నూర్జహాన్
- Malla Karunya Kumar
- 1 day ago
- 6 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #నూర్జహాన్, #Nurjahan, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు, #కొసమెరుపు

Nurjahan - New Telugu Story Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 08/05/2025
నూర్జహాన్ - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
చాలా రోజులు నుండి తన కొడుకు ఆదిత్యని గమనిస్తూనే వున్నాడు మధుసూదన్!. కొడుకు ప్రవర్తనలో ఏదో తెలియని కొత్త కోణం కనిపిస్తుంది!. “ఇన్నాళ్లు కాస్త సమయం దొరికితే తనతో మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఎంత సేపూ గదిలోనే ఉంటున్నాడు!. కొన్ని సార్లు చెప్పాపెట్టకుండా హడావుడిగా బయటకు వెళ్తుంటాడు, . ” ఇవన్నీ తండ్రికి కొడుకు మీద అనుమానం కలిగేలా చేసాయి. కొడుకు చదువుకొని ఉద్యోగంలో స్థిర పడటంతో సంతోషించాడు మధుసూదన్! కానీ ఇప్పుడు కొడుకు ప్రవర్తన లో ఏదో తేడాగా ఉండటం తో అదేమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. కొడుక్కి తెలియకుండానే కొడుకుని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు తెలిసింది తన కొడుకు పోస్ట్ ఆఫీసుకు వెళ్లి ఎవరికో పోస్ట్ పంపిస్తున్నాడు అని.
“అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అనే వారు అందరూ ఏదో విధంగా కాంటాక్టులో వుంటారు కదా?.
మరి వీడేంటి! పోస్ట్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ వున్నాడు?. ఏదో నా దగ్గర దాస్తున్నాడు. నిజం ఏంటన్నది తెలుసుకోవాలని. ” కొడుకుని నేరుగా అడగాలి అనుకున్నాడు కానీ ఇది సరైన సమయం కాదు అని వెనక్కి తగ్గాడు.
కొన్ని రోజుల తర్వాత ఆదిత్య పని మీద వేరే ఊరికి వెళ్ళాడు. “ఇదే సరైన సమయం వీడి రూమ్ వెతికితే మనకి వివరాలు దొరుకుతాయి. ” అని వెతకడం ప్రారంభించాడు.
ఎక్కడ ఎటువంటి వివరాలు దొరకలేదు చివరికి అనుమానం వచ్చి బెడ్ ని పైకి ఎత్తాడు. అక్కడ చాలా లెటర్స్ ఉన్నాయి!. అందులో నుండి ఒక లెటర్ తీసి చూసాడు అందులో నూర్జహాన్ అని పేరుంది.
“నూర్జహానా!!. ”. అని ఆశ్చర్యంతో! “అప్పుడప్పుడు ఆదిత్య పోస్ట్ ఆఫీస్ వెళ్లడానికి కారణం ఈ నూర్జహాన్ అన్న మాట!” అని అనుకుంటూ కేస్ ఛేదించిన ఆఫీసర్ లా ఫీల్ అయ్యాడు. ఆ లెటర్ ని చదవడం మొదలుపెట్టాడు.
‘మీ అభిమానం పొందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను!. ఈరోజుల్లో కూడా మీలాంటి అభిమాని ఉండడం నా అదృష్టం. అలాగే నేను రాసిన ప్రతి రచనకు, కవితకు బదులిస్తూ లెటర్ పంపిస్తున్నారు. కానీ మొన్న మీరు పంపిన లెటర్ చాలా స్పెషల్ గా ఉంది. మీరు నా మీద ఇష్టం వ్యక్తం చేస్తూ లెటర్ రాసారు. మీ మీద నాకు గల అభిప్రాయం అడిగారు. కానీ నా అభిప్రాయం చెప్పే ముందు మీరు నన్ను అంతలా ఎందుకు? ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి” అని ఉంది. ఇట్లు నూర్జహాన్ అని రాసివుంది.
ఇదంతా చదివిన మధుసూదన్ కి చెమటలు పట్టాయి. “అయితే ఈ వ్యవహారం ఎప్పటినుండో జరుగుతుందన్న మాట.. వెంటనే వీడిని దారిలో పెట్టాలి.. లేక పోతే నూర్జహాన్ అనే అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చినా వస్తాడు. నా కొంప ముంచుతాడు. అందరితో నా కొడుకు అంటూ వీడి గురించి చాల గొప్పలు చెప్పుకున్నాను. నా కొడుకు నా మాట కాదనడు అని చెప్పుకున్నాను. ఏ మాత్రం తేడా జరిగినా నా పరువు పోతుంది నలుగురిలో తలెత్తుకు తిరగలేను” అని అనుకున్నాడు.
మరుసటి రోజు ఆదిత్య ఇంటికి వచ్చాడు. కొంత సమయం తర్వాత ఆదిత్య రూంలో కి వెళ్ళాడు మధుసూదన్.
“ప్రయాణం ఎలా జరిగింది?. ”
“బాగానే జరిగింది నాన్న.. ”
“మరి నూర్జహాన్ ఎవరు.. ?”
“ఆమె!..”అంటూ మరో మాట మాట్లాడకుండా ఆగిపోయాడు ఆదిత్య తండ్రి వైపు ఆశ్చర్యంతో చూస్తూ!.. కాసేపు ఆగి, “ ఏమిటి నాన్న మీరు అడుగుతున్నారు?” అని విషయాన్ని పక్కద్రోవ పట్టించాలి అని చూసాడు.
తనకి దొరికిన లెటర్స్ ని ఆదిత్య ముందు వేస్తూ. “ ఏంట్రా ఇదంతా?.. ఎవరు ఆ నూర్జహాన్” అని గట్టిగా అరిచాడు మధుసూదన్..
అంతలా కోపంతో తన తండ్రిని ఎప్పుడూ చూడలేదు ఆదిత్య.. ”నాన్న అది!. ”అని ఏదో చెప్పబోయాడు!.
“నువ్వు ఏం చెప్పినా నేను విన దలుచుకోలేదు. ఆ లెటర్స్ చెప్తున్నాయి నీ మనసు ఏమిటి అన్నది. నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావు అని నేను గ్రహించగలను. నేను నీకు ఎక్కువుగా చెప్పదలుచుకోలేదు. ఒకే ఒక మాట చెప్పి వెళ్లిపోతాను తరువాత నీ ఇష్టం. ఆ అమ్మాయి అభిప్రాయాలు, ఆచారాలు వేరు, మనవి వేరు. అందుకే నేను ఈ ప్రేమకి పెళ్లికి ఒప్పుకోను.
నా మాట కాదని నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు కానీ, అలా నువ్వు చేస్తే మేము నీకు దక్కము. ”
అని హెచ్చరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మధుసూదన్.
ఆదిత్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన తండ్రి నుండి ఇలాంటి మాటలు వస్తాయి అని అనుకోలేదు.. చెల్లాచెదురుగా పడివున్న పేపర్లను తీసుకొని గుండెకు హత్తుకున్నాడు.. “నూర్జహాన్! ఐ మిస్ యు. ” అంటూ రోదించాడు. ఇదంతా తెలుసు కున్న ఆదిత్య తల్లి వచ్చి ఆదిత్యని బుజ్జగించింది. “నాన్న సంగతి నీకు తెలుసు కదా!.. ఈ వయసులో అతనికి ఇబ్బంది కలిగించకు” అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
తన తల్లితండ్రులు అంటే తనకి ఇష్టం కనుక వాళ్ళ సంతోషమే తన సంతోషమని ఇక మీదట నూర్జహాన్ అనే మాటను మరిచిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం కఠినమైనది కానీ తప్పనిది అని తనలో అనుకుంటున్నాడు.
“నాన్నకు ఈ విషయం తెలియకూడదు అనే ఇంటి అడ్రెస్, నా అసలు పేరు నూర్జహాన్ కి ఇవ్వకుండా తన ఫ్రెండ్ అడ్రెస్ ఇచ్చాను. నూర్జహాన్ అడ్రెస్ కనుక్కోవాలి అని చూశాను కానీ ఆమె తన అడ్రెస్ ఇవ్వ కుండా తన రచనలు ప్రచురించే పత్రిక అడ్రెస్ ఇవ్వడం తో వాళ్ళని ఆమె వివరాలు అడిగితే నాకు ఇవ్వకూడదు అని చెప్పారు. అయినా ఇలా దొరికిపోతాను అని అనుకోలేదు. ఈ విషయం నాన్నకు ఎలా తెలిసింది?. నాకు తెలియకుండా నాన్న నా మీద నిఘా పెట్టారా?. బహుశా అదే అయి ఉంటుంది. ఏదైతేనేం మొత్తానికి ఈ విషయం నాన్నకు తెలిసిపోయింది. నాన్న నా కోసం పడ్డ కష్టం నేను కళ్లారా చూశాను. నా కోసం అతని సంతోషం వదులుకొని నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చాడు. ఇప్పుడు అతని మాటలకు గౌరవం ఇవ్వకుండా నా ప్రేమ గురించి ఆలోచిస్తే, నా కంటే స్వార్థపరుడు ఎవడూ ఉండడు. ” అని తన ప్రేమను మరిచిపోయేలా తనకి తానే హిత బోధచేసుకున్నాడు.
మరుసటి రోజు ఉదయాన్నే ఆదిత్య దగ్గరకు వచ్చాడు మధుసూదన్.
“ఇంతకీ నీ నిర్ణయం ఏమిటి?”అని కొడుకుని అడిగాడు.
“నేను ఎప్పుడైనా మిమ్మల్ని వదిలి వుండగలనా నాన్న. ” అంటూ తండ్రిని కౌగలించుకున్నాడు.
“నీ బాధ నాకు అర్థం అయ్యింది ఆదిత్య.. నేను ఏమి చేసినా నీ మంచికోసమే అని గ్రహించు..
నాకు తెలుసు నీకు మేమంటే ఎంత ఇష్టమో.. సరే వెళ్లి బయలుదేరు మనం ఒక చోటుకి వెళ్ళాలి. ”
“ఎక్కడికి నాన్న?. ”
“ఈ రోజు నీకు పెళ్లి చూపులు. అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ”
ఈ మాట విని ఆదిత్య ఆశ్చర్యపోయాడు!. ఈ పరిణామాన్ని ఊహించని ఆదిత్య శిలలా ఉండిపోయాడు. తన చేతకాని స్థితికి నవ్వుకున్నాడు. తనని తానే ప్రాణమున్న శిలలా భావించాడు.
“సరే మేము ఏర్పాట్లు చేస్తాము నువ్వు రెడీ అవ్వు. ” అని చెప్పి తండ్రి వెళ్ళిపోయాడు. ”
నేను రాను అని చెప్పాలి అనుకున్నాడు. నూర్జహాన్ తనకి కావాలని గట్టిగా అరవాలి అనుకున్నాడు కానీ తాను ఇప్పుడు శిల కదా! తన అంతరంగం ఎవరికి వినపడదు అని తనలోనే తన బాధను దిగమింగుకుంటూ బయలుదేరాడు.
అందరూ కలిసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లారు. అమ్మాయి బాగానే వుంది!. ఆమె వైపు చూసాడు కానీ, ఇతని మనసు నిలవడం లేదు.. మనసు నూర్జహాన్ అనే తపిస్తుంది.
ఇంతలో మధుసూదన్.. “రేయ్ అలా ఏదో కోల్పోయినట్టుగా ముఖం పెట్టకు, వాళ్లకు అనుమానం వస్తుంది.. అమ్మాయి బాగానే వుంది కదా?” అని అడిగాడు. ”
ఏదో పరాకులో వుంటూ తల ఊపాడు ఆదిత్య.
“మా అబ్బాయికి అమ్మాయి నచ్చింది అంట. ఇక మీ నిర్ణయం ఏమిటో చెపితే ముందుకు సాగుదాం. ”అని మధుసూదన్ అడిగాడు.
తమకి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు అని అమ్మాయి తరుపు వాళ్ళు చెప్పడం తో పెళ్లికి ముహూర్తాలు పెట్టేసారు.
హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు మధుసూదన్, అతని భార్య.
పెళ్లికూడా జరిగిపోయింది..
పెళ్లైంది కానీ ఆదిత్య ను ప్రేమ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి.. తన భార్యతో సక్రమంగా ఉంటాడు కానీ ఎక్కువుగా ఆమెతో ఉండడు. ఒకరోజు ఏదో పరాకులో తన భార్యను నూర్జహాన్ అని పిలిచాడు!. “అయ్యో నా పేరు నూర్జహాన్ కాదండి!. నా పేరు మేఘన. ”అని భార్య అనడం తో.. అది కావాలనే అలా పిలిచాను నువ్వు నూర్జహాన్ లా వుంటావు కదా అని దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేసాడు. “ఆ మాటకు భార్య మెలికలు తిరుగుతూ మురిసిపోయింది. పెళ్ళైన ఇన్ని రోజులకు తన భర్త తనతో ఇలా మాట్లాడాడు అని సంతోషించింది. ఏదో తప్పించుకోవడానికి ఈ మాట అన్నాడు కానీ ఆదిత్య కు మేఘన అంటే ఇష్టం లేదు.
ఇలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు మేఘన రూమ్ సర్దుతూ ఉంది. బీరువా కూడా సర్దాలని తెరిచింది. అనుకోకుండా బీరువాలో ఉన్న పెట్టె ఒకటి కింద పడింది!. అది కింద పడి తెరుచుకోవడం తో అందులో నుండి కొన్ని పేపర్లు కింద పడ్డాయి!. అవి తియ్యడానికి సిద్ధం అయ్యింది.. అవి చూస్తుంటే లెటర్స్ లా ఉన్నాయి. ఏమిటి ఇవి అని కుతూహలం తో తీసి చదివింది. తన భర్త ఒకరోజు తనని నూర్జహాన్ అని పిలవడానికి కారణం తెలిసింది. అందుకేనా తన భర్త తనతో సఖ్యంగా ఉండటం లేదు అంటూ ఆలోచనలో పడింది!. ఇవన్నీ దాచి నన్ను పెళ్లిచేసుకున్నారు ఇతను.. ఈ విషయాన్ని మామయ్య దృష్టికి తీసుకు వెళ్తాను అంటూ ఆ పేపర్స్ తీసుకొని తన మామ దగ్గరకు వెళ్ళింది.
“మామయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి. ”
“ఏమిటో చెప్పమ్మా?. ”
తన దగ్గర ఉన్న లెటర్స్ ని మధుసూదన్ కి ఇచ్చింది.
వాటిని చూడగానే కంగారుతో కుర్చీ నుండి పైకి లేచాడు..
“ఈమెకు ఇవి ఎక్కడ దొరికాయి?.. ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి. ” అంటూ కంగారు పడుతున్నాడు!.
“ఇదంతా నా దగ్గర దాచి మీరు ఈ పెళ్లి చేసారు. పోనీ ఇదంతా గతం అనుకోని మరిచిపోదామన్నా మీ అబ్బాయి ఇంకా ఆ జ్ఞాపకాల్లో జీవిస్తున్నాడు. మీరే దీనికి సమాధానం చెప్పాలి. ”
“ఈ విషయం నీకు చెప్పక పోవడం పొరపాటే.. ఇప్పుడు నువ్వు ఎలాంటి విపరీత నిర్ణయం తీసుకోకు. నేను దీనికి ఉపాయం ఆలోచిస్తాను. వాడితో మాట్లాడుతాను మీ ఇద్దరిని దగ్గర చేసే బాధ్యత నాది. ”
“లాభం లేదు మామయ్య. మీరు ఎన్ని చెప్పినా, మీ అబ్బాయి వినే స్థితిలో లేడు!. ”
కోడలు మాటలు విని కంగారు పడ్డాడు మధుసూదన్.. ఈ కారణంతో కోడలు ఏమైనా కొడుకుని వదిలేస్తుందా అని భయపడ్డాడు. చెమటలు పడుతున్నాయి మధుసూదన్ కి.
మామ పరిస్థితి అర్థం చేసుకుంది మేఘన. “కంగారు పడకండి మామయ్య. మీరు అనుకున్నట్టు నేను మీ అబ్బాయిని ఈ కారణంతో వదిలేసి వెళ్ళను.. ఈ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ”
కోడలు మాటతో మధుసూదన్ కి టెన్షన్ తగ్గింది.. “ఆ పరిష్కారం ఏమిటి అమ్మా. ” అని ఆశ్చర్యంతో అడిగాడు.
“ఈ లేటర్లో ఉన్న నూర్జహాన్, నేనే అని మీ అబ్బాయితో చెప్పండి. ”
ఆశ్చర్యపోయాడు!.. ”అలా ఎలా అవుతుంది అమ్మ!, నూర్జహాన్ అనే పేరు మన వాళ్ళు ఎవరూ పెట్టుకోరు కదా! వాడు నమ్ముతాడా?.. ”
“అందుకే ఆ పేరు నా కలం పేరు అని చెప్పండి.. ఆ పేరుతో నేను రచనలు చేసాను అని చెప్పండి. ”
“ఈ మాట విని ఆశ్చర్యపోయాడు మధుసూదన్!.. ఈ ఉపాయం బాగుంది దీన్ని తప్పకుండా అమలు చేస్తాను. ఇలాంటి ఉపాయం ఇచ్చినందుకు చాలా థాంక్స్ అమ్మ.. వాడు రాని వాడితో నేను చెపుతాను” అని కొడుకు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆఫీస్ సమయం ముగియడం తో ఆదిత్య ఇంటికి చేరుకున్నాడు.
ఇంటికి వచ్చిన కొడుకుతో.. “రేయ్ ఆదిత్య నీతో మాట్లాడాలి ఫ్రెష్ అయ్యి రా, మన గార్డెన్లో వుంటాను. ” అని చెప్పాడు.
“సరే” అంటూ ఫ్రెషప్ అయ్యి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. “ఏదో మాట్లాడాలని పిలిచారు నాన్న.. ఇంతకీ ఏమిటా విషయం?. ”
“నువ్వు పదిలంగా దాచుకున్న ప్రేమలేఖ లు నీ భార్యకు దొరికాయి. నువ్వు తనతో సఖ్యంగా లేవని అందుకు కారణం ఈ ప్రేమలేఖలే అని నన్ను అడిగింది. ”
ఈ మాట విని కంగారుపడ్డాడు!.. నాన్న అని మాట్లాడబోతుండగా..
‘నేను చెప్పేది పూర్తిగా విను.. నీకు వచ్చిన లేఖల్లో ఉన్న నూర్జహాన్ అన్న పేరు ఎవరిదో కాదు మన మేఘనది!.. విచిత్రం ఏమిటి అంటే అది ఆమె కలం పేరు.. ఆ పేరుతోనే తాను రచనలు కొనసాగించింది.. ఆ విషయం తానే చెప్పింది. ” అని మేఘన చెప్పిన విధంగా చెప్పాడు మధుసూదన్.
తండ్రి చెప్పింది విని ఆశ్చర్యపోయాడు!.. ఇన్నాళ్లు తనకు దక్కదు అనుకున్న ప్రేమ తన కళ్లెదుటే ఉందా?.. అంటూ వేగంగా మేఘన దగ్గరకు చేరుకున్నాడు.. ఆమె దగ్గరకు వెళ్లి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు! ఎందుకో ఆదిత్య కు అనుమానం కలిగింది?.. ఇదంతా నిజమేనా? అంటూ ఆలోచనలు చేస్తున్నాడు..
ఆదిత్యను చూసి “ఏమైంది అండి!. ఏదో ఆలోచిస్తున్నట్టు వున్నారు!. ”
“నువ్వు చెప్పింది నిజమేనా? నువ్వు నిజంగా నూర్జహాన్ పేరుతో రచనలు చేసావా?.. ”
“మనిద్దరికే తెలుసు ఈ మనసు పెనుగులాట.. అన్న కవిత చదివిన క్షణం ఏదో తెలియని భావన నన్ను కట్టిపడివేసింది.. ” అని మేఘన అనడం తో ఆదిత్య కళ్ళవెంబడి నీళ్లు కారాయి.. ఇది నేను నూర్జహాన్ కి రాసిన మొదటి లేఖ.. అనుమానం లేదు నువ్వు నా నూర్జహాన్ వే అంటూ ఆమె దగ్గరకు చేరుకున్నాడు..
“మళ్ళీ నిన్ను కలుస్తాను అని అనుకోలేదు. కానీ కాలం ఈ విధంగా మనల్ని కలుపుతుంది. ” అని నేను ఊహించ లేదు అంటూ ఆమెను కౌగలించుకున్నాడు..
సమాప్తం..
******
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.