పల్లె పిలిచింది - 6
- T. V. L. Gayathri
- May 12
- 1 min read
Updated: May 15
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #అంబురుహము, #తేటగీతి, #కావ్యము

Palle Pilichindi - 6 - New Telugu Poem Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 12/05/2025
పల్లె పిలిచింది - 6 - తెలుగు కవిత ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
25.
అంబురుహము.
భ, భ, భ, భ, ర, స, వ.
యతి -13.
కోవెలయందున నిల్చిన రాముని కొల్చు చుండిరి భక్తులున్
'బ్రోవగ రమ్మ!'ని కోపులు పెట్టుచు పొల్పుగా యజియించుచున్
జీవనమంతయు నీతిగ మెల్గుచు చింత లన్నియు తీరగన్
భావిపథంబున పర్వులు పెట్టిరి పౌరులెల్లరు పొందుగన్.//
తాత్పర్యము.
రాజుపాలెం ప్రజలు దేవాలయములోని దేవుడిని పూజిస్తూ, నీతి మంతులుగా జీవనం చేస్తూ ముందుకు వెళుతున్నారు.//
26.
తేటగీతి.
ఆలయంబున పూజరి యరుణగిరికి
ప్రీతిగా మెల్గు పత్నియు బిడ్డ యొకతె
కలిగి యుండగా గేహంబు కళకళలను
సజ్జనాత్ముడై విధులను సల్పుచుండె.//
తాత్పర్యము.
ఆ ఆలయపూజారి పేరు అరుణగిరి. ఆయనకు చక్కని భార్య, ఒక ఆడపిల్ల ఉన్నారు. అతడు చాలా మంచివాడు.//
27.
తేటగీతి.
అరుణ గిరిపత్ని సుమతి తా నాదరముగ
నత్తమామలపై చూపు నమిత ప్రేమ
భర్తకనుగుణంబుగ నుండి పల్లెయందు
శాంత గుణముతో మెలగెడి సాధ్వి యామె.//
తాత్పర్యము.
అరుణగిరి భార్య పేరు సుమతి. భర్తకు తగిన ఇల్లాలు. గుణవతి యైన సుమతికి ఆ పల్లెలో మంచిపేరు ఉంది.//
28.
తేటగీతి.
అరుణగిరి సుత నామంబు హైమవతిగ
పిలుచు కొందురు తలిదండ్రి ప్రేమమీర
నందమైనట్టి బాలిక హైమవతియె
చదువుకొనుచుండె చక్కగ శాస్త్రములను.//
తాత్పర్యము.
అరుణగిరి కూతురు పేరు హైమ. ఆ అమ్మాయి చక్కని పిల్ల. ఆ అమ్మాయి ఎప్పుడూ చక్కగా చదువుకొంటూ ఉంటుంది.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments