చేయి వదలకు నేస్తమా - పార్ట్ 5
- Prameela Sarma Veluri
- 2 days ago
- 7 min read
#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #CheyiVadalakuNesthama, #చేయివదలకునేస్తమా, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Cheyi Vadalaku Nesthama - Part 5 - New Telugu Web Series Written By - Veluri Prameela Sarma Published In manatelugukathalu.com On 15/05/2025
చేయి వదలకు నేస్తమా - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక
రచన: వేలూరి ప్రమీలాశర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ..
సునీల, దొరబాబుల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది. సునీల పరిస్థితికి జాలిపడతాడు తేజ. అనుకోకుండా మెట్రో ట్రైన్ లో ఆమెను చూస్తాడు. ఆమె తలపుల్లో మునిగిపోతాడు.
స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడుతేజ. అతన్ని సునీల సోదరి, బిజినెస్ అనలిస్ట్ సుదతి కలుస్తుంది.
రైల్వే స్టేషన్ లో 'అబద్ధం' అనే అనాధ కుర్రాడు ఉంటాడు. అతన్ని ఆప్యాయంగా పలకరించే మీనాకుమారి కనపడకుండా పోతుంది. అతను ఆప్యాయంగా చూసుకునే కుక్క గాయాలతో మరణిస్తుంది.
ఇక చేయి వదలకు నేస్తమా - పార్ట్ 5 చదవండి.
ఆఫీసులో ఒక్కడే కూచుని సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నాడు తేజ. టేబుల్ పైన దొంతరగా పేర్చి ఉన్న పుస్తకాల మధ్య నుంచి సన్నటి పాకెట్ బుక్ లాంటిది ఒకటి తీసి, అందులో ఏవో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేస్కుంటున్నాడు.
"హాయ్ తేజా గారూ! హౌ ఆర్ యు! మీట్ మై సిస్టర్... సునీల. జస్ట్ కంపెనీ ఇస్తానంటేనూ రెస్టారెంట్ లో లంచ్ కి వెళుతూ, ఇటువైపు తీసుకువచ్చాను." నవ్వుతూ తనతోపాటు అక్కడికి వచ్చిన సునీలను, తేజకి పరిచయం చేసింది సుదతి.
"ఓహ్! నైస్ మీటింగ్ యూ బోత్" షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం చెయ్యి ముందుకి చాస్తూ అన్నాడు తేజ.
"నమస్తే!" చిరునవ్వుతో పలకరించిన సునీల పెదవులను దాటి ఆమె మాట పెద్దగా బయటకు రాలేదు. కానీ, అందుకు ప్రతి సమాధానంగా తేజ పెదవులపై చిరునవ్వు మెరవడం చూసి, సిగ్గుతో ఆమె కళ్ళు కిందకి నేల చూపులు చూశాయి. అరవిరిసిన గులాబీల అందం ఆమె ముఖంలో మెరుపై మెరిసింది. ఏదో చల్లని హాయిగొలిపే భావన మనసుని గిలిగింతలు పెట్టడంతో, షర్టు లోపలకి చెయ్యిపెట్టుకుని, గుండెలపై తడుముకున్నాడు తేజ.
బ్రహ్మ సృష్టిలో ఒకే ముద్రతో ఉన్న రెండు బొమ్మలు... పట్టి పట్టి చూస్తే తప్ప ఎవరెవరో పోల్చుకోవడం కష్టం. ఒకరేమో పూర్తి సాంప్రదాయ వస్త్రధారణలోనూ… మరొకరు అందుకు భిన్నంగా ట్రెండీగా ఉన్న ఆధునిక వస్త్రధారణలోనూ ఉన్నారు. ఇద్దరినీ ఓకంట గమనిస్తూ, మనసులోనే నవ్వుకున్నాడు తేజ.
చిన్నగా గొంతు సవరిస్తూ, అప్పుడే అక్కడికి వచ్చిన ప్రశాంత్... తేజ, సునీలల వంక మార్చి మార్చి చూస్తూ చిన్నగా దగ్గాడు. అంతవరకూ ఒళ్ళు మర్చిపోయి, ఆలోచనల్లో మునిగిపోయివున్న సుదతి, ఒక్కసారిగా ఉలిక్కిపడి సర్దుకుని కూచుంది. టేబుల్ పై లిడ్ తో మూసి ఉన్న గ్లాసుని చేతిలోకి తీసుకుని, గబగబా నీళ్లు తాగుతున్న ఆమెవంక వింతగా చూసింది సునీల.
