దేవమణి
- Surekha Puli

- May 7
- 5 min read
#SurekhaPuli, #సురేఖ పులి, #Devamani, #దేవమణి, #TeluguStory, #తెలుగుకథ

Devamani - New Telugu Story Written By Surekha Puli
Published In manatelugukathalu.com On 07/05/2025
దేవమణి - తెలుగు కథ
రచన: సురేఖ పులి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
మన పురాణాల్లో దేవలోకం, భూలోకం, పాతాళలోకం అని చెబుతూ నాగలోకం అని కూడా చెప్పడం జరిగింది.
శివ భక్తులు వాసుకి శంకరాభరణం అని, విష్ణు భక్తులు అనంత శేషుడు అని పాములను దైవ సమానంగా పూజిస్తారు.
శిల్ప సర్పాలకు, మట్టిపుట్టలకు శ్రద్ధాభక్తులతో, సుహృద్భావంతో శ్రావణ మాసంలో నాగుల పంచమి నాడు మరియు ఆశ్వయుజ మాసంలో నాగుల చవితి రోజు భక్తులు నియమ నిష్టలతో కొలుస్తారు.
నాగ దేవత నివాస రూపముగా తలచి పూజలు, నోములు, ఉపవాసాలతో తమలోని కష్టాలకు నివృత్తి చూపమని వేడుకుంటారు. పాము కాటు నివారణకు, సంతానోత్పత్తికి మరియు కుటుంబ శ్రేయస్సు కోరుకొని పూజిస్తారు. ఇది ఒక నమ్మకం!
*****
ఎన్నో సంవత్సరాల క్రితం నాగలోకంలో నాగుల జనాభా ఎక్కువగా ఉండేది. ఆహారం వసతులు తక్కువై వారి వారి శక్తి మేరకు చాలా వరకు పాములు భూలోకానికి వలస వచ్చాయి.
కొందరు పాము విషజంతువని చంపడం మొదలు పెట్టారు. నాగుల సంతతి తగ్గిపో సాగింది. ఈ పరిస్థితి నుంచి రక్షించే క్రమంలో నాగులు ఎంతో ప్రయాస పడ్డాయి. ముఖ్యంగా ‘ఆడ సంతతి’ లేక నాగుల సంఖ్య తగ్గి పోసాగింది.
ఇదిలా ఉండగా ఒక నాగుల జంటకు చక్కటి ముద్దుల ‘చిన్నారి’ పుట్టింది. అదృష్టవశాత్తు ఆ పాప నెత్తిమీద కాంతివంతమైన మిరుమిట్లు గొలిపే ‘మణి’ వెలిసింది.
ఆ బుజ్జి పాపకు ‘దేవమణి’ అని పేరు పెట్టుకున్నారు. అమిత సంతోషంగా నాగ కుటుంబం మురిసిపోయారు. మిరుమిట్లు గొలిపే ‘మణి’ చూస్తే అందరికీ ఆనందమే కదా!
కాలయానం లో దాని ప్రాముఖ్యత పెరిగే కొలది తోటి నాగుపాములన్నిటికి ఈర్ష్యాసూయలు మొదలైనాయి. దేవమణిని ఎంతో రక్షణతో పెంచుతున్న తల్లిదండ్రులు గ్రహించి ‘జాగ్రత్త-భద్రత’ స్థాయిని పెంచారు.
*****
దినదినాభివృద్ధి చెందుతున్న దేవమణి తోటి వారితో ఆటలు ఆడుకుంటూ అందరి మన్ననలు పొందుతూ ఉండేది.
మరో వైపు దేవమణి అంటే అయిష్టత కలిగిన ఇతర పాములు కూడా వున్నాయి. కల్మషం లేని దేవమణి అట్టి స్నేహితులుగా చలామణి అవుతున్న శత్రువులను గమనించలేక పోయింది.
సహజ మణి కలిగిన దేవమణి యొక్క ‘మణి’ దొంగిలించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు.
ఇక లాభం లేదని ఒక రోజు దేవమణి తల పైన రాళ్ళతో కొట్టి బాధించారు. పాపం! దేవమణి తల రక్తం కారుతూ బొప్పి కట్టింది, హింస భరించింది. తల్లిదండ్రులు చూసి రేగడి మట్టిని ఔషధంగా పులిమి చికిత్స చేశారు.
ఒకానొక నాగుల పంచమి రోజు ఎందరో భక్తులు దేవమణి ను చూశారు. ముఖ్యంగా ధగ ధగా మెరుస్తున్న ‘మణి’ చూసి జన్మ తరించింది అనుకున్నారు.
ఇదొక అదృష్టంగా భావించి పూజలు అతిగా అంటే అధికంగా చేయసాగారు.
కొద్ది కాలానికి విరివిగా చందాలు పోగు చేసి అందమైన గుడి కూడా కట్టించారు. అనునిత్యం పూజలు చేస్తూ తమలో తాము తృప్తి పడే వారు.
ఇతర తోటి పాములకు, దేవమణి పేరు ప్రఖ్యాతులు సహించలేక మరింత దుర్బుద్ధి చెలరేగింది!
ఒకరోజు స్నేహితులు అనుకునే శత్రు పాములన్నీ సభ ఏర్పరచుకున్నాయి. కపటమైన నిర్ణయం తీసుకున్నాయి.
భక్తులు పాముల మట్టి పుట్టలో పాలు, గ్రుడ్డులు ధారగా పోసి, కుంకుమ పసుపు జల్లి, అగరవత్తులు వెలిగించి, దీపారాధన చేసి అరటిపళ్ళు నైవేద్యం సమర్పించారు. కోరికలు వెల్లడించి పూజలు చేసే వారు. ఈ క్రమంలో ఆ ప్రదేశం ఒక తిరనాళ్ళ వలె మారిపోయింది. జనసంచారం అధికమైంది.
ఎట్లయినను దేవమణిని హతమార్చాలని సరీసృపాలు జంతుజాలాన్ని సంప్రదించారు. ఇట్టి దుష్ట కార్యానికి ఎవ్వరూ సహకరించలేదు. నిరాశ చెంది, తమలో తాము చెడు ఆలోచనలు చేయుట మొదలు పెట్టాయి. చెడు బుద్ధి కలిగిన ప్రాణులకు మంచి ఆలోచనలు రావు.
ఆ క్రమంలో పాపపుణ్యాలు గురించి మర్చిపోయి చీమల వద్దకు గుంపులుగా వెళ్లి “చీమలు.. మీరు చాలా చిన్న ప్రాణులు. ఎంతో కష్టం చేసి మీ ఆహారాన్ని సమకూర్చుకుంటారు. పాపం! మీరంటే మాకు చాలా జాలిగా ఉంది.”
“ఇది మాకు అలవాటే, కష్టపడితేనే కదా ఫలితం దక్కుతుంది. జాలి ఎందుకు?” చీమలు అమాయకంగా అడిగాయి.
ఒక పాము అంది, “అయితే మాత్రం, ఎన్నాళ్ళు ఇలా కష్ట పడతారు? మీ శ్రమను మేము చూడలేక పోతున్నాము. మా వద్ద మీరు సుఖపడే మార్గం ఉంది. మీరు సరే అంటే మీకు సులభంగా ఆహారం లభించే సలహా చెబుతాము.”
వయసు మీరిన చీమ ఆశ పడింది, “మీకు పుణ్యం ఉంటుంది, ఆ సులభమైన మార్గం ఏమిటో చెప్పండి. ముసలితనం చాలా ఘోరమైనది. ఆహారం తెచ్చుకుని, దాచుకొని బ్రతకటం చాలా కష్టంగా వుంది. దయచేసి తొందరగా చెప్పండి.”
తనకే అతి తెలివి అనుకున్న పాము చెప్పసాగింది “ఈశాన్య దిశగా మట్టి పుట్ట ఉంది. అక్కడ ప్రజలు మా నివాసం అనుకొని పాలు, గ్రుడ్డులు ధారగా పోసి, కుంకుమ పసుపు జల్లి, అగరవత్తులు వెలిగించి, దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.”
“అయితే మాకేంటి లాభం?”
“పూర్తిగా వినండి. అక్కడున్న మట్టిలో ఏర్పడిన తేమ వలన బ్యాక్టీరియా అంటే ఏకకణ జీవులు, సూక్ష్మజీవులు కోకొల్లలు పుడుతుంటాయి. మీరు అక్కడ నివాసం మార్చుకోండి, మీరు కష్టపడకనే మీకు గృహము, ఆహారం, రక్షణ అన్ని సౌకర్యాలు లభ్యమవుతాయి” అభయమిస్తున్నట్లు చెప్పింది.
చీమలన్నీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చాలా సంతోషపడ్డాయి.
“పదండి పోదాం” అంటూ ఏ మాత్రం ఆలస్యం చేయక వెంటనే పాములు చూపించిన పుట్టకు వరుస కట్టి వలస బయలుదేరాయి.
*****
కొత్త పుట్టలో దేనికీ కొదువలేదు; పాములు సత్యమే చెప్పాయి అని చీమలన్నీ పాముల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు భక్తి పేరిట మట్టి పుట్టలో పచ్చి పాలు, గ్రుడ్ల ధారగా అర్పించారు. ఇట్టి చర్య ఆధారంగా సూక్ష్మజీవుల ఉత్పత్తి అతి వేగంగా ద్విగుణీకృతమైనది. అంతే, వివిధ ప్రాంతాల్లో నివాసమున్న చీమలకు వార్త చేరిపోయింది, అవి కూడా వలస వచ్చేస్తున్నాయి.
మరి అన్ని సులభం అంటే అందరికీ ఆశ! అలాగే చీమలకు ఆశ అధికమైనది.
ఇదే అదను అనుకుని శత్రు పాములు దేవమణి వద్దకు వెళ్లి ఎంతో ప్రేమగా “మనకు దగ్గరలో చక్కటి ఉద్యానవనం వుంది. ఎప్పుడూ ఒకే చోట ఆడుకుంటూ ఉంటే విసుగు; పద, మనం అక్కడికి వెళ్లి ఆడుకుందాం, రా..” అని నమ్మకాన్ని పెంచాయి.
దేవమణి తల్లిదండ్రులు వారించారు. అయినా దేవమణి వినలేదు, మొండి పట్టు పట్టింది, బ్రతిమాలింది.
బిడ్డ సంతోషం కంటే మిన్న లేదని చివరికి పెద్దలు ఒప్పుకున్నారు. పచ్చని తోట, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం; ఒక మూలగా మట్టి పుట్ట!
“రండి, రండి.. అందరమూ కలిసి ఆడుకుందాం, పాడుకుందాం” అంటూ కేరింతలతో అల్లరి చేశాయి.
కాస్సేపటికి పాములు ‘దోబూచులాట’ ఆడుకుంటున్నారు. అన్ని పాములు దాక్కున్నాయి. దేవమణి పాముల జాడ వెదుకుతూ అటూ ఇటూ పరిగెత్తింది. ఎవ్వరూ కనబడలేదు.
కొంచెం దూరంలో ఎదురుగా పసుపు కుంకుమలతో మట్టి పుట్ట కనబడింది. చిన్న రంధ్రాలు కలిగి ముచ్చటగా తోచింది.
దొంగ పాములు ఇక్కడ దాక్కున్నాయేమో అనుకొని దేవమణి పుట్టకు దగ్గరగా వెళ్లి చూసింది. ఎవ్వరూ కనబడలేదు. రంధ్రంలోకి తొంగి చూసింది. అంతా చీకటి! ఏదో కొత్త వింత వాసన! హాయిగా, గమ్మత్తుగా తోచింది!!
మెల్లిగా పుట్ట రంధ్ర ద్వారం వైపు పాకుతూ వెళ్ళింది. అనంత చీకటి, భయం లేదు. తన వద్ద కాంతులీను మణి సహాయంతో చకచకా పాకుతూ పుట్టలోకి వెళ్ళింది.
తనతో ఆడుకుంటున్న స్నేహితులు ఎవరూ కనపడలేదు. భయం వేసి ఒక్కొక్క పేరు పలికింది. జవాబు రాలేదు.
దేవమణి చేసిన శబ్దానికి చీమల ప్రశాంతతకు భంగం వాటిల్లింది. తమ నివాసాన్ని, ఆహారాన్ని దోచుకోవాలని ఎవరో ద్రోహి వచ్చి ఆక్రమించు కుంటున్నారు అని ‘వైర్‌లెస్ కమ్యూనికేషన్’ (తీగలు లేకుండా వార్త ప్రసారం చేసుకొనుట) ద్వార పుట్ట అంతా సమాచారం పాకిపోయింది.
*****
హెచ్చరికలు చేసుకొని చీమలన్నీ అప్రమత్తమయ్యాయి. మిరుమిట్లు గొలిపే మణి కాంతి వలన కొంత భయం-బీభత్సం కూడా చోటు చేసుకుంది.
యుద్ధప్రాతిపదికన చీమలన్నీ గుమిగూడి ఒక్కసారిగా దేవమణి పైన దాడి చేశాయి.
ఇటువంటి దుస్థితి ఎన్నడూ ఎరుగని దేవమణి ముందు ఆశ్చర్యపడినా, కసెక్కిన చీమలన్నీ కుట్టడంతో ఎదురుతిరిగింది. చర్మానికి నొప్పి తెలుస్తుంది. అల్లారుముద్దుగా పెరిగిన దేవమణికి మొట్టమొదటి సారి ‘బాధ’ అంటే అర్థం తెలిసింది.
షట్కోణ ఆకారంలో ఉన్న మణి రాపిడితో తన శరీరాన్ని కరుచుకున్న చీమలను కష్టపడి విధిలించుకుంది. కొన్ని చీమలు నలిగి చనిపోయాయి. కొంతసేపు పోట్లాడిన పిమ్మట రాపిడి అధిగమించి మణి రాలిపోయింది.
మిరుమిట్లు గొలిపే మణి నేలపై పడిన వెంటనే కాంతి కోల్పోయింది. దేవమణి అప్పటికే మట్టి పుట్ట ద్వారాన్ని చేరుకుంది.
త్వర త్వరగా తన ఇల్లు చేరుకోవాలని, అమ్మ నాన్నలను హత్తుకొని జరిగిన విపత్తు చెప్పాలి.. దేవమణి ఆరాటం హెచ్చింది.
“అయ్యో! దేవమణి.. ఏమైంది? నీ తల పైన దీప్తి విరజిమ్మే మణి ఏదీ? ఎక్కడ పోగొట్టుకున్నావు?
పుట్టలో గాని పడిపోయిందా.. పద వెతకడంలో మేము సాయం చేస్తాం.” అంటూ కపట స్నేహితులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ పరామర్శించారు. స్నేహితులను లెక్క చేయలేదు. ఎవరికి సమాధానం ఇవ్వలేదు. మణి పోయినందుకు చింతించలేదు. తలపై బొప్పి కట్టింది, తల్లిదండ్రుల మాట విననందుకు ఏడుపు ఆగలేదు. దుఃఖిస్తూ ఇల్లు చేరుకుంది. సంగతి విన్న దేవమణి అమ్మానాన్నలు ధైర్యం చెప్పి ఓదార్చారు.
“శెభాష్ దేవీ! నిన్ను నువ్వు రక్షించుకున్నావు. నీలో వున్న ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం ఎంతో విలువ చేసే మణిమాణిక్యాలు! ఇట్టి అపారమైన సంపద, ఎప్పటికీ తరిగిపోని అమూల్యమైన వరాలు!!”
మణి కంటే ముఖ్యమైనది మనలోని ఆత్మవిశ్వాసము. కష్టం వచ్చినందుకు దేవమణిలోని అసలైన గొప్ప గుణాలు వెలికి వచ్చాయి.
మన మనోస్థైర్యం మనకు మిరుమిట్లు గొలిపే కాంతుల దీప్తి!
నీతి: శత్రువులకు దూరంగా ఉండాలి. కష్టాలు, బాధలన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. భయపడి వెనక్కి వెళ్లరాదు. గెలుపు అయినా, ఓటమి అయినా చివరి వరకు సంఘర్షణ చేయాలి.
*****
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ ఇంటి పేరు: పులి
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.
ప్రస్తుత నివాసం బెంగళూరు విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.
Surekha Puli




Comments