మృత్యుంజయుడు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- 5 days ago
- 9 min read
#Mruthyunjayudu, #మృత్యుంజయుడు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Mruthyunjayudu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 06/05/2025
మృత్యుంజయుడు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
"ఒరే, చిన్నా! సదువు ఒగ్గేసి ఊరంట ఆంబోతులా తిరగడం మాని పట్నానికి పోయి కూలిపనో, రిచ్చా నడిపో కుసిన్ని డబ్బులు తెత్తే ఎవసాయానికి పెట్టుబడిగా పనికొత్తాయి"
వయసొచ్చిన కొడుకు చంద్రాన్ని నిలదీసాడు సన్నకారు రైతు వెంకన్న.
స్నేహితులతో జల్షాగా తిరిగే చందర్రావుకి అహం దెబ్బతింది.
తండ్రితో మాటా మాటా పెరిగి రోషంతో కట్టుబట్టలతో మిత్రుడు సింహాద్రిని వెంట తీసుకుని పట్నానికి మకాం మార్చేసాడు చంద్రం.
ఎవరు పరిచయం లేని ప్రదేశం. స్నేహితులిద్దరూ ఎక్కడ తిరిగినా తిండి పుట్టలేదు. ఆకలి దంచేస్తోంది. చివరికి రోడ్డు పక్కన దాబా హోటల్లో కప్పులు గిన్నెలు కడిగితే భోజనం పెడతామంటే ఆ పనికి ఒప్పుకున్నారు.
రోజులు గడుస్తున్నాయి. కొడుకు పట్నంలో ఉన్నాడని తెలిసి
వెంకన్న ఇంటికి రమ్మన్నా వెళ్లలేదు. స్నేహితులిద్దరు హోటల్లో పని చేసుకుంటూ రాత్రిళ్లు హోటలు బయట అరుగు మీద పడుకుంటున్నారు.
ఒకరోజు హోటలుకి శలవైనందున మిత్రులిద్దరు పట్నంలో తిరగడానికి బయలు దేరారు. అలా వెల్తూంటే ఒక చోట పెద్ద మైదానంలో ధృఢకాయులైన యువకులు వరస కట్టి నిలబడి ఉన్నారు.
చంద్రం మిత్రుడు సింహాద్రి అక్కడ ఏం జరుగుతుందోనని వాకబు చెయ్యగా "మిలిటరీ లోకి కుర్రాళ్లని తీసుకుంటున్నారని తిండి పెట్టి బట్టలు వసతితో పాటు నెలకి జీతం ఇస్తారట " అని సమాచారం తెచ్చాడు.
మనకి సదువు ఏమీ లేదని, మనల్నెవరు మిలిట్రీకి తీసుకుంటారని అశక్తత కనబరిచాడు చంద్రం.
"పోనీలేరా, లైనులో నిలబడి చూద్దాం. తీసుకోకుంటే వచ్చేద్దాం" అని సింహాద్రి నచ్చ చెబితే 'సరే 'నని మిత్రులిద్దరు రిక్రూటింగు ఆఫీసు దగ్గర కుర్రాళ్లతో కలిసి వరసలో నిలబడితే దేహదారుడ్యం వైద్య పరిక్షల్లో సెలక్టు అయారు.
వాళ్లిద్దరికి చదువు లేదని తెలిసినా వారి దేహ దారుడ్యం, చురుకుతనం గమనించి సైనిక సిబ్బంది వయసు నిర్ధారణ, చిరునామా వివరాలతో గ్రామ పంచాయతీ ఆఫీసు నుంచి ధృవీకరణ పత్రం తీసుకురమ్మని చెప్పారు.
స్నేహితులిద్దరూ మాట్లాడుకుని ఊరికి తిరుగొచ్చి విషయం పెద్దోళ్లకు చెప్పారు.
"వద్దురా, మిలిట్రీకి పోతే సచ్చిపోతారని, ఇక్కడే ఏదో పని సూసుకుని బతకండని" ఊరి పెద్దలు నచ్చ చెప్పపోయారు. ఎవరెన్ని చెప్పినా వాళ్లు వినలేదు. మిలిటరీకి వెళ్లడానికే నిశ్చయానికొచ్చారు.
చివరికి, అందాజాగా వారి వయసు, పేరు, చిరునామా, ఊరి వివరాలతో సర్పంచి గారి నుంచి ధృవపత్రం తీసుకుని తాహసీల్దారు ఆఫీసు ముద్రతో రిక్రూటింగు ఆఫీసులో అందచేసారు.
***
మిత్రులిద్దర్నీ ఎంపిక చేసి డాక్యుమెంట్లు పూర్తి చేసి మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ కి పంపేరు రిక్రూటింగ్ ఆఫీసు సిబ్బంది.
ట్రైనింగ్ సెంటర్లో దేశం నలు మూలల నుంచి సెలక్టై వచ్చిన యువకులతో కోలాహలంగా ఉంది. ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారో తెలియడం లేదు. తెలుగు మాట అసలు లేదు. మిలిటరీ సిబ్బంది ఠీవిగా ఆకుపచ్చ దుస్తుల్లో,
హిందీలో గట్టిగా కేకలేస్తు కనబడుతున్నారు. తెలుగు మాట్లాడేవాళ్లు ఒకరిద్దరు కనబడినా వేరే విభాగానికి పంపేసారు.
ట్రైనింగ్ సెంటర్లో స్నేహితులిద్దరు ఒకేచోట ఉంటూ హిందీ భాష తెలియక చేతి సంజ్ఞల ద్వారా రోజువారీ దినచర్య చేసుకుంటు మెల్లగా హిందీ మాట్లాడటం నేర్చుకుని మిలిటరీ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసారు.
ఇద్దరికీ ఆకుపచ్చని యూనిఫాం, రోజూ మంచి భోజనం, వసతి, నెలకి జీతం అందుతుంటే ఈ జీవితమే హాయి అనుకున్నారు.
ట్రైనింగ్ పూర్తయిన తర్వాత స్నేహితులిద్దర్నీ వేరువేరు ప్రాంతాలకు పోష్టింగు ఇచ్చి పంపేరు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన మిత్రులిద్దరు భారమైన మనసుతో వీడ్కోలు చెప్పుకున్నారు.
దేశం వేరువేరు ప్రాంతాల్లో సైన్యం ఫిరంగి విభాగంలో సిపాయిలుగా సేవలందిస్తున్నారు. అన్ని వసతులతో పాటు నెలనెలా జీతం, సంవత్సరానికి రెండు నెలల పూర్తి శలవు ఉంటోంది. చంద్రం తండ్రికి ఆర్థికంగా డబ్బు సర్దుబాటు చేసి వ్యవసాయ అప్పులు తీర్చగలుగుతున్నాడు.
ఇప్పుడు చంద్రం ముసలి తండ్రి, తల్లి, చెల్లిని బాగా చూసుకుంటున్నాడు. శలవుపై ఊరికి వచ్చి పెళ్ళి చేసుకున్నాడు. జులాయిగా తిరిగే కొడుకు జీవితంలో స్థిరపడ్డాడని వెంకన్న సంతోషించాడు.
చంద్రం సిపాయిగా సైన్యంలో చేరి పదేళ్లు గడిచిపోయాయి. బలంగా ధృడంగా క్రమశిక్షణ గల సైనికుడిగా కనబడుతున్నాడు. ఈ పదేళ్ల సమయంలో మిత్రుడు సింహాద్రిని కలిసింది తక్కువే.
***
మిత్ర దేశంగా పొరుగున ఉన్న చైనా వంచనతో భారతదేశ భూ భాగాన్ని దురాక్రమణ జరపగా యుద్ధం ప్రారంభమైంది. భారత సైన్యాన్ని చైనా భారత సరిహద్దుల్లో మొహరించింది.
దేశమంతటా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కళాకారులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు జాతీయ రక్షణ నిధికి విరాళాలు సేకరిస్తున్నారు.
భారత సరిహద్దుల్లో భీకర యుద్ధం జరుగుతోంది. వెన్నుపోటుతో మోసగించిన చైనా దేశ సైన్యం ముందస్తు ప్రణాళికతో యుద్ధ సన్నాహాలు చేసుకుంది.
భారత సైన్యానికి భారీ ప్రాణనష్టం జరుగుతోంది. భయంకరంగా ఎత్తైన మంచు పర్వతాలు, చలిగాలులు, ఎముకలు కొరికే చలి, క్లిష్ట వాతావరణ పరిస్థితులు, సరైన రోడ్డు రవాణా సదుపాయాలు లేక ఆయుధాలు, ఆహారం, చలి దుస్తులు అందక భారత సైనికులు కష్టాల పాలవుతున్నారు..
చైనా సైనికుల తుపాకీ తూటాలకు కొంతమంది, వాతావరణ పరిస్థితులకు, ఆహార సరఫరా అందక ఆకలికి, తాగునీరు లేక భారత సైనికులు ప్రాణాలొదుతున్నారు. కొండలు గుట్టల్లో గుంపులుగా సైనికుల మృతదేహాలు కానొస్తున్నాయి.
సిపాయి చంద్రం పటాలంలో చాలా మంది చనిపోయారు. మిగిలిన కొద్దిమంది ప్రాణరక్షణలో చెల్లాచెదురై పోయారు. చంద్రం ఒంటరి వాడయాడు. ఆహారం అందుబాటులో లేదు. ఉన్న కొద్దిపాటి నీళ్లు, బిస్కెట్లు పొదుపుగా వాడుకుంటు తిరుగుబాట పట్టేడు.
భీకర పర్వతాల్లో దారెటో తెలియడం లేదు. వంటి మీద యూనిఫాం చిరిగి కాలికున్న బూట్లకి రంధ్రాలు పడి రాళ్లు కాళ్లకి గుచ్చుకుంటున్నాయి. అలాగే అవస్థలు పడుతు భారత సైనిక శిబిరాల చెక్ పోస్టుల కోసం వెతుకుతున్నాడు.
అలా చాలాదూరం ప్రయాణం చేసి అలసట వల్ల ఒక పెద్ద బండరాతి మీద కూర్చున్నాడు. దగ్గరలో మూలుగు శబ్దం వినబడుతోంది. ఎవరని మూలుగు వచ్చిన వైపు వెళ్లాడు. అక్కడ ఒక సైనికుడు చిరిగిన యూనిఫామ్ తో అపస్మారక స్థితిలో పడిఉన్నాడు.
ఆకలి దప్పులతో అలసి ఉన్నా చంద్రంలో మానవత్వం మేల్కొంది. వంగి ఆ వ్యక్తి ముఖం చూస్తే నేపాలీ గూర్ఖా సైనికుడిలా కనిపించాడు. తల దగ్గర హెల్మెట్ పడిఉంది. తుపాకీ తూటా హెల్మెట్ కి తగిలి రంద్రం చేసి సైనికుడి తలలో కెళ్లినట్టుంది. తల దగ్గర రక్తం గడ్డ కట్టింది. బతికే ఉన్నాడు.
చంద్రానికి ఏమి చెయ్యాలో తోచడం లేదు. ఈ పరిస్థితుల్లో తన ప్రాణాలకే నమ్మకం లేదు. మరి ఈ గాయపడిన సైనికుణ్ణి ఏం చెయ్యాలి. ఇలాగే వదిలేస్తే కొన్ని గంటల్లోనే చచ్చిపోతాడు.
తనకి మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లో, యుద్ధ సమయంలో గాయపడిన సహచర సైనికుల ప్రాణరక్షణ ఎలా చెయ్యాలో నేర్పిన పద్దతి గుర్తుకు వచ్చింది. మానవత్వం మరోసారి తట్టిలేపింది. తన దగ్గరున్న వాటరు బాటిలు మూత తీసి కొద్దిగా నీళ్లు అతని నోట్లో పోసాడు.
కొద్ది సేపటికి అతనిలో కదలిక వచ్చింది. కాని స్ప్రహ రాలేదు.. చంద్రం వంట్లో శక్తి కూడదీసుకుని ఆ సైనికుడి శరీరాన్ని వీపు మీద ఎక్కించుకుని చేతిలోని రైఫిల్ చేతి కర్రగా చేసుకుని ముందుకు సాగుతున్నాడు.
సాయంకాలమైంది. వెలుగు క్షీణిస్తోంది. దేవుడి మీద భారం వేసి మరికొద్ది ముందుకు వెళ్లిన తర్వాత మైదాన ప్రాంతానికి చేరుకున్నాడు. కొద్ది దూరంలో మనుషుల కదలికలు మాటలు వినబడుతున్నాయి.
కాళ్లలో శక్తి లేకపోయినా వీపు మీద అపస్మారక సైనికుడి శరీరంతో తూలుతు ముందుకెళ్లి పడిపోయాడు..
చంద్రం ముఖం మీద చల్లటి నీళ్లు పడటంతో కళ్లు తెరిచి చూస్తే తను భారత సైనిక చెక్ పోస్టు శిబిరంలో ఉన్నట్టు గ్రహించాడు. దేవుడు తన ప్రాణాలను రక్షించాడనుకున్నాడు. అక్కడి సైనిక వైద్య సిబ్బంది
ప్రథమ చికిత్స జరిపి ఆహారం, నీరు అందిస్తే కోలుకున్నాడు.
తనకు కొద్ది దూరంలో నేపాలీ గూర్ఖా సైనికుడు తలకి బేండేజీ కట్టుతో అపస్మారక స్థితిలో స్ట్రెచర్ మీదున్నాడు. మూతికి ఆక్సిజన్ మాస్కు, చేతికి సలైన్ బాటిల్ కనెక్టు చేసి ఉంది.
ఆ రాత్రికి సైనిక శిబిరంలో ఉంచి మర్నాడు మిలిటరీ అంబులెన్సులో దగ్గరున్న మిలిటరీ ఎమర్సెంసీ మెడికల్ సెంటర్ కి తీసుకెళ్లారు. ఆర్మీ చెక్ పోస్ట్ దగ్గర సిపాయి చంద్రం ఆర్మీ యూనిట్ వివరాలు, పేరు, సర్వీస్ నంబరు సేకరించారు.
మంచు, కొండరాళ్ల రాపిడికి పగిలి చిల్లులు పడిన కాళ్ల బూట్ల కారణంగా చంద్రం కాలి వేళ్లకు ఇన్ ఫెక్షన్ సోకి శస్త్రచికిత్స జరిపి వేళ్లు తీసేయవల్సి వచ్చింది. అందువల్ల వైద్య పరంగా ఆర్మీ సర్వీసుకి అనర్హుడిగా ఉధ్యోగ విరమణ చేయించారు. సైన్యంలో పది సంవత్సరాలే సర్వీసు చేసినందున మెడికల్ పెన్షన్ మంజూరు చేసారు.
సిపాయి చంద్రం వెంట తెచ్చిన గూర్ఖా యువకుడి తలలో బుల్లెట్ ముక్క దూరినందున శస్త్రచికిత్స చేసి దాన్ని తీసేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు సైనిక వైద్య సిబ్బంది. కాని అతని జ్ఞాపకశక్తి నసించి గతం మరిచిపోయాడు.
తన పేరు, ఊరు, ఆర్మీ యూనిట్ సర్వీస్ వివరాలు ఏమీ చెప్పలేక పోతున్నాడు. అతను ఎవరో తెలుసుకునే ఆధారాలు సైనిక అధికారులకు లభ్యం కాలేదు. మిలిటరీ హాస్పిటల్ స్టాఫ్ వైద్య సేవలో కోలుకుని
ఆరోగ్యవంతుడైనప్పటికీ ఎక్కడి వాడో ఎన్ని ప్రయత్నాలు చేసినా వివరాలు తెలుసుకోలేకపోయారు.
మతిస్థిమితం లేని ఆ యువ సైనికుడిని ఎవరికి అప్పగించడం, అతని భావి జీవితం ఎలాగని సైనిక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. నోటిమాట కూడా స్పష్టంగా లేదు. ఆ యువకుణ్ణి ఎక్కడ ఉంచాలని చర్చించుకుంటు సిపాయి చంద్రాన్ని వివరాలు
అడిగితే, భారత సైన్య గూర్ఖాదళ సైనికుడై ఉంటాడని మన దేశ సరిహద్దు ప్రాంతంలో చావు బతుకుల మద్య పడివుంటె తనతోపాటు సైనిక శిబిరానికి చేర్చినట్టు సైనిక అధికారులకు చెప్పేడు.
అధికారులు ఎన్నెన్ని ప్రయత్నాలు జరిపినా ఆ సైనికుడు ఎవరైందీ ఆచూకీ దొరక లేదు. సైనిక సిబ్బంది ఆ గూర్ఖా యువకుణ్ణి ఎక్కడికి చేర్చడమా అని ఆలోచనలో ఉంటే తనతోపాటు ఊరికి తీసుకెల్తానని, అతని వివరాలు తెలిసిన తర్వాత అప్పగిస్తానని సైనిక అధికారులకు చెప్పగా మాజీ సిపాయి చంద్రం వెంట పంపడానికి అంగీకరించారు.
గూర్ఖా యువకుడితో పాటు చంద్రం తన గ్రామానికి చేరుకున్నాడు. సాహసంతో యుద్ధంలో కెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన చంద్రానికి ఊరిలో ఘనస్వాగతం లభించింది.
గూర్ఖా యువకుడిని చూసి ఊరి ప్రజలు ముందు అభ్యంతరం చెప్పినా అతని మానసిక స్థితిని గమనించి పంచాయతీలో అంగీకరించారు.
***
చంద్రం మిత్రుడు సింహాద్రి సైన్యంలో వేర్వేరు ఫిరంగి పటాలలో ఉండి చైనా యుద్ధంలో పాల్గొన్నందున అతని జాడ దొరక లేదు. యుద్ధంలో చనిపోయి
ఉంటాడనుకున్నారు. సింహాద్రికి బదులుగా ఈ గూర్ఖా అబ్బాయి వచ్చాడనుకున్నారు గ్రామ ప్రజలు.
మాజీ సిపాయి చంద్రానికి ప్రభుత్వం తరఫున భూమి, నగదు బహుమతిగా లభించాయి. ముసలి తండ్రి చనిపోవడంతో
కుటుంబ భాద్యత చూసుకోవల్సి వచ్చింది. సైన్యం నేర్పిన క్రమశిక్షణ, ప్రవర్తన ఇప్పుడు చంద్రానికి ఎంతో ఉపయోగ పడింది.
ఏ మౌలిక సదుపాయాలు లేక వెనుక బడిన ఊరి అభివృద్ధి కోసం పంచాయతీ సర్పంచ్ గా బాధ్యత తీసుకుని గ్రామ బాగోగులు చూస్తున్నాడు చంద్రం.
గూర్ఖా యువకుడు పొట్టిగా ధృడంగా ఉన్నాడు. చంద్రం స్నేహంతో బాగా కోలుకుని మెల్లగా తెలుగు మాట్లాడటం నేర్చుకున్నాడు. కలుపుగోలుగా ఉంటూ ఊరి జనంతో కలిసిపోయి ఎవరికి ఏ సహాయం అవసరమైనా ముందుంటున్నాడు.
చంద్రం నేపాలి యువకుడికి ' బహదుర్' అని పేరు పెట్టినా ఊరి జనం మాత్రం ' బాబు' అని పిలుస్తున్నారు. చంద్రం తన పలుకుబడితో ప్రభుత్వ ఆహార గిడ్డంగిలో వాచ్ మేన్ గా ఉద్యోగం వేయించాడు.
చంద్రం గ్రామసర్పంచిగా ఎన్నికైన తర్వాత రక్షిత తాగునీరు, విద్య, ఆరోగ్య పారిశుద్ధ్యం పనుల మీద శ్రద్ధ వహించి జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అధికారుల మెప్పు సంపాదించాడు. బహదూర్ చంద్రానికి అన్ని విషయాల్లో తోడ్పాటుగా ఉంటూ కృష్ణార్జునులుగా పేరు తెచ్చుకున్నారు.
కాలగమనంలో చంద్రం తన చెల్లిని బహదుర్ కిచ్చి పెళ్లి చేసి జీవితంలో స్థిర పరిచాడు. వారికొక బాబు కలిగాడు.
సంతోషంగా రోజులు గడుస్తున్న బహదూర్ కి విషాద సంఘటన జరిగింది. ఆహార గిడ్డంగి వద్ద డ్యూటీలో ఉండగా సాయంకాలం అకస్మాత్తుగా వచ్చిన భీకర గాలివానకు గిడ్డంగి కప్పు మీదున్న ఇనుప వాసం ఊడి బహదూర్ తలకి తాకింది.
తలకి జోరుగా తగిలిన దెబ్బకు బహదుర్ స్ప్రుహ తప్పి పడిపోయాడు. తోటి సిబ్బంది వెంటనే పట్నంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లగా మెదడుకి అత్యవసర శస్త్రచికిత్స జరప వల్సి వచ్చింది.
