top of page

సవాళ్ళ సాగరంలో స్వాతిముత్యం

#SavallaSagaramloSwathimuthyam, #సవాళ్ళసాగరంలోస్వాతిముత్యం, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Savalla Sagaramlo Swathimuthyam - New Telugu Story Written By Dr. Brinda M N

Published In manatelugukathalu.com On 12/05/2025

సవాళ్ళ సాగరంలో స్వాతిముత్యం - తెలుగు కథ

రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.


 పచ్చని పంట పొలాల మధ్య గలగల పారే సెలయేరులో రామనారాయణులు ఆడుతూ, పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ, బడికిపోతూ జీవనం సాగిస్తూ ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి, పెరిగి పెద్దవారై ఒకరు ప్రభుత్వ, మరొకరు ప్రైవేటు సంస్థలలో కొలువు సంపాదించారు. 


యుక్త వయసు రాగానే రాముడు జానకితో కలిసి ఒక ఇంటివాడయ్యాడు. తల్లిదండ్రులు కాలం చేయడంతో తమ్ముని బాధ్యత పూర్తిగా తీసుకోవలసి వచ్చింది. నారాయణ కూడా అన్నావదినలను భక్తితో ఆరాధిస్తూ, అన్నమాటే వేదంగా భావించేవాడు. కష్టం ఫలించకపోవునా? నారాయణ ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయుడుగా ప్రభుత్వ కొలువు సంపాదించాడు. 


పొట్టివాడు, బహు గట్టివాడు, ఎర్రని ఆపిల్ పండులాంటి నారాయణపై ఎంతమంది దృష్టి పడేదో, ఆ, పల్లెటూరిలో. ఒకసారి తనకు వరసైన వారి బంధువుల అమ్మాయి "ఏంటి మామ! నన్ను మనువాడుతావా? పనికి పోతున్నావట కదా, మరి ఆడమనిషి తోడు కావాలి కదా, నువ్వు ఒప్పేసుకుంటే చేసుకుందాం." అంది. 


"అన్నావదిన, మీ అమ్మానాన్న ఒప్పుకోవాలిగా. " నారాయణ జవాబు. 


"ఆ, చదువుకున్నవాడివి, మనిద్దరం కలిసి ఉండాల్సినోళ్లు. వాళ్ళు ఒప్పుకోకపోయినా మనం చేసుకుందాం. " అంది చిన్నది. 


"వద్దు, పెద్దల అంగీకారం లేనిదే ఏ పని చేయకూడ”దని వారించాడు నారాయణ. 


మూడు నెలల అనంతరం నారాయణ పనిచేస్తున్న పాఠశాలలోని ఒక ఉపాధ్యాయురాలు పెళ్లి ఊసెత్తింది. "నారాయణగారు, గత ఆరు నెలలుగా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నా. మీ నడవడిక, మంచితనం, గాంభీర్యం, విలువలు ఇంకా ఎన్నో సులక్షణాలు గల మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకున్నాను, అది మీరు ఒప్పుకుంటే. "


"చూడండి! నా బాధ్యతను అన్నావదిన తీసుకున్నారు, వారి బాటలో నడవడమే శ్రేయస్కరం, వారి మర్యాదకు, గౌరవానికి నేను ఆటంకం కలిగించను. ఈ సమాధానం వలన మీకు బాధ కలిగి ఉంటే క్షమించండి. " వినమ్రంగా సెలవిచ్చాడు నారాయణ. 


"ఫర్వాలేదండి" అంది ఆమె. 


నారాయణ ఇంకా మంచిగా ప్రభుత్వ కొలువులో స్థిరపడడానికి ఉన్నత విద్యను కూడా అభ్యసిస్తూ ఉండేవాడు. 


"ఈ పుస్తకాల పురుగుకు పెళ్ళాం ఎక్కడ దొరుకుతుంది?"


"ఆ, ఈ ముదురు బెండకాయకు పిల్లనెవరిస్తారు?"


ఇలా ఇరుగుపొరుగు వారి మాటలు జానకి మనస్సును తొలచి వేశాయి. ఇక మనము నారాయణకు సంబంధాలు చూద్దాం, ఇది ఒక సవాలుగా తీసుకోవాలి, అని చెప్పింది భర్తతో. 


"జానకి! నువ్వు చెప్పింది సబబే, వయసు కూడా మీదపడుతోంది. సరే ప్రయత్నిద్దాం”

***

రెండేళ్ల తర్వాత ఒక శుభముహూర్తాన నారాయణ, నీలిమతో కలిసి ఒక ఇంటివాడయ్యాడు. వదిన బాధ్యతను దించేసుకుంది. 


క్రొత్త కాపురంలో చిగురాశలు తొణికిసలాడడం సహజమే. ఆరు నెలల పిదప కొద్ది కొద్దిగా అర్థమవుతూంది నారాయణకు. వారి ప్రణయ వీణలో రాగాలన్నీ మూగబోతున్నాయని. నీలిమ తల్లిదండ్రులను నిలదీశాడు. లాభం లేదు. ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఫలితం శూన్యం. 


సరే, నమ్ముకుని వచ్చిన వారిని ఆదరించడం మన ధర్మమని తనకు తానే సమాధానం చెప్పుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక లోకరీతి ఎరుగని వారెవ్వరు? ఐదేళ్లయినా నీలిమ కడుపు పండనే లేదు. 


"ఈ వెంగళప్పకు వద్దన్నా పెళ్లి చేశారు చూడు! ఇప్పుడు పిల్లా జల్లా లేక.." బంధువుల హోరు..


"వంశం నిర్వీర్యమై పోవాల్సిందేనా నాయన?" ముసలివారి పోరు..


చుట్టూ ఉన్న వారి మాటలు గుండెల్లో బాకుల్లా గుచ్చుతుంటే తల్లిడిల్లి పోయాడు నారాయణ. కచ్చితంగా పిల్లలు కలుగుతారు మాకు అని సవాలు విసిరాడు. ఇక తప్పనిసరియై వైద్యశాలలకు విపరీతంగా, విరామం లేకుండా సందర్శిస్తూ ఉండేవారు దంపతులిరువురు. 


ఎక్కడకి పోయినా చెప్పులు అరిగిపోవటమే కానీ ఫలితం కనిపించట్లేదు. సంకల్పం గొప్పదైనప్పుడు దివ్యశక్తులు కూడా దిగి రావాల్సిందే. అనుకోకుండా ఓ రోజు ఆకాశంలో తారాజువ్వలా ప్రసిద్ధి చెందిన గైనకాలజిస్ట్ను కలవడం, ముప్పై ఏళ్ల క్రితమే అధునాతన సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అమలుపరచడం, తత్ఫలితంగా నీలిమ గర్భం దాల్చడం, వెనువెంటనే ముత్యాల్లాంటి అక్షిత, అచ్యుత్ జన్మించటం. కాకతాళీయంగా జరిగిన సంఘటన చూసి అమ్మలక్కలు, బంధువులు, సవాలు విసిరిన వాళ్ళు, నోరెళ్ల పెట్టక తప్పలేదు మరి!


ఉన్నత విద్యను అభ్యసించిన నారాయణ ప్రభుత్వ సంస్థలో మంచి కొలువు సంపాదించాడు. మితిమీరిన శ్రమకు గురి కావటం వలన నీలిమ ఆరోగ్యం కొద్దిగా మందగించింది. నారాయణ ద్విపాత్రాభినయానికి శ్రీకారం చుట్టాడు. తల్లి తండ్రి ఇరువురు తానై పిల్లలే లోకంగా, బిడ్డల భవిష్యత్తే ధ్యేయంగా, కంటికి రెప్పలా పెంచసాగాడు. 


కాలప్రవాహంలో జరగాల్సినవి జరగక మానవు. నారాయణ పని చేస్తున్న సంస్థలోనికి అప్పుడప్పుడే నూతనంగా కొలువులో చేరిన శ్రేష్ఠ బదిలీపై వచ్చింది. పని కొత్త కావడం వలన కార్యాలయానికి సంబంధించిన పనిలోని మెలకువలను నారాయణతో నేర్చుకోమని అధికారులు శ్రేష్ఠను ఆదేశించారు. వయసురీత్యా పెద్దవారు, గురుస్థానంలో ఉన్నవారు కనుక శ్రేష్ఠ గురువుగారంటూ సంబోధిస్తూ ఉండేది. 


"గురువుగారు! ఈ డాక్యుమెంట్ను ఇక్కడ వరకు తయారు చేశానండి. తర్వాత బోధపడట్లేదు. కాస్త వివరించండి. " శ్రేష్ఠ వినయంగా అడిగింది. 


"శ్రేష్ఠగారు! ఇప్పుడు నేను అతి ముఖ్యమైన ఫైలు చూస్తున్నాను. ఇది చాలా అవసరం. వీలు చూసుకుని చెప్తాను. అంతలోపల వేరే ఫైల్లు, డాక్యుమెంట్లు సరి చూసుకోండి. " నారాయణ జవాబు. 


చిన్నతనం, మొండితనం, అమాయకత్వం నిస్వార్థం, రంగరించుకున్న మంచి మనసు శ్రేష్ఠది. రెండు వారాలైనా నారాయణ క్యాబిన్లోకి తొంగి చూడట్లేదంటే ఒట్టండి. అప్పుడు ఉన్నపలంగా అధికారులు శ్రేష్ఠ తయారు చేసిన డాక్యుమెంట్ తీసుకురమ్మన్నారు. 


"సర్, మే ఐ కమ్ ఇన్. "


"ఎస్, రండి. "


డాక్యుమెంట్ పరిశీలించిన అధికారులు ఇందులో కొద్దిగా సవరణలు చేయాలండి. "ఏంటి, మీరు నారాయణ గారి సూచనలు తీసుకోలేదా?" ప్రశ్నించారు. 


"నారాయణ గారు అత్యవసర ఫైలులో బిజీగా ఉన్న కారణంగా నేను సంప్రదించలేదండి, క్షమించండి. త్వరగా సరిచేసి తీసుకొస్తా. " శ్రేష్ఠ సమాధానం. 


ఈ తతంగమంతా శ్రేష్ఠ డాక్యుమెంట్ కంటే ముందుగా చూడాల్సిన ఫైల్ నారాయణతో ఉండడం కారణంగా ఆయనను క్యాబిన్లోనికి పిలవడం, పరిశీలించి వెనుకభాగంలో కూర్చోబెట్టడం జరిగినది. ఈ సన్నివేశాన్ని చూసిన నారాయణ ఒక్కసారిగా శ్రేష్ఠ నిజాయితీ, తన తప్పు లేకపోయినా క్షమాపణ కోరడం, కాస్త, మనసుకు బాధ కలిగించాయి. 


మరుసటి రోజే శ్రేష్ఠను తన క్యాబిన్లోనికి ఆ డాక్యుమెంట్ తీసుకురమ్మని కబురు పెట్టాడు నారాయణ. 


"గురువుగారు! అనుమతిస్తే లోనికి వస్తాను. " 


"శ్రేష్ఠగారు! ఏంటి నిన్న మీరు చేసిన పని? ఆ డాక్యుమెంట్ పూర్తి కాకపోవడానికి కారణం నా అలసత్వం, మతిమరపుతనం. కానీ అది మీపైన మోపుకోవడం భావ్యం కాదు కదా!" 


"గురువుగారు! మనకు చేతకానప్పుడు ఆ తప్పుని ఇంకొకరిపై వేయటం సమంజసం కాదు కదండీ, పైగా మీరు అహర్నిశలు పనిలో నిమగ్నమై ఉంటారు. "


ఇలా అనేక సందర్భాలలో వారిరువురూ ఒకరిపై ఒకరు మంచి అభిప్రాయం, గౌరవభావం ప్రకటించుకునేవారు. తర్వాత శ్రేష్ఠ ప్రమోషన్ వచ్చి వేరే చోటికి వెళ్లిపోయింది. అత్యవసర డాక్యుమెంట్ నిమిత్తం పాత కార్యాలయానికి రావలసి ఉంది, కానీ వెనువెంటనే ముఖ్యమైన సమావేశానికి హాజరు కావాల్సి ఉండడం చేత నారాయణకు ఫోన్ చేసి ఫలానా సమయానికి రైల్వేస్టేషన్కు వచ్చి ఆ డాక్యుమెంట్ని అందించమని చెప్పింది శ్రేష్ఠ. 


సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో కూతురితో సహా డాక్యుమెంట్ తీసుకొని వచ్చాడు నారాయణ. 


"నమస్తే! మేడం"


"నమస్తే! మా, నీ పేరేంటి"


"అక్షిత"


"వావ్ ! చాలా మంచి పేరు. ఏం చదువుతున్నావ్? నీ లక్ష్యం ఏంటి? ఇలా కుశల ప్రశ్నలు అడుగుతోంది శ్రేష్ఠ, అక్షితను. 


అంతలో నారాయణ, " అమ్మా! మేడం పెద్ద ఆఫీసర్, అయినా ఎంత సింపుల్ గా ఉందో చూడు. ఎంత ఎదిగినా ఇలా ఒద్దికగా ఉండడమే శ్రేయస్కరం. నీవు కూడా భవిష్యత్తులో మేడంను అనుసరించాలి. " 


"అలాగే, నాన్నగారు. "


డాక్యుమెంట్ తీసుకొని ధన్యవాదాలు తెలిపి అక్షితను ఆశీర్వదించి కదిలింది శ్రేష్ఠ. 


అక్షిత, అచ్యుత్ మాధ్యమిక విద్య, ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నారాయణ నిరంతర తర్ఫీదు, ప్రతి అడుగులో మెలకువలు నేర్పించడం, పిల్లలు కళ్ళ ముందుండాలన్న భావనతో కావలసిన మెటీరియల్ను తెప్పించడం, భవిష్యత్తుకు బంగారు బాట వేయడం వలన పిల్లలిద్దరూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో కొలువు సంపాదించారు. 


ఆ, ఈ కాలంలో ఉద్యోగాలు అంత సులభంగా రావు. ఇతర రాష్ట్రాలకెళ్ళి కోచింగ్ తీసుకున్న వారే వీధుల వెంబడి తిరుగుతున్నారు. ఇక ఇంట్లో కూర్చుని చదివేవారు ఏం ఉద్యోగాలు వెలగబెడతారని ఆడిపోసుకున్న వాళ్ళ నోటికి తాళం వేశాడు నారాయణ సవాలు విసిరి. ఐదేళ్ల అనంతరం అత్యవసర సమావేశమై రాజధానిలోని తమ కార్యాలయానికి వెళ్ళిన శ్రేష్ఠ, నారాయణను అక్కడ అలా చూసి నివ్వెర పోయింది. 


ఆరా తీయగా ప్రమోషన్ మీద ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చారని తెలిసింది. తన ప్రయాణానికి మూడు గంటల వ్యవధి ఉండడం చేత శ్రేష్ఠ, నారాయణ తమ కష్టనష్టాలు, జీవితంలో అనుభవాలు, నేర్చుకున్న గుణపాఠాలను పంచుకున్నారు. 


ధూమశకటం దరువేయగా కొద్దికొద్దిగా దూరంగా కనపడుతున్న నారాయణను చూసి శ్రేష్ఠ మదిలో మెదిలిన వాక్యం, "జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఆటుపోట్లను అధిగమించి, విజేతగా నిలచి సవాళ్ళ సాగరంలో స్వాతిముత్యంగా మెరిసిన నారాయణ గారు గురువుగా లభించటం ఎంతటి అదృష్టం. " ఆనందభాష్పాలతో ప్రయాణాన్ని కొనసాగించింది శ్రేష్ఠ. 


"జై తెలుగుతల్లి! భారతమాతకు జై"


 సమాప్తం


డాక్టర్ బృంద ఎం. ఎన్.  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.

 

కవయిత్రి, రచయిత్రి, గాయని,

స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి

15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట

భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.


 


Comments


bottom of page