పల్లె పిలిచింది - 9
- T. V. L. Gayathri
- May 19
- 2 min read
Updated: May 21
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #మత్తకోకిల, #ధ్రువకోకిల, #కావ్యము

Palle Pilichindi - 9 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 19/05/2025
పల్లె పిలిచింది - 9 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
38.
తేటగీతి.
పాఠశాలలో గురువుగ పాఠములను
నేర్పు చుండుశ్రీ కరుడను నీతిపరుడు
పల్లెలోనివారి నెపుడు పలుకరించి
మంచి చేయుచు నుండెడి మాన్యుడతడు. //
తాత్పర్యము.
ఆ గ్రామమున ఉన్న పాఠశాలలో శ్రీకారుడు అనే ఉపాధ్యాయుడు ఉన్నాడు.పల్లె వారి మంచిచెడ్డలను చూస్తూ ఉండే మంచివాడతడు.//
39.
తేటగీతి.
శ్రీకరునిసుతుడైనట్టి శ్రీనివాసు
సద్గుణంబులు గల్గిన ఛాత్రుడతడు
పెద్దవారిని సేవించి పెరుగుచుండి
వినయమున్ జూపి వరలెడి విబుధవరుడు.//
తాత్పర్యము.
శ్రీకరునికి శ్రీనివాసుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు పెద్దల మాట వింటూ, చక్కగా చదువుకొంటూ ఉంటాడు.//
40
తేటగీతి.
మల్లనార్యుని పుత్రునిన్ మందలించి
శ్రీకరుండు తాన్ మంచిని చెప్పబోవ
కసరు కొనుచుండి వీరేశు విసవిసనుచు
నడిచి పోవగా జనులట నవ్వుచుంద్రు.//
తాత్పర్యము.
శ్రీకరుడు ఉపాధ్యాయుడు కాబట్టి మల్లనార్యుని కుమారుడికి మంచి మాటలు చెప్తుంటే ఆ కుర్రవాడు వినకుండా విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ఆ పిల్లవాడిని చూచి ఊరులోని జనాలు హేళనగా నవ్వుతూ ఉంటారు.//
41.
తేటగీతి.
శ్రీనివాసుజననిపేరు శ్రీలతమ్మ
ధనముపై నాశ చెందెడి తరుణి యామె
భర్తగారిని నిత్యము పరుషగతిని
దెప్పిపొడుచును విసువుతో ధిషణ తరిగి.//
తాత్పర్యము.
శ్రీనివాసుని తల్లి పేరు శ్రీలతమ్మ. ఆమెకు ధనము మీద కొంచెము ఆశ ఎక్కువ. ఉపాధ్యాయుడైన శ్రీకరుడిని ఆమె తెలివి తక్కువగా దెప్పి పొడుస్తూ ఉంటుంది.//
42.
మత్తకోకిల.
జీతభత్యము తక్కువంచును శ్రీకరున్ విదిలించుచున్
నీతిమంతుల కాలమంతయు నేడు లేదను పత్నితాన్
జాతకంబున సంపదల్ కను జాడ యేదని తూలుచున్
మూతిత్రిప్పుచుమూలనుండును ముద్దు ముచ్చట తీర్చకే//
తాత్పర్యము.
'నీతిమంతుడిగా బ్రతుకుట శుద్ధ దండుగ 'అంటూ శ్రీలతమ్మ తన భర్తకు జీతము తక్కువగా ఉందని, తన జాతకంలో మంచిగా సంపదలు అనుభ వించటమనే యోగము లేదని వాపోతూ ఉండి, ఏ ముద్దూ ముచ్చట తీర్చక విసుగ్గా ఉంటుందెప్పుడు.//
43.
ధ్రువకోకిల.
కనలు చుండెడి పత్ని శ్రీలత కంటనీరిడి తిట్టినన్
మనము నందున బాధ నొందని మంచి భర్తగ మెల్గుచున్
ధనము సౌఖ్యము నీయదంచును తల్చుచుండెడి యొజ్జయై
వినయవంతుడు శ్రీకరుండట విద్యనేర్పును పల్లెలో.//
తాత్పర్యము.
కోపంగా, ఏడుస్తూ, తిడుతూ ఉండే భార్యను చూచి శ్రీకరుడు మనసులో ఏమీ బాధ పడకుండా, ఆమెతో నెమ్మదిగా ప్రవర్తిస్తూ,ధనము సుఖము నివ్వదని తల్చుచూ, ఊరిలోని పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటాడు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments