top of page

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 11

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

ree

Dayyam@thommido Mailu - Part 11 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 04/11/2025

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక

రచన: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని టాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథంతో కలిసి బయలుదేరుతాడు ఎస్సై మోహన్. తిరిగి వచ్చేటప్పుడు పొలాల్లో ఉన్న తెల్లటి ఆకారం అతన్ని గాయపరుస్తుంది.


తన ప్రేయసి రితికకు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమ్ అనే యువకుడు తొమ్మిదో మైలు దగ్గర దిగుతాడు. ఆ చీకట్లో తనకెదురైన వ్యక్తి రితిక అన్నయ్య మురళి అని తెలుసుకుంటాడు.


తన తండ్రి మరణం దయ్యంవల్లనో భయం వల్లనో కాదని చెబుతాడు మురళి. ఆ విషయంగా లోతైన దర్యాప్తు జరపాలని అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు నిర్ణయిస్తాడు. అనూహ్యంగా ఆయనకు యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్ళు కోల్పోతాడు. అతని కొడుకే గౌతమ్.


హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో మైలు దగ్గర నైట్ స్టే చెయ్యడానికి బయలుదేరుతారు. దయ్యం వారిలో చిట్టిబాబును తీవ్రంగా గాయపరుస్తుంది. అతనికి తగిలిన గాయాల పట్ల అనుమానం వస్తుంది మోహన్ కు.


గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 11 చదవండి. 


ఆరు నెలల క్రితం…

గౌతమ్ తన తండ్రి యాక్సిడెంట్   విషయం గురించిన ఆలోచనల్లో తలమునకలై ఉన్నప్పుడు మురళి మెల్లగా చెప్పడం ప్రారంభించాడు.


“గౌతమ్, ఈ ‘దయ్యం కథ’ నిజంగా పది సంవత్సరాల క్రితమే మొదలైంది… ఆ రోజు జరిగినదే నేటి రహస్యానికి మూలం.”

పది సంవత్సరాల క్రితం…

ఒక వేసవి సాయంత్రం. రోడ్డుపక్కన ఉన్న పొలాల మధ్య నెమ్మదిగా ఆగింది ఓ ఖరీదైన కారు. నలుగురు తెల్లటి షర్ట్లు, సన్ గ్లాసులు వేసుకున్నవాళ్లు బయటకు దిగారు. పచ్చటి పొలాలతో నిండిన ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తూ, తక్కువ స్వరంలో మాట్లాడుకుంటున్నారు.


పక్కనే ఉన్న తన పొలంలో, మోటార్ ఆన్ చేసి నీళ్లు వదులుతున్న రైతు రంగయ్య, వాళ్లను గమనించి దగ్గరికి వచ్చాడు.


“ఎవరు మీరు? ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నారు?” అన్నాడు కొంత అనుమానంగా.


“చెన్నై నుండి వచ్చాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. ఏరియాలో అమ్మకానికి భూములు దొరుకుతాయేమోనని వచ్చాం.. మీ మాజీ సర్పంచి కామయ్య గారు రమ్మన్నారు.” చెబుతారు  వాళ్ళు. 


“అయ్యో! మాకు తెలియలేదు!” అని రంగయ్య ఆశ్చర్యపోయాడు.

కొద్దిసేపటికి కామయ్య, బైక్‌పై ఇద్దరు అనుచరులతో వచ్చాడు.

"ఏందన్నా.. భూముల కొనుగోలుకు వీళ్లను రమ్మన్నావట.. మాకెవ్వరికీ  తెలీదే" అన్నాడు రంగయ్య.


"ఇప్పటి సర్పంచి మీ వాడైనంత మాత్రాన ప్రతిదీ మీకు చెప్పాలా? అయినా అమ్మేది మా వాళ్ళ భూములేలే.." అన్నాడు మాజీ సర్పంచి కామయ్య.


"అది కాదన్నా.. చిన్న కుగ్రామంలో ఉండే వాళ్ళం. ఏ  గ్రూప్ లో ఉన్నా మంచి చెడ్డా అందరం రచ్చబండ దగ్గర కూర్చుని  మాట్లాడుకుంటాము కదా." అన్నాడు రంగయ్య.


