పల్లె పిలిచింది - 7
- T. V. L. Gayathri
- 1 day ago
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #ఉత్పలమాల, #ధ్రువకోకిల, #కావ్యము

Palle Pilichindi - 7 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 15/05/2025
పల్లె పిలిచింది - 7 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
29.
తేటగీతి.
పెద్దకామందు మల్లయ్య వీథులందు
సామజంబును బోలుచు సాగుచుండ
పౌరులెల్లరు నిలుచుండి ప్రణతి యనుచు
కరములన్ మోడ్చి భక్తిగ గౌరవింత్రు.//
తాత్పర్యము.
ఆ గ్రామమునకు పెద్ద కామందు మల్లనార్యుడు. ఆయన గ్రామ వీధులందు గంభీరంగా నడుస్తూ ఉంటే పౌరులందరు ఆయనను గౌరవిస్తూ నమస్కారములు చేస్తూ ఉంటారు.//
30.
ఉత్పలమాల.
దానము సేయుచున్ సతము ధర్మము మీరని గ్రామపెద్దగా
దీనుల సేవకై నిలిచి ధీరత జూపెడు మాననీయుడా
గోన కులోద్భవుండు శత గోవుల కీశుడుగా చెలంగుచున్
జ్ఞానమొసంగు విద్యలను చక్కగ నేర్చెను మల్లనార్యుడున్ //
తాత్పర్యము.
ఆ గోన మల్లయ్య ధర్మపరుడు. ఎల్లప్పుడూ దానధర్మములు చేస్తూ, పేదవారికి సేవ చేస్తూ ఉంటాడు. ఆయన తన వంశ గౌరవాన్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన ఎన్నో శాస్త్రవిద్యలను చదువుకొన్నాడు.//
31.
తేటగీతి.
భార్యకోమలి సద్గుణవతిగ మెలగి
మల్లనార్యుని ప్రేమించు మంచి వనిత
బిడ్డలన్ బెంచి నధికమౌ ప్రేమజూపు
పిచ్చితల్లి మాటాడదు పెదవివిప్పి.//
తాత్పర్యము.
ఆ గోన మల్లనార్యుని భార్య కోమలి. ఆమె ఎంతో మంచిది. భర్త, పిల్లలు అంటే ఆమెకు ఎంతో ప్రేమ. ఎప్పుడూ ఒక్క మాట కూడ మాటలాడని సౌశీలవతి.//
32.
ధ్రువకోకిల.
తనయులిర్వురు మల్లనార్యుకు తన్వి యొక్కతి యుండగన్
దనకుమార్తెను గాంచి యాతడు తన్మయంబును పొందుచున్
వినయమించుక లేనివాడగు పిన్నబిడ్డను గాంచుచున్
మనము నందున క్రుంగిపోవును మౌని భంగిని మెల్గుచున్.//
తాత్పర్యము.
ఆ మల్లయ్యకు ఇద్దరు కుమారులు మరియు ఒక కూతురు ఉన్నారు. కూతురును చూచి ఆతడు సంతోషిస్తూ ఉంటాడు. అయితే అతని కుమారుల్లో చిన్నవాడు కొంచెం అల్లరివాడు. ఆ కుమారుణ్ణి చూసి మల్లయ్య అప్పుడప్పుడు దిగులుపడుతూ ఉంటాడు.//
(సశేషం )

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link: