అపరాధ పరిశోధన - పార్ట్ 9
- Seetharam Kumar Mallavarapu
- 4 days ago
- 6 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 9 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 13/05/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు.
ఇంటరాగేషన్ లో కిషన్, ఫయాజ్ లు తడబడతారు. మొదట లొంగని రంగా, బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు.
దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి.
ఆ రోజు సాయంత్రం శివరాం శర్మ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటాడు దీక్షిత్. తను కూడా వస్తానంటుంది నీతూ శర్మ.
ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 9 చదవండి..
"సరే శక్తీ భాయ్. టైం ఎక్కువ లేదు. మనిషి కోసం ట్రై చేస్తాను. దొరగ్గానే నిన్ను కాంటాక్ట్ చేస్తాను" చెప్పాడు దాము.
"సరే. వేరే నంబర్ ఇస్తాను. ఆ నంబర్ కు కాల్ చెయ్యి" అంటూ ఒక నంబర్ చెప్పాడు శక్తి.
"నేను కూడా వేరే నంబర్ నుండి చేస్తాను. ఆ నంబర్ నోట్ చేసుకో" చెప్పాడు దాము.
ఆ నంబర్ నోట్ చేసుకొని వెళ్ళిపోయాడు శక్తి.
అతను వెళ్లిన కాస్సేపటికే మోనా కాల్ చేసింది.
"ఏదో పెద్ద చేప పడిందన్నావు. వండటంలో నా సహాయం ఏమన్నా కావాలా?" అడిగింది గోముగా.
"వద్దులే.. నీ చేతులు ఎందుకు ఖరాబు చెయ్యడం? వేరే వాళ్ళ చేత వండించుకుంటాలే" అన్నాడు దాము.
"సరేలే! అన్నట్లు ఇందాక నా ఫ్రెండ్ లూసీ ఫోన్ చేసింది" చెప్పింది మోనా.
ఉలిక్కిపడ్డాడు దాము.
అతని కళ్ళ ముందు లూసీ అందమైన రూపం మెదిలింది.
ఆమె జాఫర్ భార్య.. తనంటే ఇష్టం చూపేది. అది తెలిసే ఆ జాఫర్ గాడు ఒక కేసులో తనను పోలీసులకు పట్టించ బోయాడు. అదృష్టం బాగుండి తను తప్పించుకున్నాడు. తన తప్పేమీ లేదని బుకాయించాడు జాఫర్. తను క్షమించలేదు. లూసీని తనకు ఎరగా వేసి తిరిగి తన గ్యాంగ్ లో చేరాలని చూసాడు జాఫర్. లూసీని చూసి తను టెంప్ట్ అయినా జాఫర్ చేసిన మోసాన్ని క్షమించలేక పోయాడు. అప్పట్నుంచి వాడిని దూరం పెట్టాడు తను.
"ఎందుకు చేసిందట?" అడిగాడు దాము.
"అదే.. ఆ జాఫర్ ఏ పనీ దొరక్క అల్లాటప్పాగా ఉన్నాడట. డబ్బులకు ఇబ్బందిగా ఉందట. నువ్వేదైనా సహాయం చేస్తే నీ ఋణం ఉంచుకోదట. అర్థమైందిగా" అంది మోనా అదోలా నవ్వుతూ.
'ఆ జాఫర్ గాడిని క్షమించమంటున్నావా.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ?' ఆవేశంగా అనబోయి బలవంతంగా తన మాటల్ని ఆపుకున్నాడు దాము. ఇప్పుడు తను చేయబోయే పనికి జాఫర్నే వాడుకుంటే..
ఇందాక శక్తి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
అందమైన భార్య ఉన్న అనుచరుడు.. పోయినా పరవాలేదు అనుకునే అనుచరుడు.. ఏ రకంగా చూసిన అందుకు జాఫర్ సరిగ్గా సరిపోతాడు. పైగా షూట్ చేయడంలో కూడా మంచి ఎక్స్పర్ట్.
కానీ అతను ఈ పనికి ఒప్పుకుంటాడా..
ఎందుకు ఒప్పుకోడు.. ఒప్పించేంత డబ్బు తను ఆఫర్ చేస్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. ఈ మిషన్ లో అతను దొరికిపోయినా చనిపోయినా లూసీ తన ఆధీనంలోకి వస్తుంది. ఆమెను మోనా లాగా కేవలం తనకే పరిమితం చేసుకోకూడదు. పెద్ద పెద్ద అధికారులకి ఎరగా వేయడానికి కూడా వాడుకోవచ్చు.
ఈ ఆలోచన వచ్చింది తడవుగా "వాళ్లను నమ్మవచ్చు అంటావా? అసలు లూసీ ఏం చెప్పిందో కరెక్ట్ గా చెప్పు" అన్నాడు దాము.
"అబ్బా.. చెప్పానుగా.. నీ రుణం ఉంచుకోదని. ఇంకా డైరెక్ట్ గా నా నోటితో చెప్పించుకోవాలని కోరికగా ఉందా" అంది కాస్త కోపంగా.
"కోపం వద్దు మోనా డార్లింగ్. నీ ప్లేస్ ఎప్పటికీ నీదే. సరే! ఆ జాఫర్ ను నన్ను వెంటనే డైరెక్ట్ గా కలవమని చెప్పమని లూసీతో చెప్పు" అన్నాడు దాము.
"అలాగేలే. లూసీని తన మాట మరిచిపోవద్దని కూడా గట్టిగా చెబుతాను" అంది మోనా నవ్వుతూ.
"అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు దాము.
మరో అరగంటకి దాముకు మునావర్ దగ్గరనుండి కాల్ వచ్చింది.
"అన్నా! జాఫర్ వచ్చిండు. అన్నీ చెక్ చేసినా. పంపనా?" అడిగాడు.
పంపమన్నాడు దాము.
లోపలికి వచ్చాడు జాఫర్.
అతన్ని కూర్చోమని కూడా చెప్పలేదు దాము.
దాము కోపాన్ని గ్రహించిన జాఫర్ మెల్లిగా అతని దగ్గరకు వచ్చి చేతులు జోడించాడు.
"నిజంగా ఆరోజు నేను మీ పేరు చెప్పలేదు దామన్నా. నీకెవరో నా గురించి తప్పుగా చెప్పి ఉంటారు. నా భార్య లూసీ 'దాము బావ ను మన ఇంటికి భోజనానికి పిలువు, ఇద్దరం అయన కాళ్ళ మీద పడి క్షమించమందాం' అని నాతో చాలా సార్లు చెప్పింది. నాకు ముఖం చెల్లక రాకపోవడంతో తానే మోనా అక్కకు ఫోన్ చేసింది. " మాటలు జాగ్రత్తగా పేర్చి మాట్లాడాడు జాఫర్.
మనసులోనే నవ్వుకున్నాడు దాము.
లూసీ తనను బావ అన్నట్లు చెప్పడం, తన మోనాను జాఫర్ అక్క అని వరస కలపడం..
ఖుషీగా ఫీలయ్యాడు దాము. అప్రయత్నంగా మీసం మెలేసాడు. తన మీసం గురించి మోనా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. లూసీ అయితే ఏమంటుందో..
అప్రయత్నంగా జాఫర్ ముఖంలోకి చూసాడు దాము. చేతులు కట్టుకుని అమిత వినయంగా తనవైపే చూస్తున్నాడతను.
'ఒకవేళ తను ఈరోజే భోజనానికి వస్తానంటే స్వయంగా తనను తీసుకొని వెళ్లి, ఏదో పనున్నవాడిలా బయటకు వెళ్లి లూసీని తనకు అప్పగిస్తాడు. కాబట్టి ఈ మిషన్ లో వీడు చావకున్నా తనకు అడ్డురాడు. కానీ ఇప్పుడు ప్రతి గంటా విలువైంది. '
ఆలోచనలు కట్టి పెట్టి జాఫర్ ను కూర్చోమన్నాడు.
"చూడు జాఫర్! చెయ్యాల్సిన పని చెబుతాను. జాగ్రత్తగా విను. ఎస్పీ దీక్షిత్ ను అతని ఇంట్లోనే షూట్ చెయ్యాలి. " చెప్పాడు.
"దీక్షిత్ సార్ నా! అదీ ఇంట్లోనా.. " నిర్ఘాంతపోయాడు జాఫర్.
"డ్యూటీలో ఉన్నప్పుడు అయన దగ్గర రివాల్వర్ ఎప్పుడూ ఉంటుంది. పక్కనే పోలీసులు ఉంటారు. ఇంట్లోనే కాస్త ఫ్రీగా ఉంటాడు. నిన్ను లోపలికి తెలిసిన మనిషి తీసుకొని వెళ్తాడు. అవకాశం చూసి ఆయన్ని షూట్ చెయ్యి. కాంపౌండ్ వాల్ వెనుకవైపు నుండి బయటకు దూకు.
అక్కడ వెహికల్ రెడీగా ఉంటుంది. అది ఎక్కి తప్పించుకో. వాళ్ళు చెప్పిన ప్లేసులో ఒక వారం ఉండు. తరువాత ఊరు వదిలి వెళ్ళిపో. " చెప్పాడు దాము.
"అంటే నేనెవరో తెలిసిపోతుంది కదా" భయంగా అడిగాడు జాఫర్.
"మేకప్ కోసం మనిషిని ఏర్పాటు చేస్తాను. గుండు గీకి మీసాలు తీసేస్తాడు. నీది చప్పిడి ముక్కు కదా. పొడవైన ముక్కు పెడతాడు. కాస్త నడక మార్చుకుని వెళ్ళు. ఎందుకైనా మంచిది.. వారం రోజులు దాక్కున్నాక వేరే ఊరికి వెళ్ళు. నీ మీద అనుమానం రాకుంటే తరువాత తిరిగి వద్దువు గానీ. అయన ఇంట్లో సీసీ కెమెరాలు లేవు. గేట్ దగ్గరా, ఇంటి వరండాలో మాత్రం ఉన్నాయి. అక్కడ ముఖానికి మాస్క్ వేసుకొని తల దించుకొని నడువు" చెప్పాడు దాము.
"ఒక వేళ నేనే చేశానని తెలిస్తే?" అడిగాడు జాఫర్.
"కోటి రూపాయలు.. " అన్నాడు దాము.
అర్థం కాలేదు జాఫర్ కు.
"నీ లైఫ్ లో నువ్వు తీసుకున్న పెద్ద సుఫారి పది లక్షలు. ఇప్పుడు నేను ఇవ్వబోయేది కోటి రూపాయలు. కొద్ది రోజులు దాక్కుంటే వేరే దేశం వెళ్ళడానికి వేరే పేరుతొ పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తాను. నీ భార్యను అక్కడికి క్షేమంగా చేరుస్తాను. అక్కడ నాకు తెలిసిన గ్యాంగ్ లో ఏదైనా పని ఇప్పిస్తాను. ఇవన్నీ నువ్వు హత్య చేసినట్లు బయట పడితేనే. లేకుంటే ఆ కోటి రూపాయలతో ఇక్కడే దర్జాగా బతకవచ్చు" ఊరించాడు దాము.
"ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా" అన్నాడు జాఫర్.
"పనయ్యాక మరో పది లక్షలు కలిపి ఇస్తానులే. " హామీ ఇచ్చాడు దాము.
"చాలా థాంక్స్ అన్నా. నేను హైడింగ్ లో ఉన్న వారం రోజులూ నా భార్యను నీ అడ్డాలో ఉంచి కాపాడన్నా" అన్నాడు జాఫర్.
"చ చ.. మనవాళ్ళ కంట్లో లూసీని ఎందుకు పడెయ్యడం.. మోనా ఫ్రెండ్ కదా.. తన ఇంట్లో ఉంచుకోమని చెబుతాను. సరే.. నువ్వెళ్లు. మేకప్ మాన్ తో నిన్ను కలవమని చెబుతాను" అన్నాడు దాము.
మరోసారి థాంక్స్ చెప్పి బయటకు నడిచాడు జాఫర్.
'వలలో పడింది బలికాబోయే చేప' అనుకుంటూ శక్తికి కాల్ చేసాడు దాము.
బయటకు వెళ్లిన జాఫర్ కూడా 'వలలో పడింది పెద్ద చేప' అనుకుంటూ ఎవరికో కాల్ చేసాడు.
***
రంగాను ఉంచిన చోటికి వచ్చాడు కానిస్టేబుల్ మధు.
అక్కడ కాపలా ఉన్న కానిస్టేబుల్ తో "ఏమంటున్నాడు వీడు.. ఏమన్నా చెప్పాడా?" అని అడిగాడు.
"ఏమీ చెప్పలేదన్నా" అన్నాడు ఆ కానిస్టేబుల్. మధు సైగ చేయడంతో "బయటకు వెళ్లి ఒక్క దమ్ము లాగించి వస్తానన్నా. కాస్త జాగ్రత్త. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు" అంటూ బయటకు నడిచాడు.
అదను కోసం చూస్తున్న రంగా "మధు సార్. చిన్న హెల్ప్ చేయాలి" అన్నాడు.
"కుదరదబ్బా. ఆ టీ కొట్టు బషీర్ ను పోలీసులు ఇప్పుడే విడిచి పెట్టారు. అయినా నీకోసం ట్రై చేస్తాను. ఈసారి డబల్ పేమెంట్ ఇవ్వాలి" అన్నాడు మధు.
"సరే అన్నా. నీ సహాయం మరచిపోను" అన్నాడు రంగా.
ఇంతలో బయటకు వెళ్లిన కానిస్టేబుల్ తిరిగి వచ్చాడు.
"వీడు వాష్ రూమ్ వెళ్ళాలట. నేను తీసుకొని వెళ్తాలే" అన్నాడు మధు.
"జాగ్రత్త మధు సర్! వీడసలే కేటుగాడు" అన్నాడు ఆ కానిస్టేబుల్.
మధు, రంగాను బయటకు తీసుకొని వెళ్తూ దారిలోనే బషీర్ కు కాల్ చేసాడు.
వాష్ రూమ్స్ పక్కనున్న చెట్టు కింద కూర్చున్నాడు. రంగాను కూడా కూర్చోమన్నాడు కానీ అతడు కూర్చోలేదు.
కొద్ది సేపట్లోనే బషీర్ ఒక సిగిరెట్ పాకెట్ తీసుకొని వచ్చి చెట్టు చాటుకు వెళ్లి రంగాను పిలిచాడు.
రంగా రాగానే ఆ పాకెట్ లోనుంచి ఒక సన్నటి మొబైల్ బయటికి తీసి రంగాకు అందించి "తొందరగా కానివ్వు. నిఘా ఉంది" అన్నాడు.
రంగా, మునావర్ కు కాల్ చేసాడు.
మునావర్ లిఫ్ట్ చెయ్యగానే "అన్నా! కిషన్, ఫయాజ్ లు అన్న పేరు బయట పెట్టేట్లు ఉన్నారు" అన్నాడు.
మునావర్ మాట్లాడుతూ "వాళ్లకు అన్నెవరో తెలీదు. ఫోన్ లోనే కాంటాక్ట్. వాళ్లకు తన పేరు జాఫర్ అని చెప్పాడు. నిన్ను కూడా ఎక్కువ టార్చర్ పెడితే జాఫర్ పేరు చెప్పు. ఖేల్ ఖతమవుద్ది" అన్నాడు.
"పోయినసారి బషీర్ కు పేమెంట్ కోసం అన్న పేరు చెప్పాను. " అన్నాడు రంగా.
"గుర్తుంది. ఫోన్ ఆ బషీర్ కి ఇవ్వు" అన్నాడు మునావర్.
"చెప్పు భాయ్" అన్నాడు బషీర్.
"నేనిప్పుడు జాఫర్ మనిషిని. ఎవరడినా అలానే చెప్పు. నేనేం చేసినా దాము సార్ కి సంబంధం లేదు. అర్థమైందిగా" అన్నాడు మునావర్.
"అలాగే అన్నా. పేమెంట్ పోయినసారి లాగే పంపండి" అని కాల్ కట్ చేసి ఫోన్ జేబులో పెట్టుకున్నాడు బషీర్.
రంగా హుషారుగా మధు దగ్గరకు వచ్చి "ఇక వెళదాము సార్. చాలా థాంక్స్. మీ పేమెంట్ కూడా బషీర్ దగ్గరకు చేరుతుంది" అన్నాడు.
అతన్ని తిరిగి లోపలికి తీసుకుని వెళ్లి కానిస్టేబుల్ కి అప్పగించాడు మధు.
తరువాత బయటకు వెళ్లి బషీర్ దగ్గర ఆ మొబైల్ కలెక్ట్ చేసుకుని మురళికి అందించాడు.
దీక్షిత్, మురళిలు ఆ మొబైల్ లో ఉన్న వాయిస్ రికార్డింగ్ ను విన్నారు.
=========================================================
ఇంకా ఉంది
అపరాధ పరిశోధన - పార్ట్ 10 త్వరలో..
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.