పొలమారిన ఆమెను చూసి కంగారుగా... "ఓహ్! సడన్ ఎంట్రీతో కొంచెం గాభరా పెట్టినట్టున్నాను. సారీ..." సుదతి మొహంలోని భావాలు చదవాలని ప్రయత్నిస్తూ అన్నాడు ప్రశాంత్.
"నో నో... అదేమీ లేదు!" అంటూ ముఖం పక్కకి తిప్పుకున్న ఆమెను చూసి, 'నేనంటే ఈమెకెందుకింత కోపం?' అనుకుంటూ నవ్వుకున్నాడు ప్రశాంత్.
మెల్లగా వర్క్ గురించి మాట్లాడుతూనే తేజ, సునీల, సుదతిల ఫీలింగ్స్ ని గమనిస్తున్నాడు ప్రశాంత్. ఒకరికొకరు ఎప్పట్నుంచో పరిచయం ఉన్నవారిలా అనిపించింది. 'ఎ పర్ఫెక్ట్ టీమ్' మనసులోనే అనుకున్నాడు ప్రశాంత్.
సుదతి మనసులో ఆలోచన మరో విధంగా ఉంది. తేజని చూసినప్పుడల్లా… పీటల మీద పెళ్లి ఆగిపోయిన తన అక్క సునీలకి సరైన జోడీగా అనిపిస్తున్నాడు. అందుకేనేమో ఆరోజు ఆ పెళ్లి ఆగిపోయింది… అని ఎన్నోసార్లు ఆమె మనసులో అనుకుంది.
టేబుల్ సొరుగులోంచి ఏ3 సైజ్ పేపర్ తీసి, పెన్నుతో దానిమీద బార్ గ్రాఫ్స్ గీస్తూ… తన అంచనాలో ఉన్న ఉద్యోగుల శాతం, వారి వయసు వారి హోమ్ నీడ్స్ కి సంబంధించిన వివరాలను కలర్ బార్స్ మీద నోట్ చేస్తూ, కింద ప్రొడక్ట్ వివరాలు బ్లూ పెన్ తో రాయసాగాడు తేజ.
"కమింగ్ టు ద పాయింట్… హోమ్ నీడ్స్ కి సంబంధించి, వివిధ ఆకృతుల్లో రూపొందించిన రోబోలను మనం ఎకానమీ రేంజ్ లో అందించే ప్రయత్నం చేస్తున్నాం. జ్ఞాపకశక్తిని కోల్పోయినవారూ, అంగవైకల్యంతో బాధపడుతున్నవారూ… జీవితాంతం మరొకరిపై ఆధారపడాల్సి పరిస్థితి ఉంటోంది. ఇలాంటివారికి ఇంటిపనుల్లో ఆసరాగా ఉండేందుకే మనం తయారు చేసిన ఈ రోబోలు. సో! ముందుగా వారి వారి అవసరాల తాలూకు డేటా మనం సేకరించి, ఆర్డర్స్ తెచ్చుకోగలిగితే… తదనుగుణంగా డిజైన్ చేసిన రోబోలను సప్లై చెయ్యొచ్చు.
ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాదు. కానీ, మన దేశంలో టెక్నాలజీ వాడకాన్ని జనం ఇంకా అంతగా అలవాటుచేసుకోవటం లేదు. ముందుగా మన ప్రొడక్ట్ పనితీరు గురించి జనాలకు పరిచయం చెయ్యాలి. ప్రాక్టికల్ గా ఒకరి విషయంలో ఈ రోబోలు నూటికి నూరు శాతం సహాయకారిగా ఉంటాయి… అని మనం ప్రూవ్ చెయ్యాల్సి ఉంది. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన పోస్టులు ఎప్పటికప్పుడు అప్ డేట్ చెయ్యడంతో పాటు, వృద్హాశ్రమాలు, హాస్పిటల్స్ యాజమాన్యాలకు కూడా మన రోబోల పనితీరు గురించి నమ్మకంగా చెప్పగలగాలి. అప్పుడే తగినన్ని ఆర్దర్లూ తెచ్చుకోగలుగుతాం. ఏమంటారు?" గెడ్డానికి పెన్ను ఆనించి, కళ్ళెగరేస్తూ అడిగాడు తేజ.
"ఫెంటాస్టిక్… ఈ ఐడియా నచ్చే, నేనూ నీ వెనక వచ్చాను. వర్క్ ఎప్పట్నుంచి మొదలుపెడదామో చెప్పు… నేను డిజైన్ చేసిన మోడల్స్ మీ ముందుంచుతాను. ఆ! తేజా! నువ్వు ప్రోగ్రామింగ్ కోడ్ ఇస్తే, మనం ముందుగా అనుకున్నట్టుగానే సుదతి సేల్స్ డేటా విషయాలు చూసుకుంటుంది. ఇక సునీల గారు…" మాట్లాడుతూ మధ్యలోనే ఆగిపోయాడు ప్రశాంత్.
"యా! మీ ప్లానింగ్ అండ్ వర్క్స్ అలాట్మెంట్ కూడా నాకు నచ్చింది. నేను ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. బట్, మన స్టార్ట్ అప్ లో వర్క్ షేర్ చేసుకోవడానికి మా సునీల సిద్ధంగా ఉన్నట్టు నాకనిపించడం లేదు. ఏమంటావు సునీలా?" అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చింది సుదతి.
మెడలో వేలాడుతున్న చెయిన్ కి ఉన్న లాకెట్ ను చేతితో పెదవులకు ఆనించి, మునిపంటితో కొరుకుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్న సునీల, తన అభిప్రాయాన్ని చెప్పడానికన్నట్టు మెల్లగా గొంతు సవరించుకుంది.
"నిజమే! నాకీ స్టార్ట్ అప్ లూ అవీ ఎంతవరకూ నిలదొక్కుకోగలవు అన్న దానిపై పెద్దగా అవగాహన లేదు. కానీ… తేజ గారూ! మీరు అన్నట్టు హోమ్ నీడ్స్ కోసం డిజైన్ చేసే రోబోలు అందుబాటులోకి వస్తే, కొన్నాళ్ళకి మనుషులు తమ భావోద్వేగాలను మరొకరితో పంచుకోవడం కూడా మర్చిపోతారేమో అనిపిస్తోంది.
యాంత్రికమైన జీవనంలో ఇప్పటికే ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమను వ్యక్తం చెయ్యడం లాంటి ఫీలింగ్స్ తగ్గిపోయాయి. కొంత కాలానికి మనుషులు కూడా ఈ రోబోల్లాగే మర బొమ్మలైపోతారేమో అనిపిస్తోంది. ఈ మిషన్ల మీద ఆధారపడటం వల్ల, శారీరక శ్రమను తగ్గించుకోవడం మాట అటుంచి, చేసే ఆ కొద్దీపనీ కూడా లేక, సరిపడా వ్యాయామం లేక, అనారోగ్యం కొ నితెచ్చుకుంటారేమో ననిపిస్తోంది. మనం ఎంకరేజ్ చేసినవాళ్ళమవుతావేమో మరోసారి ఆలోచించండి" సాలోచనగా చెప్పింది సునీల.
"ఐ అప్ప్రీషియేట్ యువర్ ఫీలింగ్స్ సునీలా! మీరన్నదీ కరక్టే... కానీ మారుతున్న అవసరాలకు అనుగుణంగా మనమూ మారాలి. అందుకే ఈ కంపానియన్ రోబోల రూపకల్పన దిశగా ఆలోచించడం. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఇలాంటివాటిపై ఆధారపడక తప్పదు. గడియారంలో ముల్లుల కన్నా వేగంగా పరిగెట్టాల్సిన రోజులివి.
ఈ కంపానియన్ రోబోలు మనకి సహాయకారిగా ఉంటూ, మన అవసరాలను తీరుస్తాయే తప్ప, మనుషుల స్థానంలో వీటిని రీప్లేస్ చెయ్యలేము. ఎందుకంటే మనమిచ్చే ఆదేశాలకు అనుగుణంగా… మనం ఫీడ్ చేసిన సంకేతాలతో అవి పనిచేస్తాయి తప్ప, వాటికి ఎలాంటి సొంత ఆలోచనలూ ఉండవు. సో, వీటి వల్ల మనుషులు భావోద్వేగాలు కోల్పోయి, మరబొమ్మలుగా మారే అవకాశం ఏమాత్రం ఉండదు. అలాంటి భయాలేమీ పెట్టుకోనవసరం లేదు.
చూస్తూ ఉండండి… ఏడాది తిరిగేసరికి మనుషుల్లో మార్పు మనల్ని సమాజంలో ఏ స్థాయిలో నిలబెడుతుందో… ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, ఇది బాగా వర్క్ అవుట్ అవుతుందనిపిస్తోంది. మీలా సాంప్రదాయంగా ఆలోచించే ఇల్లాళ్ళు కూడా ఓపిక లేక ఉస్సూరుమంటున్నారు. ఇంటిపనిలో సహాయపడే ఈ కంపానియన్ రోబోస్ కి డేటా ఫీడ్ చేసి ఇస్తే చాలు… చకచకా పనిచేసుకుని పోతాయి" అప్పటికి చెప్పడం ఆపి, ఫైల్ క్లోజ్ చేసి, డ్రా లో పెట్టాడు తేజ.
"లెట్ అజ్ హ్యావ్ సమ్ టీ" అంటూ బెల్ నొక్కి, బోయ్ కి ఆర్డర్ చెప్పాడు.
"సునీలా! మీ జాబ్ సెర్చింగ్ ఎంతవరకూ వచ్చింది" టీ సిప్ చేస్తూ అడిగాడు.
"హ్యాపీగా పెళ్లి చేసుకుని, ఇంటిపనీ, వంటపనీ చేస్తే చాలు అనే మొగుడి కోసం ఎదురుచూస్తోంది మా సునీల" నవ్వుతూ అంటున్న సుదతి మాటలతో అక్కడున్న అందరూ గట్టిగా నవ్వేశారు.
సుదతి మాటలకు నొచ్చుకున్న సునీల, ఎర్రబడిన మొహంతో లేచి వెళ్లి కిటికీలోంచి బయటకు చూస్తూ నుంచుంది.
"ఓహ్! సారీ! నా మాటలకు కోపం వచ్చిందా? సరదాగా అన్నాను. లైట్ తీస్కో సునీలా. అందరూ చూస్తున్నారు, బాగుండదు" వెంటనే లేచివచ్చి, లోగొంతుతో చిన్నగా చెబుతూ భుజం మీద చెయ్యి వేసింది సుదతి.
"నేనిక వెళ్తాను" అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసి భుజానికి తగిలించుకుని, సుదతికి సమాధానం చెప్పకుండా, అక్కడ ఉండడం ఇష్టం లేనట్టు డోర్ వైపు దారి తీసింది సునీల.
"ఒ…హొ! ఎందుకంత కోపం సునీలా? మూవీకి వెళదామని టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా! షో కి ఇంకా వన్ అవర్ టైముంది" వాచీలో టైమ్ చూస్కుంటూ చెప్పింది సుదతి.
"నాకు మూవీ చూడాలనిలేదు. నేను రాను. ఇంకెవరినైనా తీసుకువెళ్ళు. నాతో వచ్చినా నువ్వు మూవీ ఎంజాయ్ చెయ్యలేవు" అసహనంగా బయటకు నడుస్తూ చెప్పింది సునీల.
ఏం మాట్లాడాలో తెలీక మౌనంగా ఉండిపోయింది సుదతి. 'ఛ! అనవసరంగా సునీలకి కోపం తెప్పించాను. ఈ రోజు ప్రోగ్రాం మొత్తం అప్ సెట్ అయిపోయింది' అనుకుంటూ డల్ గా కూచుంది.
"జస్ట్ ఎ మినిట్!" అంటూ… బయటకు వచ్చేసిన సునీలని సమీపించి, తానూ నాలుగు అడుగులు వేసాడు తేజ. ఆమె కాదనకపోవడంతో ధైర్యం చేసి, కొంచెం క్లోజ్ గా నడవడం మొదలుపెట్టాడు.
రోడ్డు మీద ఇద్దరూ జంటగా నడుస్తుంటే, ఎదురుగా వస్తున్న కాలేజీ అమ్మాయిలు, నైస్ పెయిర్ అన్నట్టు సైగ చెయ్యడం గమనించిన తేజ, మనసులోనే నవ్వుకున్నాడు.
"మీకు అభ్యంతరం లేకపోతే, మీకు నచ్చిన జాబ్ దొరికే వరకూ నా కంపెనీకి అడ్వైజర్ గా ఉండొచ్చు కదా! ఐ మీన్… ఈ కంపానియన్ రోబోస్ తో పాటే, సేఫ్టీ డివైజెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. వీటిని చేతికో… లేక మనం నడిచేటప్పుడు చెప్పులకో పెట్టుకోవడం వల్ల ఏదైనా రిస్క్ ఫేస్ చేసిన సమయంలో మన వివరాలు, మన వారికి తెలుసుకోవడం సులభమవుతుంది.
ఈ డివైజెస్ కి జీపీయస్ అనుసంధానం చెయ్యడం ద్వారా ఇదంతా సాధ్యపడుతుంది. ఇలాంటి మోడల్స్ డిజైనింగ్ లో మీలా ముక్కుసూటిగా మాట్లాడే, తెలివైన ఆడవాళ్ళ సలహాలూ, సూచనలూ చాలా అవసరం. ఏమంటారు?" సమయం చూసుకుని, తన మనసులో మాట బయటపెట్టాడు.
తేజ చెబుతున్నదంతా వింటూ, మౌనంగా నడుస్తున్న సునీల పెదవులపై మెరిసిన చిరునవ్వును, ఆమె అంగీకారానికి సూచనగా భావిస్తూ, "థాంక్యూ! థాంక్స్ సోమచ్!" అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. చొరవ తీసుకున్నందుకు ఆమె అభ్యంతరం చెప్పలేదు.
మనసులోనే 'థాంక్ గాడ్' అనుకున్నాడు తేజ.
"ఇదిగో మేం ప్రోగ్రామింగ్ చేసిన మోడల్ డివైజ్… ఇది చూడ్డానికి జస్ట్ ఓ రిస్ట్ బ్యాoడ్ లాగా ఉంటుంది. కానీ దీనిని చేతికి పెట్టుకుని, జీపీయస్ ఆన్ చేసి ఉంచితే, ఏదైనా రిస్క్ లో ఉన్నప్పుడు ఈ చిన్న హుక్ ని ప్రెస్ చేస్తే చాలు, మీరెక్కడున్నదీ సెంట్రల్ ప్యానెల్ కి సిగ్నలింగ్ ద్వారా అనుసంధానం చేయబడుతుంది. ఇలా మీరు వేరేవారి మొబైల్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.
దానివల్ల వారికి మీరెక్కడున్నదీ తెలిసి, వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది. దీనిని మీ చేతికి ఉంచండి. జస్ట్ ఫర్ ట్రయల్ ఓసారి నా మొబైల్ కి కనెక్ట్ అవ్వండి" అంటూ తాను ప్రోగ్రామింగ్ చేసిన సేఫ్టీ డివైజ్ ని సునీల చేతికి అమర్చాడు తేజ.
అతను తన పక్కన ఉంటే ఆమెకీ కొంత ఆలంబనగా అనిపించినట్టు, అతని చేతిలో ఆమె చేతి వేళ్ళు బిగుసుకున్నాయి. తేజ మాటలు సునీలను చాలా ఆలోచింపచేసాయి. ఇన్నాళ్ళూ ఇలాంటివాటికి ప్రాక్టీకబిలిటీ తక్కువగా ఉంటుందేమో అనుకున్న సునీలకి, ఇప్పుడు ఇలాంటి డివైజెస్ పెట్టుకోవడం ఎంత అవసరమో అర్థమయ్యింది. మెల్లగా తేజ చెప్పిన కాన్సెప్ట్ తో ఏకీభవించడం మొదలుపెట్టింది. తాను తయారుచేసిన ఆ డివైజ్ పట్ల సునీల సానుకూలంగా స్పందించడం తేజకి కొండంత బలాన్నిచ్చింది.
ఇద్దరి దారులూ వేరైనా అభిరుచులు మాత్రం ఒకటే కావడం వల్ల వారిమధ్య స్నేహం చిగురించింది. తరచూ సునీల కూడా రోబోటిక్ ప్రెజంటేషన్స్ లో పాల్గొనడం మొదలు పెట్టింది. మెల్లమెల్లగా సూచనలిస్తూ తేజా, ప్రశాంత్ ల స్టార్ట్ అప్ లో సుదతితో పాటు తానూ వర్కింగ్ పార్టనర్ గా మారింది సునీల.
=========================================================
ఇంకా ఉంది
చేయి వదలకు నేస్తమా - పార్ట్ 6 త్వరలో
=========================================================
వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ
నమస్తే!
సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.
రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.
వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.
మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.
వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.
ధన్యవాదములు. 🙏🏼
ఇట్లు,
వేలూరి ప్రమీలాశర్మ.
@prameelasarma970
•8 hours ago
నా రచనకు గళం అందించిన మీకు ధన్యవాదాలు sir 🙏🏼