top of page

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 20

Updated: Mar 31

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 20 - New Telugu Web Series

Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 25/03/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 20 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. 


పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది మాధవి. వీరి విషయం నరసింహులు గారికి తెలుస్తుంది. 

కౌంటీ ఇండియన్ ఫంక్షన్ కి వెళ్లిన నరసింహ మూర్తి ఉపన్యాసానికి ప్రశంసలు లభిస్తాయి. 


ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 20 చదవండి.. 


కార్యక్రమం అంతా అయిపోయిన తరవాత ఫ్రెండ్సందరి వద్దా వీడ్కోలు తీసుకున్న తరవాత అందరూ కారు లోకి వెళ్ళి కూర్చున్నారు. కారు కాస్తంత పెద్దది కావటాన అందరికీ బాగానే సరిపోయింది. సుజాత తమ్ముణ్ణి వెనక్కి పంపి తను స్టీరింగు చేతబట్టింది. కొద్ది దూరం సాగిన తరవాత నరసింహమూర్తి వెనక్కి తిరక్కుండానే మోహనను ఉద్దేశించి అన్నాడు- “అన్నట్టు నీకు చెప్పడం మరచిపోయాను మోహనా! మా రూమ్ మేట్ షేక్ అహ్మద్ నీ బ్యూటీని మెచ్చుకున్నాడు. చీరలో చాలా పొందికగా ఉన్నావన్నాడు”


“పాపం ఆ పాకిస్థానీ అబ్బాయికి తెలియదనుకుంటాను నేను చాలా అరుదుగా చీరలు కట్టుకుంటానని. మా అక్కయ్యే వయ సుకి మించిన ముత్తయిదువులా కనిపించడానికి ఇంటా బైటా చీరలు కట్టుకోవడానికి తెగ ఉబలాటపడ్తుంటుంది. సరేలే- మీకు నిరుత్సాహం కలిగించడం దేనికి- మీ మిత్రుడి సౌందర్యోపాసనకు నా ధన్యవాదాలు చెప్పండి. ఇక నాదొక చిన్న రిక్వెస్ట్ వింటారా బావగారూ! ” 


ఇటు తిరక్కుండానే ఉఁ- అన్నాడతను. 

“మీరు ఇటు వస్తే నేనటు వచ్చి కూర్చుంటాను” 


ఎందుకూ- అన్నట్టు తిరిగి చూసాడు నరసింహమూర్తి. 


“మరేం లేదు. అసలే మితిమీరిన మంచుకాలం. మీరు ఎక్కువ సార్లు మా అక్కయ్యనే ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అదేమో- చకోర పక్షిలా మీ మాటకోసం ఎదురు చూస్తూ మిమ్మల్నే చూస్తూంది. రోడ్డు పైన దాని ఏకాగ్రత చెడితే మా కొంప కూలవచ్చు”


ఈ సారి సుజాత కల్పించుకుంది. “నువ్వూరుకోవే! అవ్వాయి చువ్వలా మధ్య నన్నెందుకు ముగ్గులోకి లాగుతావూ! ఆయనిక్కడుండేదే కొన్నాళ్ళు. కాస్తంత ఓర్చుకోవే!” 

అప్పుడు నరసింహమూర్తి టాపిక్ మారుస్తూ అన్నాడు- “అక్కడ మనకు కనిపిస్తున్నది జార్డెయిన్ లేక్ కదా! ”


ఉఁ అందామె. 

“దానికి ఆనుకొని ఫారెస్టుంది కదూ! ”


ఈ సారి సుజాత బదు లివ్వక ముందే రామ్ మోహన్ రాబర్ట్ అందుకున్నాడు- “అదంతా సరే బావగారూ! ఇంతకూ మీకేమి కావాలి?“


“నాదొక కోరికుందోయ్. ఆ ఆశ నెరవేరకుండానే వెళ్ళి పోవలసి వస్తుందేమో!”


ఆ మాట విని సుజాత కారు వేగం తగ్గించింది- 

“మీకోరికేమిటో మొదట చెప్పండి మూర్తిగారూ! ఇంతకీ ఏమిటది?”అని అడిగింది. 

ఈసారి మోహన చివుక్కున అడ్డు వచ్చింది- “ఈయనేదో కోరిక అంటున్నారు. తొందరపడి ఊఁ అనకే అక్కాయ్! రేపు నీ కొంప ముంచినా ముంచుతాడు“


“నువ్వూరుకుంటావా లేదా మొట్టి కాయ పెట్టమంటావా!” అంటూ నరసింహమూర్తి వేపు తిరిగింది చెప్పమన్నట్టు చూస్తూ. 


“నాకు క్యాంప్ ఫైర్ అంటే చాలా ఇష్టం. ఒక్క రోజైనా జార్డెన్ అడవులమ్మట క్యాంప్ చేసి వెళ్ళాలనుకునుకున్నాను. అనుకున్నవి అనుకున్నట్టు అన్నీ నెరవేరవు కదా!”


అప్పుడు మోహనే మళ్ళీ అందుకుంది- “తమరి వాంఛేమో రసాత్మకంగానే ఉంది రాజమండ్రి బావగారూ! కాని అక్కడ క్యాంపింగుకి ఇది సమయం కాదు కదా! జార్డెయిన్ అడవుల్లో మకాం వేయడం మాట అటుంచి అందులోకి వెళ్ళడమనేదే నరకప్రాయమవుతుంది మరి”


“నార్త్ కరొలీనా స్టేట్ లోని కాల చక్రం గురించి నాకు తెలియదు గాని- నవంబర్ నెల వచ్చీరావడం తోనే అమెరికన్లు వాచీలను ఒక గంట వెనక్కి తిప్పేస్తారని నాకు తెలుసు. శుభ్రత తొణికిసలాడుతూన్న నదినీ దాని ప్రక్కనున్న పచ్చటి అడవినీ చూసి ఉద్వేగానికి లోనై కొంచెం కన్ ఫ్యూజ్ అయాననుకో!”అంటూ సుజాతను కారాపమన్నాడు. 


ఎందుకని అడిగిందామె కారుని ఆపుతూ. 

“అక్కడ కాఫీ బార్ తెరచి ఉన్నట్లుంది. అందరం కలసి కాఫీ తాగుదాం“


“మరి మీ భోజనం సంగతి? ఇంటి కొచ్చి వెళ్ళడం ఆలస్యమవుతుందేమో!”


“అవచ్చు. అవనియ్యి. ఇటువంటి వాతావరణం- ఇటుంటి స్నేహ మాధుర్యం మళ్ళీ ఎన్నాళ్ళకో మరి!”


“అలాగే చేద్దాం- ఒక చిన్నపాటి సర్దుబాటుతో. మేం ముగ్గురమూ కాఫీలు తీసుకుంటాం. మీరు మాత్రం మినీ మీల్స్ వంటిది తీసుకుని ఆ తరవాత కాఫీ తీసుకోండి. ఇక్కడికి మరి కొద్ది దూరంలో క్యారీ అవే లేన్- ఉంది. దానికి సమీపంగా కెంటకీ నాన్ విజ్ షాప్ ఉంది. అక్కడ భోంచేయండి. ఆ తరవాత మిమ్మల్ని తిన్నగా ట్రైనింగ్ హాస్టల్ వద్ద దిగబెట్టేస్తాం. సరేనా? ”


తలూపాడతను. 

కారుని కెంటకీ షాపు ముందు ఆపి కొంటర్ వద్దకు వెళ్లి కాఫీలు మినీ మీల్సూ ఆర్డర్ చేసింది సుజాత.

అతడు భోజనం ముగించి అందరితో కాఫీ తాగుతూన్న సమయం చూసి సుజాత కదిపింది- “ఊఁ చెప్పండి“


“నేను ట్రైనింగ్ ముగించిన వెంటనే- అంటే అదే రోజు నేను ఇండియా వెళ్ళిపోవాలి“

సుజాత తెల్లబోయి చూసింది. అక్కయ్య పరిస్థితి గమనించిన మోహన తేరుకుంటూ చేతి పైన చేయి వేసి నిమిరింది; గుండె నిబ్బరం తెచ్చుకోమన్నట్టు సంకేతం ఇస్తూ. 


సుజాత తేరుకుంటూ ముఖాన నవ్వు తెచ్చుపెట్టుకుంటూ అంది- “అదేంవిటండీ! మొన్న మీరేగా నాన్నగారితో అన్నారు అకాడమీ వాళ్లు ట్రైనింగ్ పీరియడ్ ఐన వెంటనే మీకందరికీ వెకేషన్ లాగ ఊళ్ళన్నీ తిరగాడనికి వారం రోజలు గడువిస్తారని. మరిప్పుడేమైంది? ప్రోగ్రామ్ రద్దు చేసారా! ”

“లేదు. అటువంటిదేమీ కాలేదు. నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. అమ్మకు నలతగా ఉందట. అందులో మరొక మేటర్ ఎదురైనట్లుంది. మాధవి పెళ్ళి విషయం- నేను అక్కడకు చేరకుండా వ్యవహారం తీరేటట్లులేదని మాపెదనాన్నగారు ఫోను చేసి చెప్పారు“


అప్పుడక్కడ నిశ్శబ్దం తాండవించింది. నిశ్శబ్దం మంచు ముద్లలా గడ్డకట్టకముందే మోహన కలుగచేసుకుంది- “అదేంవిటే అక్కాయ్! విషయం అర్థం చేసుకోకుండా అలామూడీగా అయిపోతున్నావు! బావగారు ఎంత త్వరగా ఊరు వెళితే అంత మంచిదే కదా! ఈయన అక్కడకు వెళ్ళకుండా- వెళ్లి వాళ్ళ పెదనాన్నకూ అమ్మానాన్నలకూ విషయం వివరించి చెప్పకుండా నిశ్చితార్థం తేదీ నిర్ణయం చేసి తాంబూలాలు పుచ్చుకోవడానికి ఇక్కడి కెలా వస్తారు? అందులో బావగారి చెల్లి పెళ్ళి వ్యవహారం వచ్చి పడిందాయె! పాస్ పోర్టులు-- వీసాలు గట్రా పొందవలసుందాయె! ”


మోహన మాటకు అంగీకార సూచకంగా నరిసింహమూర్తి నవ్వుతూ తలూపాడు. 

సుజాత నవ్వుతూ కారు వేగాన్ని అదుపు చేసుకుంటూ అతడి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అతడి చేతిని తన చేతిలోకి అందుకుంది. అక్కయ్య మనోభావాన్ని గమనించిన రామ్ మోహన్ రాబర్ట్ లోలోన విస్మయం చెందాడు. పురి విప్పిన నెమలిలా నిటారుగా తిరిగే అక్కయ్య కొద్ది రోజుల్లోపల ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన నరసింహమూర్తి కోసం దిగులు చెందడం 

అతడికి ఆశ్చర్యంగానే ఉంది మరి. ప్రాంతాలకు ప్రదేశాలకు అతీతంగా ప్రతి స్త్రీకీ ఇటువంటి అనురాగ పూరిత ఆశ్రిత గుణం ఏదో ఒక మూలన ఉంటూనే ఉంటుందేమో! 

_____________________________________________________________

వర్థనమ్మ మగతగా కళ్ళు విప్పి చుట్టూ పరకాయించి చూసింది. ఆ తరవాత కళ్ళను గిర్రున తిప్పి చూసింది. ఆమె చూపుకి వ్రేలాడుతూన్న ఆక్సిజన్ సిలిండర్ కనిపించింది. చుట్టూ వ్యాపించి ఉన్ని తీక్షణమైన యాసిడ్ ద్రావకాల వాసన ఆమె ముక్కుపుటాలను ఎగర గొడ్తూంది. ట్యూబుని తగిలించడం కోసం చేతిని గుచ్చిన చోట ఆమె తడిమి చూసుకుంది. ఇన్ని జరిగిన తరవాతనే తనకు పునరుజ్జీవం కలిగిందన్నది ఆమెకు స్పష్టమవుతూంది. అప్పుడప్పుడు గాఢమైన నిశ్శబ్దాన్ని చీలుస్తూ టకటకమనే నర్సమ్మల కాళ్ళ చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఆమె బెడ్ రెస్ట్ స్టాండుకి చేరబడి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. 


ఆమె భర్త డాక్టర్ నరసింహులు నవ్వు ముఖంతో తననే చూస్తూ నిల్చున్నాడు. తనకు చిరకాల పరచితమైన ఆ నవ్వూ ఆ రూపూ ఆమెకు కొండంత బలాన్నిచ్చింది. మొత్తానికి ఆమెకు తనున్నది హాస్పిటల్ బెడ్ అన్నది బాగా గుర్తుకి వచ్చింది. ఆమె అదే నవ్వుతో స్పందిస్తూ దగ్గరకు రమ్మనమని తలూపింది. 


అతడు ముఖాన్ని మరింతగా విప్పార్చుకుని భార్యను సమీ పించాడు- “మరేం కాలేదోయ్. కొంచెం ముఖం తిరిగి పడిపోయినట్లున్నావు. ఎందుకైనా మంచిదని- పనిలో పనిగా అన్ని టెస్టులూ పూర్తి చేస్తే బాగుంటుందని గాంధీ ఆస్పత్రిలో చేర్పించాను. అంతే!”


ఆమె ఇంకా నవ్వుతూనే- “ఇంతకూ--” అని ఏదో చెప్పబోయి ఆగిపోయింది. కాని ఆపాడతను. ”చెప్పాగా సీరియస్ విషయం ఏదీ లేదని! హిమోగ్లోబిన్ లెవల్ తగ్గింది. రక్తపు పోటు అటూ యిటుగా పెరిగినట్లుంది. అందులో వంటగదిలో తడినేల పైన నడిచావేమో—అడుగులు నిలద్రొక్కుకోలేక జారిపడ్డావు. నేను చెప్పినట్టు మన డిస్పెన్సరీకి ముందే వచ్చి ప్రిలిమినరీ మెడికల్ టెస్టులు చేసుంటే ఈ అగచాట్లు ఉండేవి కావు”


వర్థనమ్మ భర్తను నిదానంగా చూస్తూ అటు తల తిప్పి చూసింది. దు:ఖపూరిత నయనాలతో తల్లిని చూస్తూ దూరాన నిల్చుంది మాధవి. వర్థనమ్మ మనసు తల్లడిల్లింది. తన అలక్ష్యం వల్ల ఎంతపని జరిగింది! ఇంటిల్లపాదినీ ఎంత లావు టెన్షెన్కి లోను చేసింది! 

ఇలా ఆలోచి స్తూ “ఎన్ని రోజులుండాలి? ” భర్తను అడిగిందామె. 


“మూడు రోజులు. కాని కావాలంటే రేపే వెళ్లిపోవచ్చు. నన్నడిగితే ఉండటం మంచిది”


ఆమె తలూపుతూ ముఖాన్ని విప్పార్చి మళ్ళీ నవ్వడానికి ప్రయత్నించింది. తన పరిస్థితికి ఇంట్లోవాళ్లు బాగానే బెంబేలు పడిపోయుంటారు. అలా చూస్తూ కూతురుని దగ్గరకు రమ్మంది. “మీ నాన్నగారు చెప్పింది విన్నావుగా! సీరియస్ విషయం ఏమీ లేదని. ఇక దిగులెందుకు? ఇకముందు జాగ్రత్తలు తీసుకుంటాలే!” అని కూతురుకి భరోసా ఇచ్చింది. 

మాధవి చేతిని చాచి- “ప్రామిస్? ” అని తల్లికి అందించింది. 


కూతురి చేతిని ప్రేమగా నిమిరి అసంకల్పితంగా అటు చూపు సారించి ఆశ్చర్యంగా కనురెప్పలల్లాడిస్తూ ఉండి పోయింది. శంకరం! రెండు చేతుల్నీ క్రాస్ గా కట్టుకుని తదేకంగా చూస్తూ నిల్చున్నాడు. ఆమె కళ్ళల్లో అలవికాని ఆప్యాయత తొణికిసలాడింది. 


అప్పుడామె కూతుర్ని దగ్గర గా పిలిచి మెల్లగా చెవిలో వినిపించేలా చెప్పింది- “ఆ అబ్బాయినెందుకు పిలిచి టెన్షన్ లో పెట్టావు! మీనాన్న డాక్టరన్నది మరచి పోయావా యేమిటి?” 

మాధవి కూడా గొంతు తగ్గించుకుని మెల్లగా బదులిచ్చింది- “అబ్బే! నేనెక్కడ పిలిచాను? విషయం తెలుసుకుని ఆయనే తానుగా వచ్చి మాతో రోజంతా ఉన్నారు. కావాలంటే నువ్వే అడుగమ్మా! ”

ఆమె కూతురు సూచన ప్రకారమే అడిగింది తన అనారోగ్యం గురించి అతడి కెలా తెలుసని. 

“నిజంగా నాకెవరూ చెప్పలేదు మేడమ్! నెలకొక ఆదివారం పూట నాకు సత్య హరిశ్చంద్ర సేవా సమితి వాళ్ళ ఆఫీసులో డ్యూటీ ఉంటుందండి” 


ఈసారి డాక్టర్ నరసింహులు అడ్డు వచ్చి అడిగాడు- “డ్యూటీ అంటే—”


దానికి మొహమాట పడుతూ శంకరం బదులిచ్చాడు- “మరేం లేదండీ. అవసరం కలిగినప్పుడల్లా వాళ్ళాఫీసులో పనులు చేసి పెట్తుంటానండి. నెలకొక సారి ఫీల్డ్ డ్యూటీ ఇస్తుంటారండి”

“సత్య హరించ్చంద్ర ఆఫీసు వాళ్ళ పనీ-- వాళ్ళిచ్చే ఫీల్డు వర్కూ అంటున్నారే! ఆర్ యు పెయిడ్ ఫర్ ఇట్?”


“లేదు సార్. అంతా స్వఛ్ఛంద సేవేనండీ! అదే రీతిన నిన్న ఆదివారం కూడా ఇక్కడకు వచ్చానండీ! “


“ఇక్కడకు ఎందుకు రావడం? ”- నరసింహులు


“చాలా రోజులుగా క్లయిమ్ చేయని అనాథ శవాలు కొన్నిటిని వాళ్ళతో బాటు వెళ్ళి పూడ్చి వచ్చానండీ! “


ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. ”ఈ పని మీరెందుకు చేయాలి శంకరం?” సందేహం తీరక మళ్ళీ అడిగాడు నరసింహులు. 


శంకరం బదులిచ్చాడు- “యాక్సిడెంట్ల వల్లనో- ఆత్మహత్యలు చేసుకోవడం వల్లనో మరణించిన వాళ్ళ పార్థివ శరీరాలు నెలల తరబడి ఎవరూ క్లయిమ్ చేయక పోవడం వల్ల మార్చురీ ఐస్ పెట్టెలో పడుంటాయి సార్. సత్య హరిశ్చం ద్ర సేవా సమతి వాళ్ళకూ— ఆస్పత్రి డిపార్టుమెంటు వాళ్లకూ మధ్య ఒక అవగాహన ఉందండి. దాని ప్రకారం మా వాళ్లు అటువంటి అన్ క్లయిమ్డ్ బాడీస్ ని అదుపులోకి తీసుకుని పవిత్ర మంత్చోఛ్ఛరణల మధ్య దహన క్రియలు జరిపిస్తారండి. 


యిలా చేయడానికి డిపార్టుమెంటు వాళ్ళు ఒక శవానికి ఇంతని ఖర్చులకోసం అమౌంటు రిలీజ్ చేస్తుంటారండి. దహన క్రియలు జరపక ముందే సేవాసమితి వాళ్ల వెబ్ సైట్లో నోటిఫికేషన్ మూలంగా డెడ్ బాడీస్ ని పోల్చుకున్న కొందరు మా సమితి వాళ్ళను కలుసుకుని కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకు తోచినంత విరాళాలు ఇచ్చి పోతుంటారు. వీటితో సేవా సమితి వారు తమ దైనందిన కార్యకలాపాలను సాగిస్తుంటారండి. వాళ్ళు సాగించే దహన క్రియల్లో నేను కూడా నెలకొకసారి పాలుపంచుకుంటానండీ! ”


అదంతా విన్న తరవాత ఆ వార్డులో దయావర్షం కురిసినట్లయింది. వర్ధనమ్మ గుండె కరిగింది. కళ్ళు తడిసాయి. 


సత్యహరిశ్చంద్ర సేవా కార్యకర్తలు సాధారణ సేవా తత్పరులు కారు. దయానిధులు! 

ఆర్ద్రతతో నిండిన మనసుతో ఆమె శంకరాన్ని తన దగ్గరకు రమ్మని పిలిచి అతడి రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకుంది. “మొత్తానికి గొప్ప పుణ్యాన్నే సంపాదిస్తున్నావన్న మాట! నీవు సంపాదించిన పుణ్యంలో నాకు కొంచెం ఇస్తావా? ”


“కొంచెమేమిటి మేడమ్? అంతా మీరే తీసుకోండి! ఐనా- మీరు చేయని పుణ్యకార్యమా! ” అంటూ ఆమెనుండి రెండు చేతుల్నీ విడి పించుకుని వెళ్ళి ఆమె రెండు పాదాలనూ తాకి నెత్తికి హత్తుకున్నాడు శంకరం. 


ఈసారి మాధవి సంభాషణా ప్రవాహంలోకి చేరింది- “మీరు మంత్రోఛ్ఛరణలతో శవ సంస్కారం చేస్తున్నానన్నారు కదా! మరి ఇతర మతస్థులవారు వచ్చి, అది వాళ్ళ మత ధర్మానికి విరుధ్ధమని నిరసన తెలియచేస్తే ఏమి చేస్తారు? ”


“ఇంత వరకూ అటువంటి అబ్జక్షన్ రాలేదు మాధవీ! ఒక వేళ అటువంటి వాళ్ళు అబ్జక్షన్ తో వస్తే వాళ్ళ బంధువుల శరీరాలను అప్పచెప్పడానికి సేవా సమితి వారికి ఆక్షేపణ ఉండదు. ఐనా— మంత్రోఛ్చరణలు సంస్కృతంలో ఉన్నా ఒక మతస్థులకంటూ ప్రత్యేకించినవి కావుగా! చనిపోయిన వారికి ఆత్మశాంతి నొసగమని భగవంతుణ్ణి కోరి— పంచభూతాల సాక్షిగా దహనక్రియలు పూర్తి చేస్తుంటాం- అన్ని పార్థివ శరీరాలనూ పంచభూతాల్లో కలసిపోవాలని కోరుకుంటూ--

అప్పుడు కాసేపాగి నరసింహులు అడిగాడు- “అంటే—మీ మేడమ్ గారిని స్ట్రెచర్ లో వేసి తీసుకొస్తుండటం చూసి- పని మధ్యలో పరుగెత్తుకొచ్చారన్నమాట! ”


శంకరం మౌనంగా తలూపాడు. 


“సరే- మీరిప్పుడేమి చేద్దామనుకుంటున్నారు? మాధవితో బాటు మీరిక్కడుంటారా! ”


“అబ్బే! మాధవిగారికి శ్రమ యెందుకండీ? నేనే ఉంటానండి. నాకు చాలా రోజుల సి. ఎల్ ఉందండీ. ఐనా విషయం అంత సీరియస్ కాదని తేలిపోయింది కదండీ!” 


అప్పుడు నరసింహులు కూతురి వేపు తిరిగి అన్నాడు- “అలాగే- నువ్వు శంకరంతో బాటు వెళ్ళి క్రిందున్న క్యాంటీనులో కాఫీలు తాగి రండి!” అని మాధవిని బయల్దేరదీసి భార్యను కదిపాడు- “మా ఫ్రెండ్సు ఇద్దరు మాధవితో క్లోజ్ గా ఉంటున్నాడని చెప్పిన అబ్బాయి ఇతనే కదూ! ” 


వర్థనమ్మ పెదవి విప్పకుండానే నవ్వుతూన్న కళ్ళతోనే బదులిచ్చింది - ఔనన్నట్టు. అతడేమీ అనలేదు. సాలోచనగా తలపంకిస్తూ డ్యూటీ మెడికల్ ఆఫీసరు గది వేపు కదిలాడు. వర్ధనమ్మ భర్తను ఆపింది- “ ఏమండీ! ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? ”


“ఇప్పుడీ పరిస్థితిలో సీరియస్ విషయాలు మాట్లాడుకోవడం అవసరమా! అబ్బాయి ఎలాగూ న్యూజెర్సీ నుండి వస్తున్నాడుగా! అప్పుడు మాట్లాడుకుందాం”


ఆమె ఊరుకోలేదు. “నేనేమీ యెమోషనల్ అయిపోనులెండి. సూచాయగా మీ అభిప్రాయం వింటే బాగుంటుందని”


భార్యలోని ఆరాటం గమనించి దగ్గరకు వచ్చాడు నరసింహులు- “మాధవి ఇంగితం ఉన్న అమ్మాయి. తడబడి పొరపాటు చేయదది. ఇకపోతే అసలు విషయానికి వస్తాను. ఒక ఆడదానికి అందగాడు భర్తగా దొరకవచ్చు. ధనవంతుడు తోడుగా లభించ వచ్చు. ఆ మాటకు వస్తే- తెలివితేటలు గలవాడు కూడా జతగాడుగా చేరవచ్చు. కాని సున్నితత్వం గల వ్యక్తి లభించడం చాలా కష్టం. 


ఎందుకంటే- సున్నితత్వం అందరికీ ఉండకపోవచ్చు. హృదయమున్నవాడికే ఉంటుంది. అటువంటి వాడు మాత్రమే ఎదుటి వారి బాగోగుల గురించి ఆలోచిస్తాడు. తన వల్ల ఎదుటి వారికి ఆటంకం కలగకూడదని జాగ్రత్త పడతాడు. అందులో అనుభవమున్న విద్యాధికురాలివి. బిడ్డల తల్లివి. అతణ్ణి చాలా రోజులుగా గమనిస్తున్నదానివి కూడా-- నీ నిర్ణయంలో తప్పెలా ఉంటుంది? 

లాస్ట్ బట్ నాట్ దీ లీస్ట్- నీకు ఆదినుండీ తెలుసు— నాకు మానవసంస్కారం పట్ల ఉన్నంత అక్కర— జాతి కుల వ్యవస్థ ల పట్ల లేదని. ఎలాగూ నువ్వు నాకంటే ముందుగానే నిర్ణయం తీసుకున్నావు కాబట్టి, ఇటువంటి శుభకార్యాలు జరిపించడంలో జాప్యాలకు తావు లేకుండా చూసుకోవాలి. నా వరకు శుభకార్యానికీ ధర్మ కార్యానికీ మధ్య అంత వ్యత్యాసం లేదంటాను. ఈ రోజే మా అన్నయ్యతో మాట్లాడతాను”


“శంకరం చాలా వెనుకబడిన తరగతికి చెందినవాడు కదా! బావగారు ఏమంటారో మరి! --” 


“సంతోషిస్తారు. మనకంటే ఎక్కువగా సంతోషిస్తారు. ఆయన వీరేశలింగం పంతులుగారి భక్తుడన్నమాట మరచి పోయావేంటి? ”


వర్ధనమ్మ మౌనంగా చూస్తూండిపోయి- ఆ తరవాత భర్త చేతుల్ని అందుకుని కళ్ళకు హత్తుకుంది. ఆమె కళ్ళల్లోని తడి చేతులకు తాకడం అతడికి బాగా తెలుస్తూంది.


=======================================================================

                                                ఇంకా వుంది

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 21 త్వరలో

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Σχόλια


bottom of page