అనుకోని ఈ దుర్ఘటనకు చంద్రం హతాసుడయాడు. డబ్బు ఖర్చు చేసి ఖరీదైన వైద్యం చేయించాడు. కొద్ది రోజుల తర్వాత బహదుర్ కోలుకుని స్ప్రుహలో్ కొచ్చి వెర్రి చూపులు
చూస్తూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఏదో అర్థం కాని భాషలో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నవారెవరికీ ఏమీ అర్థం కాక మెదడు దెబ్బతిని పిచ్చి వచ్చిందనుకున్నారు.
చంద్రానికి విషయం తెల్సి పరుగున బహదుర్ దగ్గర కొచ్చి పేరు పెట్టి పిలిచి ఏమైందని కంగారుగా అడిగాడు.
"నా పేరు జియాంగ్ చింగ్, నాది చైనా దేశం. నా ఊరి పేరు రాంగ్లీ. పదంచిన్ దగ్గరుంది. మీరంతా ఎవరు? నేను ఇక్కడి కెలా వచ్చాను? "అని బహదుర్ తెలుగులో అన్నాడు.
అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది, అందరూ ఆశ్చర్య పోయారు. మానసిక వైద్యుడికి చూపినా సమస్య పరిష్కారం కాలేదు.
చంద్రానికి ఏమీ అర్థం కాలేదు. బహదుర్ తన వెంట ఊరికి వచ్చి పదేళ్లు దాటింది. ఇన్నాళ్లు ఊరిలో ఒకడిగా కలిసిపోయాడు. గ్రామ పంచాయతీలో తీర్మానం ద్వారా ఓటరు కార్డు, రేషను కార్డు సంపాదించి స్థానికుడిగా చెలామణీ అవుతున్నాడు.
వేష భాషలన్నీ గ్రామీణ పద్దతిలో ఉన్నాయి. కొంచెం రూపంలో మార్పు తప్ప మిగత పద్దతులన్నీ తెలుగువాడిగా కనబడుతున్నాడు. తలకి దెబ్బ తగిలి హాస్పిటల్లో సర్జరీ జరిగి కోలుకున్నప్పటి నుంచి వింత మార్పులు జరిగి విచిత్రంగా ప్రవర్తిస్తూ తను చైనా వాడినని, తన ఊరు పేరు చెబుతున్నాడు. చైనా యుద్ధం జరిగి పదేళ్లు గడిచాయి.
దాని విషయం జనం మర్చిపోయారు. మరిప్పుడు ఏమిటీ విచిత్ర పరిస్థితని చంద్రం అయోమయంలో పడ్డాడు.
కొద్ది రోజుల తర్వాత బహదుర్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకువచ్చారు. ఆరోగ్యం బాగుపడి మామూలు మనిషై తన డ్యూటీ చేసుకుంటు ఎప్పటిలా ఊరి జనంతో కలిసినప్పటికీ అప్పుడప్పుడు తనది చైనా దేశమని, రాంగ్లీ గ్రామమని, కొండల్లో ఉందని, తనకు అమ్మా నాయన అన్నయ్య ఊర్లో ఉంటారని, తను ఆర్మీలో నౌకరి చేస్తున్నట్టు చెబుతు తనని ఎవరు ఇక్కడికి తీసుకువచ్చారని అడుగుతూంటాడు.
తన కుటుంబం ఎలాగుందోనని తనలో తనే మాట్లాడుకుంటూంటాడు. బహదుర్ తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి మెదడు దెబ్బతిని పిచ్చెక్కి అలా మాట్లాడుతున్నారనుకుంటున్నారు ఊరి జనం.
బహదుర్ అప్పుడప్పుడు పిచ్చిగా ఏవేవో మాట్లాడటం విన్న
చంద్రానికి అనుమానం కలుగుతోంది. పది సంవత్సరాల కిందట దేశ సరిహద్దు యుద్ధ ప్రాంతంలో అపస్మారక స్థితిలో చావుబతుకుల మద్య ఉన్న బహదుర్ ని మన భారత సైన్య గూర్ఖాదళ సైనికుడని మానవత్వంతో ఆర్మీ శిబిరానికి చేర్చవలసి వచ్చింది.
తర్వాత నుంచి బహదుర్ గురించిన ఏ సమాచారం తెలియదు.
అతని తలలో దూరిన బుల్లెట్ ముక్క శస్త్రచికిత్స జరిపి తీసిన తర్వాత మతిస్థిమితం లేనందున తన పేరు, ఊరు, కుటుంబ వివరాలు భారత సైన్య ఏ గూర్ఖా దళానికీ చెందినవాడో తెలియలేదు.
ఆర్మీ ప్రధాన కార్యాలయానికి ఏ సమాచారం తెలియలేదు. బహదుర్ ఫోటో తీసి అన్ని సైనిక దళాలకు పంపినప్పటికీ ఏ ఫలితం రాలేదు. తనతో వచ్చి ఊరిలో ఒకడిగా కలిసి పోయాడు. దేశంలో అందరూ యుద్ధ పరిస్థితుల్ని మరిచి పోయారు. తన ఆప్త మిత్రుడు సింహాద్రి జాడ తెలియక
యుద్ధక్షేత్రంలో చనిపోయి ఉంటాడని నిర్థారణ కొచ్చారు.
అన్నీ సద్దుమణిగి ప్రశాంతంగా రోజులు గడుస్తున్న ఈ సమయంలో జరుగుతున్న సంఘటనలతో అనుమానం కలిగి చంద్రం జిల్లా సైనిక సంక్షేమ అధికారికి విషయం తెలియచేసాడు.
జిల్లా సైనిక సంక్షేమ అధికారి బహదుర్ ప్రస్తుత ఫోటోతో జరిగిన సంఘటనల వివరాలతో సమగ్ర రిపోర్టు ఆర్మీ హెడ్ క్వార్కర్స్ కి పంపేరు. ఆర్మీ అధికారులు స్థూలంగా పరిశీలించి అనుమానంతో చైనా రాయభార
కార్యాలయానికి బహదుర్ ఫోటోతో అతడు చెబుతున్న ఊరి పేర్లతో నోట్ తయారు చేసి, గతంలో జరిగిన చైనా యుద్ధ సమయంలో జాడ తెలియని వారి సైనికుల వివరాలు పరిశీలించగా బహదుర్ ఫోటోతో సరిపోలి అతను మాట్లాడుతున్న పిచ్చి మాటలు నిజమేనని నిర్థారణ జరిగింది.
వాస్తవానికి బహదుర్ గా పిలవబడే గూర్ఖా యువకుడు చైనా యుద్ధ సమయంలో చైనా సైన్య సైనికుడనీ, సరిహద్దు గ్రామ నివాసని, యుద్ధ సమయంలో పొరపాటున సరిహద్దు దాటి భారత భూభాగంలో వచ్చినందున రైఫిల్ తూటా హెల్మెట్ కి తగిలి అపస్మారక స్థితిలో పడివుండగా మానవతా దృక్పధంతో చంద్రం భారత సైనిక స్థావరానికి చేర్చడం వల్ల ప్రాణాలతో బతికాడు. ఇదీ వాస్తవంగా జరిగిన సంఘటన.
ఆర్మీ అధికారులు బహదుర్ని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి రప్పించి చైనా రాయభార కార్యాలయ సిబ్బంది కి పరిచయం చెయ్యగా వారితో చైనా భాషలో మాట్లాడితే, అతను చైనా ఆర్మీ సైనికుడేనని అతను చెప్పిన ఊరు కుటుంబ సభ్యుల వివరాలు వాస్తవమని రుజువైంది.
యుద్ధ సమయంలో బహదుర్ని గూర్ఖా సైనికుడిగా భావించి ప్రాణాపాయ స్థితిలో భారత సైనిక శిబిరానికి చేర్చి కాపాడిన మాజీ సిపాయి చంద్రం తనతో ఊరికి తీసుకెళ్లి తమ గ్రామ వాసిగా భారత దేశ పౌరుడిగా గుర్తింపు సంపాదించి పెట్టాడు.
తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటంటే, తను భారత దేశంలోనే ఉంటానని వీసా పాస్ పోర్ట్ సౌకర్యం కలిగిస్తే ఒకసారి తన స్వంత ఊరెళ్లి కుటుంబ సభ్యుల్ని కలిసొస్తానని పై అధికారులకు విన్నవించుకున్నాడు బహదుర్ ఉరఫ్ జియాంగ్ చింగ్.
సమస్య సామరస్యంగా పరిష్కారమైనందుకు, బహదుర్ 'బాబు' గా ఊరికి ఉపకారిగా అందరి మన్ననలు పొందినందుకు ఊరి సర్పంచ్ మాజీ సిపాయి చంద్రం ఆనందానికి అవధులు లేకపోయాయి.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments