top of page

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7

Updated: 2 days ago

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

ree

Dayyam@thommido Mailu - Part 7 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 08/10/2025

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని టాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం తో కలిసి బయలుదేరుతాడు ఎస్సై మోహన్. తిరిగి వచ్చేటప్పుడు చింత చెట్టు కొమ్మ విరిగి పడటంతో జీప్ ఆగుతుంది. పొలాల్లో ఉన్న తెల్లటి ఆకారం దగ్గరకు వెళ్తాడు ఎస్సై మోహన్. ఆ ఆకారం అతన్ని గాయపరుస్తుంది. ఈ విషయాలన్నీ న్యూస్ ఛానళ్లలో వస్తాయి. 


ఆరు నెలల క్రితం కొందరు బి టెక్ స్టూడెంట్స్ తొమ్మిదో మైలు దగ్గర్లో ఉన్న శివయ్య జలపాతం టూర్ ప్లాన్ చేస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు తన ప్రేయసి రితికకు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమ్ అనే యువకుడు తొమ్మిదో మైలు దగ్గర దిగుతాడు. 

ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7 చదవండి. 


హఠాత్తుగా తన ఎదురుగా ప్రత్యక్షమైన ఆ తెల్లటి ఆకారాన్ని చూసి ఒక క్షణం భయపడ్డాడు గౌతమ్. కానీ అంతలోనే తమాయించుకొని "ఎవరు నువ్వు?" అని ప్రశ్నించాడు. 


"ఫర్వాలేదు. ధైర్యవంతుడివే" అన్నాడు తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తి. 


"నా ధైర్యం సంగతి అటు ఉంచు. చూస్తూ ఉంటే స్థానికుడిలా ఉన్నావు. నీకు దయ్యమంటే భయంలేదా.. లేక నువ్వే దయ్యానివా?” అడిగాడు గౌతమ్. 


ఆ వ్యక్తి, గౌతమ్ కు మరి కాస్త దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు అతడు మనిషేనని స్పష్టంగా తెలుస్తోంది. 


"నువ్వు వస్తున్నావని, నీకు తోడుగా ఉండమని రితి చెప్పింది” అన్నాడు అతను. 


"అలాగా.. మీ పేరేమిటి?" అడిగాడు గౌతమ్. 


"పేరుతో పనేముందిలే.. స్థానికుడిని అన్నావు కదా. కాబట్టి లోకల్ మాన్ అని పిలువు" అన్నాడు అతడు. 


క్షణం ఆలోచించాడు గౌతమ్. ఒకసారి రితికను 'రితి' అని పిలిస్తే అలా పిలవద్దని చెప్పింది. ఎందుకని అడిగితే తన అన్నయ్య మురళి ఒక్కడే అలా పిలుస్తాడని, తనను అన్నయ్యలా అనుకోవడం లేదని చెప్పింది. అంటే ఇతను మురళి యేనా.. 


పగటిపూట అయి ఉంటే అతనిలో రితిక పోలికల కోసం వెతికేవాడు. ఇప్పుడా అవకాశం లేదు. ఇతను మురళి అయితే ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నాడు? రితికతో తన పరిచయం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నాడా.. ఒకవేళ తను రితికను ప్రేమిస్తున్నట్లు చెబితే ఈ చీకట్లో తనకు ఏదైనా హాని తలపెట్టి, ఆ నేరం దయ్యం మీదకు నెడతాడా.. 


ఆ వ్యక్తి గౌతమ్ ముఖం మీద చిటిక వేయడంతో ఆలోచనలోంచి బయటకు వచ్చాడు. 


"ఏమిటి.. ఏదైనా వెహికల్ దొరికితే ఎక్కి పారిపోదాం అనుకుంటున్నావా?" అడిగాడు అతను, గౌతమ్ భుజం మీద చేయి వేస్తూ. 


"భయపడే వాడినైతే ఒంటరిగా ఇక్కడ దిగేవాడిని కాదు. దయ్యం సంగతో, దయ్యంలాంటి మనిషి సంగతో తేల్చుకోవాలని ఇక్కడకు వచ్చాను. ఈ రాత్రి విషయం తేల్చి గాని వెళ్ళను. రితిక కోసం ఆమాత్రం చేయలేనా?" ధైర్యంగా అన్నాడు గౌతమ్. 


"ఓహో అదా విషయం. ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా" అడిగాడు. 


"మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రితిక తన అన్నయ్య మాట జవదాటనని చెప్పింది. ఆయన అనుమతి తీసుకున్నాకే మా వివాహం జరుగుతుంది. మాది టైం పాస్ ప్రేమ కాదు. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం" అన్నాడు గౌతమ్. 


"వెరీ గుడ్. ఆ మురళి నాకు తెలిసిన వ్యక్తి. నేను కూడా అతనికి నీ గురించి రెకమెండ్ చేస్తానులే" అన్నాడు అతను. 


"ఇంతకీ నీ పేరు చెప్పనే లేదు..?" అడిగాడు గౌతమ్.


"చెప్పానుగా లోకల్ బాయ్ అని.. అలాగే పిలువు. మనం ఊర్లోకి వెళదాం పద. ఈ రాత్రికి మా ఇంట్లో ఉందువు గాని" అన్నాడు అతను. 


"లేదు లోకల్ బాయ్. రితిక నన్ను ఇక్కడే ఉండమంది. ఊర్లో ఎంతోమంది ఉంటారు కదా.. అక్కడ ఉండడంలో ధైర్యం ఏముంది" అన్నాడు గౌతమ్. 


"నాకు మాత్రం అంత ధైర్యం లేదు ఫ్రెండ్. ఊర్లో నుంచి నా స్నేహితుడు ఒకడు బైక్ లో వస్తున్నాడు. ఇప్పుడు వాగులో నీళ్లు లేవు కాబట్టి సులభంగానే ఊర్లోకి వెళ్ళవచ్చు. నువ్వు వస్తానంటే త్రిబుల్స్ లో వెళ్దాము. ఎక్కువ బరువు ఉంటే దారిలో దయ్యం తోసినా పడము కదా" అన్నాడు నవ్వుతూ. 


"చెప్పానుగా.. రితిక చెప్పిన మాట తప్పను. నీకు వీలైతే ఒక్క సహాయం చేయి. ఆ చింత చెట్టు పక్కన పొలాల్లో ఒక షెడ్ ఉంది కదా.. ఈ రాత్రికి అక్కడ ఉంటాను. ఆ షెడ్ ఎవరిది? లాక్ చేసి ఉందా" అడిగాడు గౌతమ్. 


"రంగయ్య తాతది. రాత్రిపూట కరెంట్ ఇచ్చినప్పుడు పొలాలకు నీళ్లు పట్టడానికి దగ్గరే ఉంటాడు. ఎవరెంత చెప్పినా వినడు. అప్పట్లో దెయ్యానికి భయపడి ఎంతమందో భూములు అమ్ముకొని వెళ్లినా రంగయ్య లెక్క చేయలేదు. 'ఎక్కడో చచ్చే బదులు నా పొలంలో చనిపోతే అంతకంటే అదృష్టం ఏముంటుంది' అనేవాడు. ఈ వారం ఉదయం కరెంటు కాబట్టి అతను ఇంట్లోనే ఉంటాడు. ఆ షెడ్ కు గడియ పెట్టుకుని వెళ్ళిపోతాడు కానీ ఎప్పుడూ తాళం వేయడు" అన్నాడు ఆ వ్యక్తి. 


"అయితే ఈ రాత్రికి నేను అక్కడే ఉంటాను" అన్నాడు గౌతమ్. 


"నీ ఇష్టం. ఆ చింత చెట్టు దగ్గర దయ్యం ఉంటుందని విన్నాను. కాబట్టి నేను అటువైపు రాలేను. ఏమీ అనుకోవద్దు. నువ్వు ఒక్కడివే ధైర్యంగా వెళ్ళు" చెప్పాడు ఆ యువకుడు. 


"లోకల్ బాయ్ కూడా భయపడడం ఆశ్చర్యంగా ఉంది. కాసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని అడిగాను. అంతేకానీ భయం చేత కాదు. పర్వాలేదులే.. నేనొక్కడినే వెళ్తాను" అంటూ చింత చెట్టు వైపు కదిలాడు గౌతమ్. 


వెనకనుంచి ఆ వ్యక్తి "ఆగాగు. నిన్ను ఒంటరిగా వదలడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఏమైతే అది జరగనీ. నేను కూడా రాత్రంతా నీతోనే ఉంటాను" అన్నాడు అతను. 


"వద్దు, నేను ఒంటరిగానే ఉండాలనుకున్నాను. ఒక గంట సేపు మాట్లాడుకుందాము. మీ ఫ్రెండ్ ను ఆ తర్వాత రమ్మని చెప్పు" అన్నాడు గౌతమ్. 


"అలాగే పద" అన్నాడు అతను. ఇద్దరూ చింత చెట్టును సమీపించారు. గాలికి కొమ్మలు బలంగా ఊగుతూ ఉండడంతో వాతావరణం భయంకరంగా అనిపిస్తోంది. ఆ చెట్టు పక్కనే ఉన్న పొలం గట్ల మీద నడుచుకుంటూ ఇద్దరూ ఆ షెడ్ ను చేరారు. లోకల్ బాయ్ చెప్పినట్లుగానే తాళం వేయలేదు. అతనే గడియ తీసి లోపలికి వెళుతూ గౌతమ్ ను కూడా రమ్మన్నాడు. గౌతమ్ కూడా లోపలికి వచ్చాక తలుపు మూసి గడియ పెట్టాడు. 


సెల్ వెలుతురులో స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్లి లైట్ ఆన్ చేశాడు. వెలుతురు వచ్చాక కాస్త స్థిమితపడ్డాడు గౌతమ్. అప్పుడు ఆ లోకల్ బాయ్ ముఖం వంక పరిశీలనగా చూశాడు. ఆ ముఖంలో రితిక పోలికల కోసం వెతుకుతున్నాడు. 


"తొమ్మిదో మైల్ దగ్గర చూడాల్సింది ముఖం వంక కాదు. కాళ్ళ వంక చూడాలి. అప్పుడే ఎదురుగా ఉండేది మనిషా దయ్యమా అనేది తెలుస్తుంది" అన్నాడు అతను గౌతమ్ వంక సూటిగా చూస్తూ. 


అతని పాదాల వంక చూసిన గౌతం ఉలిక్కిపడ్డాడు. 

***

మరుసటి రోజు కూడా ఎంతోమంది విలేఖరులు ఎస్సై మోహన్ దగ్గరకు వచ్చి వివరాలు సేకరించారు. ఇద్దరు వ్యక్తులు మోహన్ తో మాట్లాడుతూ తాము ఒక హేతువాద సంస్థ నుండి వచ్చామని, దయ్యం కనపడ్డ ప్రదేశంలో ఒక డేరా వేసుకొని నాలుగైదు రాత్రులు అక్కడే గడుపుతామని చెప్పారు. అందుకు పోలీసుల అనుమతి అవసరమైతే అందుకోసం అర్జీ రాసి ఇస్తామని చెప్పారు. 


అప్పుడు మోహన్ మాట్లాడుతూ "ఆ తొమ్మిదో మైలు అనేది నిషేధిత ప్రాంతం ఏమీ కాదు. ఎంతోమంది ఆ ప్రాంతం మీదుగా అటు ఇటు వెళ్లి వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉండడానికి మేము అనుమతి ఇచ్చే అవసరం ఉండదు. కానీ ఒక్క విషయం అడుగుతాను.. సమాధానం ఇస్తారా" అన్నాడు. 


అడగమన్నారు వాళ్ళు. 


"ఆ ప్రాంతంలో దయ్యం ఉందని కొందరు నమ్ముతున్నారు. ఒకవేళ దయ్యం కాకపోతే ఎవరైనా మనుషులు దయ్యం లాగా భయపెడుతూ ఉండాలి. ఏ జంతువు అయినా జనాల మీద దాడి చేస్తూ ఉండవచ్చు. అక్కడ దయ్యాలు ఉన్నాయి అనగానే, మేము అక్కడ ఉండి లేదని నిరూపిస్తామనడం ధైర్యం కాదు. ఒకరకంగా ఆవేశంలో తీసుకునే నిర్ణయం. ఒకవేళ దయ్యం పేరుతో ఎవరైనా దుండగులు, జనాల మీద దాడి చేసి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అనుకుందాం. మీరిద్దరూ వెళ్లి అక్కడ డేరా వేసుకుంటే, మీ మీద వాళ్ళు దాడి చేయరని నమ్మకం ఏమిటి?


నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెబుతాను వినండి. మా ఊర్లో ఒక పాత బావి ఉండేది. ఎవరిదో గోల్డ్ చైన్ అందులో పడిపోవడంతో పైనుండి తాడు కట్టుకొని ఒక వ్యక్తి లోపలికి దిగాడు. దిగిన కొంతసేపటికి తనను పైకి లాగమని చేతులు ఊపాడు. పైకి వచ్చేసరికి అతను స్పృహ కోల్పోయి ఉన్నాడు. కొంత సేపటికి స్పృహలోకి వచ్చి, ఎవరో తన గుండెలను బలంగా అదిమిపెట్టినట్లు అనిపించిందని చెప్పాడు. గతంలో ఎప్పుడో ఆ బావిలో చనిపోయిన వ్యక్తి తాలూకు దయ్యం అలా చేసిందని ఊరి వాళ్ళందరూ అనుకున్నారు. 


హేతువాద సంఘం నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ముందుగా ఒక వ్యక్తి లోపలికి దిగాడు. అతను కూడా ఊపిరి ఆడనట్లు సైగలు చేయడంతో వెంటనే పైకి లాగారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు రెండో వ్యక్తి తను లోపలికి దిగుతానని మొండిపట్టు పట్టాడు. అప్పుడు అక్కడ టీచరుగా పనిచేస్తున్న మా నాన్న అతన్ని వారించి, 'హేతువాదం అంటే కారణాలు వెదకాలి' అని చెప్పాడు. 'ఆ బావిలోకి దిగి మనుషులు చనిపోవడం అనేది వాస్తవం. దాన్ని ఎవరూ కాదనలేరు. చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించడమే హేతువాదమని, ఆలోచించకుండా లోపలికి దిగడం తప్పని అతన్ని ఒప్పించారు మా నాన్న. 


తరువాత ముఖానికి ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని, కొంతమంది అక్కడ చనిపోయి పడి ఉన్న జంతువుల కళేబరాలను పైకి తీసుకొని వచ్చారు. పోస్ట్ మార్టం లో ఆ జంతువులు విషవాయువుల ప్రభావం వల్ల చనిపోయినట్లు తెలిసింది. చివరగా ఆ పాడు పడ్డ బావి నుండి ప్రాణాలకు హానికరమైన వాయువులు వెలువడుతున్నట్లు, అందువల్లనే అందులోకి దిగిన వాళ్ళు మరణించినట్లు ప్రకటించారు. 


అలాగే ఇప్పుడు దయ్యం కనబడుతోంది అనే విషయం మీద కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. విషయం మా దృష్టికి వచ్చినప్పటినుండి మేము ఈ విషయంగా తీవ్రంగా పరిశోధిస్తున్నాము" చెప్పాడు మోహన్. 


ఆ వ్యక్తులు మాట్లాడుతూ "మీరు చాలా ఓపిక తీసుకుని, మా మంచి ఆలోచించి, చక్కటి సలహాలు ఇచ్చారు. కానీ ఇలాంటి సాహసాలు మాకు కొత్త కాదు. ముఖ్యంగా దయ్యాల విషయంలో మేము ఇప్పటికే ఎన్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ దయ్యాలు లేవని నిరూపించాము. 


మేము వెళ్లి అక్కడ రెండు మూడు రాత్రులు గడిపితే ప్రజల్లో ఉన్న భయాలు తొలగిపోతాయి. లేదంటే ఆ చుట్టుపక్కల ఏ మరణం సంభవించినా అందుకు దయ్యమే కారణం అనే పుకార్లు పెరుగుతాయి. మీ అనుమతి అవసరం లేదని మీరే చెప్పారు. కాబట్టి మేము అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాము. 


రాత్రుళ్ళు పూర్తిగా మా పరిసరాలను ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటాము. అవసరమైతే మీ సహాయం కోరుతాము" అని చెప్పి స్టేషన్ నుండి బయటకు వచ్చారు. బస్టాండ్ దగ్గరకు వెళ్లి ఒక టాక్సీని పిలిచి తొమ్మిదో మైల్ దగ్గరకు వెళ్దామని అన్నారు. 



టాక్సీ డ్రైవర్ వీళ్ళ వంక పరిశీలనగా చూస్తూ "ఎందుకు సార్? అక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా" అని వినయంగా అడిగాడు. 


"మా బాబాయ్ కనపడకుండా పోయి రెండేళ్లయింది. ఆయన దయ్యమై అక్కడ తిరుగుతున్నాడని ఎవరో చెప్పారు. ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాం" అన్నాడు ఒక వ్యక్తి. 


అతను ఎగతాళిగా అలా అంటున్నాడని గ్రహించాడు ఆ టాక్సీ డ్రైవర్. 


"చూడండి.. మీరు ఇంతవరకు అక్కడ దయ్యం 'ఉందట' అనే మాటనే విని వింటారు. కానీ 'అక్కడ దయ్యం ఉంది. నేను చూశాను.. ' అనే మాట మీతో ఎవరైనా చెప్పారా?" అని అడిగాడు. 


"లేదు. అందుకే అది పుకారని మా నమ్మకం. అది రుజువు చేయడానికి వెళుతున్నాము" చెప్పాడు రెండో వ్యక్తి. 


"అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఆ దెయ్యాన్ని మొదటిసారిగా చూసింది నేనే. నా పేరు రాజు. ఆ రోజు నా కారుకు అడ్డంగా వచ్చి నుంచుంది. నా గుండె ఒక్క క్షణం ఆగి మళ్లీ కొట్టుకుంది. ఇది ముమ్మాటికి నిజం. ప్రాణాల మీద ఆశ ఉంటే అటువైపు వెళ్ళకండి" అని చెప్పాడు. 


"ఇదేమీ రాత్రి కాదు కదా. మిట్ట మధ్యాహ్నం. కాబట్టి మమ్మల్ని కరెక్ట్ గా ఆ స్థలం దగ్గర వదిలిపెట్టు. నువ్వు వెంటనే తిరిగి వచ్చేయవచ్చు" అని చెప్పారు వాళ్లు. 


ఒప్పుకున్నాడు రాజు. వాళ్లు తమతో తెచ్చుకున్న ఫోల్డబుల్ టెంట్ ను కారు డిక్కీలో పెట్టారు. వాళ్లు లోపల కూర్చున్నాక కారును తొమ్మిదో మైల్ వైపు పోనిచ్చాడు రాజు. 



=========================================================

ఇంకా ఉంది

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 







Comments


bottom of page