పాపం పరమేశ్
- Sudha Vishwam Akondi
- May 12
- 3 min read
#SudhavishwamAkondi, #PapamParamesh, #పాపంపరమేశ్, #సుధావిశ్వంఆకొండి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Papam Paramesh - New Telugu Story Written By Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 12/05/2025
పాపం పరమేశ్ - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
పరమేశ్ తన ఎంబీబీఎస్ అవ్వగానే తండ్రితో...
"నాన్నా! నేను ఒక పల్లెటూరుకు వెళ్లి, పేదలకు ఉచిత వైద్యం చేయాలని అనుకుంటున్నాను మీరు కొంత డబ్బు ఇస్తే వెళ్తాను నా ఆశయసాధనకు" అన్నాడు.
"పేదలకు ఉచితంగా వైద్యం చేయాలనుకుంటే పల్లెటూరుకు వెళ్లడం ఎందుకురా? సినిమాలో చూపించినట్లుగా పల్లెటూళ్ళు ఉండవు. పేదవాళ్లు అక్కడా, ఇక్కడా కూడా వుంటారు. ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ ఉంది. ఉచిత వైద్యం అందించాలనే నీ ఆశయం మంచిదే! కానీ అలా తెలియని చోటుకు వెళ్లి, కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. ఎవరైనా డబ్బులు లేని పేదలు అవసరంతో వస్తే ఇక్కడే ఉచితంగా వైద్యం చేద్దువుగానీ! మీ తాతగారి కాలం నుంచి మేము చేస్తున్నది అదే కదా! " అన్నాడు డాక్టర్ అయిన తండ్రి.
"లేదు నాన్నా! నేను కొద్దిరోజులన్నా వెళ్లి వస్తాను! ఎంతో మంచి పేరు తెచ్చుకుంటాను. టీవీల్లో కూడా వస్తుంది చూడు నా పేరు"అన్నాడు పరమేశ్ ఊహల్లో తేలిపోతూ
ఎంత చెప్పినా వినకపోయేసరికి, సరేనని పంపించాడు తండ్రి.
#####
పరమేశ్ ఆ ఊరుకు వచ్చి పది రోజులు అయ్యింది. అందరు ఊళ్ళో ఏమి రోగం వచ్చినా పరమేశ్ దగ్గరకు వస్తున్నారు. ఇన్నాళ్లు అక్కడ ఉన్న ఆ ఊరి డాక్టర్ అయిన గిరికి పరమేశ్ రాక కంటకంగా మారింది.
చిన్న రోగానికి కూడా ఏదో అయిపోయిందని టెన్షన్ పడుతూ వచ్చే రోగులు పెరిగారు. ఎలాగో ఫ్రీ నే కదా అనుకుంటూ వచ్చేవాళ్లే ఎక్కువ మంది.
"ఇంజక్షన్ ఇవ్వరా డాక్టర్? ఏమీ టెస్టులు చేయట్లేదు. నిజంగా ఈ మందులతో రోగం తగ్గుతుందా? మొన్న సిటీలో హాస్పిటల్ కి వెళ్తే అన్ని టెస్టులు చేశారు. మీరు డబ్బును గురించి చూడకుండా అన్ని టెస్టులూ చేయండి. ఇన్సూరెన్స్ ఉంది నాకు. ఎటూ ఫ్రీ నే కదా! మళ్ళీ ఈ సంవత్సరం కట్టింది వేస్ట్ అవుతుంది. మీరు చెక్ చేస్తే కట్టింది వచ్చినట్లే కదా! అందుకని బాగా మందులు రాయండి. పర్లేదు!" అనేవాడు ఒకడు.
పొద్దున లేవగానే మెడ పట్టేసిందని ఒకడు, ఎక్కిళ్లు వస్తున్నాయని మరొకరు ఇలా వచ్చేవాళ్ళు పేషంట్స్. తల పట్టుకునేవాడు ఒక్కోసారి పరమేశ్. మళ్ళీ బాగా పేరు తెచ్చుకోవాలి కదా అని ఒకటికి పదిసార్లు గుర్తుకు తెచ్చుకునేవాడు. అలా పాజిటివ్ నెస్ పెంచుకుంటూ ఓపిగ్గా రోగులను చూస్తున్నాడు.
ఇలా ఉండగా...
ఓ రోజు క్లినిక్ లో రోగులను చూస్తున్నాడు పరమేశ్. ఒక్కొక్కళ్ళను కంపౌoడర్ పంపుతున్నాడు లోపలికి.
ఇంతలో ఏదో గోల వినబడింది. ఒక పేషంట్ ను ఇద్దరు ఓ మోస్తరు దృఢకాయులు చెరోవైపు పట్టుకుని తీసుకొస్తున్నారు. ఆ వ్యక్తి పొట్ట పట్టుకుని మెలికలు తిరిగిపోతున్నాడు.
అది కిటికీ లోనుంచి గమనించి, అర్జంట్ గా అటెండ్ కావాలి, ఏదో సీరియస్ అయినట్లుందని అనుకుని "ఏమైంది?" అంటూ బయటకు వచ్చాడు పరమేశ్.
"ఏం డాక్టర్! ఏం మందు ఇచ్చినావు మా వాడికి? నిన్న నీ దగ్గరకు వస్తే మందు ఇచ్చినావు. ఇవ్వాళ వేసుకోగానే ఇట్లా అయిపోయాడు మా వాడు! ఏమన్నా అయితే నీ సంగతి చూస్తాం! రోగం తగ్గేటట్టు చెయ్యి ముందు" అన్నారు ఆ దృఢకాయులు ఆ మెలికలు తిరిగే వ్యక్తి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ నోట్లోంచి మాట రావట్లేదు.
ఆ వ్యక్తి కి ఏమైంది అర్ధం కాలేదు పరమేశ్ కి.
వాళ్ళు సిటీలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వెళ్ళేటప్పుడు బెదిరించి మరీ వెళ్లారు. వాళ్లు వెళ్లి కొద్దిసేపు అయ్యిందో లేదో టీవీ ఛానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ అంటూ డాక్టర్ పరమేశ్ గురించి వస్తోంది. ఫ్రీ వైద్యం చేస్తానని మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్న వైద్యుడు అంటూ వస్తోంది. భయపడిపోయాడు. సిటీలోని తన ఇంటికి వెళ్ళాడు. అతను చేరిన హాస్పిటల్ లో ఎంక్వైయిరీ చేశాడు.
సిటీ లోని ఓ హాస్పిటల్ లో ఈ మెలికలు తిరిగిన వ్యక్తి చేరాడు. మందులు వేసి ఒక గంటలో నార్మల్ కు తీసుకొచ్చారు డాక్టర్లు.
ఆ వ్యక్తికి స్పృహ వచ్చింది. అసలు ఏమి తిన్నావు? అని అడిగితే అతడు ఇలా చెప్పుకొచ్చాడు..
"సార్! నేను మా ఊళ్లో డాక్టర్ పరమేశ్ గారి వద్దకు నిన్న కడుపునొప్పి గా ఉందని వెళ్ళాను. ఆయన పరీక్ష చేసి, రోజూ రెండు చొప్పున వేసుకొమ్మని మూడు రోజులకు మందులు ఇచ్చారు. మూడు రోజుల్లో తగ్గిపోతుంది లేదంటే మళ్ళీ అప్పుడు రమ్మని చెప్పారు. సరేనని ఇంటికి వెళ్లి మూడురోజులు వేసుకుంటే తగ్గడానికి మూడురోజులు పడుతుంది అన్నారు కదా! మరి అన్నీ ఒకేసారి వేసుకుంటే రేపటికల్లా తగ్గిపోతుంది అనుకుని టాబ్లెట్స్ మొత్తం ఒకేసారి మింగాను" అన్నాడు మెల్లగా
అప్పుడు బాగా తిట్టారు డాక్టర్లు. దృఢకాయులు తలలు దించుకున్నారు.
ఆ వ్యక్తితో మళ్ళీ విషయం చెప్పించి, పరమేశ్ ను తిడుతూ చేసిన వీడియో తీయించి, తిరిగి ఛానెల్స్ లో వాస్తవం ప్రసారం చేయించేసరికి అందరికీ విషయం అర్ధం అయి, పగలబడి నవ్వుకున్నారు.
పాపం పరమేశ్ మాత్రం పేరు ప్రఖ్యాతుల కోసం పల్లెటూరు వెళ్ళాలి అనుకోవడం మానేసి, తండ్రి హాస్పిటల్ నే చూసుకుంటూ, అందరికి మంచి వైద్యం అందించి పేరు తెచ్చుకున్నాడు.
కీర్తిప్రతిష్టల కోసం తాపత్రయపడితే రావు. మనపని మనం నియమబద్ధంగా చేసుకుంటూ వెళితే కీర్తి దానంతట అదే వస్తుంది. లేదని తాపత్రయం పెరిగి తోచినట్లుగా చేస్తే, అనవసర విషయాల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడవలసి వస్తుంది.
అంతే కదా...

-సుధావిశ్వం
Comentarios