తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 25
- Pandranki Subramani
- Apr 25
- 10 min read
Updated: 6 days ago
#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 25 - New Telugu Web Series
Written By Pandranki Subramani Published In manatelugukathalu.com On 25/04/2025
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 25 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది.
పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. నరసింహ మూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది. ఇండియా వచ్చిన నరసింహ మూర్తికి శంకరం గురించి తెలుస్తుంది. మాధవి, శంకరాల వివాహం జరుగుతుంది.
నరసింహమూర్తి చేసే కాల్స్ కి రెస్పాండ్ కాదు సుజాత. అమెరికా వెళ్లిన నరసింహ మూర్తిని సుజాత కాంప్ ఫైర్ కు తీసుకొని వెళ్తుంది.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 25 చదవండి..
లోపలకు వెళ్ళిన వెంటనే నరసింహమూర్తి కళ్లు ఫెళ్ళున మెరిసాయి. క్రింద మెత్తటి చక్కటి తివాసీతో- పూల పాన్పుల వంటి చిన్నపాటి పడకలతో- తన కాలేజీ రోజుల్లో-- అదేదో అరేబియన్ నైట్ సినిమాలో చూసిన సీను కళ్ళముందు మెదిలింది.
అదంతా చూస్తూ అతడడిగాడు- “ఇదంతా ఫారెస్టు డిపార్టుమెంటు వాళ్ళు చేసిన యేర్పాటా? లేక--” అంటూ లేచి వెళ్లి సూటుకే సునుండి నీ లెన్త్ కోటు తీసుకుని వేసుకున్నాడు.
“కాదు. నాకు కొంత ఇంటీరియర్ డిజైనింగ్ తెలుసు. చాలా వరకు నేను చేసిన ఏర్పాటే. నేనారోజు ఇచ్చిన కోటు తేవడం మరచిపోతారేమో ననుకున్నాను” అంటూ అక్కడున్న ఫ్లాస్కునుండి కాఫీపోసి ఇచ్చింది.
అతడు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు- “ఇప్పుడేగా మనం భోజనం చేసి వచ్చాం. అదీను అక్కడొకసారి ఇక్కడొక సారీను. హెవీగానే ఉన్నట్లుంది సుజాతా!”
“మీకు స్ట్రాంగ్ గా ఉంటేనే కదా బాగుంటుంది”
ఆ మాట విని అతడొకసారి తేరిపార చూసి కాఫీ కప్పు అందుకున్నాడు. ఆమె తన పట్ల అవసరానికి మించిన మన్నన కావాలనే కనబరుస్తున్నట్లుంటే- అతడి కళ్ళముందు సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా దాగున్న అగ్ని పర్వతం ఫెళ్లు ఫెళ్లున ఎగసి పడ్తున్నట్లు మెదిలింది. వాతావరణంలో కాస్తంత మార్పు వస్తే బాగుంటుందనిపించి అడిగాడు - “అలా లైట్లు ఫోకస్ అయేంత వరకూ చెట్ల మధ్య నదీ తీరం వరకూ నడచి వద్దామా!”
ఆమె ఠపీమని బదులిచ్చింది- “వద్దు”
“ఎందుకు- మృగాలు తచ్చాడుతాయన్న భయమా!”
“ఉన్నా ఏమీ కాదు. ఎందుకంటే ఇక్కడ చుట్టుప్రక్కల ఫారెస్ట్ గార్డులుంటారు. మీరనుకుంటున్నట్టు ఇక్కడ యెగిరే వన్నీ మామూలు దోమలు కావు. అవి పెద్దవే కాక- వాటి మధ్య విషకీటకాలు కూడా నలుపుగా చీకటిలో చీకటిగా కలుస్తూ తిరుగాడుతుంటావి. మీరు మంచాన పడినా పడ్తారు. గవర్నమెంట్ ఆఫీసర్లకు లీవు దొరకడం—ఆ తరవాత దానిని పొడిగించడం అంత తేలికైన పని కాదని నాకు తెలుసు”
“మంచాన పడ్డానే అనుకో. నన్ను చూడాటానికి నువ్వు లేవా?”
ఆమె ఆ మాటకు బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయింది.
“అంతటి నిదానం చూపించకు సుజాతా!”
అప్పుడామె కళ్ళెత్తి చూస్తూ ముక్తాయింపు పలికింది - ‘చూపిస్తే?’ అన్నట్టు చురుగ్గా చూసింది.
“అపరిచితుల మధ్య ఉన్నట్లని పిస్తుంది. గుండెనిండా బరువు పేరుకుపోయినట్లనిపిస్తుంది”
“హుఁ మీలోని బరువు గురించే ఆలోచిస్తున్నారు. ఎప్పుడైనా నా గుండెలోని గుబులు గురించి ఆలోచించారా!”
అతడేమీ అనకుండా నిదానంగా చూస్తూ ఉండిపోయాడు. వింటి నారిని ఆకర్ణాంతం లాగి విడువబోయే బాణాన్ని ఎదుర్కోవడానికి అతడు లోలోన సంసిద్ధుడవసాగాడు. అప్పుడామె అదే నిదానంతో చూస్తూ అతడికెదురుగా కుర్చీ తీసుకుని కూర్చుంది.
“రెక్కలు విదల్చిన పక్షుల్లా మనమిప్పుడు మనసులు విప్పి మాట్లాడుకుందామా మూర్తీ!”
పరాధీనుడై-- నిస్సహాయుడై తలూపాడను.
బైట వైట్ అమ్మాయిలు- బ్లాక్ అమ్మాయిలు- వాళ్ల వాళ్ల బాయ్ ఫ్రెండ్సుతో కలగలసి ఆనందంతో పెళ్లగించే అరుపులు విని పిస్తున్నాయి. వాళ్ల కేరింతలకు అక్కడక్కడ పిట్టలు తుళ్ళిపడి కూస్తూ ఉన్నచెట్టునుండి మరో చెట్టు వేపు ఎగిరిపోతున్నాయి.
“మీరేదో ఆలోచనల మధ్య తేలిపోతున్నట్టున్నారు”
తనలోని అనుమానం వ్యక్తం చేసిందామె.
“లేదు. నిలకడగా నీదగ్గరే ఉన్నాను. నీతోనే ఉన్నాను”
“సరే- చెప్తాను. ఎమోషనల్ అవకూడదు-- సరేనా?”
“ఆ దశ ఎప్పుడో దాటిపోయింది సుజాతా! కర్ణ కవచం తొడుక్కుని అన్నిటికీ సంసిద్ధుడనయే వచ్చాను. ఇన్ని రోజుల రాధ్ధాంతం తరవాత దేనికదే తేలిపోవాలి కదా! ఇక పైన కూడా మంచు ముద్దలతో గుద్దులాటా? ఇలా సాగిపోతుంటే చివరకు ఎవరికీ ఏమీ మిగలదు”
“ఔను. బాగా చెప్పారు. చక్కటి తెలుగులో చెప్పారు. ఇక నేను చెప్పేది వినండి. మా బామ్మ చెప్తుండేది సంకట హర వినాయక వ్రతానికి విఘ్నాలు వస్తుంటావని. ఇప్పుడు దాని అర్థం నాకు బోధపడుతూంది. మొదట మీ సంబంధం గురించి యింట్లోవాళ్ళు ప్రస్తావించినప్పుడు వద్దనే అనాలనిపించింది. అలా నెగటివ్ గా తోచడానికి కారణం లేక పోలేదు.
మా చెల్లి మోహన అన్నట్టు—యెంతగా రఁవణమ్మగారి ఆలనా పాలనలో పెరిగి పెద్దదాన్నయినా—నేను అటూ ఇటుగా అమెరికన్ సామాజిక వాతావరణంతో మమేకమై పెరిగిన దానిని. ఇక్కడి విలువలు ఆనవాయితీలు నారక్తంలో కొంతలో కొంతైనా కలసిపోయే ఉంటావి. మీరేమో పూర్తి గా రాజమండ్రి వాస్తవ్యులు. మన మధ్య మెంటల్ అడప్టాబిలిటీ కుదరక పోవచ్చు.
మరొకటి- ముక్కూ మొహం ఎరగని మిమ్మల్ని నమ్ముకుని ఏడు సముద్ర తీరాలు దాటి- అమ్మానాన్నలను— చెల్లీ తమ్ముళ్ల బంధాలను- ముఖ్యంగా ఇక్కడి సంపూర్ణమైన సేఫ్టిటీ జోన్ ని వదలి అంతదూరం రావడం పూర్తిగా అసంబంధ్ధంగా తోచింది. కాని తరవాత మనసు మార్చుకున్నాను”
అప్పుడతను కలుగచేసుకున్నాడు- “ఎందుకూ! ” అని.
“చెప్తాను. మీ నాన్నగారి గురించీ- మీ పెదనాన్నగారి గురించీ మా నాన్నా చిన్నాన్నాచెప్పారు. ఇక పోతే- మా పిన్ని ఒక మాట అంది- ‘మా అత్తగారు తన ఇద్దరు మనవరాళ్లకై ఇటువంటి సంబంధం గురించే కలలు కనేవారు‘ అని.
సూటిగా- ఒక్కమాటలో చెప్పాలంటే మీ కుటుంబం పట్ల నాకు ఏర్పడ్డ గౌరవ భావం వల్లనే మిమ్మల్ని పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకున్నాను. కొత్త ప్రాతల మేలు కలియిక- అంటారే- అటువంటి ప్రోగ్రస్సివ్ కుటుంబమే మీదని తేల్చుకున్నాను. ఇక ఆ ఒరవడిన నాకు తెలియకుండానే చేయకూడని పొరపాటొకటి చేసాను. అదే నాకు గుదిబండలా నెత్తి పైన కూర్చుంది. అదేంవిటో తెలుసా మూర్తిగారూ! ”
అదేమిటన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు.
“వశం తప్పడం- మీకు మనసివ్వడం”
ఆ మాటంటూ ఆమె నిట్టూర్పు విడిచింది. “మేటర్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఏమంటే- మీరు నాలా మనసివ్వలేదు. నన్ను మనసార ప్రేమించలేదు”
“ఎందుకలా అనుకుంటున్నావు? ” బిత్తరపోతూ అడిగాడతను.
“అనుకోవడమేమిటి- ఆధారాలున్నాయి’
అప్పుడతను ఓ క్షణం ఆగాడు. అతడూహించినట్టే అగ్నిపర్వతం బ్రద్దలు కాబోతున్నది.
“అదేమిటో చెప్తేకదా తెలుస్తుంది! ” సాధ్యమైనంత మేర కంఠ స్వరాన్ని సరళీకృతం చేసుకుంటూ అడిగాడతను.
“ఉఁ వస్తున్నాను. మొట్ట మొదట మీరు నా చేతుల్ని అందుకుని కళ్ళ కద్దుకున్నారు. నేనేమీ అనలేదు. నా యందభిమానంతో అలా చేసుంటారని మిన్నకుండి పోయాను. మోహన మాటలకు మీరు మరీ డిస్టర్బ్ అవకూడదని- ‘ఐలైకిట్‘అని కూడా అన్నాను. గుర్తుంది కదూ! ”
అతడేమీ అనకుండా తేరి చూడసాగాడు. అవి సుందర క్షణాలు- మృదు మధుర మనోభావాలకు ఆలంబ నలు- ఎందుకు గుర్తుండవూ! అవన్నీ మరోమారు జ్ఞప్తికి తెచ్చుకుంటూ తలూపాడు గుర్తుందన్నట్టు.
ఆమె కొనసాగించింది- “ఇక రెండవది- గుడికి వెళ్లి వస్తూ కారు వేపు నడుస్తూ మోహన అన్న మాటలకు రెచ్చిపోతూ— నా అనుమతి లేకుండానే నా పెదవుల్ని ముద్దు పెట్టుకున్నారు. “మగాడన్నవాడు ఆపాటి మగటిమి చూపించడా యేమిటి!’ అనుకుంటూ అప్పుడు కూడా ఊరకుండిపోయాను.
అంతటితో ఊరకున్నారా- చీర కట్టులో నన్ను చూసి నా అందం చూసి ఉగ్గబట్టలేక పోతున్నానంటూ—హాలు గ్రీన్ రూములో నన్ను పెనవేసుకుని ఏదేదో అన్నారు--
ఇప్పుడదంతా ఎందుకులెండి. చెప్పొచ్చేదే మంటే—నా అనుమతి లేకుండానే అన్నీ సాధించారు. కాని మీరు నా గురించిన ఒక సాధారణ విషయం గుర్తించలేదు. అప్పుడే నాలో మునుపెన్నడూ లేని యవ్వన కోరికలు నెమలి పింఛాల్లా పురివిప్పనారంభించాయి. ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన అలజడికి లోనుచేసాయి.
కాని మీరు అదేమీ గమనించకుండా మీ పనిపైన గురిపెట్టి మీ దారిన మీరు వెళ్ళిపోయారు. నా మానసికావస్థను అర్థం చేసుకోవడానికి ఇసుమంత ప్రయత్నం కూడా చేయలేదు. అట్టర్ ఇండిఫరెన్సుతో మరలి పోయారు”
“ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్! ఒక్క నిమిషం ఆగు. నిన్నలా డిస్టర్బు చేసుండకూడదు. అదుపు తప్పి అలాచేసినందుకు ఐ యామ్ వెరీ సారీ! కాని నీ మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించ లేదన్నది మాత్రం కరెక్టు కాదు. ఎలాగూ పెళ్ళి చేసుకోబోతున్న కన్యే కదా అన్న భరోసాతో ధీమాగా వెళ్ళిపోయుంటాను”
“కాదు! మీరు విపరీతమైన నిర్లక్ష్య భావంతో—ఎలాగూ పెళ్ళాం కాబోతున్నదానినే కదా- అన్న అహంకారపు విసురుతో వెళ్లిపో యారు. సముదాయించడానికి కాస్తంతయినా ప్రయత్నించారా? ! ”
“సారీ! విరిసీ విరియని మొగ్గలా తోస్తూంది. కొంచెం విడమర్చి చెప్తే బాగుంటుందేమో! ”
“వెళ్ళేటప్పుడు ఆదరాబాదరాగా వెళ్లిపోయారే గాని- నన్ను ఊరడించారా! కనీసం నా చేతిని తీసుకుని నిమిరి అనురాగపు జల్లు కురిపించారా? అలా నన్ను దగ్గరకు తీసుకుంటే నేను వారించేదానినా!”
“సారీ! నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. మొదటిది- మా అమ్మ గుర్తుకు వచ్చి నా మూడ్ అదోలా మారింది. రెండ వది- అంత మంది పెద్దల మధ్య నేనెలా నిన్ను సమీపించగలను. అదే సమయాన నిన్ను ప్రక్కగదిలోకి రమ్మని పిలవలేను కూడాను- నువ్వింకా నా భార్యవు కాలేదుగా!”
“టు బి ట్రూత్ ఫుల్- నేనప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. అన్నీ నా అవగాహనకు వచ్చిన తరవాతనే మీ ముభావం వెనుకు ఉన్న కార్య కమామిషుల్ని తెలుసుకున్నాను”
అదివిని- “అంటే?” అన్నట్టు కనుబొమలు ఎరగేసి చూసాడు నరసింహమూర్తి.
“మనమింకా పెళ్ళి చేసుకోలేదు. ఆ మాటకు వస్తే పెద్దల సమక్షాన నిశ్చితార్థమూ జరగలేదు. కావున- మనం చేరువ కాలేదు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే మనం ఏనాడూ శారీర కంగా కలవడానికి కుతూహలం చూపించ లేదు. వాస్తవానికి కలవ కూడదు కూడాను. అంత వరకూ బాగానే ఉంది. మరి ఏమీ జరక్కుండానే—అంతలోనే భారతీయ స్త్రీ పట్ల వెగటు పుట్టుకొచ్చింది- కొత్త రుచులు కావల్సి వచ్చింది మీకు. అంతే కదూ మిస్టర్ నరసింహమూర్తీ! ”
మౌనం. దీర్ఘమైన విరామం. సుజాత అతణ్ణి కాసేపు ఆలోచించుకునేందుకు ఎడబాటునిచ్చింది.
అతడు కొన్ని క్షణాల పాటు ప్రాణం సారం పోగొట్టుకున్న నిర్వీర్యుడిలా తదేకంగా చూస్తూండి పోయాడు. కాని ఏదో ఒకటి అనాలి కాబట్టి- న్యూక్లియర్ భార జలం వంటి నిశ్శబ్దాన్ని తగ్గించాలి కాబట్టి గొణిగినట్లన్నాడు- “నిజంగా నాకేమీ అర్థం కావడం లైదు సుజా! ”
ఆమె నవ్వింది. “పెళ్ళికి ముందు గాని- పెళ్ళి తరవాత గాని మీరు నా ముందు ఇంత బేలగా కనిపిస్తారని నేనను కోలేదు మూర్తి గారూ! సరే- మీకు అరటి పండు ఒలిచి ఇచ్చినట్లే చెప్తాను. కాని ఒక షరతు- మరీ అంత అమాయకంగా ముఖం పెట్టి చూడకండి. ఏమీ ఎరగనట్టు అలా నిర్ఘాంత పోయినట్టు చూస్తే మా మోహన అన్నమాటలే జ్ఞప్తికి వస్తాయి”
అతడు పెదవి విప్పకుండానే అవేమిటో చెప్పమన్నట్టు తలాడించాడు.
ఆమె మళ్లీ నవ్వడానికి ప్రయత్నిస్తూ చెప్పసాగింది- “ఇండియన్స్ దాపరి కంలో- దాగుడు మూతల ఆట ఆడటంలో దిట్ట అంటుంది. మహర్షులు నడయాడిన పుణ్యక్షేత్రమైనా ఇండియన్సుకి కడుపునిండా కపటమే అంటుంది. మీరిప్పుడు దాని మాటను వాస్తవమని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు”
“కుడ్ యు గివ్ మి ఎనీ ఎగ్జాంపుల్ ? ”
“ఎక్కడిదో ఎవరిదో ఎందుకు? మన వ్యవహారమే తీసుకుందాం. ఒక సారి అనుకోకుండా మాప్రెండ్ నైట్ డిన్నర్ పార్టీకి వెళ్ళాల్ని వచ్చింది. అది మాయింటి నుండి కొంచెమే దూరం. అందరూ బీర్- జిన్- విస్కీ వంటివి తీసుకుంటున్నప్పుడు— నేను మాత్రం పండ్ల రసం తాగుతూ అక్కడ జరుగూతూన్నకేరింతల తంతుని చూస్తూ నిల్చున్నాను. ఎక్కణ్ణించి ఎప్పటి నుంచి నన్ను చూస్తున్నాడో తెలియదు. నా దగ్గరకి జర్మన్ యాక్సెంటు ఉన్న ఒక స్టూడెంటు వచ్చి ఎటువంటి మొహమాటమూ తడబాటూ లేకుండా అడిగాడు- ‘ఐ వాంట్ టు హేవ్ యువర్ కంపెనీ విత్ మీ- డుయూమైండ్?’
నేనతడి మాటకు పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే - వాళ్లా విషయంలోనే కాదు, చాలా విషయాలలో బోల్డ్ గా స్ట్రెయిట్ గా ఉంటారు. ఇది వాళ్ల నైజం”
“అప్పుడు నువ్వేమని బదులిచ్చావు? ”
“హఁ-- రవణమ్మాగారి మనవరాలిని సూగాత్రమ్మగారి కూతుర్ని- నేనెలా స్పందించి ఉంటానో ఊహించ లేరా! ”
“ఓకే! ఊహించగలిగాను. ఇంతకూ నన్నుదాపరికాల దామోదరం అంటావు. నిక్కచ్చితనం లేని రాజనాలని ముద్రవేస్తావు. ఔనా? ”
“నిస్సందేహంగా! అంతేకాదు- మీది పులి గుణం కూడా కాదని వాదిస్తాను. చిరుత గుణమంటాను”
అంటే- అన్నట్టు షార్పుగా చూ సాడతను.
“పులి స్వతస్సిధ్ధంగా మేజెస్టిక్ ఎనిమల్. దొరికిన దానిని కడుపార ఆరగించి తన మానాన తను వెళ్లి చెట్టు నీడనో కొండ గుహలోనో వెళ్లి పడుకుంటుంది. మళ్ళీ ఆకలి పుట్టేంతవరకూ వేటజోలికి పోదు;మరొక జంతువు కళ్ళకు అగుపించినా సరే-- కాని చిరుత అలా కాదు. ఇక్కడ దొరికిన ఎరను తింటూనే- తినడం పూర్తిచేయకుండానే అటు పోతూన్న జింకను తరిమి పట్టుకుని పడేస్తుంది. మరొక చోట మరొక దానిని— ఇలా ఇలా—”
“అంటే- నాది నీచమైన ప్రవృత్తి అంటావు. అంతే కదూ? ”
అతడి కళ్ళు చెదురు తున్నాయి. ఆమె తగ్గలేదు. కాసేపు ఊరకుండిపోయి, హ్యాండ్ బ్యాగు నుండి చేతి గుడ్డ తీసి కనుకొలకుల్ని తుడుచుకుంది. నరసింహమూర్తి ముఖం వివర్ణమైంది. ఆవేశంతో ముక్కు పుటాలు ఎగిరి పడ్తున్నాయి.
”నిజంగా చాలా బాధగా ఉంది సుజాతా! నా జీవితంలో నేనిన్ని మాటలు పడతానని ఎన్నడూ అనుకోలేదు”
“బాధ అన్నపదానికి మీకు అర్థమే తెలియదు మూర్తీ! బాధలోనున్న లోతుని సున్నిత మనస్కురాలైన ఆడదానికే తెలుస్తుంది”
“సరే— అలాగే అనుకో. ఇక అగ్ని శేషంలా ఇంకా బిటర్ ఫీలింగ్సుని మిగల్చడ మెందుకూ! తాడో పేడో తేల్చేసుకుని మనం ఇక్కణ్ణించి కదలి వెళ్ళి పోవడం మంచిది కదా!”
తనలో ఎడారి తుఫానులా చెలరేగిన మానసిక సంక్షోభాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి యమయాతన పడుతూ కాసేపాగి ఊపిరి పీల్చుకుందామె. ఆ తరవాత తెరపి కూడదీసుకునేందుకు ప్రయత్నిస్తూ అడిగింది సుజాత- ‘క్యాథరిన్ తో మీకున్న క్లోజ్ నెజ్ నెస్ ఎప్పట్టినుంచి ఆరంభమైంది? క్యాథరిన్ గురించి నాకు చెప్పకుండా ఎందుకు దాచారు? ”
ఆ మాటతో అతడికి ఝలక్ వంటిది తగిలింది. కాని- బైట పడకుండా సర్దుకునేందుకు తనను తను కుదుట పర్చుకున్నాడు. ఇంటి వాకిట వరకూ వచ్చి యిక ముంతను దాచడమెందుకు? “ట్రైనింగు పీరియడ్ లో కెనడా నుండి వచ్చిన నా సహ ట్రైనీ. నా ప్రక్క సీటే ఆమెది”
“సరే—దానిని అలా ఉంచండి. లిమండ్ నాన్సీ కూడా మీ బ్యాచే కదా. మరి ఆమె గురించి కూడా నాకు చెప్పలేదే!”
“ఆమె కూడా నా సహ ట్రైనీయే. బ్రెజిల్ నుండి వచ్చిన క్యాండిడేట్- లాటిన్ అమెరికన్”
“నాకు కావలసింది మీ వివరణ కాదు మూర్తిగారూ! నాకు కావలసింది విషయం- వాస్తవం. ఈమె గురించి కూడా నాకెప్పుడూ చెప్పలేదే!”
అతడు క్షణకాలం ఆగి నిదానంగా చెప్పడానికి పూనుకున్నాడు-
‘చెప్పాలన్న అవసరం కలగలేదు గనుక. వచ్చిన యాభై అరవైమంది క్యాండిడేట్లలో వాళ్లు ఇద్దరున్నారు. అంతే!”
“కాదు. మీరు మళ్ళీ ముసుగులో గుద్దులాటకు దిగుతున్నారు. గాలిలోకి విసిరిన బాణంలా కాకుండా టార్గట్ తప్పని మిస్సా యిల్ లా గురిపెట్టి అడుగుతున్నాను. మీరు క్యాథరిన్ ని ముద్దు పెట్టుకున్నారా లేదా? పెద్దావిడ గ్రేస్ ప్రేమతో హగ్ చేసుకోమని అడిగినప్పుడు ఇబ్బందిగా తొలగి నిల్చున్న మీరు క్యాథరిన్ ని గాఢంగా ఎలా ముద్దు పెట్టుకోగలిగారు? వైట్ ఉమన్ విత్ బ్లూమింగ్ యూత్ అన్న యావతోనే కదూ!”
“ఆమెను నేను ముద్దు పెట్టుకోలేదు. ఆమే నన్ను ఏదో విషయమై డిస్కస్ చేస్తున్నప్పుడు నేనిచ్చిన వివరణ విని ముగ్ధురాలై ఉన్నపాటున నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది.”
“ఎవరు ముందుకు వచ్చి ముద్దు పెట్టుకుంటేనేమి? రెండూ ఒకటేగా!“
“అదెలా ఒక్కటవుతుంది? మంగళ హారాన్ని ఏనుగు మన మెడన వేయడమూ- అటు పోతూన్న మేకమెడన వేయడమూ ఒక్క టవుతుందా యేమిటి? ఐనా ఇదంతా నీకెలా తెలుసు? ఇక్కడుండే ఇవన్నీ ఎలా తెలుసుకోగలిగావు!’
“మీకోసం ఆమె మాటిమాటిగా ఫోనులో భోగట్టా అడగటమూ- సరాసరి రెండు సార్లు ఇంటికే రావడమూ- నాకు అనుమానం కలిగించింది. చాలా రోజులుగా అందరూ- మోహనతో సహా వాళ్లిద్దరూ నాకు పరిచయమున్న స్నేహితురాండ్రనుకున్నారు’
“నేను మీ ఇంట్లో ఉంటానని వాళ్ళెలా అనుకున్నారు? ”
“ఇందులో పెద్ద రహస్యమేముంది మూర్తిగారూ! మీ ట్రైనీ క్యాండిడేట్లందరికీ వారం రోజుల పాటు ఊరు తిరగడానికి రీసెస్ ఇచ్చా రు కదా! అప్పుడు మా ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు. మొదటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వారం రోజుల పాటు మీరు మా యింట్లోనే మకాం పెట్టాలనేగా--
మీరు అర్జంటుగా ఊరు వెళ్తూ అసలు విషయం వాళ్లకు చెప్పడం మరచిపోయుంటారు. సరే- ఇక దీనికి కూడా బదులివ్వండి. ఆ లిమండ్ నాన్సీని కూడా ముద్దుపెట్టుకున్నారు కదూ! ”
నరసింహమూర్తి నిట్టూర్చాడు. నిస్సహా యంగా చూస్తూ అన్నాడు- “ఇటువంటి విషయాలలో నాకంత చొరవ లేదు. మళ్ళీ జరిగింది డిటో అనే చెప్పాలి”
అతడి పరిస్థితి శత్రు సేనల మధ్య చిక్కుకొని చేతులెత్తేసిన పటాలం వాడిలా ఉంది.
అంటే- అన్నట్టు చూసిందామె సూటిగా.
“ఆమే నన్ను అభిమానంతో కిస్ పెట్టింది. ఇద్దరూ నా పట్ల కాస్తంత ఎమోషనల్ గానే ఉన్నారు. యెమోషనల్ గానే రియాక్ట్ అయేవారు”
“దయచేసి పాయింట్ నుండి తొలగిపోకండి. ఎక్కడ జరిగింది ఇదంతా?” అని అడిగిందామె. క్యాంపస్ కి అవతలున్న చెట్ల మధ్యనని చెప్పాడతను.
ఆమె ఊరుకోలేదు. “ఉన్నపళాన- స్పంటేనియస్లీ అభిమానం పొంగుకు వచ్చిన వాళ్లు మిమ్మల్ని వృక్ష సముదాయంలో కి వెళ్లి ముద్దు పెట్టుకోనవసరం లేదు మూర్తిగారూ! ఈజిట్ నాట్ సో?”
“అబ్బ! నేను నిజం చెప్తున్నాను- నువ్వుగాని ఫెడరల్ కోర్టు అడ్వకేట్ వి ఐతే కోర్టు ప్రాంగణం గింగిర్లెత్తి పోతుందనుకో! ఇక ఉన్న దున్నట్లు చెప్తాను. వినడం వినకపోవడం నీ ఇష్టం. అప్పుడప్పుడు క్లాసుల్లో కొన్ని దేశాల చరిత్ర గురించి ఆ దేశాల సాంఘిక ఆర్థిక పరిస్థితుల గురించి ప్రస్తావన వచ్చేది. ఆ సమయంలో భారతదేశం గురించిన చర్చలు కూడా సాగుతుండేవి.
క్లాసులో జరిగే ఆ చర్చల సారాంశాన్ని సంక్షిప్తీకరించి ప్రోజెక్టు రిపోర్టులా తయారు చేసి ట్రైనింగ్ ప్రోగ్రాము ఇన్ చార్జీ మిస్టర్ రస్సెల్ గిల్ బర్టుకి అందచేయాలి. అప్పుడు వాళ్ళిద్దరూ నాతో భారతదేశానికి సంబంధించిన విషయాలను చర్చించేవారు.
ముందే చెప్పాగా- ఇద్ద రూ కాస్తంత ఎమోషనల్ టైపని. అప్పుడొకసారి ఇప్పుడొసారి సంతోషంతో ఆవేశ పడిపోతూ అలా నన్ను కౌగలించుకునేవారు”
“కాదు. కౌగలింతతో చాలించేవారు కారు. లిప్ లాక్ చేసేవారు. టంగ్ ఎంటాగల్ కూడా చేసేవారు. ఔనా! ”
అతడు బదులివ్వ లేదు. మళ్ళీ ఆమె అందుకుంది- ”మీరెప్పుడూ వాళ్లను వారించడానికి ప్రయత్నించలేదు. దూరంగా తొలగిపోలేదు. అంతేకదూ? ”
“తొలగిపోయేంత అవకాశం నాకివ్వలేదు వాళ్లు. దానికదే మామూలుగా జరిగిపోయేది"
“మామూలుగా జరిగిపోయిందా! సరే—అదే ఫీలింగుతో దీనికి బదులివ్వండి. ఆ రాత్రి మా ఫ్రెండు వాళ్ల డిన్నర్ పార్టీలో ఆ జర్మన్ యువకుడు వచ్చి నన్ను తనతో రమ్మనమని పిలిచాడని చెప్తే మీకెలా అనిపించింది? మీరు పెళ్ళి చేసుకోబోతూన్న అమ్మాయి దానికి ఎలా స్పందించిందోనని తలపోస్తూ ఎంత వేగిరపాటుకి లోనయారో తెలుసా! మరి నేను జీవితాంతం కలసి ఉండబోతూ న్నవ్యక్తి మరొక స్త్రీని ఎమోషనల్ గా తాకాడని తెలిస్తే నాకెలా ఉంటుంది? ఫీలింగ్స్ మీ మగాళ్ళకే ఉంటుందా? మాకుండవా? ”
అతడికి ఆలోచనలు అందలేదు. మాటలు దొరకలేదు. అయోమయంగా చూడసాగాడు.
=======================================================================
ఇంకా వుంది
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Comments