top of page

జీవిత చిత్రాలు - 16

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

చివరి భాగం

Jeevitha Chitralu Part-16- Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 19/05/2025

జీవిత చిత్రాలు - పార్ట్ 16 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య, చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు. యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని, చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. 


గోవిందరాజు కుమారుడు కిరణ్, గులాబీల వివాహానికి గులాబీ తండ్రి.. ప్రొడ్యూసర్ వినాయకం అంగీకరించడు. తల్లి చిలకమ్మ అంగీకరిస్తుంది. కూతుర్ని కలిసి తిరిగి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చెయ్యబడుతుంది చిలకమ్మ.


భార్య కిడ్నాప్ అయిన విషయాన్ని డి.ఐ.జి కొండలరావుకు చెబుతాడు వినాయకం. కిడ్నాపర్లు చిలకమ్మ చేత వినాయకంతో మాట్లాడిస్తారు. 


చిన్నప్పటి తన ఇంటి జాగా తిరిగి కొనాలనుకుంటాడు ఆది. యువరాణి అందుకు అంగీకరిస్తుంది. వినాయకం ఇచ్చిన డబ్బు పేదలకు పంచి, చిలకమ్మను విడిచి పెడతారు కిడ్నాపర్లు.



ఇక జీవిత చిత్రాలు ధారావాహిక పార్ట్ 16 చదవండి. 


ఆదిత్య.. వైజాగ్ చేరాడు. కిరణ్, ఆది ఆఫీసుకు వెళ్ళాడు. పేపర్లో చిలకమ్మ.. డబ్బును దానం చేసేటప్పుడు పాత్రికేయులు తీసిన ఫొటోలు ప్రచురించబడ్డాయి. ధర్మదేవత అని గొప్పగా వ్రాసి వున్నారు. గోవిందరాజు.. చిలకమ్మ ఫొటోలను భార్య శాంతమ్మకు చూపించాడు.


గోవిందరాజు, శాంతమ్మలు గులాబీ కిరణ్‍ల వివాహ ముహూర్తాన్ని నిర్ణయించేటందుకు.. పురోహితుని పిలిపించారు.. కానీ..

ఆ దంపతుల ఇరువురి మనస్సున.. పెద్దవాడు చిన్నాకు పెండ్లి జరిపించకుండా చిన్నవాడు కిరణ్‍కి ముందు జరిపించబోతున్నామే అనే కొరత.. బాధ.


ఆది రూమ్ క్లీన్ చేస్తూ.. మంచం క్రింద పడివున్న ఒక కవర్ చూచి పనిమనిషి, నూకాలమ్మ.. దాన్ని చేతికి తీసుకొని క్రిందికి వచ్చి..

"అయ్యగోరూ!.. ఈ కవరు చిన్నయ్యగారి మంచం క్రింద పడుందయ్యా!.." చెప్పి, గోవిందరాజుకు అందించి తన పనికి వెళ్ళిపోయింది.


విప్పని ఆ కవర్ చూచి, మధ్యన.. టు.. ఆదిత్యా అన్న పేరును క్రింద ఫ్రమ్.. యువరాణి.. అన్న పేర్లను చూచి ఆశ్చర్యంతో కవర్‍ను చించి చూచాడు గోవిందరాజు. అందులో ఇలా వ్రాసి ఉంది.

’ప్రియాతి ప్రియమైన ఆదిత్యకు.. నీ యువరాణి వ్రాయునది..


ఆదీ!.. ఎనిమిదేళ్ల ప్రాయంలో మా అన్నయ్య మాటలను విని నీ విషయంలో తప్పుగా ప్రవర్తించాను. నా కారణంగా నీవు.. మీ యింటిని వదిలి ఎటో వెళ్ళిపోయావు. నేను మోపిన నేరం కారణంగా మీ అమ్మా నాన్న అక్కా.. తమ్ముడు కూడా ఆస్థి పాస్థులను అమ్మేసి, ఎటో వెళ్ళిపోయారు. నేను ఎదిగే కొద్దీ.. నీ పట్ల నేను చేసిన తప్పు.. నేరం, నాకు తెలిసి వచ్చింది. ఎప్పుడూ నీ గురించే ఆలోచించేదాన్ని. మనస్సున నిన్ను కలవాలని క్షమాపణ చెప్పాలనే భావన. నాతో పాటే నాయీ భావనా నాలో ఎదిగింది.


పోయిన నెలలో నీవు మన వూరికి వచ్చి మా ఇంటి ముందు నిలబడి వున్న నిన్ను నేను గుర్తించాను. సుధను అడిగి.. నా అనుమానాన్ని తీర్చుకున్నాను. త్వరలో నిన్ను కలవగలనని నేను చాలా ఆనందించాను. బి.ఎస్సీ, ఎం.బి.ఎ వరకు చదివాను. నా చదువు నా సంస్కారం నిన్ను ఏనాటికైనా నా వాడిగా చేసుకోవాలని నాకు నేర్పాయి. నా మనసంతా నీవే. అమ్మా, నాన్న నా వివాహ ప్రయత్నాలు చేశారు. నా వివాహం నా ఇష్టానుసారంగా జరుగవలసి వచ్చినప్పుడు జరుగుతుందని, మీ ప్రయత్నాలను మానుకోండని వారికి చెప్పాను.


నాకు వివాహం అంటూ జరిగితే.. అది నీతోనే.. నా తప్పును మన్నించి.. నన్ను నీ దానిగా చేసుకొంటావో.. లేక పగ ప్రతీకారంతో నన్ను అసహ్యించుకొని.. జీవితాంతం ఒంటరిగా వుండిపొమ్మంటావో.. అది నీ ఇష్టం. నీవు ఏ నిర్ణయం తీసుకొన్నా.. నీ పట్ల నాకు నిన్న నేడు రేపు వుండేది ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..


ఇట్లు

సదా..

నీ యువరాణి


ఉత్తరం సాంతం చదివి గోవిందరాజు నవ్వుతూ భార్య ముఖంలోకి చూచాడు.


"ఏమిటండీ.. ఎవరిదా ఉత్తరం!.." ఆశ్చర్యంతో అడిగింది శాంతమ్మ.


"శాంతీ!.. దేవుడు దయామయుడు. మన మనస్సున వున్న కొరతను తీర్చాడు. ఈ ఉత్తరాన్ని చదువు" నవ్వుతూ శాంతమ్మ చేతికి అందించి, తన్నే చిత్రంగా చూస్తున్న శాస్త్రి గారి ముఖంలోకి చూచి..

"శాస్త్రిగారూ!.. నిశ్చితార్థ వివాహ ముహూర్తాలు ఒకటి కాదు రెండు. మా చిన్నాకు.. మా కిరణ్‍కు.. ముందు జరుగవలసింది చిన్నాదే. రెండు మూడు రోజుల వ్యత్యాసంలో నిశ్చితార్థ ముహూర్తాలు.. వీలుంటే వివాహాలు రెండూ ఒకే రోజున జరిగేలా చూడండి" ఆనందంగా చెప్పాడు గోవిందరాజు.


ఉత్తరాన్ని చదివిన శాంతమ్మ.. "ఈ యువరాణి ఎవరండీ!.." ఆశ్చర్యంతో అడిగింది.


"మన పెద్ద కోడలు.. చిన్నాకు కాబోయే అర్థాంగి. మనం పిల్లలకు చెప్పకుండా.. నెల్లూరుకు వెళ్ళి చూచి వద్దాం. రేపే మన ప్రయాణం" నవ్వుతూ చెప్పాడు గోవిందరాజు.


శాస్త్రిగారు పంచాంగాన్ని చూచి.. ఆ రోజుకు తొమ్మిదవ రోజున చిన్నాకు నిశ్చితార్థం.. పన్నెండవ రోజున కిరణ్‍కు నిశ్చితార్థం.. ఇరవై రెండవ రోజున ఒకే లగ్నంలో ఉభయులకూ వివాహ ముహూర్తాలను నిర్ణయించాడు. లగ్న పత్రికలను వ్రాసి వారికి అందించాడు.


వారు అందించిన సంభావనను స్వీకరించి.. వారిని దీవించి శాస్త్రిగారు వెళ్ళిపోయారు.

ఆఫీసుకు ఫోన్ చేసి.. ముకుందయ్య.. జనార్థన్‍ల ఫోన్ నెంబర్లను చిన్నా నుండి తెలుసుకొన్నాడు గోవిందరాజు.


"శాంతీ!.. ఈ ఉత్తరం విషయం చిన్నాకు తెలియకూడదు. సరేనా!.."


"నాకు అర్థం అయిందండీ!.. సస్పెన్స్" నవ్వింది శాంతమ్మ.


దివాకర్ కారు.. కారు పోర్టికోలో ఆగింది. చిలకమ్మ దివాకర్ లోనికి వచ్చారు. ఇరువురినీ వారు సాదరంగా ఆహ్వానించారు. తన కుమారుని బారసాల పత్రికను వారికి అందించి.. తప్పక మీరంతా రావాలని కోరాడు దివాకర్.

*

దివాకర్ తనయుని బారసాల మహోత్సవం.. ఆరోజు హైదరాబాదులో. 

వైజాగ్ నుండి అందరి కంటే ప్రప్రథమంగా గోవిందరాజు, శాంతమ్మ, ఆదిత్య, కిరణ్, గులాబీ, చిలకమ్మలు వచ్చారు.


ఆ ముందురోజే.. దివాకర్ భార్య పార్వతీ.. అమ్మా నాన్నలు.. రామచంద్రయ్య, సీతమ్మలు.. తమ్ముడు ఆనంద్ వచ్చేశారు. రామచంద్రయ్యగారు భువనేశ్వర్‍లో హోటళ్ళ యజమాని. సంపన్నుడు, సంస్కారవంతుడు. ఆనంద్.. ఆది స్వగ్రామంలో సబ్ ఇన్స్ పెక్టర్.. జనార్థన్‍కు అతని పట్ల ఎంతో గౌరవం. అభిమానం. తన కూతురు సుధను అతనికి ఇచ్చి వివాహం చేయాలన్నది అతని కోరిక. 


తనకూ.. జనర్థన్‍కు వున్న పరిచయంతో ఆనంద్ తన ఒక్క కొడుకు బారసాలకు, జనార్థన్ కుటుంబాన్ని ఆ గ్రామ సర్పంచ్ యువరాణినీ.. గ్రామ పెద్దల్లో ఒకరైన ముకుందరావు కుటుంబాన్నీ.. హైదరాబాదుకు రావలసిందిగా.. ఆనంద్ వారినందరినీ ఆహ్వానించాడు. వారంతా గోవిందరాజు బృందం చేరిన అరగంటకు దివాకర్ యింటికి వచ్చారు.


దివాకర్ తన అమ్మానాన్నలను ముందుగా గోవిందరాజు దంపతులకు.. తర్వాత, ఆది, కిరణ్‍లకు గులాబీ చిలకమ్మలకు పరిచయం చేశాడు.


ఆ దంపతులను చూచిన ఆది.. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. వారిరువురూ తన కన్న తల్లిదండ్రులు. అతను.. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. భోరున చేతులను ముఖానికి అడ్డు పెట్టుకొని ఏడవసాగాడు.


అందరూ ఆది ఈ చర్యకు ఆశ్చర్యపోయారు. గోవిందరాజు, కిరణ్ ఆదిని సమీపించారు.

"ఆదీ! ఏమైంది? ఎందుకు రా ఏడుస్తున్నావ్!" ఆందోళనతో అడిగాడు గోవిందరాజు.


"అన్నా!.. ఏమైందిరా!" దీనంగా అడిగాడు కిరణ్.


"బా..బా..య్!.. అ..మ్మా..నా..న్న.." ఆ దంపతులను చూపుతూ అది బొంగురు పోయిన కంఠంతో చెప్పాడు. 


అతని వదనంలో.. ఆనందం.. దుఃఖం.. ఆవేదన ముప్పిరిగొని వున్నాయి.

రామచంద్రయ్య.. సీతమ్మా!.. తమవైపు చేతిని చూపిస్తూ ఏడుస్తున్న ఆదిని పరీక్షగా చూచారు.

"వారు.. మా అమ్మా నాన్న. భువనేశ్వర్‍లో వున్నారు" అంది పార్వతి.


ఏడుస్తూనే ఆది పార్వతి ముఖంలోకి చూచాడు.

"అ..క్కా.. అ..క్కా" అన్నాడు.


ఆ ముగ్గురూ ఆత్రంగా ఆదిని సమీపించారు.

ఆది పరవశంతో.. తన్ను సమీపించి పరీక్షగా చూస్తున్న రామచంద్రయ్యా.. సీతమ్మల భుజాలపై చేయివేసి..

"అమ్మా!.. నాన్నా!.. నేను.. నేను.. మీ.. మీ ఆదిత్యను.. నేను మీ ఆదిత్యను" గద్గద స్వరంతో చెప్పలేక చెప్పాడు. 


ఆ దంపతులు ఆనందంతో.. ఆదిత్యను తమ చేతుల్లోకి తీసుకొన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆదిని తమ హృదయానికి హత్తుకొన్నారు. ముకుందయ్య అన్నా వదినలను గుర్తించి ప్రీతిగా పలకరించాడు. ఎంతగానో సంతోషించాడు.


జరుగుతున్న దాన్ని చూస్తూ వున్న పార్వతీ.. ఆనంద్‍లు ఆదిని సమీపించారు. అతని చేతులను తమ చేతుల్లోకి తీసుకొన్నారు. అతని కన్నీటిని తుడిచారు.


అంతా చిత్రంగా చూస్తూ వున్న దివాకర్.. "నా కొడుకు యోగ జాతకుడు.. ఏనాడో విడిపోయిన ఆదిత్యను తన కుటుంబంతో కలిపాడు. చిన్నా నా ముద్దుల బావమరిదీ!.. నీవు వెంటనే పెళ్ళి చేసుకొని.. నాకు కోడలిని కని ఇవ్వాలి." నవ్వుతూ ఎంతో సంతోషంగా చెప్పాడు. 


ఆ మాటలను విన్న అందరి వదనాల్లో ఆనందం.. నవ్వులు..

గోవిందరాజు రామచంద్రయ్యను సమీపించి.. "అన్నయ్యగారూ!.. అదుగో.. మనకు కాబోయే కోడలు.. యువరాణి" చేతితో చూపాడు నవ్వుతూ.


గులాబీ.. యువరాణి ప్రక్కకు వెళ్ళి భుజంపై చెయ్యి వేసి.. "అక్కా!.. మా బావగారు చాలా మంచివారు" నవ్వుతూ అంది.


"నాకు తెలుసు గులాబీ!" మెల్లగా నవ్వుతూ అంది యువరాణి.


ఆనంద్.. సుధ ప్రక్కన చేరాడు. సుధ అతన్ని క్రీగంట చూచి ఒదిగి నిలబడింది. వారిని చూచిన జనార్థన్, భాస్కర్‍లు నవ్వుకొన్నారు.


"త్వరలో.. మా చిన్నాకు యువరాణి.. మా కిరణ్‍కు గులాబీలకు వివాహాలు జరుగనున్నాయి ముహూర్తాలు నిర్ణయించాం" నవ్వుతూ చెప్పాడు గోవిందరాజు.


"అన్నయ్యగారూ!.. మరో ముహూర్తాన్ని కూడా నిర్ణయించాలి" అన్నాడు జనార్థన్.


"ఎవరికి?" ఆశ్చర్యంతో అడిగాడు రామచంద్రయ్య.


"మన ఆనంద్‍కు.. సుధకు" నవ్వుతూ చెప్పాడు ముకుందరావు.


"ఈరోజు.. చాలా సుదినం. మా మనవడు నిజంగా లోక హితుడౌతాడు. ప్రతి మనిషి బ్రతుకు తెరువులో.. ఎన్నో ’జీవిత చిత్రాలు’ నిండి వుంటాయి. కష్ట సుఖాలను సమదృష్టితో భరించి.. ధైర్యంతో సత్యధర్మాలను నమ్మి ముందుకు నడిచేవాడే.. తన లక్ష్యాన్ని సాధిస్తాడు. మంచి మనిషి అనిపించుకొంటాడు. అందుకు నిదర్శనం మా ఆది. మా ఇరువురు దంపతులకు ముద్దుబిడ్డ" ఆనందంగా నవ్వుతూ చెప్పాడు రామచంద్రయ్య.


"వీరి వివాహాల అనంతరం మమమంతా మరలా కలిసి సంబరాలు చేసుకొనే మరో వేదికను మన చిన్నా.. యువరాణులు సిద్ధం చేస్తున్నారు అన్నా!" నవ్వుతూ చెప్పాడు గోవిందరాజు.

"అదేమిటి?" ఆశ్చర్యంతో అడిగాడు రామచంద్రయ్య.


"మీ స్వగ్రామంలో వారు నిర్మిస్తున్న భవంతి.. అనాధాశ్రమాల గృహప్రవేశ ఓపెనింగ్ ఫంక్షన్" ఆనందంగా నవ్వాడు గోవిందరాజు.


పురోహితులు వచ్చారు. బాలసారె కార్యక్రమం ప్రారంభం అయింది.

అందరి చూపులు ఆశ్చర్యంతో.. ముఖద్వారం వైపు మళ్ళాయి. వినాయకం.. డి.ఐ.జి కొండలరావు, వారి సతీమణి విమల.. రంజిత్ నిలబడి వున్నారు.


ఆది.. దివాకర్ వేగంగా వారిని సమీపించి..

"వెల్‍కమ్ సార్!.. వెల్‍కమ్!.." నవ్వుతూ స్వాగతం పలికారు.


వారు అందరి మధ్యన చేరి.. చిరునవ్వులతో అందరినీ పలకరించారు. చిలకమ్మ.. నవ్వుతూ భర్త వినాయకం ప్రక్కన చేరింది.


బిడ్డకు.. ’అక్షయ’ అని నామకరణం చేశారు. ఆ క్షణంలో.. అందరి వదనాల్లో ఎంతో ప్రశాంతత.. ఆనందం..


=======================================================================

సమాప్తం

జీవిత చిత్రాలు ధారావాహికను ఆదరించిన పాఠకులకు

రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య గారి తరఫున,

మనతెలుగుకథలు.కామ్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comentários


bottom of page