top of page
Original_edited.jpg

కొలనులో చేప.. కొమ్మపై కోతి..!

  • Writer: Mukkamala Janakiram
    Mukkamala Janakiram
  • Dec 27, 2024
  • 2 min read

#MukkamalaJanakiram, #ముక్కామలజానకిరామ్, #KolanuloChepaKommapaiKothi, #కొలనులోచేపకొమ్మపైకోతి, #TeluguMoralStories, #నైతికకథలు

ree

Kolanulo Chepa Kommapai kothi - New Telugu Story Written By Mukkamala Janakiram

Published In manatelugukathalu.com On 27/12/2024

కొలనులో చేప.. కొమ్మపై కోతితెలుగు కథ

రచన: ముక్కామల జానకిరామ్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



కోదండ అడవిలో అందమైన కొలను ఉండేది. రకరకాల జంతువులు, పక్షులు కూడా ఉండేవి. వాటికి దాహం వేసినప్పుడు ఈ కొలను వద్దకే వచ్చి దాహాన్ని తీర్చుకునేవి. 


 కొలనులో కొన్ని చేపలతో పాటూ స్వర్ణముఖి అనే చేప ఉండేది. దానికి అక్కడికి వచ్చిన పక్షులతో.. జంతువులతో మాట్లాడాలని, స్నేహం చేయాలని ఉండేది. కానీ.. అవేవీ స్వర్ణముఖితో స్నేహం చేయక పోయేసరికి చాలా బాధపడేది. ఒడ్డుకు వచ్చి కూర్చుని వాటి వైపు ఆశగా చూసేది. 


కొలను పక్కన ఎత్తైన నేరేడు చెట్టు ఉంది. ఎవరో వెనుక నుండి తరుముతున్నట్టుగా పరుగెత్తుకొచ్చింది ఒక కోతి. అలసిపోయిన కోతికి కొలను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఆయాస పడుతూ కొలను వద్దకు వచ్చిన కోతిని స్వర్ణముఖి చూసింది. 


ఒడ్డుకు చేరి.. "ఏమైంది! ఎందుకలా పరుగెత్తుకొచ్చావు?" అని అడిగింది. 


"సింహం నన్ను వెంటాడింది. ఎలాగోలాగా దాని నుండి తప్పించుకుని ఇలా వచ్చాను" అని జరిగిన సంగతినంతా చెప్పి నీటిని తాగి ఒడ్డు మీద తాపీగా కూర్చుంది. 


 "మిత్రమా! ఆకలితో ఉన్నట్టున్నావు. ఈ చెట్టుకు నేరేడు పళ్ళు ఉన్నాయి. చెట్టెక్కి పళ్ళను తిను" అని చెప్పింది స్వర్ణముఖి. 


సంతోషించిన కోతి పక్కనే ఉన్న చెట్టునెక్కి కడుపు నిండా పళ్ళను తిన్నది. "ఆకలిగా ఉన్న నాకు పళ్ళను చూపించి ఆకలి తీర్చావు. నీ సాయం మర్చిపోను" అన్నది కోతి. 


"దీనిలో నా గొప్పతనం ఏమీ లేదు. ఈ అడవే మన అవసరాలన్నీ తీరుస్తుంది. కానీ.. నాది ఒక చిన్న కోరిక. ఈ కొలనులో చాలా కాలం నుండి ఉంటున్నాను. ఇక్కడ ఉన్న ఏ పక్షీ, జంతువు నాతో స్నేహం చేయడం లేదు. నువ్వు నాతో స్నేహం చేస్తావా?.. ఎంచక్కా! ఇక్కడ తాగడానికి నీరు, తినడానికి పళ్ళు ఉన్నాయి. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గడుపుదాం" అని బాధగా అడిగింది స్వర్ణముఖి. 


సంతోషించిన కోతి "సరే" అన్నది. 


ఆరోజు నుండి స్వర్ణముఖి, కోతి రెండూ మంచి స్నేహితులయ్యాయి. కోతి చెట్టునెక్కి నేరేడు కొమ్మను గట్టిగా ఊపగానే నేరేడు పళ్ళు రాలాయి. నీటిలో ఉన్న స్వర్ణముఖి చెంగున ఎగిరి నోటితో పండును అందుకొని.. "చూసావా! ఎలా అందుకున్నానో" అన్నట్లుగా కోతి వైపు చూసి నవ్వింది. 


"భలే.. భలే.. " అంటూ కోతి సంతోషంగా చప్పట్లు కొట్టింది. రెండు అలా ఆనందంగా జీవించసాగాయి. ఒకరోజు జాలరి భుజానికి సంచి, చేతిలో వలను పట్టుకొని కొలను వద్దకు వచ్చాడు. 


అది చూసిన స్వర్ణముఖి భయపడి "ఈరోజుతో నాకు నూకలు చెల్లాయి. ఈ సాయంత్రానికి అతనికి పులుసుగా మారల్సిందేనా?" అని బాధపడుతూ చెట్టుపై కూర్చున్న కోతి వైపు చూసింది. 


దాని కళ్ళలో భయాన్ని, బాధను చూసిన కోతి ‘ఎలాగైనా నా మిత్రున్ని కాపాడుకోవాలి’ అని నిశ్చయిచుకుంది. కానీ.. ఎలా కాపాడాలో తెలియలేదు. జాలరి తన వద్ద ఉన్న సంచిని కొలను వద్ద ఉంచి వలను కొలనులోకి వేశాడు. అది చూసి భయపడిన స్వర్ణముఖి అవతలి ఒడ్డుకు వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత వలను తీసి చూడగా చేపలు పడలేదు. 

 మళ్లీ మరోవైపు వెళ్లి వలను ఈసారి బలంగా నీటిలోకి విసిరాడు. కొద్దిసేపటి తర్వాత వలను బయటికి తీసి చూడగా వలలో చేపలు పడ్డాయి. మిగతా చేపలతో పాటూ స్వర్ణముఖి కూడా వలలో చిక్కి గిలగిలా కొట్టుకోసాగింది.

 

 అది చూసిన కోతి ఆగ్రహంతో జాలరి మీదికి దూకి కరవసాగింది. దాంతో జాలరి వలను అక్కడే వదిలేసి భయంతో పరుగందుకున్నాడు. 


 వలలో చిక్కుకున్న చేపలతో పాటూ స్వర్ణముఖిని వల నుండి బయటకు తీసింది. 


 కొలనులోకి జారుకున్న స్వర్ణముఖి "మిత్రమా! నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. ఏమిచ్చి నీ ఋణం తీర్చకోగలను" అని అన్నది. 


"ఆపదలో ఉన్నప్పుడు కాపాడడమే మిత్ర ధర్మం కదా!" అని అన్నది కోతి. 


మంచి మిత్రుడు దొరికినందుకు స్వర్ణముఖి సంతోషించింది. రెండూ ఆనందంగా జీవించసాగాయి. 

 

 ***


ముక్కామల జానకిరామ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: ముక్కామల జానకిరామ్ M. A., B. Ed., D. Ed


స్కూల్ అసిస్టెంట్- తెలుగు

నల్గొండ జిల్లా

తెలంగాణా




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page