#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 7 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 27/12/2024
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది.
ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి.
అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది.
అమెరికా వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ ప్రోగ్రాము ఇన్ చార్జీ మిస్టర్ రస్సెల్ ను కలుస్తాడు.
డబల్ బెడ్ రూమ్- విత్ షేరింగ్ ఫెసిలిటీ తీసుకొని, రూమ్ కు వెళ్తాడు. అతని రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది.
పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారిని కలుస్తాడు. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నరసింహ మూర్తి, షేక్ అహ్మద్ ల మధ్య చర్చ నడుస్తుంది.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 7 చదవండి..
షేక్ అహ్మద్ స్పందించకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏదో మూడ్ లోకి దిగబడి పోయినట్టున్నాడు.
ఈసారి నరసింహమూర్తి ప్రోత్సహిస్తూ మళ్లీ అన్నాడు- “ఉఁ! సంశయించకండి. ఏదైనా చెప్పండి. ఒకరినొకరం కాంట్రడిక్ట్ చేసుకోబోమని ముందే ఒప్పందం చేసుకున్నాంగా! ఇంకా ఆలో చించడం దేనికి? ”
అప్పుడు పుంజుకుని చొరవతీసుకుని నోరు విప్పాడు షేక్ అహ్మద్- “భారతదేశ చరిత్రలో మా ముస్లిమ్ లకు ఇవ్వవలసిన గుర్తింపు మీ చరిత్రకారులు ఇవ్వలేదేమోనని పిస్తుంది. అందరమూ కలిసే కదా పోరాడి విడుదల సంపాదించాం. అదెందుకు దాచడానికి ప్రయత్నిస్తున్నారు?”
ఆ మాటతో ఖంగుతిన్నట్టయినా తనను తను స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు నరసింహమూర్తి. అతడిలో భావావేశం ఉప్పెనలా పొంగింది. కలిసే స్వాతంత్ర్యాన్ని సాధించినప్పుడు ఆ తరవాత కలిసే కదా ఉండాలి! కొన్ని దాటలేని అంతరాల వల్లన కలసి ఉండలేకపోయినా కనీసం సామరస్యంగానైనా ఉండాలికదా! పాకిస్థాన్ అలా ఉంటుందా- కనీసం ఉండటానికి ప్రయిత్నించిందన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా?
అసలు అక్కడి వాళ్ళ మూల బీజాలు ఇక్కడున్నాయన్నది తెలుసుకోక పోతే ఎలా? అతడు ఎట్టకేలకు ఆవేశం ఆపుకున్నాడు; మనసున ఒకటీ రెండూ గబగబా లెక్కిస్తూ సంయమనం తెచ్చుకుంటూ ఉండిపోయాడు. ఆ తరవాత నిదానంగా చెప్పడానికి పూనుకున్నాడు. “మొదటిది- మొదటి నిజమైన స్వాతంత్ర్య సమరం అందరూ కలిసే చేసారన్నది నేను మరవలేదు. అదే సమయాన, నా దృష్టిలో గొప్ప వాళ్ళుగా కనిపించిన ముస్లిమ్ సోదరులను విస్మరించామనడం సబబు కానేరదు.
ఎందుకంటే- నాకు తోచిన ఖాన్ అబ్దులే గఫర్ ఖాన్ గారి పేరు- అబ్డుల్ కలామ్ అజాద్ గారి పేర్లు నాకు బాగా గుర్తు. వాళ్లపట్ల నాకు అమితమైన గౌరవము. ఇకపోతే- నేను కీర్తి శేషులు పాకిస్థాన్ పిత జిన్నా గారి పేరు ప్రస్తావించలేదన్నది వాస్తవం. కాని అది కావాలని చేసినది కాదు. నాకు తోచలేదు. ఇక- లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్- నేను దక్షిణ భారతానికి చెందిన వాణ్ణి. అంచేత చాలా మంది దేశభక్తులు త్యాగధనులైన ముస్లిమ్ నాయకులు అప్పటికప్పుడు గుర్తుకి రాలేక పోవచ్చు అంతే!
ఇక మాటకి మాట చెప్పుకుంటే- సరిహద్దు గాంధి ఖాన్ గఫర్ ఖాన్ గారికి భారతదేశ అత్యంత విశిష్టమైన భారత రత్న బిరుదుని ఇచ్చామన్న వాస్తవాన్ని మరచిపోకూడదు”
“అర్థమైంది. ఐ అప్రెషియేటిట్. మా వాళ్ళకూ మీ వాళ్లకూ మధ్య నిజమైన వ్యత్యాసం ఉన్నట్లే తోస్తూంది. మొన్న మీ దేశ రాజధా నిలో సంభవించిన సంఘటన జ్ఞప్తికి వస్తుంది మిస్టర్ మూర్తీ! ”
అదేమిటో చెప్పండి- అన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు నరసింహమూర్తి.
చెప్పసాగాడు అహ్మద్- “అప్పుడు మీ దేశం నలువైపులా సెక్యూర్టీ ఫోర్స్ వాళ్ళు ఉగ్రవాదులను వెంటాడి వేట సాగిస్తున్న సమయం. ఇండియన్ ఇంటలీజెన్సు వాళ్లు, సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళూ కల గలసి ట్రైనులు, బళ్లూ బైకులూ ఆపేసి అనుమానితుల్ని తొలిచేసి చెడామడా కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఆ సమయంలో వేళకాని వేళలో భోజనశాలలోకి ప్రవేశించినట్టు- మా దేశం నుండి ఏదో సామాజిక బృందం ఢిల్లీ నగరంలో జరిగే సమావేశానికి హాజరు కావడానికి ఒక హ్యూమన్ రైట్స్ ఎన్. జీ. ఓ వాళ్ల తరపున వచ్చారు.
అటు వంటి ఉద్రిక్త వాతావరణంలో—సెక్యూరిటీ ఫోర్సువాళ్ళకు నీడకూ మనిషి రూపానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్నికనిపెట్టగల నిదానం ఉంటుందా! ఆ ఊపున వాళ్ళు పాకిస్థాన్ హ్యూమన్ రైట్స్ సంస్థవాళ్ళ హోటల్ రూముపైన కూడా దాడిచేసి సోదాలు జరిపారు. అదీను అర్థరాత్రి పూట. దాని వల్ల మా దేశపు ఎన్. జీ. ఓ వాళ్లు నొచ్చుకున్నారు. తమను ఉగ్రవాదులుగా పరిగణించడాన్ని భరించలేక పోయారు.
ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సు వాళ్ళ చర్యకు నిరసనగా మరునాడు తోటి భారతీయ హ్యూమన్ రైట్సు సంఘాలతో కలసి హోమ్ మినిస్ట్రీ ఆఫీసు ముందు నినాదాలు లేవదీయాలని తీర్మానించారు. కాని –అదే రోజు ఉదయం ఫోన్ కాల్ వచ్చింది వాళ్లకు- ఎక్కణ్ణించని? ఊహించడమే కష్టం సుమా! ”
“ఎక్కణ్ణించి వచ్చిందా ఫోన్? సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ నుండా!” - నరసింహమూర్తి.
“కాదు. నేరుగా భారత ప్రధాని నుండి. ఆ ఫోనులో ఆయన ఏమన్నారంటే- ‘క్షమించండి మీకు కలిగిన ఇబ్బందికి‘అని క్షమాపణ కోరారు ఆయన. ఎంతటి ఔదార్యం ఆయనది! “
“ఔను. జ్ఞాపకం వస్తుందిప్పుడు. ఆ బృందానికి నాయకురాలు ఒక పాకిస్థానీ స్త్రీ. అప్పుడామెగారు అన్నమాట నా కిప్పటికీ బాగా జ్ఞాపకం- ‘ఇంతటి ఔదార్యంగల నాయకులుండబట్టే భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది! ’అంతేకదూ!”
ఆ మాటకు షేక్ అహ్మద్ తలూపాడు. నరసింహమూర్తి కొనసాగించాడు- ”థేంక్స్- మాదేశం గురించిన మంచి విషయాలు కొన్ని జ్ఞాపకం ఉంచుకున్నందుకు. వాటిని నాకు గుర్తు చేసినందుకూ! ఇక మీరు మీ దేశం గురించి యేదైనా చెప్పా లనుకుంటున్నారా? నాకూ వినాలనే ఉంది”
అది విని షేక్ అహ్మద్ పెదవులపైన హాసరేఖ కదలీ కదలని చిరు అలలా తారాడు తూ వెళ్ళింది. ”రేపటి మంచి రోజులోకి ఆశగా తొంగి చూడటం తప్పించి మా దేశం గురించి ఇప్పట్లో చెప్పడానికి ఏమీ లేనట్లే తోస్తూంది మిస్టర్ మూర్తీ! “
ఇకపైన ఇద్దరికీ మాటలు అందక మౌనంగా తమ రూమ్ పోర్షన్ లోకి ప్రవేశించారు. నరసింహమూర్తి నైట్ గౌనులోకి దిగి పడకపైన వాలుతూ అటు చూసాడు. షేక్ అహ్మద్ బట్టలు మార్చుకోకుండానే మేను వాల్చాడు; అన్యమనస్కుడై ఎటో చూస్తూ- ఎటో చూసి ఆలోచిస్తూ.
---------------------------------------------------------------------------------------------
అనుకున్న ప్రకారం ఆదివారం ఉదయం శ్రీరామ్ తమ్ముడు శ్రీలక్ష్మణ్ నరసింహమూర్తి కోసం ట్రైనింగు అకాడమీ హాస్టల్ కి వచ్చాడు. పైకి కబురంపి రిసెప్షన్ కౌంటర్ వద్ద కూర్చున్నాడాయన. నరసింహమూర్తికేమో అలా షేక్ అహ్మద్ ని ఒంటిరిగా విడిచి వెళ్ళడం సంకటంగానే తోచింది. కాని తను కలుసుకోబోయే వారు ఎలా ఉంటారో, ఎలా మెసలుతారో తనకే తెలియనప్పు డు మరొక వ్యక్తిని ఎలా ముందుకు తోయగలడు? అది భావ్యమూ కాదేమో!
అందులో అతను భారతీయ ముస్లిమ్ కూడా కాదాయె. చెలిమి దేశంకాని పాకిస్థాన్ దేశానికి చెందిన వాడని తెలుసుకుని గగ్గోలు పడినా పడతారు. ఇంతకూ వాళ్ళు తనను ఆహ్వానించేది తన పెదనాన్న గారి తరపున! తనకు మాలిన ధర్మం కూడదంటారు ఇందుకేగా మరి! తనకు చేరువయిన షేక్ అహ్మద్ ని తోడ్కొని పోవడానికి మార్గం వెతకాలి. కాని ఇప్పట్లో మాత్రం కాదు.
అందుకే దుస్తులు మార్చుకుని వెళ్తూ వెళ్తూ షేక్ అహ్మద్ తో అన్నాడు- “నన్ను పిలుస్తోన్నది నాకు తెలిసిన వాళ్ళు కాదు. ఆంధ్ర ప్రదేశ్ లో రాజమండ్రి డిస్ట్రి క్ట్ లో ఉంటూన్న మా పెదనాన్నగారి చిన్ననాటి మిత్రుడు ఒకాయన- మిస్టర్ శ్రీరామ్ గారు”
అప్పుడు షేక్ అహ్మద్ అడ్డు వచ్చాడు- “ఈ పేరుని ఎక్కడో చూసినట్టున్నాను. లేదా ఎక్కడో విన్నట్టున్నాను“
“ఇందులో అంతగా ఆశ్యర్య పడవలసిందేముందోయ్! శ్రీ రాముడి పేరు దాదాపు దేశమంతటా ఏదో ఒక రూపాన వినిపిస్తునే ఉంటుంది షేక్! ”
తల అడ్డంగా ఆడించి“అది కాదు మూర్తీ. ఈ పేరుని ఇక్కడకు దగ్గర్లోనే ఎప్పుడో విన్నట్టున్నాను” అన్నాడు.
“కావచ్చు. కాని ఇప్పడు మనకు అవసరమైన మేటర్ అది కాదు. దూరం గురించి నాకంతగా తెలియదు కాబట్టి ఎప్పట్లో వస్తానో చెప్పలేను మిస్టర్ షేక్. ఈ లోపల మీరొకసారి బంగ్లా క్యాండిడేట్ మిస్టర్ ముస్తాక్ ని— ఉత్తర భారతం నుండి వచ్చిన మిస్టర్ మల్హొత్రాతోనూ మాటలు కలిపి వస్తే అటు పొద్దుపోతుంది, ఇటు కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. ఓకే” అంటూ షేక్ అహ్మద్ తో చేతులు కలిపి చకచకా మెట్లుదిగి వచ్చి శ్రీలక్ష్మణ్ గారికి నమస్కరించి ఆయనతో బాటు వెళ్ళి కారులో కూర్చున్నాడు.
దాదాపు నిర్మానుష్యంగా కనిపిస్తూన్న రోడ్డమ్మట కారు తోలుతూ శ్రీలక్ష్మణ్ నరసింహమూర్తిని అడిగిన మొదటి ప్రశ్న- రాజమండ్రి గురించి విశేషాలు చెప్పమని. అది విన్న తరవాత ఆయన వేసిన మలి ప్రశ్న- తన అమ్మానాన్నల గురించి. ఆయన ఎక్కువగా నరసింహమూర్తి తండ్రి డాక్టర్ నరసింహులు గారి గురించి- ఆయన పనిచేసి రిటైర్ ఐన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి గురించి మరీ మరీ అడిగి తెలుసుకున్నారు. అన్నిటికీ బదులిస్తూనే లోలోన మిక్కిలి అబ్బురపడ్డాడు నరసింహమూర్తి.
ఎందుకంటే ఇక్కడి వాళ్ల కుటుంబంతో సంబంధం ఉన్న ఒకే ఒక వ్యక్తి తన పెదనాన్న భూషణంగారు మాత్రమే. తన ఎరుకలో తతిమ్మా వాళ్ళెవరికీ ఇక్కడి వాళ్ళతో సంబంధం మాట అటుంచి పరిచయమే లేదు. కాని- శ్రీ రామ్ గారి తమ్ముడేమో- ఒక్కటంటే ఒక్కమాట కూడా తన పెదనాన్నగారి గురించి మాట్లాడలేదు. వ్యవహారమంతా బట్టతలకీ మోకాలికీ ముడి వేసే తంతులా సంభాషణ ఏదోలా సాగుతున్నట్లుంది.
ఉండబట్టలేక అతనే తన పెదనాన్నగారి గురించిన ప్రస్తావన లేవనెత్తాడు- “మా పెదనాన్న భూషణంగారి గురించి మీకు తెలుసు కదండీ! నిక్కచ్చితనం గల మనిషి. అటువంటి నియమ నిబధ్ధతలు గల పెద్దమనిషిని చూడటం ఈ రోజుల్లో చాలా అరుదైన విషయమండీ! ”
అప్పుడు శ్రీలక్ష్మణ్ స్పందించాడు. “భలే వాడివోయ్! భూషణంగారి గురించి తెలియక పోవడమేమిటి? ఆయన మా అన్నయ్య చిన్ననాటి ప్రాణమిత్రుడు. నేను చిన్న తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ పెద్ద తరగతుల్లో ఉండేవారు. చెట్టాపట్టాలేసుకు తిరిగేవారు”
అది విని ఊపిరి తీసుకున్నాడు నరసింహమూర్తి. అబ్బ! ఎట్టకేలకు తన పెదనాన్నగారి గురించి తెలుసని ఒప్పుకున్నాడు శ్రీలక్ష్మణ్. ఇక ఆ తరవాత ఆయనను ఆపే ప్రసక్తే లేకుండా పోయింది. రాజమహేంద్ర వరంలో తాను పుట్టి పెరిగిన తావు గురించి వీధిబడి గురించి డిగ్రీ తీసుకున్న కాలేజీ వాతావరణం గురించీ సవివరంగా చెప్పాడాయన. అలా ఇలా కాదు- పూర్తిగా మైమరచి చెప్పాడు.
అలా చెప్పుకు పోతూ శ్రీలక్ష్మణ్ గారు ఉన్నపాటున కారుని చెట్లమధ్య పచ్చ తివాసీలా పరచి ఉన్న సన్నటి బాట ప్రక్కన ఆపాడు. అది చూసి నేచు సరల్ కాల్ కోసమనుకున్నాడు నరసింహమూర్తి. కాని అది కాదు కారణం.
“మా ఇల్లు మీరనుకున్నంత దగ్గరగా లేదు. కాస్తంత దూరమే. మరొక అరగంట సేపయినా పడ్తుంది”అంటూ కారు డాష్ బోర్డు ప్రక్కన కుదురుగా ఉంచిన థర్మోఫ్లాస్క్ తీసి, దానితో బాటు రెండు పేపర్ కప్పుల్ని కూడా అందుకుని కాఫీ పోసి అందిచ్చాడు.
అతడందుకోలేదు. ఆ గెస్చర్కి నరసింహమూర్తి రవంత విస్మయంతో చూసాడు; అప్పటికి థేంక్స్ చెప్పడం కూడా మరచి. ఆయన చూపిస్తూన్న మన్ననంతా తనకోసం కాదని, తన పెద నాన్నగారి పట్ల వాళ్ళకున్న మర్యాదేనని మనసున తలపోస్తూ-- ఏది ఎలాఉన్నా- లోలోన ఆయన కనబరూస్తూన్న మన్నన చూసి సందిగ్దావస్థకు లోనవుకుండా ఉండలేకపోతున్నాడు- “ముందు మీరు తీసుకోండి సార్! “
శ్రీలక్ష్మణ్ నవ్వి “నేనూ తీసుకుం టాను. ఇక్కడి చలిగాలులకి అలవాటు లేనివారు మీరు. మొదట మీరే తీసుకోవాలి మరి“ అని పేపర్ కప్పుని నరసింహమూర్తి చేతిలో పెట్టి తను కూడా కాఫీపోసుకుని తాగసాగాడు.
ఔను మరి- ఇక్కడి దూరం గురించి ఊహించాలంటే మైళ్ళతోనే కొలవాలి మరి. అక్కడిలా కిలోమీటర్లతో పని కాదు. కాఫీతాగుతూనే క్రిందకు దిగాడు నరసింహమూర్తి మఫ్లర్ని మెడచుట్టూ బిగుతుగా చుట్టుకుని. కారు చాలా ఖరీదైన బ్రాండ్ లాగానే కనిపిస్తూంది. జర్మన్ మేక్ అయుంటుంది. డాలర్ల రూపంలో కొంచెం తక్కువ ధరకే ప్రత్యేక సీజనల్ డీల్ తో కొనుంటారు. దూరాన్ని బట్టి, ఆమడ దూరం వరకూ జనసంచారం అంతగా లేని వ్యవహారాన్ని బట్టి చూస్తే వీళ్ళింట్లో మరో రెండు మూడు కార్లు ఉండే ఉంటావేమో! సౌఖ్యం గురించి కాక అవసరాన్ని బట్టి చూస్తే అతడికి అలానే తోస్తూంది; అప్పట్లో తమింట్లో వాడే సైకిల్సు లాగన్నమాట. ఇప్పటికీ రాజమండ్రిలోని ఇంట్లో ఇంకా మూడు సైకిల్లు అలానే పడున్నాయి.
కారులోపల కూర్చున్న శ్రీలక్ష్మణ్ వేపు అతడి చూపు మళ్ళింది. వేసుకున్న సూటు- చుట్టూ కప్పుకున్న పొడవాటి మఫ్ల ర్. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు- చేతికి బ్రేస్లెట్- చేతికి వేసుకున్న రిస్ట్ వాచీ- ఇవన్నీ చూస్తుంటే, మనిషి కూడా చాలా ఖరీదైన వాడిలాగే అగుపిస్తున్నాడు. మరి పెదనాన్న— తనకింతటి మోతుబరి కుటుంబస్థులు- అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుకున్న వారు ఉన్నారని తనకింత వరకూ మాటవరసకు కూడా తెలపలేదు. నిండుకుండ తొణకదుగా!
ఇకపోతే- పెద్దవాళ్లు తమతమ హుందా తనం నిలుపుకోవడానికి సాధారణంగా చిన్నవాళ్ళ వద్ద అన్ని విషయాలూ ప్రస్తావించరన్నది అతడికి తెలుసు. విజ్ఞులైన పెద్దలు సమయ సందర్భం చూసి మెసలుతారని కూడా అతడికి తెలుసు. కాని- ఎటొచ్చీ ఇంట్లోవాళ్లందరూ తననింకా లోక జ్ఞానం ఎర గని హైస్కూలు విద్యార్థిలా భావిస్తుండటమే అతడికి చిరాకు కలిగిస్తూంది. అంతకు మునుపెన్నడో చదివిన చిరు కథ పేరు తలం పుకొచ్చింది- ‘మానవా నువ్వు మారవా! ’అన్న పేరున.
అదే విధంగా మరొక కథ పేరు కూడా తలంపుకొచ్చింది ‘అగ్రజులూ! మీరు ఉన్నకాలం నుంచి ఇటు కదలి రారా’
అతడికి గాని కథ వ్రాసే అవకాశం కలిగితే కథ పేరు ఇలా పెట్టేవాడు‘పెద్దలూ! వివేకమున్న విజ్ఞులూ! చిన్నవాళ్ళను మరీ చులకన చేయకండి సుమా! ’ఇక ముందుకు సాగి ఆలోచిస్తే అతడు శ్రీరామ్- శ్రీలక్ష్మణ సహోదరుల హోదాగురించి సంపద రాశుల గురించి తలపోస్తూ వచ్చినది సరైన ఊహే! గురితప్పని ఉజ్జాయింపే!
----------------------------------------------------------------------------------
నగరానికి కొంచెం దూరంగా- రిడ్జ్ మోంటో విలేజికి ఆవల- వాళ్ళ రెండతస్తుల మేడ ఆమడ దూరం నుంచి నిటారుగా నిల్చుని నిక్కి చూస్తున్నట్లుంది. సుమారుగా ఒక ఎకరం విస్తీర్ణనలో పరచుకుని ఉంది వాళ్ల నివాసం. అరనిమిషం పాటు కనురెప్ప మూయకుండా చూస్తూండి పోయాడు నరసింహమూర్తి. ఇంతటి విశాలమైన నివాస స్థలంలో కట్టడం-- అక్కడైతే గవర్నర్లలకు ముఖ్య మంత్రులకు మాత్రామే సాధ్యమవుతుంది మరి. ఇక్కడైతే-- జనం తక్కువా స్థలం ఎక్కువా! అతడు మేడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న శ్రీరామ్ గారింట్లోకి ప్రెవేశించాడు.
అమెరికాలో గ్రౌండ్ ఫ్లోర్ని ఫస్టే ఫ్లోరనే పిలుస్తారు యెందుకో మరి. ఆ సాంకేతిక పరమైన లెక్కలు వాళ్ళకే తెలవాలి. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే నరసింహమూర్తి కళ్లు పెద్దవయాయి. అతడి రాక కోసం ఇరు కుటుంబాలూ విశాలమైన హాలులో వేచి ఉన్నాయి. తన పెదనాన్న భూషణంగారి పెద్దరికానికి ఎంతటి గౌరవ ప్రపత్తులున్నా తనకంతటి వి. ఐ. పి ట్రేట్ మెంట్ ఇవ్వడం అతడికి నిజంగానే ఇబ్బంది కలిగించింది. అలజడి రేకెత్తింది. బయల్దేరేముందు పెదనాన్న చెప్పిన సర్ప్ రైజ్ ఇదేనన్నమాట! బాగు బాగు!
కాని అతడి కోసం ఇంకొన్ని సర్ప్ రైజ్లు కాచుక్కూర్చున్నాయన్నది అతడికింకా తెలియదు.
మొదట అతడి దృష్టికి వచ్చినది— ఆ ఇంట్లో స్థిరీకరించబడ్డ సమతుల్యమైన శీతోష్ణస్థితి. బైటలా ఇంట్లోపల కూడా శీతలం గా కాకుండా సమశీతోష్ణ స్థితితో హాయిగా ఉపశమనం కలిగించేలా ఉంది. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం సమకూర్చు కోవడానికి ఆ మేడలో రెండు మూడు ఏ. సీ. ప్లాంట్ లు ఉండే తీరుతాయి.
