శత్రుదేశానికి శరాఘాతం
- Rayala Sreeramachandrakumar
- May 12
- 4 min read
#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #Sathrudesaniki Saraghatham, #శత్రుదేశానికి శరాఘాతం, #TeluguArticleOnTerrorism

Sathrudesaniki Saraghatham - New Telugu Article Written By R C Kumar
Published In manatelugukathalu.com On 12/05/2025
శత్రుదేశానికి శరాఘాతం - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం మరియు భారతదేశంలో మత సామరస్యాన్ని చెడగొట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్ లో అమాయక పర్యాటకులపై చేసిన మారణకాండకు ప్రతీకారంగా జరిపిన ఆపరేషన్ సింధూర్ భారత జాతికే గర్వకారణం. ఆ దెబ్బకు సుమారు వందమంది ఉగ్రవాదులు హతం కావడంతో మొదలైంది భారతదేశ జైత్రయాత్ర. దీనికి ప్రతిచర్యగా సుమారు15 ప్రాంతాలలో మన వైమానిక రక్షణ వ్యవస్థను టార్గెట్ చేసిన పాకిస్తాన్ ప్రయత్నాలను మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్-400 అనే శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థను ఉపయోగించి శత్రుదేశం ప్రయోగించిన ద్రోణ్ లను, శతజ్ఞులను మన సైన్యం తునాతనకలు చేశారు.
ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ కమాండ్ సిస్టమ్ (IBCS) ద్వారా సెన్సార్లతో కూడిన నెట్వర్క్ సహాయంతో యుద్ధంలో మన సామర్థ్యాన్ని మరింత బలంగా ఉపయోగించి శత్రుబలగాలను ఎదుర్కోవడం జరిగింది. మన సైనికులు అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మాస్త్రం లాంటి బ్రహ్మోస్ క్షిపణులను ఇంకా పూర్తిస్థాయిలో ఉపయోగించలేదు. పాకిస్తాన్ కు సంబంధించిన మూడు ఫైటర్ జెట్లను కూల్చివేయడం, లాహోర్ కరాచీలలో వారి సైనిక, నావిక స్థావరాలకు తీవ్ర నష్టం కలగడం వారికి పెద్ద షాక్.
ప్రత్యక్షంగా ఎదుర్కోలేక శత్రుదేశం అన్యాయాలకు, ఆగడాలకు తెరతీసింది. మోసపూరిత పద్ధతులను ఉపయోగించడం ద్వారా దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తూనే ప్రపంచ దేశాల మద్దతు పొందాలని చూస్తున్నారు పాకిస్తాన్ మిలిటరీ పాలకులు. యుద్ధంలో ఇప్పటివరకు మనదే పైచేయిగా కొనసాగుతున్న తీరును జీర్ణించుకోలేక భారతదేశాన్ని తప్పుపడుతూ నకిలీ మరియు పాత వీడియోలను ఇతర దేశాలకు పంపుతున్నారు. సరిహద్దుల్లో మన పౌర స్థావరాలపై ద్రోణ్ లతో దాడి చేసి భయభ్రాంతులను సృష్టిస్తున్నారు. సరిహద్దు కాల్పులతో రెచ్చగొడుతూ మన సరిహద్దు భద్రతా దళాల దృష్టి మరల్చి తీవ్రవాద ముఠాలను మనదేశంలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కరాచీ లాహోర్ లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో పౌర విమానాలను ఉంచి వాటిని కవచంగా ఉపయోగిస్తూ పకడ్బందీగా జరుగుతున్న భారత్ దాడులను ఆపుకుంటున్నారు.
దొంగే దొంగ, దొంగ అని అరిచినట్టుగా గురుద్వారాలపై దాడిచేసి ఆ నెపాన్ని భారతదేశ సైనికులపై నెట్టుతున్నారు. అంతర్జాతీయ సమాజానికి తప్పుడు సమాచారాన్ని పంపుతూ వారి మద్దతుకై ప్రాధేయ పడుతున్నారు. ఆదినుండి ఇటువంటి నీచ ప్రవృత్తి వారి నర నరాల్లో జీర్ణించుకుపోయింది. సైనిక, ప్రభుత్వ వ్యూహాలకు, దేశభద్రతకు సంబంధించిన కీలక విషయాలపై సంపూర్ణ అవగాహన లేకుండా భావోద్వేగాలతో పత్రికా ముఖంగా విమర్శలు చేయడం భావ్యం కాదు.
తీవ్రమైన యుద్ద వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఊహాజనిత వ్యాఖ్యలతో మరియు నకిలీ చిత్రాలతో యుద్ధరంగానికి సంబంధించి పోస్ట్ చేస్తున్న వీడియో క్లిప్‌లను అనుసరించడం, ప్రచారం చేయడాన్ని నెటిజన్లు మానాలి. అనధికార వార్తలతో తప్పుదారి పట్టించే తాడు బొంగరం లేని టీవీ చానల్స్ చూడకపోవడమే మేలు. హైదరాబాద్ పాతబస్తీలో ఉగ్రవాదులకు సహకరించే 20వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని, ఫైనాన్షియల్ సిటీ పైన దాడి జరగవచ్చన్న అనధికార వార్తలను ఒక టీవీ ఛానల్ ఈ మధ్యనే ప్రసారం చేసింది. విశ్వసనీయమైన సమాచారలోపంతో ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించడం సరికాదు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వశపరచుకోవడానికి ఇదే సరైన సమయం అంటూ కొందరు, మొత్తం పాకిస్తాన్ దేశాన్ని మనదేశంలో కలుపుకోవాలి అని ఇంకొందరు, అలా కాదు ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అనేది లేకుండా రూపుమాపాలని మరికొందరు ఇలా ఎవరికివారు వారిలో ఉప్పొంగే భావోద్వేగాలను వ్యక్తీకరించుకుంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది ఎంత మటుకు సబబు ? చేయవలసిందేదో చేయవలసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా, మనకెందుకు అనవసర ఆరాటం. సైనికుల విరోచిత పోరాటానికి సంఘీభావం తెలపడమే మన ప్రస్తుత కర్తవ్యంగా గుర్తించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎటువంటి అడ్డంకులు లేకుండా అంగరంగ వైభవంగా మిస్ వరల్డ్ పోటీలను జరిపించే లక్ష్యంతో చేసిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ విధంగా తెలంగాణ ఔన్నత్యాన్ని, ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయవచ్చని ప్రభుత్వ అభిలాష. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఈ విషయంపై పునరాలోచించడం కూడా అవసరం. భారత పౌరులందరూ ఏకతాటిపై నిలిచి ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైన్యానికి అండగా నిలబడవలసిన ఈ కీలక సమయంలో అందాల పోటీలు జరిపితే జాతికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నట్టు. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ఇప్పటికే ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లను తాత్కాలికంగా నిలిపివేయడం మనకు తెలిసిందే. అందాల పోటీల నిర్వహణపై ప్రభుత్వ పెద్దలు పెద్ద మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ విషయంపై బజరంగ్ దళ్ నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దౌత్య పరంగా ప్రపంచ దేశాలను విశ్వాసంలోకి తీసుకుంటూ ఉగ్రవాద దేశానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడంలో నేర్పుగా వ్యవహరిస్తున్న విదేశాంగ మంత్రిత్వశాఖ పాత్ర అభినందనీయం. ప్రస్తుతానికి మాటలకే పరిమితమైన చైనా, ప్రత్యక్షంగా టర్కీ తప్ప పాకిస్తాన్ కు సహకరించడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధంగా లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు కూడా ఇరుదేశాల యుద్ధ వాతావరణంతో మాకు సంబంధం లేదు అనే సంకేతాన్ని ఇచ్చినా కాల్పుల విరమణ మాతోనే సాధ్యపడింది అని ట్రంప్ చాటుకున్నారు. పాక్ అమ్ములపొదిలో ఉన్న న్యూక్లియర్ ఆయుధాలను విచక్షణారహితంగా ప్రయోగించడానికి ఎలాగూ వీలు కాదు. వాటి వాడకంపై అంతర్జాతీయ స్థాయిలో అనేక నిబంధనలు, ఆంక్షలు ఉన్నాయి.
మొదటినుండి పక్కలో బల్లెంలా ఉంటున్న పాకిస్తాన్ దాయాది దేశం కాదు శత్రు దేశమే అని పక్కాగా నిరూపించుకుంది. సహించినంతకాలం సహించాము. ఇక తాడోపేడో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. దేశ భద్రత, ఐక్యత, సమగ్రత సార్వభౌమాధికారం విషయంలో రాజకీయాలకు తావులేదు అందరం ఐక్యంగా ఉంటాం అని చెప్పడమే కాదు అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం నిరూపించాయి. ప్రస్తుతానికి మతవిద్వేషాలను రెచ్చగొట్టకుండా సంయమనం పాటిస్తూ పూర్తిస్థాయిలో ప్రభుత్వం చేపట్టే చర్యలకు సంఘీభావాన్ని తెలుపుతూ, ఐక్యతను ప్రదర్శిస్తూ వీర సైనికుల భద్రత, సంక్షేమం కోసం మనమందరం ఆ దేవదేవుణ్ణి ప్రార్థించాలి.
శత్రు దేశ అభ్యర్థనను, అమెరికా సలహాను మన్నించి భారతదేశం తాత్కాలికంగా కాల్పులను మాత్రమే విరమించిందే కానీ ఇప్పటికే విధించిన ఆంక్షలను వేటిని సడలించలేదు. కాల్పుల విరమణ తాత్కాలికం, ఉగ్రవాద నిర్మూలనే మన అంతిమ ధ్యేయం. ఇరుదేశాల డిజిఎంఓ లు జరిపిన చర్చల ఫలితాలు ప్రభావాలపై ఊహాగానాలు కూడా ఈ సమయంలో తగదు. శ్రీరస్తు విజయోస్తు
ధన్యవాదాలు
ఆర్ సి కుమార్
సామాజిక వేత్త
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
Comentarios