top of page
Original_edited.jpg

చివరి కోరిక - పార్ట్ 2

  • Writer: Madduri Bindumadhavi
    Madduri Bindumadhavi
  • 6 days ago
  • 3 min read

Updated: 2 days ago

#MadduriBindumadhavi, #మద్దూరిబిందుమాధవి, #ChivariKorika, #చివరికోరిక, #TeluguWebSeries

ree

Chivari Korika - Part 2 - New Telugu Story Written By Madduri Bindumadhavi 

Published In manatelugukathalu.com On 12/11/2025

చివరి కోరిక - పార్ట్ 2 - తెలుగు కథ

రచన: మద్దూరి బిందుమాధవి 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


మొదటి ఎపిసోడ్ లో 

 'శాంతి మహిళా సేవా సంస్థ' వార్షికోత్సవం లో తన జీవిత గమనం గురించి చెబుతూ ఉంటుంది సుందరి. 



ఇక చివరి కోరిక - పార్ట్ 2 చదవండి


సత్యం రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్నత పదవిలో ఉండేవారు. 

పేరుకు తగ్గట్టే అతి సుందరంగా, సుకుమారంగా ఉన్న సుందరిని బంధువుల ఇంట్లో పెళ్ళిలో చూశాడు. చూపు తిప్పుకోలేని అందం. చిరునవ్వులు చిందే ముఖం. చక్కటి మాట తీరు.. రూపానికి తగ్గ చల్లని మనసు. అందుకే తన తండ్రి, కట్నం కోసం పట్టుదలగా ఉన్నా పేదింటి పిల్లైన సుందరిని కోరి చేసుకున్నాడు.. సత్యం. 

వివాహమైన అతి తక్కువ కాలం లోనే సుందరి తన ప్రవర్తనతో ఇంట్లో అందరి మన్ననలు 

పొందింది. 

సత్యం కంటే తమ్ముడు విశ్వం ఎనిమిదేళ్లు చిన్నవాడు. మరిదిని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసే వదిన అంటే విశ్వానికి ప్రాణం. వదిన గారి దగ్గర ఉన్న చనువు వల్ల నాన్నగారిని అడగటానికి భయపడే విషయాలు కూడా వదిన ద్వారా అడిగించి పనులు పూర్తి చేసుకుంటాడు. 

********

కోరి చేసుకున్న భార్య సుందరి అంటే సత్యానికి ప్రాణం! 

వారి దాంపత్య కలల పంటలు రుద్ర, హరిణి. 

వారి జీవితం హాయిగా నల్లేరు మీద బండి లాగా ప్రశాంతంగా సాగుతున్నది. 

కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా! 

ఆఫీస్ లో ఏదో మెడికల్ క్యాంప్ జరుగుతుంటే అందరితో పాటు సత్యం కూడా యధాలాపంగా బ్లడ్ టెస్ట్ లు, షుగర్, బీపీ, థైరాయిడ్ టెస్ట్ లు చేయించుకున్నాడు. ఇంట్లో వాళ్ళతో ఆ మెడికల్ క్యాంప్, అందులో తను టెస్టులు చేయించుకున్న విషయం గురించి చెప్పాడు. 


సుందరికి మెడికల్ టెస్ట్ లంటే భయం. "అదేంటండీ మీరు బాగానే ఉన్నారుగా! టెస్ట్ లెందుకు? డాక్టర్ అందరికీ చేయించమన్నారా?" అని గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. 


"అబ్బా అదేం కాదు బంగారం! ఊరికే ఆఫీస్ లో మెడికల్ క్యాంప్ అవుతుంటే అందరితో పాటు నేను చేయించుకున్నాను. రేపు రిపోర్ట్స్ వచ్చేస్తాయి. నువ్వే చూస్తావుగా మీ ఆయన ఎంత ఆరోగ్యవంతుడో! నేను ఉక్కు, పిడుగు అని నీకు తెలుసు కదా” అని చేతులు ముడిచి, వస్తాదు లాగా భుజ కండరాలు చూపిస్తూ వాతావరణం తేలిక పరిచాడు. 


అనుకున్నట్లు మరునాడు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ క్యాంప్ నిర్వహించిన హాస్పిటల్ వాళ్ళ ప్రతినిధి సత్యాన్ని పిల్చి "మీరు వెంటనే ఒక సారి హాస్పిటల్ కి రండి. మీకు కొన్ని ఎడ్వాన్స్డ్ టెస్ట్ లు చెయ్యాలి. పెద్ద డాక్టర్ చూస్తారు" అని చెప్పి వెళ్ళారు. 


ఈ మాట వింటూనే సత్యం మనసు పరి పరి విధాల ఆలోచించటం మొదలుపెట్టింది. ఏం జరిగి ఉంటుంది... ఎందుకు రమ్మన్నారు... ఇంటికెళ్ళగానే రిపోర్ట్స్ లో ఏమున్నదని సుందరి అడుగుతుంది. 


తనని ఎడ్వాన్స్డ్ టెస్ట్ లకి రమ్మన్న విషయం తనకి చెప్పాలా? వద్దా? 

తనతో పాటు సుందరిని కూడా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలా? ఒంటరిగా వెళ్ళాలా? 

తల్లి తండ్రులు పెద్ద వయసు వాళ్ళు. ఇప్పుడు హాస్పిటల్... టెస్ట్ లు అంటే కంగారు పడతారేమో? 

ఇలా మనసులో కురుక్షేత్ర సంగ్రామం నడుస్తుండగా.. సత్యం ఆఫీస్ లో తనకి బాగా ఆత్మీయుడైన కృష్ణారావుని పిల్చి.. 

“నిన్న జరిగిన మెడికల్ క్యాంప్ తాలూకు రిపోర్ట్స్ వచ్చాయిట. వాళ్ళు నన్ను మళ్లీ రమ్మన్నారు. నాతో హాస్పిటల్ కి రారా” అన్నాడు సత్యం.. జరిగింది చెప్పి తనతో పాటు హాస్పిటల్ కి రమ్మని కోరుతూ. 


ఇంటికి ఫోన్ చేసి “సుందు.. నాకు అర్జంట్ గా బయటికెళ్ళే పని పడింది. సాయంత్రం లేట్ గా వస్తాను. అమ్మకి, నాన్నకి చెప్పు” అని.... సత్యం కృష్ణారావుని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాడు. 


డాక్టర్ సత్యాన్ని “ సర్ మీరు ఇన్ పేషెంట్ గా ఎడ్మిట్ అవ్వాల్సి రావచ్చు. ముందు కొన్ని టెస్ట్ లు వెంటనే చెయ్యాలి. ఈ మధ్య కాలంలో మీకు అలసటగా ఉండటం కానీ, కాళ్ళూ-చేతులూ భరించలేనంత నొప్పులుగా ఉండటం కానీ గమనించారా? ఇంకా ఏమైనా అసాధారణ లక్షణాలు మీ ఆరోగ్యంలో మీ దృష్టికొచ్చాయా?" అని అడిగాడు. 


సత్యం "అవునండీ.. ఈ మధ్య నాకు కాళ్ళు బాగా నొప్పెడుతున్నాయంటే నా భార్య వేడి చేసి ఉంటుంది అని కొబ్బరి నీళ్ళు, మజ్జిగ నాచేత ఎక్కువగా తాగిస్తున్నది. అలాగే అలసటగా ఉండి కాళ్ళు నొప్పులంటే రక్త హీనత అయ్యుంటుంది అని డ్రై ఫ్రూట్స్ రాత్రి నీళ్ళల్లో నానేసి పొద్దున్నే పెడుతున్నది" అనిచెప్పాడు. 


కృష్ణా రావుని పక్కకి పిల్చి డాక్టర్ "నిన్న టెస్ట్ ల్లో అనుమానమొచ్చి మళ్ళీ ఇవ్వాళ్ళ అందుకే రమ్మన్నాము. పాపం చిన్న వయసు. మన వంతు ప్రయత్నం మనం చేద్దాము. ఇంట్లో వాళ్ళు ఎలా తట్టుకుంటారో? ఎలాగో మీరే వారి తల్లిదండ్రులకి, భార్యకి చెప్పి జరగబోయేదానికి సిద్ధం చెయ్యండి" అని.. వాళ్ళ వరకు ఇది ఏదో సామాన్య విషయం అన్నట్టుగా చెప్పి లోపలికి వెళ్ళి పోయాడు. 


ఇది వింటూనే కృష్ణా రావు పక్కన బాంబ్ పడ్డట్టు అదిరిపడ్డాడు. 


=======================================================================

                                                       ఇంకా వుంది..


========================================================================


మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :  ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


ree



ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page