top of page

పల్లె పిలిచింది - 8

Updated: May 19

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #కందం, #ధ్రువకోకిల, #కావ్యము

Palle Pilichindi - 8 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 17/05/2025

పల్లె పిలిచింది - 8 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


 33.

తేటగీతి.


మల్లనార్యుని పుత్రులు మణివికాసు

డనగ వీరేశుడనుపేర్ల వరలుచుండ

పెద్దవాడు వికాసుడు వినయమూర్తి

తల్లిదండ్రులన్ గాంచును దాలిమిమెయి//


తాత్పర్యము.


మల్లనార్యుని కుమారులలో పెద్దవాడు మణివికాసుడు, చిన్నవాడు వీరేశుడు.పెద్దకొడుకు చాలా వినయంగా పెద్దలను గౌరవిస్తూ ఉంటాడు.//


34.

తేటగీతి.


చిత్ర నామంపు కూతురు చిన్నసుతను 

తండ్రి మల్లయ్య ప్రేమగా దరికి జేర్చి 

ముద్దు జేయుచు నిత్యము మురిసిపోవ

నాటలాడుచు వర్థిల్లె నాడుపిల్ల.//


తాత్పర్యము.


మల్లనార్యుని కూతురు పేరు చిత్ర. ఆ పిల్లను తండ్రి గారాబం చేస్తూ ఉంటే ఆ పల్లెలో ఆడుతూ పాడుతూ పెరుగుతూ ఉంటుంది.//


35.

కందం.


మల్లయ సుతుడౌ వీరుడు 

వెళ్ళడు తగు విద్య నేర్వ విబుధుల కడకున్ 

చిల్లర పనులను జేయుచు 

తల్లికి తండ్రికి బరువుగ తరలుచు నుండున్.//


తాత్పర్యము.


మల్లయ్య చిన్నకొడుకు వీరేశుడు సరిగ్గా చదవడు. అల్లరి చిల్లరగా తిరుగుతూ తల్లిదండ్రులకు తలనొప్పిగా తయారయ్యాడు.//


36.

ధ్రువకోకిల.


చిరుత ప్రాయపు చిన్నబిడ్డడు చిందులేయుచు పొర్లుచున్ 

గఱకుగా గని తల్లి దండ్రుల గౌరవింపక మెల్గుచున్ 

పరువు తీయుచు పెద్దవారిని బాధవెట్టుచు నిత్యమున్ 

తెరలు చుండును గ్రామమందున దిక్కుమాలిన బుద్ధితో.//


తాత్పర్యము.


చిన్న పిల్లవాడయిన వీరేశుడు తల్లిదండ్రులను గౌరవించక గాలికి తిరుగుతూ ఉంటాడు. పెద్దవారిని బాధపెడుతూ ఉంటాడు.//


37.

ధ్రువకోకిల.


కుమతుడౌ నిజ పుత్రు గాంచుచు కోమలమ్మయె  బెంగతో 

కుములుచుండియు భర్తగారికి కోరి సేవలు చేయుచున్ 

మమత పంచుచు గేహ మందున మాటలాడక దేవునిన్ 

నిముసమైనను విస్మరించదు నిష్ఠతో జపియించుచున్.//


తాత్పర్యము.


ఆ వీరేశుని తల్లి వాడిని చూస్తూ మనసులో బెంగపడుతూ, ఎంతో మౌనంగా ఉంటూ, తనపని తాను చేసుకుంటూ ఎప్పుడూ దేవుడి నామమును జపిస్తూ ఉంటుంది.//




టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Komentarze


bottom of page