'Oka Amma Katha Part 1/2' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 19/11/2023
'ఒక అమ్మ కథ పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం
రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"అమ్మా!.. " కడుపును రెండు చేతులతో నొక్కుకుంటూ మెలికలు తిరిగిపోతోంది సుందరి.
పక్క రూమ్ లో ఉన్న సుచిత్ర ఆదుర్దాగా పరుగెత్తుకుంటూ వచ్చింది "ఏమైంది సుందరీ" అంటూ.
"కడుపులో ఒకటే నొప్పి అక్కా.. భరించలేక పోతున్నాను" బాధను అణుచుకుంటూ చెప్పింది సుందరి.
వాళ్ళు ఉంటున్నది ఒక ప్రైవేట్ హాస్టల్.
నిజానికది ఒక వ్యభిచార గృహం. పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ కి వచ్చే వారికి ఇక్కడినుంచి అమ్మాయిల్ని సప్లై చేస్తూ ఉంటారు. అక్కడ దాదాపు పదిమంది వివిధ వయస్సుల అమ్మాయిలు ఉన్నారు.
వేగంగా హాల్ లో ఉన్న ఆ హాస్టల్ నిర్వాహకురాలు రంగనాయకి దగ్గరకు వెళ్ళింది సుచిత్ర.
“సుందరి కడుపు నొప్పితో అల్లాడుతోంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి" అని చెప్పింది.
"ఇప్పుడే రంగయ్యను పనిమీద బయటికి పంపాను. ఓ పావుగంటలో వచ్చేస్తాడు. రాగానే తోడిచ్చి పంపిస్తాను" అంది రంగనాయకి.
అది తోడు కాదని, కాపలా అనీ సుచిత్రకు తెలుసు.
"అంతవరకు ఆగితే సుందరి ప్రాణం పోయేలా ఉంది. తరువాత పోలీసులతో గొడవలు పడాలి. అయినా పారిపోవడానికి అదేం చిన్న పిల్ల కాదుగా! నేను తీసుకెళ్లి భద్రంగా తిరిగి తెస్తాను. నన్ను కూడా నమ్మకుంటే నువ్వైనా తీసుకెళ్ళు". అంది సుచిత్ర.
రంగనాయకి ఇంకా సంకోచిస్తూ ఉండటంతో "నలభై ఐదేళ్ల దాన్ని. ఇరవై ఏళ్ళ నుంచి నీతో ఉంటున్నదాన్ని. ఈ వయస్సులో ఎక్కడికి పోతానని నీ అనుమానం?" అంది కాస్త కోపంగా.
"అబ్బే.. అదేం లేదు. ఆ హాస్పిటల్ పనులూ అవీ నువ్వు చూసుకోలేవని ఆలోచిస్తున్నాను. పైగా ఇప్పుడు బిజినెస్ మానేసి నువ్వు ఈ హాస్టల్ కి వంటమనిషిగా మారిపోయావు". అంది రంగనాయకి.
"వంట పని పూర్తి అయిపోయిందిలే. నీకు తెలిసిన ఆటో ని పిలువక్కా. నేను వెళ్లి సుందరిని తీసుకొని వస్తాను. డబ్బులు కూడా నీ దగ్గర ఎంతుంటే అంత తీసి ఉంచు. లెక్కలు తరువాత చూసుకుందాం" అంటూ లోపలి వెళ్లి సుందరిని తీసుకొని వచ్చింది సుచిత్ర.
రంగనాయకి సహాయంతో సుందరిని ఆటోలో ఎక్కించి, ఆటోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లనీయమంది.
అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి సుందరికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు.
సుచిత్ర ఫోన్ చెయ్యడంతో రంగనాయకి, రంగయ్య హాస్పిటల్ కి వచ్చారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ బయటకు రాగానే సుచిత్ర ఆతృతగా ఎదురువెళ్ళి "పేషేంట్ కి ఎలా వుంది డాక్టర్ గారూ" అని అడిగింది.
ఆ డాక్టర్ సుచిత్ర వంక పరిశీలనగా చూశాడు.
తరువాత ముఖానికున్న మాస్క్ ని తీసి, "మరో అరగంటలో స్పృహ వస్తుంది. మాట్లాడవచ్చు" అని చెప్పి తిరిగి సుచిత్ర వంక సూటిగా చూశాడు.
గుండె ఝల్లుమన్నట్లయింది సుచిత్రకి.
డాక్టర్ కి చేతులు జోడించి థాంక్స్ చెబుతూనే అతన్ని నిశితంగా గమనించింది.
అతనికి సుమారు పాతికేళ్ళుంటాయి.
అతన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది.
ఎక్కడా.. అవును.. సురేష్ అచ్చం ఇలాగే ఉంటాడు.
అంటే ఇతను..
ఆమె ఆలోచనలు తెగక ముందే "మీరు ఎక్కడ ఉంటారు?" అని అడిగాడతను.
ఆలోచనల్లో ఉన్న సుచిత్ర సమాధానం చెప్పలేదు.
తమ హాస్టల్ పేరు, ఉంటున్న వీధి పేరు చెప్పింది రంగనాయకి.
థాంక్స్ చెప్పి మరోసారి సుచిత్ర వంక అదోలా చూసి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్.
మరికాస్సేపటికి నర్స్ వచ్చి పేషంట్ ని చూడవచ్చని చెప్పడంతో రంగనాయకితో కలిసి సుందరి దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పింది. ఆమెను ఆ రోజు సాయంత్రమే డిశ్చార్జ్ చెయ్యడంతో హాస్టల్ కి తీసుకొని వచ్చారు.
ఆ రాత్రి సుందరికి తోడుగా ఆమె గదిలోనే పడుకుంది సుచిత్ర. ఉదయం ఇచ్చిన మత్తు ప్రభావమో, తరువాత వేసిన మాత్రల ప్రభావమోగానీ సుందరి వెంటనే నిద్ర పోయింది. సుచిత్ర ఆలోచనలు మాత్రం ఆ డాక్టర్ చుట్టూనే తిరుగుతున్నాయి. గతం తాలూకు ఆలోచనలు ఆమెను ఆక్రమించుకున్నాయి.
***
ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది సుచిత్ర. జూనియర్ కాలేజీ ఇంటికి దగ్గర్లోనే ఉండటంతో నడిచే వెళ్ళేది. ఇప్పుడు డిగ్రీ కాలేజీ ఇంటికి చాలా దూరం. సిటీ బస్సులో వెళ్ళాలన్నా అర కిలోమీటర్ నడిచి బస్సు ఎక్కాలి.
అందుకని ఆ వీధిలోనే ఉంటూ ఆటో నడుపుకుంటున్న సురేష్ తో మాట్లాడాడు సుచిత్ర వాళ్ళ నాన్న.
సుచిత్రను, అదే కాలనీలో ఉంటున్న ఆమె స్నేహితురాలు మరో అమ్మాయినీ రోజూ ఉదయం కాలేజీలో దింపి తిరిగి సాయంత్రం ఇంటి దగ్గర వదలాలి.
అలా సురేష్ తో పరిచయం అయింది సుచిత్రకి. బాగా కలివిడిగా జోక్స్ వేస్తూ సరదాగా మాట్లాడే సురేష్ అంటే ఆకర్షణ ఏర్పడింది. అందుకు వయసు ప్రభావం తోడైంది. సాయంత్రం ఒక గంట ముందే కాలేజీనుండి బయటకు వచ్చేసేది సుచిత్ర. సురేష్ తో సరదాగా తిరిగి కాలేజీ వదిలేసాక స్నేహితురాలిని ఎక్కించుకొని ఇంటికి వచ్చేది.
ఇలాంటి విషయాలు ఎక్కువ రోజులు దాగవు కదా! స్నేహితులురాలు చెప్పిందో, మరెలా తెలిసిందో కానీ సుచిత్ర పేరెంట్స్ ఈ విషయమై నిలదీశారు.
తాను, సురేష్ ప్రేమించుకుంటున్నామనీ, పెళ్లి చేసుకుంటామనీ ధైర్యంగా చెప్పింది సుచిత్ర.
అందుకు అంగీకరించక, కాలేజీకి ఆటోలో పంపడం మానేశారు.
ఉదయం పూట ఆమె తల్లి బస్ స్టాప్ వరకు తోడు వెళ్లి దగ్గరుండి బస్సు ఎక్కించేది.
సాయంత్రాలు తండ్రి బైకులో కాలేజీ నుండి తీసుకొని వచ్చేవాడు.
ఒకరోజు సాయంత్రం సుచిత్ర తండ్రి కాలేజీ బయట ఎంతసేపు ఎదురు చూసినా సుచిత్ర రాలేదు.
అతన్ని దాటుకొని వెళ్లిపోయిన సుచిత్ర స్నేహితురాలు వెనక్కి తిరిగి వచ్చింది.
"అంకుల్! సుచిత్రకు ఎలా వుంది? మీరు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు?" అంటూ అనుమానంగా అడిగింది.
"అదేమిటి.. సుచిత్రకేమైంది? నేను తనకోసమే వచ్చాను" ఆందోళనగా అడిగాడాయన.
"కాలేజీకి వచ్చిన కాసేపటికే తనకు తలపోటుగా ఉందనీ, ఇంటికి వెళ్ళిపోతున్నాననీ చెప్పింది. నేను తోడు వస్తానంటే వద్దంది" చెప్పింది ఆ అమ్మాయి.
వెంటనే ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పాడాయన. ఆమె వెంటనే బీరువా చెక్ చేసింది. బీరువాలో ఉండాల్సిన మొత్తం నగలు, కాష్ మాయమయ్యాయి. వాటి స్థానంలో ఒక ఉత్తరం కనిపించింది.
‘నేను సురేష్ తో వెళ్ళిపోతున్నాను. నాకోసం వెతకొద్దు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లాంటివి చేస్తే చనిపోతాను. మేము సెటిల్ అయ్యాక మీ నగల తాలూకు డబ్బులు తిప్పి పంపుతామని సురేష్ చెప్పమన్నాడు’
ఇదీ ఆ ఉత్తరం సారాంశం..
***
సుందరి చిన్నగా మూలుగుతుండటంతో ఆలోచనలనుంచి తేరుకొని తన దగ్గరకు వెళ్ళింది సుచిత్ర.
ఆమెకు మంచినీళ్లు తాగించి, కొద్దిసేపు పక్కనే కూర్చొని తలను నిమిరింది. కాసేపటికి సుందరి నిద్రలోకి జారుకుంది.
తిరిగి తన బెడ్ మీదకి వచ్చిన సుచిత్ర మళ్ళీ తన గత జీవితం గురించి ఆలోచించసాగింది.
తన స్వంత ఊరు కాకినాడ. ఆ రోజు సురేష్ తనను ముంబై తీసుకొని వెళ్ళాడు. తన స్నేహితుడు అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానన్నాడని చెప్పాడు. కొన్ని నెలల తరువాత ఉద్యోగం రాలేదనీ, నగలు ఇస్తే అమ్మి టాక్సీ కొనుక్కుని సంపాదిస్తాననీ చెప్పాడు. సంతోషంగా అన్ని నగలూ అప్పగించింది తను.
మరో ఆరు నెలలు గడిచేసరికి తను ప్రెగ్నెంట్ అయింది.
మొదట తనను అబార్షన్ చేయించుకోమన్న సురేష్ తను కోప్పడటంతో మళ్ళీ ఆ మాట అనలేదు.
తనకు కొడుకు పుట్టాడు. అన్నీ సురేష్ పోలికలే.
ఒకరోజు హఠాత్తుగా తండ్రి నుండి ఫోన్ వచ్చింది.
ఇంటినుండి వచ్చేసాక తన నెంబర్ మార్చేసింది. 'మరి ఈ నంబర్ ఎలా తెలిసింది?' అనుకుంది.
ఆనందం, ఆశ్చర్యాలతో గొంతు పెగల్లేదు.
"నాన్నా! మీరా.. ఎలా వున్నారు.. అమ్మ ఎలా వుంది?" గొంతు పెగుల్చుకొని మాట్లాడింది.
“మా జీవితాల్లో ఆనందాన్ని నీతో తీసుకొని వెళ్ళావు. ఎలా ఉంటాం? జీవచ్ఛవాల్లా బ్రతుకు ఈడుస్తున్నాం. దిగులుతో, మీ అమ్మ జబ్బున పడింది. అవమాన భారంతో నేను తలదించుకుని బ్రతుకుతున్నాను" దిగులుగా చెప్పాడాయన.
"ప్రేమించడం నేరమా? మీరు ఒప్పుకొని వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.. నేను సురేష్ తో హాయిగా ఉన్నాను" చెప్పింది తను.
"నీ కొత్త నంబర్ మాకెలా తెలిసిందనుకున్నావ్? అతడే ఇచ్చాడు. ఆస్తి తనపేరుతో రాస్తే తిరిగి వస్తామని ఫోన్ చేసి చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. నీతో మాట్లాడితే కరిగిపోతామని నీ నంబర్ ఇచ్చాడు. ఇప్పటికైనా మించి పోలేదు. కొడుకుని తీసుకొని మా దగ్గరకు వచ్చెయ్యి. ఆ సురేష్ గాడిని వదిలేస్తే నిన్ను మేము చేసుకుంటాము. పోయిన పరువు ఎలాగూ పోయింది. కనీసం నీ కొడుకు బ్రతుకైనా బాగుపడుతుంది" చెప్పాడు తండ్రి.
"మీరు అతన్ని అపార్థం చేసుకుంటున్నారు. సురేష్ చాలా మంచివాడు" చెప్పింది తను.
"నీ కళ్ళకు కమ్మిన పొరలు ఇంకా తొలగలేదు. నా ఊహ నిజమైతే అతను ఈ పాటికి నీ నగలు అమ్మేసి ఉంటాడు" అన్నాడాయన.
"అందులో తప్పేముంది? నీకవసరమైతే అమ్మ తన నగలు ఇవ్వదా? ఆయన్ని చులకన చేసే మీతో నేను మాట్లాడను" అంటూ ఫోన్ కట్ చేసేసింది తను.
సురేష్ ఇంటికి వచ్చాక ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడావంటూ నిలదీసింది.
"ఒక్కతే కూతురివి. నిన్ను దూరం చేసుకొని వాళ్లెలా ఉండగలరు. ఎవరో ఊళ్ళోవాళ్ళకి ఆస్తి ఇచ్చే బదులు మనకిస్తే అందరం కలిసి హాయిగా ఉండొచ్చు కదా అని అడిగాను" చెప్పాడు సురేష్.
"ఆస్తి కోసమే నువ్వు నాకు వల వేసినట్లు వాళ్ళు అనుకుంటున్నారు. నిన్ను తప్పుగా అనుకునే వాళ్ళ ఆస్తి నాకు వద్దు" సురేష్ మీద నమ్మకంతో చెప్పింది తను.
అప్పటికి ఏమీ మాట్లాడలేదు సురేష్.
కానీ క్రమక్రమంగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనమీద చికాకు పడటంతో మొదలు పెట్టి అకారణంగా కొట్టడం, ఇంటికి తాగి రావడం చేయ్యసాగాడు.
అప్పుడర్థమయ్యింది తనకి తండ్రి మాటల్లో నిజం ఉందని. ఆస్తి కోసమే సురేష్ తనని ట్రాప్ చేసాడు. కొద్ది రోజులకు అంతా సద్దుమణిగి ఆస్తి తనకు దక్కుతుందనుకున్నాడు. కుదరక పోవడంతో అతని నిజస్వరూపం బయట పడసాగింది.
కానీ తండ్రి ముందు ఓటమిని ఒప్పుకోవడానికి అహం అడ్డు వచ్చింది తనకి.
అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి ఇంటిదగ్గరే మందు పార్టీ చేసుకోవడం మొదలు పెట్టాడు సురేష్. ఒక రోజు పార్టీకి వచ్చిన వాళ్లలో ఒక వ్యక్తి తనను లొంగదీసుకోవాలని ప్రయత్నించడం జరిగింది. సురేష్ ఫుల్ గా తాగి స్పృహలో లేనట్లుగా పడి ఉన్నాడు.
తన శక్తినంతా ఉపయోగించి అతన్ని నెట్టేసింది. ఇంతలో వెనకనుండి ఎవరో కర్చీఫ్ తో తన ముక్కును అదిమి పెట్టారు. తియ్యటి వాసన ముక్కుకు తగులుతుండగా స్పృహ తప్పింది తనకి.
కళ్ళు తెరిచేసరికి తను ఒక గదిలో బందీగా ఉన్నట్లు గ్రహించింది.