పాదాలు వెచ్చదనం కోల్పోకుండా ఉండటానికి ఫ్లోరింగ్ చుట్టూ క్రీమ్ రంగు తివాచీ పరచబడి ఉంది. ఇంటి చుట్టూ అల్లంత దూరం వరకూ ఫల పుష్పాదులతో విరాజిల్లే పచ్చటి తోట. కనుచూపు ఆనినంత వరకూ కళ్లు విప్పార్చితే-- ఆవలంతా పైన్ వృక్ష సముదాయం. సరాసరి కుబేరుడి వనం వరకూ విస్తరించి నట్లుంది. ఇక్కడున్నంతసేపూ తనకు తిరుగుండదు;మాటక మాట చెప్పాలంటే-- ఇటువంటి సమతుల్య ఆహ్లాదకర గృహవాతావరణంలో తనేకాదు, ఇంకెవరైనా హాయిగా నెట్టుకు రాగలరు చీకూ చింతా లేకుండా.
ఇంట్లోని వాళ్ళతో పలకరింపులూ ప్రతి నమస్కారాలూ ఐన తరవాత అతణ్ణొక సూనృత మనోభావం పారిజాత పుష్టంలా తాకింది;తను తన స్వంత ఇంట్లోకి ప్రవేశించినట్టు ఒక మృదు భావన-- తన స్వంత వాళ్ళ మధ్య ఉన్నట్టు ఓ మధుర భావన. తన రూమ్ మేట్ షేక్ అహ్మద్ తనతో రాలేక పోవడం వల్ల ఎంతటి విలువైనది, మోహనకరమైనది మిస్ అయిపోయాడు! కట్టూ బొట్టూ- గృహాలంకరణం అంతా తెలుగు తనం- భారతీయ సాంస్కృతి మయం. నిశ్శబ్ద నిర్మల తరంగం వంటి ఆ వాతావరణం తను పుట్టి పెరిగిన రాజమహేంద్రవరానికి- ఏటవాలుగా పారే గోదావరి తీరానికి తనని తీసుకెళ్ళిపోయింది.
అందర్నీ శ్రీరామ్ గారే తన పెద్దరికాన్ని మరచి శ్రమతీసుకుని ఇంటిల్లపాదినీ పరియచయం చేసారు.
భార్య సుగాత్రమ్మ- తమ్ముడి భార్య వైదేహి- కొడుకు రామ్ మోహన్ రాబర్ట్- కూతురు సుజాత- తమ్ముడి కూతురు మోహ న. అప్పుడు నరసింహమూర్తిని ఉన్నపాటున నిలువెల్లా ఆకర్షించిన నిండు విగ్రహం- మధుర మోహన రూపం- సుజాత. నుదుట గుండ్రటి బొట్టు- చక్కటి కాంచీపురం చీర కట్టు- వేణికలా అల్లిన వయ్యారపు జడ. చలాకీ తనం ఉట్టిపడుతూ వెండిమబ్బులను తలంపుకి తెచ్చే విశాల నయనాలు- ఇంచుక కూడా యెక్కువ కాని నిగనిగలాడే మేనితో- విల్లులా విలాసంగా వంగిన నడుము తో- పొడవుకి తగ్గ అంగ సౌష్ఠవంతో- అతడికి చూపులు మరల్చుకోవడానికి క్షణాలు పట్టాయి.
ఇంతటి చక్కటి ముగ్ద మోహన రూపం- యవ్వన విన్యాసం ఎవరి కోసమో! ఈ సూదూర ప్రాంతాన ఎన్నాళ్ళ నిరీక్షణమో! ఇంకా నయం చంద్రుడు ఏమరు పాటు న అహల్యను చూసాడు. ఇటువంటి అమెరికన్ తెలుగు సుందరాంగిని చూసి ఉంటే ఏమయి పోయేవాడో! శాపాలుపైన శాపాలు పెట్టినా ఖాతరుచేయకుండా ఏకంగా చంద్రలోకానికే ఎత్తుకు పోయేవాడేమో! రోహిణి వద్ద మొట్టికాయలు తినేవాడేమో!
=======================================================================
ఇంకా వుంది
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments