చివరి కోరిక - పార్ట్ 3
- Madduri Bindumadhavi

- 2 days ago
- 3 min read
#MadduriBindumadhavi, #మద్దూరిబిందుమాధవి, #ChivariKorika, #చివరికోరిక, #TeluguWebSeries

Chivari Korika - Part 3 - New Telugu Web Series Written By Madduri Bindumadhavi
Published In manatelugukathalu.com On 15/11/2025
చివరి కోరిక - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక
రచన: మద్దూరి బిందుమాధవి
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
జరిగిన కథ:
'శాంతి మహిళా సేవా సంస్థ' వార్షికోత్సవం లో తన జీవిత గమనం గురించి చెబుతూ ఉంటుంది సుందరి. ఆమె భర్తకు కాన్సర్ వ్యాధి సోకుతుంది.
ఇక చివరి కోరిక - పార్ట్ 3 చదవండి.
లోపలున్న సత్యానికి.... డాక్టర్ ఎంతకీ ఏమీ చెప్పకుండా అటూ ఇటూ తిరగటం చూస్తే ఏమైనా సీరియస్సా? తనకి చెప్పటానికి సందేహిస్తున్నాడా? అని ఒకటే దుగ్ధ!
కృష్ణా రావుని పిలిస్తే అతను ఆఫీస్ లో ఎవరితోనో సీరియస్ గా మాట్లాడుతున్నాడు. ఎవరినో హాస్పిటల్ కి రమ్మని చెబుతున్నాడు.
ఇక ఆగలేక కృష్ణా రావుతో "ఏంటోయ్...ఆయన ఏమీ చెప్పడు, నువ్వూ ఏమీ చెప్పవు. ఏమైనా సీరియస్సా?" అని అడిగేసరికి కృష్ణా రావు "మధు వస్తున్నాడు. మనం ఇంటికెళ్ళిపోవచ్చు" అని అసందర్భంగా మాట్లాడేసరికి సత్యానికి మనసులో కలిగిన సందేహం బలపడింది.
ఇంతలో ఆఫీస్ నుంచి మధు వచ్చాడు. ఇద్దరూ కలిసి డాక్టర్ తో మాట్లాడి, అప్పటికి సత్యాన్ని తీసుకుని ఇంటికెళ్ళారు.
అతని తల్లిదండ్రులని, భార్యని పక్కకి పిల్చి ప్రశాంతంగా కూర్చోబెట్టి వారిని కాసిని మంచి నీళ్ళు తాగమని నెమ్మదిగా ఒక్కొక్క అక్షరమే పలుకుతూ విషయం వివరించారు.
సుందరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మగవాడు కాబట్టి తండ్రి తనని తను నిగ్రహించుకుని...భార్య భుజం మీద చెయ్యి వేసి బెడ్రూం లోకి తీసుకెళ్ళాడు.
ఆ రోజు మొదలు..ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం!
సత్యం తమ్ముడు విశ్వం కి విషయం అర్థం చేసుకునే వయస్సున్నది కానీ, కొడుకు రుద్ర కి ఆరేళ్ళు...కూతురు హరిణికి నాలుగేళ్ళు. తెలిసీ తెలియని వయసు.
ఇంట్లో ఏదో జరగరానిది జరిగింది అనుకుంటున్నారు కానీ ఏమిటో తెలియదు.
***
సత్యం ఆరోగ్య పరిస్థితి తెలిసినప్పటి నుంచి సుందరి తనగురించి తను పట్టించుకోవటం మానేసింది. వేళ పట్టున అన్నం తినదు, నిద్ర సంగతి అసలు చెప్పక్కర్లేదు. మనిషి శుష్కించి పోయింది.
ఒక రోజు తీవ్ర జ్వరంతో ఉదయం లేవలేక పోయింది. అత్తగారు వచ్చి చూసి..రెండో కొడుకు విశ్వాన్ని పిల్చి ....'వదినని లేపి కూర్చోబెట్టి పళ్ళుతోమి, కాఫీ తాగిద్దాము రా’ అని చెప్పింది. తనని కంటికి రెప్పలాగా చూసుకునే వదిన అలా అయిపోవటం చూసి భరించలేని విశ్వం...వదినని రెండు చేతులతో ఎత్తి కూర్చోబెట్టి.....సీతకి సేవ చేసే లక్ష్మణుడి లాగా.... తల్లి సాయంతో కాఫీ తాగించాడు.
అలా మూడు రోజులు రాత్రింబవళ్లు సేవ చేస్తే కానీ మామూలు స్థితికి రాలేకపోయింది సుందరి. వదినా మరుదుల మధ్య సంబంధాన్ని తల్లీ-కొడుకుల అనుబంధంగా అర్థం చేసుకోవటానికి కొంత జన్మ సంస్కారం కావాలి!
అవసరంలో ఉన్న మనిషికి మరో మనిషే సహాయం చెయ్యాలి! దానికి అపవిత్రత అంటకట్టటం మొదలు పెడితే మనిషి మళ్ళీ అనాగరికపు-పశు స్థాయికి వెళ్ళిపోతాడు.
సత్యాన్ని చూసి వెళ్ళటానికి పొరుగూరి నుంచి వచ్చిన అతని పిన్ని....విశ్వం తన వదినకి చేసే సేవని మరో కోణంలో వికృతంగా మాత్రమే చూడగలిగింది.
అక్కని పక్కకి పిల్చి.... "అక్కా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు! సుందరిది నలుగురి కళ్ళల్లో పడే అందం. ఈ వయసులో భర్తని పోగొట్టుకుని ఒంటరిదైతే .... చేరదీసేవాళ్ళు తయారవుతారు. ఎవరికెప్పుడు ఎలాంటి బుద్ధులు పుడతాయో తెలియదు. ఇందులో ప్రవరాఖ్యులెవరూ లేరు. అన్ని రోజులు మనమనుకున్నట్లు జరగవు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో! ఒకళ్ళు అనే మాట మనమే అనుకుంటే సరిపోతుంది!\" అని అన్యాపదేశంగా విశ్వం వంక చూస్తూ అక్కకి హితబోధ చేసింది.
అసలే చెట్టంత కొడుక్కి వచ్చిన కష్టంతో మనసు చెదిరి బాధపడుతున్న అనసూయమ్మగారికి, \"పులి మీద పుట్ర\" లాగా ఇదొక ఆలోచించవలసిన కొత్త సమస్యగా తోచింది.
చిన్న నాయనమ్మ అన్న మాటలు చిన్నవాడైన రుద్ర చెవిలో పడ్డాయి. ఆనాటి నుంచి నాయనమ్మ కూడా తేడాగా చూస్తున్నట్టు ఆ వయసులోనే వాడికి అనిపించింది. అందులో అర్థం తెలియక పోయినా అమ్మ గురించి-బాబాయిగురించి ఏదో మాట్లాడుకుంటున్నారని మాత్రం తెలిసింది.
=======================================================================
ఇంకా వుంది..
చివరి కోరిక - పార్ట్ 4 త్వరలో..
========================================================================
మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.
సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.






Comments