ఒక నడి వయసు స్త్రీ ఒక ప్లేట్ లో రెండు రోటీలు తీసుకొని వచ్చింది. నేనెక్కడ వున్నానని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది. కోపంతో ఆ ప్లేట్ విసిరికొట్టింది తను.
బలిష్టంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి తనను విచక్షణా రహితంగా బెల్ట్ తో స్పృహ కోల్పోయేవరకు కొట్టారు. తిరిగి స్పృహ వచ్చేసరికి వొళ్ళంతా నీరసంగా ఉంది. ఒంటిమీది బట్టలు సవ్యంగా లేవు. మళ్ళీ ఆ నడివయసు స్త్రీ వచ్చింది.
"నీ భర్త నిన్ను ఇక్కడ అమ్మేశాడు. నువ్వు మానుంచి తప్పించుకోలేవు. బుద్ధిగా మేము చెప్పినట్లు వింటే సుఖంగా ఉంటావు"
మరాఠీ యాసతో హిందీలో ఆమె చెప్పిన మాటల సారాంశం ఇదీ!
తన ఫోన్ ఎక్కడుందో తెలీదు. కొడుకు ఎలా ఉన్నాడో తలచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒంటి మీది దెబ్బలకన్నా కొడుకు మీది బెంగ ఎక్కువయింది. ఏమీ చెయ్యలేని నిస్సహాయత, తనను వాళ్ళు పెట్టిన హింస, ఆకలి తనను వాళ్లకు లొంగిపోయేలా చేశాయి.
ఆ వ్యభిచార గృహంలో కొన్ని ఏళ్ళు అలాగే గడిచాయి.
వైజాగ్ కి చెందిన ఒక అమ్మాయిని ఒకడు లవ్ పేరుతో మోసం చేసి వీళ్లకి అమ్మేశాడు.
ఆ అమ్మాయి తండ్రి ఒక రాజకీయ నాయకుడి బంధువు కావడంతో పోలీసులు కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి విచారించారు. ఆచూకీ కనిపెట్టి లోకల్ పోలీసుల సహాయంతో ముంబైలో తను వున్న ఇంటిపైన దాడి చేసి అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళడానికి ముఖం చెల్లక తను అనాధనని చెప్పింది.
తెలుగు మాట్లాడుతున్న వైజాగ్ అమ్మాయితో పాటు తనను కూడా పంపారు. అలా తను ఈ వైజాగ్ చేరింది. ఒక కానిస్టేబుల్ నన్ను ఒక మహిళాసదన్ లో చేరుస్తానని రంగనాయకికి అప్పగించాడు.
ఇదికూడా ఒక వ్యభిచార గృహమే అయినా ముంబై కంటే మేలు. కాస్త మనుషులుగా గుర్తించడంతోబాటు వచ్చిందాంట్లో వాళ్ళ వాటా తీసుకొని మిగిలింది తమకే ఇస్తారు. వయసు పెరగడంతోబాటు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండటంతో రంగనాయకిని ఒప్పించి వంట పనికే పరిమితమయ్యింది తను.
ఇప్పుడు హాస్పిటల్ లో సురేష్ఆ పోలికలతో డాక్టర్ ని చూడడంతో మరుగున పడ్డ జ్ఞాపకాలు మళ్ళీ బయటకు వచ్చాయి. తను ఒక తల్లినని గుర్తుకు వచ్చి మనసు ఉద్వేగంతో నిండి పోయింది. ఎండి బీటలువారిన ఆమె హృదయం మాతృత్వ భావన తో చెమ్మగిల్లింది.
ఇది నిజమేనా లేక తన ఊహా..
అసలు సురేష్ ముఖం తనకు ఇంకా గుర్తుకు ఉందా..
ఎందుకు గుర్తుండదూ.. తనలో ఆశలు రేపిన ఆ ముఖం, తొలిప్రేమ చిగురింపజేసిన ఆ ముఖం, తనతో క్రూరంగా వ్యవహరించిన ఆ ముఖం.. తను మర్చిపోగలదా?
ఆ రాత్రి పూర్తిగా కలత నిద్రతో గడిపింది సుచిత్ర.
మర్నాడు బారెడు పొద్దెక్కాక లేచింది. అదీ సుందరిని చూడడానికి వచ్చిన రంగనాయకి లేపితేనే.
"ఆ కుర్ర డాక్టర్ సుందరికి ఆపరేషన్ చేసి, మత్తుమందు నీకు ఎక్కించినట్లున్నాడు". అంది రంగనాయకి నవ్వుతూ.
సుచిత్రకు కోపం వచ్చినా అణుచుకుంది.
"నిన్న అతను నిన్ను అదోలా చూడటంతో నీకు కూడా.. " రంగనాయకి మాట పూర్తి కాకుండానే ఆమె చెంప చెళ్లుమంది.
ఆ దెబ్బ ఎంత బలంగా తగిలిందంటే దృఢకాయురాలైన రంగనాయకి సైతం నిలదొక్కుకోలేక కింద పడింది.
తేరుకొని పైకి లేచిన రంగనాయకి సుచిత్ర వైపు అడుగులు వేసింది.
ఆమెను ఆపడానికి బెడ్ మీదనుండి పైకి లేవబోయింది సుందరి. ఆమెను ఆగమని చెప్పి సుచిత్రను సమీపించి భుజం మీద చెయ్యి వేసింది రంగనాయకి.
"ఎప్పుడూ లేనిది ఇంత కోపమొచ్చిందేమిటే నీకు" అంది ఆప్యాయంగా.
"అతన్ని చూస్తే చిన్నప్పుడు తప్పిపోయిన నా కొడుకు గుర్తుకొచ్చాడక్కా!" రంగనాయకిని కౌగలించుకొని ఏడుస్తూ చెప్పింది సుచిత్ర.
కాసేపు ఊరడించి వెళ్ళిపోయింది రంగనాయకి.
***
ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో హడావిడిగా వచ్చాడు రంగయ్య.
"పక్కన గెస్ట్ హౌస్ కి ఎస్సై గారి ఇలాకా ఎవరో వచ్చారట. అతనికి మనవాళ్లందరినీ చూపించమని ఎస్సై గారు ఫోన్ చేశారు" అని చెప్పాడు.
తన వాళ్లందరినీ పిలిచి రెడీ కమ్మంది రంగనాయకి.
"నేను ఇప్పుడు వంటలక్కను కదా. నేను ఎందుకు?" అంది సుచిత్ర.
సుచిత్రను, సుందరినీ వదిలి మిగతా అందరినీ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ కి వెనక గుమ్మం గుండా పంపించింది రంగనాయకి. అక్కడినుండి గెస్ట్ హౌస్ లోకి దారి ఉంది.
వెళ్లిన కాసేపటికే అందరూ తిరిగి వచ్చేశారు.
"అతనికి మేమెవ్వరం నచ్చినట్లు లేము. చూసీ చూడకముందే వెళ్లిపొమ్మన్నాడు" అని చెప్పిందో అమ్మాయి.
అందర్లోకీ వెనగ్గా వచ్చిన అమ్మాయి "నేను అక్కడే వుండి, పైట జార్చాలని చూసాను.
'వెళ్తావా లేదా' అని గట్టిగా అరిచాడు" అని చెప్పింది.
అందరూ లోపలికి వెళ్ళాక రంగనాయకి, సుచిత్ర హాల్లో మిగిలారు.
కొంత సేపటికి రంగయ్య వచ్చాడు.
"వీళ్ళెవరూ కాదట. నిన్న హాస్పిటల్ దగ్గర ఎవర్నో చూశాడట. ఆమే కావాలంటున్నాడు" అన్నాడు సుచిత్ర వంక చూస్తూ.
"ఎస్సైగారి తరఫున వచ్చాడట. వెళ్లి ఏదో ఒకటి చెప్పి వచ్చేసెయ్యి" అంది రంగనాయకి చెంప తడుముకుంటూ.
"అలాగేలే. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను" అంది సుచిత్ర.
ఎప్పటిలాగే వెనక డోర్ నుండి వెళ్లి గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించింది.
గెస్ట్ హౌస్ హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె కాళ్ళ కింద భూమి కంపించింది. అతడు నిన్న హాస్పిటల్ లో చూసిన డాక్టర్.
ముమ్మూర్తులా చిన్నప్పటి సురేష్ ని పోలి ఉన్న డాక్టర్.
కాళ్ళ కింద ఉన్న భూమి చీలిపోయి అందులోకి కూరుకొని మాయమైపోతే బాగుండుననిపించింది ఆమెకా క్షణం.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.
(అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments