#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 6 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 21/12/2024
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది.
ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి.
అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది.
అమెరికా వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ ప్రోగ్రాము ఇన్ చార్జీ మిస్టర్ రస్సెల్ ను కలుస్తాడు.
డబల్ బెడ్ రూమ్- విత్ షేరింగ్ ఫెసిలిటీ తీసుకొని, రూమ్ కు వెళ్తాడు. అతని రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది.
పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారిని కలుస్తాడు.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 6 చదవండి..
క్లాసులు ముగిసిన తరవాత— ఆ రోజు జరిగిన గెట్ టు గేదర్ డిన్నర్ పార్టీలో నరసింహమూర్తి ఉత్తర భారతం నుండి వచ్చిన మల్హొత్రాను— పశ్చిమ భారతం నుండి వచ్చిన సురేశ్ పాటిల్ ని కలుసుకున్నాడు. వాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు. అంతేకాక- విదేశీ పార్టిసిపెంట్సుతో కూడా పలకరింపులతో పరిచయాలు పెంచుకోవడానికి చొరవగా ముందుకొచ్చాడు నరసింహ మూర్తి. ఎందుకంటే- తమ్ముడి కొడుకు విదేశీ ప్రయాణానికి బయల్దేరేముందు భూషణం కొన్ని ఉపదేశాలు అందించాడు. అవసరం ఉంటుందో- అవసరం ఉండదో అన్న ప్రసక్తికి పోకుండా అందరితోను పరిచయాలు పెంచుకోవాలి. అవగాహన పెంచుకోవాలి. ఎవరిలో ఎంత లోతుందో తెలియకుండా ఎవరినీ పై చూపులతో అంచనా వేయకూడదు. అంతేకాక- ఎవరి అవసరం ఎప్పుడేర్పడు తుందో ఊహించి చెప్పడమూ సాధ్యం కాదు. అందుకే- ఆయన మాటల్నిగుర్తుకు తెచ్చుకుంటూ ఎదుటొచ్చిన వారందరిపైనా స్నేహపు జల్లులు కురిపించాడు. అలసటను దగ్గరకు చేరనివ్వకుండా యెదురొచ్చిన వారందరితో చేతులు కలిపాడు ముచ్చటపూడి నరసింహమూర్తి.
ఆంగ్లం ఒక్కటైనా, అమెరిన్ ఇంగ్లీషు ఉఛ్చరణలో వ్యత్యాసం యెలాగుంటుందో; అదే రీతిన భారతీయులు- లాటిన్ వాళ్ళు- జపాన్ వాళ్లు- ఇతర ఆసియన్ దేశవాస్థుల వాళ్ళ ఉఛ్చరణలో కూడా వేర్బాటుండటం నరసింహమూర్తి గమనించాడు. ఈ కారణాన- యెదుటివారితో సంభాషిస్తున్నప్పుడు విషయం అర్థం చేసుకోవడానికి అతడు ఒకటికి రెండుసార్లు- ‘పార్ డన్ మీ’ అని అడగ వలసొచ్చేది. ఎన్ని భాషలు నేర్చుకున్నా- ఎన్నెన్ని ఊళ్ళు తిరిగొచ్చినా ఉఛ్ఛరణకు మూలం తల్లిభాషలోనేగా ఇమిడి ఉంటుంది.
అంతెందుకు- రాష్ట్ర విభజనకు ముందు ఆ తరవాత కూడా ఒకే తెలుగు గడ్డపైన మాట్లాడే తెలుగు భాషలోని ఉఛ్ఛరణలు ప్రాంతా లవారీగా ఎంత మార్పు సంతరించుకోవడం లేదూ! ధ్వనులు చెదరి, స్వరాలు ఒరిగి వేరు వేరుగా వినిపించడం లేదూ! ఐనా ఆ అడ్డంకుల్ని అధికమిస్తూ ఒకరి నొకరు అర్థం చేసుకుంటూ సంభాషించుకుంటూ ఒకరికొకరు చేరువవుతూనే ఉన్నారుగా! సంబంధాలు కుదుర్చు కుంటూనే ఉన్నారుగా! ఎన్ని రాజకీయ సమీకరణలు యెన్ని సర్దుబాటులు మధ్యంతరంగా చోటు చేసుకున్నా అవి తెగని బంధాలుగా కొనసాగుతూనే ఉంటాయిగా--
ఆ రోజురాత్రి డిన్నర్ పార్టీనుండి డైనింగ్ హాలులోనుంచి బయటికి వచ్చి అసంకల్పితంగా తలెత్తి చూసాడు నరసింహ మూర్తి. చుక్కల్లేని విశాలమైన ఆకాశం. ఇక్కణ్ణించి భాగ్యనగరం వరకూ సాగిపోతూ తొంగి చూసే ఆకాశం. అతడు పుట్టి పెరిగిన రాజమహేంద్ర వరంలోని ఆకాశం కూడా దీనితోనే కదూ అనుబంధం పెనవేసుకొనుంటుంది! ఇక్కడ చూసినా- అక్కడ చూసినా మరెక్కడ చూసినా ఉన్నదంతా ఒక్క ఆకాశమేగా మరి.. ఇకపోతే మేఘాల మాటేమిటి?
’ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు--- దేశదేశాలన్నీ తిరిగి చూసేవు-- ‘తన తల్లి వర్థనమ్మకి చాలా ఇష్టమైన పాట. ఇంతకీ ఇంట్లో అమ్మానాన్నా ఏమి చేస్తుంటారు? మరి మాధవి ఏమి చేస్తుంటుంది? ముగ్గురూ భోజనాలు ముగించి హాయిగా పడకపై పవ్వళిస్తూ ఉంటారు. లేదా వాళ్ళ వాళ్ళకిష్టమైన టి. వీ. సీరియల్స్ చూసి- ఆ తరవాత పెందలకడే లేచి వాళ్ల వాళ్ల పనులు చూసుకోవడానికి హడావిడి పడిపోతూ ఉంటారు.
అప్పుడు గిర్రున గీచినట్లనిపించిన చలిగాలికి వణుకు వంటిది పుట్టి స్వెట్టర్ కాలర్ పైకి ఎగరేసి, మఫ్లర్ని మెడ చుట్టూ బిగించి ముందుకు కదిలాడు నరసింహమూర్తి. అప్పుడు ప్రక్కన అలికిడి వినిపించినట్లనిపించి తిరిగి చూసాడు. ఎవరూ లేరు గాలి ఊసులు తప్ప.
ఈ పాటికి షేక్ అహ్మద్ చెరువుగట్టున రంగరించిన ఇంగువలా అరబ్బు ప్రాంతాలనుండి, మలేషియా మాల్దీ వ్ ఆఫ్గన్ వంటి దేశాల వంటి ముస్లిమ్ నేపథ్యం గల వాళ్లతో కలగలసి పోయుంటాడు. వచ్చిన కార్యం మరచి ఇప్పటి ముస్లిమ్ దేశాల స్థితి గతుల గురించి- యూదు దేశమైన ఇజ్రాయిల్ వాళ్లు పాలస్థినా అరబ్బులపైన సాగిస్తూన్న దాడుల పరంపర గురిం చి విస్తారంగా చర్చిస్తూ ఉంటారు. కొత్త ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన ప్రసిధ్ధ క్రెకెట్ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ గురించి కూడా అభిప్రాయాలు పంచుకుని ఉంటారు.
ఇది చాలదని- పుట్టలోనుంచి పుట్టుకొచ్చిన నాగుపాములాంటి ఐ ఎస్ ఐ ఎస్- ఒకటీ. తెగ తర్జన భర్జనలు చేసి అలసి సొలసి ఉంటాడు తన రూమ్ మేట్. కాని అతడు అనుకున్నట్లు అలా జరగలేదు. షేక్ అహ్మద్ అతణ్ణే అనుసరించి వచ్చాడు.
పలకరింపుగా నవ్వి అన్నాడు- “రండి మిస్టర్ షేక్! మనకు అలవాటు లేని చలిగాలులు కదా- చేతులకి గ్లవ్స్ కూడా లేవు కదా- చేతులు బిర్రబిగుసుకు పోక ముందే అడుగు ముందుకు వేద్దామా! ”
“అలాగే! ఈ రోజు ఫ్యాకల్టీ మెంబర్లు వరల్డ్ హిస్టరీ పేపర్ చర్చించారు కదా. అప్పట్నించి మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటు న్నాను. దీనికి మీరు సావధానంగా బదులిస్తారని ఆశిస్తున్నాను”
నరసింహమూర్తి నిదానంగా చూసాడు. అక్కడెక్కడో రేగిన ఉద్రేకపు టెంపో ఇంకా తగ్గనట్టుంది. అతడికి తెలుసు- పాకిస్థానీయులు త్వరగా ఎమోషనల్ ఐపోతుంటారని. అకారణంగా రెచ్చిపోతుంటారని. నరసింహమూర్తి లోలోన ఆలోచిస్తూ తలెత్తి చూసేటప్పటికి వాళ్ళిద్దరూ- ‘లా ‘స్కూలు కట్టడం వరకు వచ్చేసారు.
“దేనిగురించి?” - నరసింహమూర్తి అడిగాడు తాపీగా--
“అదే మీ భారతదేశం గురించి—“
ఉఁ- దాదాపు పాకిస్థానీయులందరికీ ఇలలో కలలో నిత్యమూ కనిపించేదంతా రెండే రెండు అంశాలేగా! ఒకటి- భారత దేశంలో కాశ్మీరం- రెండవది- బాలీవుడ్ ప్రపంచం. ఇక విషయ ప్రస్తావన భాతదేశ రాజకీయ వ్యవస్థ గురించే రాబోతున్నదన్నది విడిగా చెప్పాలా! అందుకే అతడు సాధ్యమైనంత సరళంగా అన్నాడు- “హించాను. మరి నేనొకటి చెప్పనా మిస్టర్ అహ్మద్? ”
తలూపాడతను.
“ఇప్పుడు మనిద్దరం ఒకే బ్యాచ్ కి చెందిన సహధ్యాయులం. ఒకసారి విడిపోతే మళ్లీ ఎప్పుడు కలుసుంటామో మనకే తెలీదు. అంచేత మన రెండు దేశాల మధ్య కాంపేర్ అండ్ కాంట్రేస్ట్ ఎందుకూ! మన స్కూలు రోజుల గురించి మాట్లాడుకుందాం. మన కాలేజీ రోజుల్లో మనం వెంబడించిన కాలేజీ బ్యూటీల గురించి- కన్న కమ్మని రంగుల కలల గురించి చెప్పుకుందాం- వాళ్ళ వద్ద మనం తిన్న చీవాట్ల గురించి సిగ్గుపడకుండా చెప్పుకుని ఆనందిద్దాం.
అందులోనూ మనకు ఆసక్తి కలగకపోతే మనకిష్టమైన గేమ్సు గురించి చర్చించుకుందాం. మనం గాని ఇరుదేశాల క్రికెట్ ఫీల్డులో చోటు చేసుకుంటూన్న బెట్టింగుల గురించి మ్యాచ్ ఫిక్సింగుల గురించి చర్చించనారంభిస్తే బోలెడంత మేటర్ దొరుకుతుంది. భలే మజాగా మాట్లాడుకుందాం. ఓ కే! ”
“అలాగే! మరి మనకు బోలెడంత టైముందిగా- అదంతా తరవాత చర్చించుకుందాం. ఈలోపల ఈ ప్రశ్న మాత్రం అడక్కుండా ఉండలేను. మా వాళ్లనడిగితే ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా చెప్తారు. ఐ వాంట్ టు గెటిట్ స్ట్రెయిట్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ది హార్స్. ఇప్పుడు మేటర్ కి వస్తున్నాను. ఇక జాప్యం చేయకుండా అడిగేదా!”
ఇక తప్పదుగా- స్వర్గానికి వెళ్లినా సవతి పోరు మాత్రం తప్ప దుగా- అనుకుంటూ ఊఁ కొట్టాడు నరసింహమూర్తి.
“అంత పెద్ద దేశంలో- అంటే భారతదేశంలో- అంతటి జనస్సమ్మర్దం గల దేశంలో అంతటి సుస్థిరమైన ప్రజాసామ్య వ్వవస్థ నిలద్రొకుని నిలబడడానికి కారణం యేమిటి? మూలాధారం యేమిటి? ప్రధాన జాతీయ పార్టీలు- లోకల్ పార్టీలు- ఒకర్ని ఒకరు తిట్టిపోసుకుంటూ వెనుకనుండి ఒకరి కాళ్లు మరొకరు లాక్కుంటూనే ఉంటారు. అంతేకాక-- వాళ్లు న్యాయస్థానాలలో ఒకరి పైన ఒకరు వేసుకునే కేసుల గురించి ఇక చెప్పనే అవసరం లేదు. దాదాపు మీ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ రైవల్ ట్రైబ్స్ లాగే ఢీ కొట్టు కుంటాయి. కాని ఎలెక్షన్ వచ్చేటప్పటికి అందరూ సెల్ఫ్ డిస్ట్రక్షన్ కి పాల్పడకుండా బుధ్ధిగా అందరూ నియమాలు పాటిస్తూ పాల్గుంటారు. అదెలా సాధ్యం? ”
ఆ ప్రశ్న విని నరసింహమూర్తి సన్నగా నిట్టూర్చాడు. ఒక విదేశీయుడి ఆక్రోశ నేత్రం నుండి రాలిన విశ్లేషణలు అవి. అలాగని వాటిని ఉన్నదున్నట్లు కొట్టి పారేయడం సముచితం కానేరదు. ఫోబియా అనే ఆంగ్ల పదం ఒకటుంది. ఒకే విషయం పట్ల అలవికి మించిన వాంఛ— అదుపు లేని ఆవేశం కలిగి ఉండటం. ఒకే విషయం గురించి, అదే విషయం గురించి మరల మరల— తరచి తరచి తలపోయడం. అటువంటిదే కొందరికి కాదు; చాలా మంది పాకిస్థానీయులకు భారతదేశం పట్ల ఉంది.
ఇక అసలు సంగతి చెప్పాలంటే ఇటువంటి ఫోబియా— ఆడామగా అన్న తేడా లేకుండా వాళ్లలో పెరుగుతూనే ఉంది. ఉర్దూ గేయాలలోని సంగీత లయలు వింటూ తన్మయత్వంతో ఆనందిస్తూనే చటుక్కున రివర్స్ లోకి వచ్చి హిందు స్థానీ సంగీతంతో పోల్చుతారు. పోల్చుతూ హిందీ సంగీత లయల్ని తక్కువ చేసి మాట్లాడతారు. మాట్లాడి ఏదో సాదించినట్టు వాళ్ళకు వాళ్ళే చంకలు గుద్దు కుంటారు. మరి అటు వంటి వారు పనిగట్టుకుని భారతీయ సినీ పాటలు వినడమెందుకో! అక్కడి కళాకారులు నటీ నటులు భారత సినీరంగంలోకి ప్రవేశించడానికి అంతటి తాపత్ర పడట మెందుకో!
ఈ ఫోబియా ఇక పైన ఎప్పుడు ఏ తరం పాకిస్థానీయుల తో తగ్గుముఖం పడుతుందో చెప్పడం కష్టం. ఒక విధంగా చూస్తే ఇదొక హీస్టోరికల్ బ్యాగేజీ కూడా కావచ్చు. తన ఆలోచనలను సాధ్యమైనంత మేర నిదానంతో కుదుటపర్చుకుంటూ నరసింహమూర్తి ఆరంభించాడు- “నాకు తెలిసినంత మేర చెప్తాను. ఐతే ఒక షరతుపైన- నేను చెప్పదలచుకున్నది నేను చెప్పుకుంటూ పోతాను. మీరు కాంట్రాడిక్ట్ చేయకండి. అదే విధంగా మీరు చెప్ప దలచుకున్నది మీరు చెప్పుకుంటూ పొండి. నేను అడ్డు రాను. వాదోపవాదాలకు దిగను. ఎందుకంటే నేను అన్నీ అధ్యయనం చేసిన యూని వర్సిటీ స్కాలర్ ని కానుగా! ఈజిట్ ఓ కే! ”
“ఐ ప్రామిస్. మా అమ్మపైన ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేను అడ్డురాను. వాదోపవాదాలకు దిగను. వై బికాజ్? నాకు తెలుసుకోవాల నుంది. నాకు నేను ఆత్మశోధన చేసుకోవాలనుంది. నధింగ్ మోర్- నథింగ్ లెస్”
నరసింహమూర్తి తలూపాడు. రవంత విరామం ఇచ్చి నిదాంగా చూసాడు. తను చెప్పి ముగించేంత వరకూ పట్టున ప్రతిస్పందించకూడా షేకే అహ్మద్ ఓర్పు చూపించగలడో లేదో! చూద్దాం- అనుకుంటూ ఆరంభించాడతను-
“మొదటిది- ప్రజాస్వామ్య వ్వవస్థ. ఒక గొప్ప జాతీయ సిధ్ధాంతంగా న్యాయసూత్రంలో అంతర్భాగంగా పరిగణించ బడుతున్నా, పలువురి ప్రశంసలు పొందుతున్నా- వాటి ఆచరణలో లోటుపాట్లు లేక పోలేదు. ముఖ్యంగా మా భారత దేశ వ్వవస్థలో కొందరు దేనినైనా డబ్బిచ్చి కొనుక్కోగల మనుకుంటారు. వాటిలో ఒకటి-- రాష్ట్ర శాసన మండలిలోను రాజ్యసభలోనూ సీటు సంపాదించడం.
కొన్నిసార్లు అలా డబ్బు విచ్చలవిడిగా ఖర్ఛు పెట్టగలిగిన వాడు ఏదో ఒక పార్టీ పంచన చేరి బొమ్మను తిమ్నిచేసి తిమ్నిని బొమ్మచేసి సీటుని ఎగరేసుకుపోతూనే ఉన్నాడు. కొన్నిసార్లని నేనెందుకు అన్నానంటే- ఎల్ల వేళలా అందరూ అలా డబ్బుని ఎరచూపి పరపతిని ఉపయోగించి సాధించ లేరు- ముఖ్యంగా లోక్ సభకూ రాష్ట్ర శాసన సభకూ..
కొన్నిసార్లు మాత్రమేనని నేనెందుకన్నానంటే- ఇదీ చెప్తాను- మార్క్ చేసుకోండి. ప్రజలచేత, ప్రభుత్వ సంస్థల చేత అమితంగా గౌరవించబడ్డ దివంగత ప్రముఖ పారిశ్రామిక వేత్త టాటాగారు పార్లమెంటు ఎలక్షన్ లో స్వతంత్ర అభ్యర్థిగా ముంబాయిలో నిలుచుని ఓడిపోయారు. చాలా మంది భారతీయులు షాక్ తిన్నారు. ఎందుకంటే- అంత పెద్దమనిషి అంత గొప్ప పారిశ్రామికి వేత్త ఓటమి చెందడం మనసుకి కాస్తంత ఇబ్బంది కలిగించినా ఆయన ఓటమిలో చెప్పుకోదగ్గ రెండు అంశాలు అందీ అందని విధంగా దాగి ఉన్నాయి.
ఒక మంచి అంశం- ఓటు వేసే వాళ్లందరూ కేవలం డబ్పు కోసం కక్కుర్తి పడేవారు కాదని- పరపతిని చూసి దిమ్మదిరిగి పోయేవారు కాదని నిరూపించుకున్నారు. అదే సమయంలో ఇందులో ఇమిడి ఉన్న నకారాత్మక అంశం యేమంటే- టాటాగారు మా దేశానికి ఇచ్చిన సేవలను- పార్లమెంటులో ఆయన ఉనికి వల్ల చేకూరబోయే మేలుని విస్మరించారు.
ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉండబట్టే- , సమస్యల పరిష్కారానికి కనిపించీ కనిపించని రీతిన హింసాత్మక ధోరణి అవలంబించే తీవ్ర వామపక్షీయులు సిద్ధాంతపరంగా పుంజుకుని ఒకానొకప్పుడు తమ సత్తా చూపించగలిగారు—శాసన సభల్లోనూ పార్లమెంటులోనూ. సమతౌల్యతా సహనతా పట్ల అక్కర ఉన్న ప్రజలు కాల ప్రవాహంలో వామపక్ష పార్లీలను పూర్తిగా కాకపోయినా చాలా వరకు మట్టి కరిపించారు.
దీనికి తోడు వాళ్ళు పాటించే ఆకాలపు ఆర్థిక సామాజిక సిధ్ధాంతాలు ఈ కాలానికి చెల్లుబడి కావన్న అభిప్రాయమూ మంది మనసులో నాటుకోనారంభించింది; ముఖ్యంగా ప్రజా బాహుల్యంలో. వామపక్ష భావాల ప్రభావం ఇప్పటికీ చెదురు మదురుగా ఉందన్నది విస్మరించరాని వాస్తవం.
ఇక్కడ మనం గమనించవలసిన అంశం- వామ పక్షీయుల సైధ్ధాంతిక ఆచరణలో వచ్చిన మార్పుకాదు గమనించతగ్గ ది. ఆశావహులైన ఇప్పటి తరం వాళ్లలో కానవచ్చిన విలువల్లోని మార్పు ముఖ్య కారణమనాలి. దీనికి మరొక ముఖ్యమైన అంశం- వామ పక్షీయుల ప్రాబల్యంలో వచ్చిన క్షీణతకు మరొక కారణం- సహజంగానే భారతీయులలో- అటు కాశ్మీరం నుండి కన్యాకుమరి వరకూ వ్యాపించిన జన సమూహంలో టెంపర్ మెంటల్ ఇంపాక్ట్-
అదేమంటే- చాలా మంది భారతీయులు హిసాత్మ క తీవ్రవాద ధోరణులను గర్హిస్తారు. దేశాన్ని ముందుకు నడిపించుకు పోవాలంటే- తరాలనాటి పునాదిరాళ్ళను కదలించాలంటే కాస్తంత కఠినాత్మక ధోరణలు తప్పనిసరి అంటే, సగ టు భారతీయుడూ భారతీయురాలూ ఆ భావ స్రవంతితో అంగీకరించరు.
ఈ దృక్పథాన్ని కొందరు మెతకతనమని కూడా అంటారు. అది వాళ్ళ వాళ్ల దృక్పధం. వామ పక్షీయులు మరల తలెత్తుకోలేరని కూడా అనలేం. దీనిలోకి మరీ లోతుగా వెళ్ళ దలచుకోలేదు. మరీ లోతుగా వెళ్లనవసరమూ లేదు, . ఇక రెండవది- బలమైన ప్రజాస్వామ్యానికి సైధ్ధాంతిక పరమైన మూల స్తంభాలను నిజంగా నాటిన వారు, నేటి భారతీయ సంతతికి చెందిన వారు కాదు. ముఖ్యంగా ఈనాటి రాజకీయవాదులకు ఇందులో- అంటే, ప్రశాంసాత్మకమైన ఈ ఆలోచనా విధానంలో ఈషణ్మాత్ర మంత పాలు మాత్రం ఉండవచ్చేమో!
నా అవగాహన మేర- అప్పటి వారే ఈ ఆరోగ్యకర సైధ్ధాంతిక జీవనానికి బీజాలు నాటిన వారు. త్యాగులు, దీర్ఘదార్శకులైన అప్పటి నాయకులే అసలు మూలపురుషులు. వీళ్ళలో అందరూ ఉన్నారు- వ్య క్తిగతమైన విశ్వాసాలకు అతీతంగా. ఇక చెప్పాలంటే- వాళ్ళ మూల సిధ్ధాంతాలకు నిట్రాటలు రెండు- ఒకటి అహింస- రెండవది- పరమత సహనం. సాయుధ చర్యకు పాల్పడిని విప్లవ వీరులు మన్యం రాజు అల్లూరి సీతారామరాజు- తిరుప్పూర్ కుమరన్- భగత్ సింగ్- సుభాస్ చంద్రబోస్ వంటి వారిని కొందర్ని ప్రక్కనపెట్టి చూస్తే; అహింసాత్మక సిద్ధాంతానికి కట్టుబడి ఉద్యమం సాగించిన ఆ త్యాగధనులు ఎవరు?
ఉదాహరణకు- టంగుటూరి ప్రకాశం పంతులుగారు- పొట్టి శ్రీరాములు గారు- వావిలాల గోపాలకృష్ణయ్యగారు- బాలగంగాధర్ తిలక్ గారు- గోవింద్ పంత్ గారు- సర్దార్ వల్లభ బాయి పటేల్ గారు- చిత్తరంజన్ దాస్ గారు- మోహన్ దాస్ కరమ్ చంద్ గారు- శ్రీమతి సరోజినీ నాయుడు గారు- కామరాజ్ గారి గురువు కృష్ణమూ ర్తిగారు- భారతీయుల చేత గౌరవపూర్వకంగా సరిహద్దు గాంధీ అని పిలవబడే ఖాన్ అబ్డుల్ గఫర్ ఖాన్ గారు- అబ్దుల్ కలాం ఆజాద్ గారు- ఆచార్య రంగా గారు- దుర్గాభాయ్ దేశ్ ముఖ్ గారు- పండిత్ నెహ్రూగారు- ప్రపంచ ప్రసిద్ధ రేషనలిష్ట్ ఈవీ రామసామి నాయుడుగారు- వంటి ప్రముఖులు స్వాతంత్రోద్యమానికి దన్నుగా నిలచి భారత ప్రజా ప్రవాహాన్ని నడిపించారు; రాజకీయంగానే కాక సాంఘికంగా కూడాను--
అభిప్రాయాలూ ఆలోచనలూ అక్కడక్కడ వేరుగా ఉన్నట్లనిపించినా వీళ్ళందరూ త్యాగాలు చేసి స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలొడ్డారే గాని- ఎవరి ప్రాణమూ తీయలేదు. చివరకు తమను హింసపాలు చేసిన బ్రిటి ష్ వాళ్ళ పైన సహితం దౌర్జన్యానికి పూనుకోలేదు. అలాగని వీళ్లనెవర్నీ భారత చరిత్ర పిరికి వాళ్లని చిత్రీకరంచడానికి ఎన్నడూ సాహసించలే దు. వాళ్ళది చిత్తశుధ్ధిగల సైధ్ధాంతికపరమైన ఆచరణ. వారితో అంగీకరించడం అంగీకరించకపోవడం- అనుసరించడం అనుసరించకపోవడం ఇప్పటి సంతతి వారు తేల్చుకోవలసిన అంశం”
ఇకపోతే-- ప్రపంచ ప్రసిధ్ధ అహింసావాది మోహన్ దాస్ కరమ్ దాస్ గాంధీగారిని మరొకమారు ప్రపంచమంతటా ప్రస్తావిం చ వలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పట్లో ఆయనకున్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని చూస్తే- ప్రజలు ఆయనపైన ఉంచు కున్న నమ్మకాన్ని తరచిచూస్తే; మంచికో చెడుకో—ఆయన గాని అనుకోవాలే గాని-- , ఉద్యమాన్ని ఉద్రిక్త పరచి అప్పటికే ఆవేశ పూరితులై ఉన్న ప్రజాసమూహాన్ని హింసాత్మక చర్యల పట్ల దృష్టి మళ్ళించేలా ఉసిగొల్లి ఉండేవారు. ఆయనెప్పుడూ అలా చేయలేదు.
దానికి మారుగా ఆయన మాటిమాటికీ అనేవారు- ‘మన విరోధులు బ్రిటిష్ పాలకులే గాని, బ్రటిష్ ప్రజలు కారు! ’ అని.
ఎందుకంటే- ఆయన రూపొందించిన ఆ పథక రచన వెనుక ఒక గొప్ప చారిత్రాత్మకమైన- ఆధ్యాత్మికమైన ఉజ్జ్వలమైన సామాజిక పరమైన ఒక గొప్పకారణం ఉంది. దానిని మేము దివ్యదృష్టి అంటాము”
నరసింహమూర్తి చెప్పడం ఆపాడు. రెండు బ్లాక్ లు దాటి ఇద్దరూ హాస్టల్ కట్టడం వద్దకు వచ్చేసారు. విరామం తీసుకుం టూ నిదానంగా కదులుతూ నరసింహమూర్తి మేడ మెట్లెక్కసాగాడు. కాని షేక్ అహ్మద్ ఆపుకోలేక పోయాడు. ”చెప్పండి మిస్టర్ మూర్తీ! ఆసక్తి ఆపుకోలేక పోతున్నాను. మీ వ్యాఖ్యానం కొత్తగా ఉంది. మీ ఆలోచనా ప్రవాహం ఒన్ సైడడ్ కాకుండా సమతుల్యంగా ఉంది. ప్లీజ్ ప్రొజీడ్! ”
“చెప్తాను. కాస్తంత విరామం తీసుకున్నానంతే! మీకు తెలుసనుకుంటాను, గాంధీ మహాత్ముడు చాలామంది హిందువుల్లా భగవద్గీత ఆరాధకుడు. మాట తప్పనివాడిగా గుర్తింపు పొందిన సత్య హరిశ్చంద్రుడి మానసిక పుత్రుడు”
షేక్ అహ్మద్ తెలుసన్నట్టు తలూపాడు.
“ఆ నేపథ్యంతో ఆయన భావి భారతాన్ని స్వాతంత్ర్యానంతరం తరవాత- ఏం? అంతకుముందే ఆయన భావి భారతం భావి భారత వ్యవస్థ ఎలాగుండాలన్న దానిని స్పష్టంగా దర్శించగలిగాడు. ఇంకా చెప్పాలంటే- హింసనుండి ఉత్పన్నమైన ఏ ఫలమైనా యే సాధనైనా వయొలెన్స్ తోనే అంతమౌతుందని- లేదా చివరివరకూ దాని భవిష్యత్తు వయొలెన్స్ తోనే ముడిపడి ఉంటుందన్నది గాంధీగారి గాఢమైన విశ్వాసం.
ఆ విశ్వాసాన్ని గౌరవించడం గౌరవించక పోవడం మన వంతు. ఇక పోతే, రక్త ధారలు చిమ్మటం నుంచి వచ్చిన ఏ ఫలానికైనా రక్తపు మరక అంటుకుని తీరుతుందనేది ఆయనకు బాగా తెలుసు.
అటువంటి ఉత్కృష్టమైన మహా స్వాతంత్ర్య సమరమప్పుడే మా భారతీయ నాయకులు హింసను దరిచేరనివ్వలేదు. ఆ రీతిన అప్పటి మహానాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిలద్రొక్కుకుని అగ్గికీ లోతైన సముద్రానికీ మధ్యన నిటారుగా నిల్చుని అహింసకు, శాంతికి, సహనానికి విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళారు. హేవింగ్ సెడ్ దట్- ఒకటి క్లియర్ గా ఒప్పుకోవాలి. ఆ కాలపు మహనాయకులు త్యాగశీలురు. ఆత్మార్పణ చేయగల మహా పురుషులు. వాళ్ళు కన్న కలలు చాలా వరకు కలలుగానే మిగిలి పోయాయి.
ఉదాహరణకు- భారతదేశం పూర్తి మద్యనిషేధాన్ని పాటించ లేకపోయింది. జాతి కులభేదాలు నిర్మూలించి సంపూర్ణ గ్రామాభివృధ్ధిని సాధించలేక పోయింది. ఇంకా చెప్పాలంటే ఆ మహనాయకులు పాటించిన ముఖ్యమైన విలువల్ని నీరుగార్చే సాం. మేమెక్కడ స్త్రీల గొరవాన్నిసర్వవిధాలా కాపాడగలుగుతున్నాం? ఆత్మహత్యలను పూర్తిగా ఎక్కడ ఆపగలుగుతు న్నాం? మాదేశం పొరుగు దేశాలతో సమానంగా ప్రాంతీయ శక్తిగా ఎదగలేదన్నది కాదు మా భారతీయుల ఆత్మ విచారం. దేశ సంపద సమాంతరంగా పంచబడలేదన్నదే చాలా మంది భారతీయుల దిగులు.
చదువు- నాణ్యత గల చదువు అందరికీ అందడం లేదన్నది మరొక గుబులు. ఈ విషయంలో తీవ్ర వాద వామపక్షీయులకు ఇప్పటి ప్రజాసామ్య రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు చెప్పవలసి ఉంటుందేమో. ఇక ఇప్పటి విషయానికి వస్తే- ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడిప్పుడే భారతదేశం పరపతి పెంచు కుంటూ సగౌరవంగా తలెత్తుకు నిలవగలగుతున్నదని చాలా మంది భారతీయులు భావిస్తున్నారు. లెటజ్ హోప్ ఫర్ ది బెటర్— అన్ని కోణాలనూ స్పర్శించలేక పోయినా చెప్పదలచుకున్నది సూటిగా చెప్పాననుకుంటున్నాను. ఇక మీరు చెప్పదలచుకున్నది మీరు చెప్పండి. ఐ ప్రామిస్- సావధానంగా వింటాను మిస్టర్ షేక్ అహ్మద్! ”
అంతవరకూ చెప్తూ సాగిన నరసింహమూర్తి ఒక్కసారంటే ఒక్కసారి కూడా దేశ విభజనకు అంకురార్పణ చేసిన ముస్లిమ్ లీగ్ నాయకులపైన, ముఖ్యంగా మహమ్మద్ జిన్నాగారిపైన నకారాత్మక వ్యాఖ్యానం చేయలేదు కావాలనే-- ఎందుకంటే తెలిసీ మంటల్లోకి భగ్గుమనిపించే యాసిడ్ పొడిని చల్లడమెందుకూ! ఆ పాటి ఇంగితం చూపలేకపోతే తన చదువుకీ సంస్కారానికీ సార్ధకత ఏదీ! ఇంకా ఒకడుగు ముందుకు వేసి చెప్పాలంటే- ఆఫీసర్ పోస్టు వరకూ ఎదగడమెందుకూ!
=======================================================================
ఇంకా వుంది
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments