఆకలి తీరే మార్గం గురించి ఆలోచించడం తప్ప, వేరే ఆలోచనలు ఏవీ లేని ఆ కుర్రవాడిని చూస్తే జాలేసింది గోపీకృష్ణకి. చీదరించుకునే ఈ లోకంపై కూడా వాడికి ఏమాత్రం కోపం లేదు.
"ఔను సారూ! నా పేరు అబద్ధమే! అది ఈ లోకంలోని మలినం నిండిన మడుసులు నాకు పెట్టిన పేరు. ఎందుకంటే నేను నిజాలు మాత్రమే మాటాడతాను కాబట్టి. నేను జెప్పే ఆ నిజాలు... కొందరి అబద్ధపు బతుకుల్ని బయటెడతాయి. ఆళ్ళకి శిచ్చ పడినప్పుడు కసిగా నన్ను తిట్టుకుంటూ... "అబద్ధం... ఆడు చెప్పేది అబద్ధం... ఆడి పుట్టుకే అబద్ధం..." అంటా కసిగా, హేలనగా మాటాడతారు.
అమ్మా, అయ్యా ఎవరో తెలీని అనాద ఎదవనని అందరికీ లోకువ. పోనీయ్ సారూ! నేనేందో నాకు తెల్సు. అందుకే ఎవ్వరు అబద్ధం అని పిల్సినా, ఎదురు మాటాడకుండా పల్కతాను. ఎందుకంటే ఆళ్ళు అట్ట పిల్సినప్పుడల్లా నాలో నిజ్జాయితీ ఇంకా పెరిగుతాది." నిండా పదమూడేళ్ళు కూడా లేని వాడి మాటలు గోపీకృష్ణని చాలా ఆలోచింపచేసాయి.
"అబద్ధం అని పిలిస్తే నీకు కోపం రాదా? అయినా నీకు ఆ పేరెవరు పెట్టారు?" చుట్టూ ఉన్న ప్రపంచమే ఓ పెద్ద మాయ అని తెలిసినా, ప్రవాహంలో కొట్టుకుపోకుండా, తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ కుర్రాడిని చూస్తే ముచ్చటేసింది గోపీకృష్ణకి.
"అంటే... నువ్వు అవసరమైతే కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెబుతావా? ఈ కుక్కంటే నీకు ప్రాణమని తెలుస్తోంది. చూస్తుంటే… చూస్తుంటే దాన్ని ఎవరైనా గాయపరిచి, చంపేసి వుండొచ్చనిపిస్తోంది. రేపు నిన్ను కూడా ఇలా చేస్తే… ఆడిగేందుకు నీకెవరున్నారు?" తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగాడు గోపీకృష్ణ.
"నేను సూసిందైతే తప్పకండా చెప్తాను. చెప్పినందుకి ఎంతో కొంత ఇచ్చేటోళ్లకి నా మాటకున్న ఇలువ తెల్సు. ఆళ్ళంతా నాకు అయినోళ్లే. నాకేం కాదులే సారూ… నేను బతికుండగానే సెత్తకుప్పల కాడికిసిరేసిన మా యమ్మే నన్ను కాదనుకున్నాది.
ఎవులో సంపి పడెత్తారన్న బయం నాకు లేదు" లోకం నాడి తెలిసినవాడిలా చెబుతున్న వాడి మాటలు… వినడానికి చాలా ఆసక్తిని కలిగిస్తున్నా, టైమ్ లేకపోవడంతో క్యాoటీన్ వైపు దారితీసాడు గోపీకృష్ణ. వెళ్తూ వెళ్తూ…
"సరే! ఈ వందా ఉంచు. ముందు ఏదైనా కొనుక్కుని తిను. చాలా నీరసంగా ఉన్నావు" అంటూ వందనోటు తీసి, అబద్ధం చేతిలో పెట్టాడు.
ఆకలికి లోపలకి అణిగిపోయిన డొక్కలు, ఎక్కిళ్ళతో అదిరిపడుతుంటే అబద్ధం కళ్ళల్లో నీళ్ళు ఇంకా సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. అందుకు కుక్క చచ్చిపోవడం ఒక కారణమైతే, రోజూ తనని పలకరిస్తూ, వారం రోజులుగా జాడ తెలియకుండా పోయిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి మరో కారణం. అబద్దానికి దుఃఖం ఆగడంలేదు.
గోపీకృష్ణతో మాట్లాడినంతసేపూ వాడి కళ్ళు దేనికోసమో అన్వేషిస్తూనే ఉన్నాయి. ఆ అన్వేషణ వెనకున్న భయం గొలిపే ఆలోచనలు, ఆ చిన్ని మస్తిష్కంలో అలజడులు రేపుతున్నాయి. బ్రతుకు పోరాటంలో దెబ్బలు తినీ, తినీ రాటుదేలిన ఆ పసి మనసు, వయసుకి మించిన ఆలోచనలతో సతమతమవుతోంది.
*********************
గూడూ, నీడా లేని దుర్భరమైన బ్రతుకు. ఆకలేస్తే కడుపునింపుకోవడానికి చెయ్యి చాచటం, నిద్దరొస్తే ప్లాట్ ఫామ్ మీదనే ఓ మూలకి ఒదిగి పడుకోవడం... ఉరుకుల, పరుగుల ప్రపంచంలో ఎన్నో రకాల మనస్తత్వాలున్న మనుషుల్ని చూసాడు ఆ పసివాడు. ఎవ్వరూ పట్టించుకోని ఆ కుర్రాడిని, ఓ పంతొమ్మిదేళ్ళ అమ్మాయి మాత్రం పట్టించుకునేది.
చిరునవ్వుతో ఆమె పలకరింపుగా చూసే ఆ ఒక్క క్షణం కోసం రోజూ ఎదురుచూసేవాడు అబద్ధం. ఎప్పటిలాగే రైలెక్కడానికి వచ్చిన ఆమె కూచున్న బెంచ్ వైపుకి వెళ్ళాడు అబద్ధం.
చుడీదార్ వేస్కుని, పొడవాటి జడను ముందుకు వేస్కుని… వేలితో జుట్టు కొసలు తిప్పుతూ ఆలోచిస్తూ కూచుంది ఆ యువతి. మరో చేతిలో ఉన్న పుస్తకాలు జారిపోకుండా గట్టిగా గుండెలకి దగ్గరగా చేర్చి పట్టుకుంది. అబద్ధం తనవైపుగా రావడం గమనించి పలకరింపుగా నవ్వింది.
"అక్కా! రోజూ ఇదే బండెక్కి యాడకి బోతావు?" చేతిలో ఉన్న పుస్తకాలలో, ప్రపంచాన్ని చదివెయ్యాలనుకుంటున్న ఆ అమ్మాయి వంక వింతగా చూస్తూ అడిగాడు అబద్ధం.
"నాలాగా చదువుకుంటే నీకూ తెలిసేది" నవ్వుతూ సమాధానమిచ్చింది ఆ అమ్మాయి. నవ్వుతున్నప్పుడు ఆ అమ్మాయి కుడి దవడ ఎముక, క్రింది భాగంలో లోపలకి గుంతపడటంతో, దవడ మరింత లోపలికి పోయేది.
"నీ దవడ లోనికెందుకు పోతావుందక్కా?" బెంచ్ మీద చివరగా కూచుంటూ… కుతూహలం ఆపుకోలేక అడిగాడు అబద్ధం.
"చిన్నప్పుడు రోడ్డు మీద ఆడుకుంటుంటే... పక్కనుంచి పోతున్న లారీ వెనక చక్రానికి, ముందువైపున వేలాడుతూన్న ఇనుప హుక్కు నాకు తగులుకుని, రోడ్డు మీద కొంత దూరం నన్ను ముందుకి ఈడ్చుకుపోయింది. అప్పుడే ఈ చెవికి ముందున్న దవడ ఇలా చీలిపోయింది" జరిగిన సంఘటన తాలూకు భయం మొహంలో నీడలా కడలాడుతుంటే చెప్పిందా అమ్మాయి.
"మరి... లారీని ఎవ్వురూ ఆపనేదా?" నోరు తెరుచుకుని, ఆమె ఏం చెబుతుందోనని, ఆసక్తిగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు అబద్ధం.
"ఆపితేనే కదా ఆగింది" ఆ అమ్మాయి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.
"ఏవురు?" కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు.
"రెండు చక్రాలకీ మధ్యన నలిగిపోయిన మా నాన్న!" చేతుల్లో ముఖం దాచుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది ఆ అమ్మాయి.
"ఏడ్వకక్కా! అమ్మా, అయ్యా ఎట్టుంటరో నాకు తెలవదు. నేనేడుస్తన్ననా? నాకన్నా మూరెడెత్తున్నావు. నువ్వేడిస్తే... నాకూ ఏడుపోస్తాoది. నీకు అమ్మేనా ఉన్నాది కదా..." ఆమెని ఎలా సముదాయించాలో తెలీక సతమతమవుతూ అన్నాడు అబద్ధం.
"హు! అమ్మ! ఒంటరిగా పోరాడుతూ… నన్ను పెంచలేక, తాను పనిచేస్తున్న దుకాణం యజమాని మాయలోపడి, అతడ్ని రెండోపెళ్లి చేసుకుంది."
"మంచిదేగా... మడిసికి మడిసి తోడుంటారు..."
"అతను మనిషైతే కదా! నన్ను చూస్తేనే ఇంతెత్తున లేచేవాడు. ఎంగిలి మెతుకులు విదపడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. బళ్ళోకెళితే కాళ్ళు విరిచేస్తాననేవాడు. దుకాణంలో నాచేత గొడ్డు చాకిరీ చేయించేవాడు. అతని కళ్లుగప్పి ఓరోజు ఇంటినుంచి పారిపోయా. అలా ఈ రైల్వే స్టేషన్ చేరాను.
ఎవరో తెలీదు కానీ, ఓ పెద్దావిడ నన్ను చదివిస్తోంది. తరచూ ఈ స్టేషన్లో బండి దిగే ఓ పంతులు నా పరిస్థితి గురించి చెబితే తెలుసుకుందట… నెల నెలా నా చదువుకీ, ఖర్చులకీ డబ్బు పంపుతుంది. కానీ ఎందుకో నన్ను కలవడానికి మాత్రం ఇష్టపడదు."
చెబుతున్నదల్లా తాను ఎక్కాల్సిన రైలు కూతవేస్తూ, ప్లాట్ ఫామ్ పై వచ్చి ఆగడంతో, లేచి గబగబా బ్యాగ్ భుజాన తగిలించుకుని, అటువైపు నడిచింది.
"అక్కా! నీ పేరేంది?" చెయ్యెత్తి ఆగమన్నట్టు ఆమె వెనకే పరిగెత్తాడు అబద్ధం.
"మీ నా... మీనా కుమారి!" నవ్వుతూ, బోగీలోకి ఎక్కేసిన ఆమెకు 'బై' చెబుతూ, గాల్లోకి చెయ్యి ఊపుతూ అక్కడే నుంచుండిపోయాడు అబద్ధం. కాస్సేపటి తర్వాత తోక ఊపుతూ, తన కాళ్ళ దగ్గర తచ్చాడుతున్న కుక్క తలమీద ప్రేమగా నిమురుతూ, అక్కడ జరిగినదాని గురించి మర్చిపోయాడు.
ఆరోజు సాయంత్రం తిరుగు రైలులో ఆమె వస్తుందేమోనని అక్కడే నుంచుని ఎదురుచూడసాగాడు అబద్ధం. రైలు వచ్చి ఆగింది... తిరిగి బయల్దేరి వెళ్ళింది... కానీ ఆ అమ్మాయి దిగలేదు. అలా ఒకటి కాదు, రెండు కాదు… వారం రోజులు గడిచాయి.
అబద్దానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. రైల్వే పోలీసుల్ని ఆశ్రయించినా, మీనాకుమారి ఆచూకీ దొరకకపోవడంతో, ఆమె ఏమయ్యిందోనన్న ఆందోళనతో గిలాగిల్లాడిపోయాడు. ఎవరికి చెప్పుకోవాలి? ఎవరితో తన బాధను పంచుకోవాలో తెలీక, తన నేస్తమైన కుక్కని పక్కన కూచోబెట్టుకుని, దానితోనే మాట్లాడుకునేవాడు.
ఆ మూగప్రాణికి ఏమర్థమయ్యిందో కానీ, చుట్టుపక్కల అంతా వెతికేది. కొంతసేపటి తర్వాత తిరిగివచ్చి అబద్ధం ముందు దిగాలుగా పడుకునేది.
ఆ రోజు... చనిపోయే రోజున తీవ్ర గాయాలతో రొప్పుతూ... కొనఊపిరితో ఉన్న కుక్కని చూస్తే, ఏదో జరక్కూడనిది జరిగిందని మాత్రం అర్థమయ్యింది అబద్ధానికి. కానీ ఏం జరిగిందో నోరుతెరిచి చెప్పలేని ఆ మూగజీవికి ఆయువు తీరి అనంత లోకాలకి వెళ్లిపోవడంతో, తీరని ఆవేదనతో కుంగిపోయాడు.
'ఏవయ్యుంటాది? మీనాకుమారి ఏదేని కట్టంలో సిక్కుకోనుంటే… ఈ కుక్క కాపాడబోయి పానం మీదకి తెచ్చుకున్నాదా? అక్క ఏదేని ఆపదలో ఉన్నాదా?' సమాధానం దొరకని ప్రశ్నలతో ఆ పసిమనసు విలవిల్లాడింది.
ఉన్న ఒక్క నేస్తం దూరం కావడంతో, ఇక మీనాకుమారి ఆచూకీ తెల్వడం కష్టమే అన్న నిరుత్సాహంతో కుంగిపోయాడు అబద్ధం.
=========================================================
ఇంకా ఉంది
=========================================================
వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ
నమస్తే!
సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.
రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.
వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.
మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.
వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.
ధన్యవాదములు. 🙏🏼
ఇట్లు,
వేలూరి ప్రమీలాశర్మ.