"ఇప్పటికిప్పుడు బేరం తేల్చెయ్యము కదా. బేరసారాలు సాగాలి కదా. విషయం కొంత కదిలాక చెబుతములే. సరే.. నువ్వు పనిలో ఉన్నట్లున్నావు. పద.. " అన్నాడు కామయ్య.


"మోటారు ఆన్ చేసి, పొలాలకు నీళ్లు వదిలాను. ఇంకో రెండు గంటలు పారాల. అంతవరకు ఖాళీనే. కూడా ఉంటానులే." అన్నాడు రంగయ్య.


"ఇక్కడ భూముల రేటు ఎంత ఉంది?" అడిగారు కారులో వచ్చిన  వ్యక్తులు.


"రోడ్డు పక్కనయితే ఎకరం పది లక్షలు ఉంది. కాస్త లోపలి వెళితే ఎకరం ఐదు లక్షలు. వాగుకు ఆ పక్కయితే ఎకరం లక్ష మాత్రమే.  ఎందుకంటే వాగు దాటేందుకు బ్రిడ్జి లేదు. రోడ్డు కూడా సరిగ్గా లేదు. మా ఉరికి బస్సులు, ట్రాక్టర్లు   కూడా వెళ్లవు." చెప్పాడు కామయ్య.


"అంత రేట్ అనుకోలేదు.. అసలే మమ్మల్ని అడిగిన వాళ్ళు మహా పిసినారి వాళ్ళు. మరోసారి కలుస్తాము. మాకు వంద ఎకరాలు కావాలి. ఇప్పించిన వాళ్లకు మంచి కమీషన్ ఉంటుంది" అని చెప్పి వెళ్లిపోయారు.

 

అప్పట్లో మురళి తండ్రి దీనదయాళు ఆ ఊర్లో అందరికీ తలలో నాలుకలా వుండే వ్యక్తి. పదవీ వ్యామోహం లేనివాడు. కామయ్యకు డబ్బు పిచ్చి ఎక్కువ. అందుకని అతనికి పోటీగా ఒక మంచి వ్యక్తిని నిలబెట్టి గెలిపించాడు. అప్పటినుండి కామయ్యకు దీనదయాళు అన్నా, అతన్ని సమర్ధించే వాళ్ళన్నా పడదు.


"చూసావుగా రంగయ్యా. ఏదో ఒకమాట అడిగి వెళ్లిపోయారు. దానికే మాకు చెప్పలేదంటూ పెద్ద ఇదైపోయావు. ఇంక ఎగేసుకుంటూ వెళ్లి మీ వాళ్లకు చెప్పు" అన్నాడు కామయ్య.


అతను చెప్పినట్లుగానే ఆ సాయంత్రం దీనదయాళు వర్గం కాల భైరవ ఆలయం వద్ద సమావేశమయ్యారు. రంగయ్య చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు దీనదయాళు.


ఏదైనా ఫ్యాక్టరీ కట్టాలన్నా, సెజ్ ..అంటే పారిశ్రామిక వాడ లాంటిది ఏర్పాటు చెయ్యాలన్నా, లేదా ప్రభుత్వం ఏదైనా కాలువలు తవ్వాలన్నా పెద్ద మొత్తంలో భూములు అవసరమవుతాయి.  ఎక్కువ ధర పలికితేగానీ ప్రజలు అమ్మకానికి మొగ్గు చూపరు. కాబట్టి భూముల రేట్లు భారీగా పెరుగుతాయి.


ఐతే కొందరు స్వార్థపరులు ముందుగా వాళ్ళే బినామీ పేర్లతో ఆ భూములు కొనుక్కుంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు పది రేట్లు లాభంతో అమ్ముతారు.


ఇటీవల ఒక ఊరిలో సెజ్ ఏర్పాటు చేశారు. అంతకు రెండేళ్ల ముందే కొందరు వ్యక్తులు రెట్టింపు ధరతో ఆ ఊర్లో భూములు కొన్నారు. ఇప్పుడు పదిరెట్లు లాభంతో అమ్ముకున్నారు. మన ఊర్లో కూడా అలాంటిదేదో జరగబోతోంది. ఎవ్వరూ తొందర పడి భూములు అమ్మవద్దు. దళారులు లాభం ఆశించడంలో తప్పు లేదు. కానీ పది రూపాయలు లాభం వస్తే అందులో తొమ్మిది రూపాయలు వాళ్ళ జేబులోకి వెళ్లాలని ఆశిస్తే ఊరుకోను" అన్నాడు దీనదయాళు.


ఆ పక్కరోజు దగ్గర్లోని పట్టణంలో ఉన్న ఒక ద్వితీయ శ్రేణి నాయకుడి ఇంట్లో..


"నేను ముందే చెప్పను కదా అన్నా. ఆ దీనదయాళు ప్రతి పనికీ అడ్డం వస్తాడు. తాను తినడు. ఇంకొకరిని తిననివ్వడు. ఇక మా ఊర్లో భూములు సేకరించడం దేవుడి వల్ల కూడా కాదు" అన్నాడు కామయ్య.

"దేవుడి వల్ల కాకపోవచ్చు. కానీ దయ్యం వల్ల జరుగుతుంది" అన్నాడు ఆ నాయకుడు.


"అంటే..?" అర్థం కానట్లు చూసాడు కామయ్య.


“అర్థం చేసుకో. భయమే పెద్ద ఆయుధం. ఒకసారి ఆ ఊర్లో దయ్యం ఉందని పుకారు పుట్టితే ఎవ్వరూ ఆ ప్రాంతంలో అడుగుపెట్టరు. అప్పుడు భూములు విలువ తగ్గుతాయి. మన వాళ్లు తక్కువ ధరకు కొనేస్తారు.”


“కానీ ప్రజలు నమ్ముతారా?” అన్నాడు కామయ్య.


“మన దగ్గర మీడియా ఉంది, మన దగ్గర పూజార్లు, మంత్రగాళ్లు ఉన్నారు. ఇద్దరు నటులు చాలు. రాత్రి పొలాల్లో కనిపిస్తే, ఒక వారం లోపే ఊరు ఖాళీ అవుతుంది. దయ్యం@తొమ్మిదోమైలు ఆరంభం అవుతుంది,” అన్నాడు రాజకీయ నాయకుడు రమణయ్య.


కామయ్య చప్పట్లు కొట్టాడు.. "అదే కావాలన్నా. దయ్యాన్ని సృష్టించామంటే భయంతో దొరికిన రేటుకి భూములు అమ్ముకుంటారు" ఆనందం పట్టలేక పోయాడు కామయ్య.

***

చెన్నై వాళ్ళు వచ్చి వెళ్లిన  వారం తరువాత..

తొమ్మిదో మైలు దగ్గర బస్సు దిగారు ఇద్దరు గ్రామస్థులు. అప్పుడు రాత్రి పది గంటలు. చింత చెట్టు కింద రెండు తెల్లటి ఆకారాలను చూసారు వాళ్ళు. ఇద్దరికీ గుండె ఆగినంత పనైంది. ఒక వ్యక్తి పెద్దగా విజిల్ వేయడంతో వెళ్తున్న బస్సు కాస్త దూరంలో ఆగింది. యిద్దరూ వేగంగా బస్సు దగ్గరికి పరుగెత్తారు. ఆ తెల్లటి ఆకారాలు వాళ్ళను వెంబడించాయి.


"బస్సు ఎందుకు ఆపావు? ముందుకు     పోనియ్యి" అంటూ డ్రైవర్ ను హెచ్చరించారు కొందరు.


"పాపం..వాళ్ళను రానియ్యి డ్రైవరన్నా.." అన్నారు మరికొందరు.


వాళ్లకు సహాయంగా బస్సునుండి యిద్దరు యువకులు ధైర్యంగా కిందికి దిగారు.


అది చూసి దయ్యంలాంటి ఆకారాలు ఆగిపోయాయి.


ఇంతలో ఆ యిద్దరూ బస్సులోకి వచ్చేసారు. డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసాడు.

బస్సులోని వాళ్ళందరూ ఆ ఇద్దరి చుట్టూ మూగారు. విషయమేమిటని ఆరా తీశారు.


"మాకు కూడా తెలియదన్నా. మా రూట్లో ఇప్పటివరకు దయ్యాలను చూసింది లేదు. ఇదే మొదటిసారి. ప్రాణం పోయినట్లయింది" చెప్పారు వాళ్ళు.


టౌన్ లోకి వెళ్ళాక డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గర బస్సును ఆపాడు.

పోలీసులకు విషయం వివరించారు డ్రైవర్, కండక్టర్.

పోలీసులు ఆ ఇద్దరి దగ్గరా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ ఇద్దరు గ్రామస్థులను విచారించి, వారు చెప్పింది రికార్డ్ చేశారు. బస్సులోని తోటి ప్రయాణీకులను కూడా విచారించారు.పక్కరోజు అన్ని పేపర్లలో 'తొమ్మిదో మైలు దగ్గర దయ్యం' అంటూ ఫ్రంట్ పేజీలో వార్తలు, కథనాలు వచ్చాయి.

ఆ రోజు సాయంత్రం కాల భైరవ ఆలయం దగ్గర తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యాడు దీనదయాళు.


"ఇప్పుడిప్పుడే వాళ్ల ప్లాన్ అర్థం అవుతోంది.

మనల్ని భయపెట్టి మన భూముల్ని తక్కువ రేటుకి కొనెయ్యాలనుకుంటున్నారు. ఎవ్వరూ భయపడకండి. మన తాతలు చెప్పిన కథల ప్రకారం కూడా దయ్యాలు వాళ్లకు అన్యాయం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాయి. మన ఊరి వాళ్ళెవ్వరూ ఎవరికీ అపకారం చెయ్యలేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ భయం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఒకరినుంచి ఒకరికి సులభంగా అంటుకుంటుంది. మనలో చదువుకున్న ప్రతి ఒక్కరూ మిగతా వారికి ధైర్యాన్ని నూరిపోయాలి.  " అన్నాడు దీనదయాళు. 


రంగయ్య మాట్లాడుతూ "మన వేటపాలెం ఊరినుండి వాగు వరకు ఉన్న భూమిని కాలభైరవ స్వామి కాపాడుతాడని మన ఊరి వాళ్ళు నమ్ముతారు. కాబట్టి వాగుకి ఇటువైపు వాళ్ళు అంతగా భయపడరు. వాగుకి అటువైపు, నేను ప్రాణం పోయినా భూమిని అమ్మను. రోడ్డు పక్కన భూములు వుండి  సిటీలో స్థిరపడ్డ  వాళ్ళు కూడా అమ్మరు. వాళ్ళు మంచి రేటు వచ్చేవరకు ఆగుతారు" అన్నాడు రంగయ్య.   


"అదే మనకు కావలసింది. వాళ్లకు మొత్తం భూమి ఒకే చోట కావాలి. మధ్య మధ్య మన భూములు వుంటే వాళ్లకు ఉపయోగం ఉండదు. ఈ కాలభైరవ ఆలయానికి దాదాపు పది ఎకరాలు గుడి మాన్యపు భూములు ఉన్నాయి. అవి కొందరు రైతులు దానం చేసిన భూములు. అవి కూడా అక్కడక్కడా ఉన్నాయి. కాబట్టి అంత సులభంగా వాళ్ళు అనుకున్నది జరగదు" చెప్పాడు దీనదయాళు. 


కానీ ఆ కాల భైరవ ఆలయ భూముల గురించి ఆక్రమణ దారులకు ముందే తెలుసు. అందుకు తగ్గ ఉపాయం అలోచించి ఉన్నారనే విషయం దీనదయాళు బృందానికి అప్పట్లో తెలియదు.

=========================================================

ఇంకా ఉంది

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 12 త్వరలో

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 







Comments


bottom of page