'Rajakeeyam' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 02/11/2023
'రాజకీయం' తెలుగు కథ
రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఇది ఉత్తర భారతంలోని ఒక రాష్ట్రంలో జరిగినట్లు కల్పించబడ్డ కథ. పాఠకుల సౌకర్యార్థం పాత్రల పేర్లు, సంభాషణలు తెలుగులో చెప్పబడ్డాయి..
పార్టీ పరిస్థితిని జిల్లాల వారీగా సమీక్షించడానికి కేంద్ర పరిశీలకుడు శరత్ చంద్ర ఆ జిల్లాకు వచ్చాడు. స్థానిక ఎంపీ ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ లో ఆరాత్రికి బస చేసాడు.
ఏర్పాట్లు పరిశీలించడానికన్నట్లు గెస్ట్ హౌస్ కి వచ్చిన ఎంపీ నిత్యానందం, శరత్ చంద్రతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. రాబోయే ఎన్నికల్లో కూడా తనకే పార్టీ టికెట్ వచ్చేలా ఎలాగైనా చూడమన్నాడు.
నాకు ఇంత ముట్ట చెప్పాలని అడగలేదు శరత్ చంద్ర. ఆలా అడిగితే తనకు ఇచ్చేది చాలా స్వల్పమని అతడికి తెలుసు. దాన్ని ఇవ్వడం అనేకంటే విదిల్చడం అంటేనే సరిగ్గా ఉంటుంది.
"లాభం లేదయ్యా నిత్యానందం.. అధిష్టానం నీ మీద గుర్రుగా ఉంది. పైగా పార్టీలో చాలామంది నిన్ను వ్యతిరేకిస్తున్నారు. వేరే వాళ్ళను పరిశీలనకు పంపిస్తే ఓ యాభై లక్షలు సమర్పించి, నువ్వు మేనేజ్ చేస్తావని వాళ్లకు తెలుసు. అందుకనే సరైన అంచనా వెయ్యమని నన్ను పంపించారు" అన్నాడు శరత్ చంద్ర.
‘వీడి ముఖం.. పాతికేళ్ళనుంచి పార్టీలో ఉన్నా కనీసం చిన్న పదవికి సంబంధించిన ఎలెక్షన్ లో కూడా గెలవలేదు. అప్పోజిషన్ వాళ్ళను న్యూస్ ఛానళ్లలో తిట్టేస్తూ అధిష్టానం మెప్పు పొంది నెట్టుకొస్తున్నాడు. ఏమన్నాడూ.. వేరేవాళ్లనైతే యాభైతో మేనేజ్ చేస్తానా? అంటే వీడికి అంతకు రెండు మూడు రెట్లు ఇవ్వమని సూచిస్తున్నట్లున్నాడు’ మనసులో తిట్టుకున్నాడు నిత్యానందం.
పైకి మాత్రం ఓ నవ్వు పులుముకొని, "అంతా తమ చేతుల్లో ఉంది. అయినా మనం అపోజిషన్ లో ఉన్నాం. ఈ సారి కూడా రూలింగ్ పార్టీ యే వస్తుందని అందరూ అటువైపు టికెట్ కి ట్రై చేస్తున్నారు. మన పార్టీలో వేరే వాళ్లకు టికెట్ ఇచ్చినా ధైర్యంగా ఖర్చు పెట్టగలిగే వాళ్ళు లేరు. అందుకని ఈసారి సెంట్రల్ పార్టీకి ఇచ్చే డొనేషన్ కాస్త తగ్గించమని చెప్పండి. తగ్గిన మొత్తంలో సగభాగం.. " అంటూ ఆపాడు నిత్యానందం.
ఆలోచనలో పడ్డాడు శరత్ చంద్ర.
'నిత్యానందం చెప్పింది నిజమే. ఈ సారి పార్టీ టికెట్లకు పెద్దగా పోటీ లేదు. సౌత్ లో అయితే ఎన్నికల ఖర్చులో పార్టీయే సగం భరించాలంటున్నారు. కానీ నిత్యానందం అధికారం లేకుండా ఉండలేడు. ఆ విషయం తెలుసు శరత్ చంద్రకి.
"రేపు కార్యకర్తల సమావేశం ముగిశాక నీకు అనుకూలంగా ఒక పదిమంది రిపోర్టులు, వ్యతిరేకంగా పదిమంది రిపోర్టులు నా కామెంట్లతో పంపమని అధిష్ఠానం ఆదేశం. వ్యతిరేకంగా ఉండేవి చిన్న పాయింట్లు గా ఉండేలా చూసుకో. ఆ తరువాత ఎలక్షన్ లకు ఎంత ఖర్చు పెడతావో, పార్టీ ఫండ్ ఎంత ఇస్తావో మాట్లాడుకుందాం" చెప్పాడు శరత్ చంద్ర.
"అంతా మీ దయ. అన్నట్లు రాత్రికి మీకు చిన్న విందు, మంచి కంపెనీ ఏర్పాటు చేసాను. స్వీకరించండి" అని చెప్పి, అతని దగ్గర సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు నిత్యానందం.
మర్నాడు పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను సమావేశంలో నొక్కి వక్కాణించాడు శరత్ చంద్ర.
టికెట్ ఆశిస్తున్న కనకలింగం అనుచరులు నిత్యానందానికి మళ్ళీ టికెట్ ఇస్తే పార్టీ గెలవదనీ, ఈసారి కనకలింగానికే ఇవ్వాలనీ నినాదాలు చేశారు. దాంతో నిత్యానందం అనుచరులు వాళ్ళ మీద దాడి చేశారు. ఇరు వర్గాల వాళ్ళు కుర్చీలు, బల్లలు విసురుకుని కాసేపటికి శాంతించారు.
తమ నాయకుడికి ఎందుకు టికెట్ ఇవ్వాలో రాతపూర్వకంగా ఇవ్వమని ఇరువైపులా పదిమందిని కోరాడు శరత్ చంద్ర. మిగతా వారందరినీ బయటలు పంపించేశాడు.
ఇరవై మంది దగ్గరా లెటర్లు తీసుకుని ఆ రోజే ఢిల్లీకి బయలుదేరాడు.
ఆ రోజూ రాత్రి ఆ లెటర్ లు అన్నింటినీ ముందేసుకుని కూర్చున్నాడు.
వాటిని క్లుప్తంగా హిందీలోకి మార్చి, వాటికి తన కామెంట్లు జోడించి మర్నాడు అధిష్ఠానానికి ఇవ్వాలి.
అతడు ఆ పనిలో ఉండగా కనకలింగం అనుచరుడొకడు రాసిన లెటర్ అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే జరిగితే నిత్యానందానికి పెద్ద దెబ్బే తగులుతుంది అనుకున్నాడు.
వెంటనే అతనికి ఫోన్ చేద్దామనుకున్నాడు. కానీ ఇలాంటి విషయాలు ఫోన్ లో మాట్లాడటం రిస్క్ ఆనుకొని ఆగిపోయాడు.
మరుసటి రోజు అధిష్టానం ప్రతినిధిని ఇంటి దగ్గర కలిసాడు శరత్ చంద్ర.
ముందుగా ఆ ప్రత్యేకమైన లెటర్ గురించి ప్రస్తావించాడు.
ఆ లెటలో వివరం ఇదీ..
నిత్యానందం బావమరిది రంగనాథానికి దాదాపు పాతిక వైన్ షాపులు వేరే వేరే పేర్లతో ఉన్నాయి. వీటి నిర్వహణ అతని ముఖ్య అనుచరుడు ద్వారకా చూసుకుంటూ ఉంటాడు.
చిన్నప్పటినుండి జులాయిగా తిరిగే ద్వారకా ఈ మధ్యనే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానంటూ వెంటపడ్డం మొదలు పెట్టాడు. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోక పోవడంతో త్వరలో యాసిడ్ దాడి చేయబోతున్నాడట. నిత్యానందం అనుచరులు ఇలా చాలా అకృత్యాలకు పాల్పడుతున్నారనీ, అందువల్ల అతనికి టికెట్ ఇవ్వకూడదనీ ఆ లెటర్ సారాంశం.
ఆ అధిష్టానం ప్రతినిధి ఆలోచనలో పడటంతో, "ఇది పెద్ద విషయం కాదు. నిత్యానందం తో చెప్పి ఇలా జరక్కుండా చేస్తాను" అన్నాడు శరత్ చంద్ర.
"తొందర పడి ఏమీ చెయ్యొద్దు. నన్ను పెద్దలతో మాట్లాడనీ. ఇది ఫోన్ లో మాట్లాడే విషయం కాదు. నేను ఈరోజే స్వయంగా పెద్దవాళ్ళతో మాట్లాడతాను. నువ్వు నన్ను రేపు స్వయంగా కలువు. మధ్యలో ఎవరికీ ఫోన్ లు చెయ్యకు" అన్నాడు ప్రతినిధి.
మరుసటి రోజు అధిష్టానం ప్రతినిధిని కలిసిన శరత్ చంద్ర, అతను చెప్పింది విని ఆశ్చర్యపోయాడు.
ప్రతినిధి చెప్పిన మాటల సారాంశం...
నిత్యానందం, తన బావమరిది రంగనాథంతో పదిమందికీ తెలిసేలా గొడవపడాలి. రంగనాథం అధికార పార్టీ వాళ్ళను కలిసి, తను ఆ పార్టీలో త్వరలో చేరబోతున్నట్లు, తనను చేర్చుకుంటే పార్టీకి భారీగా ఫండ్స్ ఇవ్వబోతున్నట్లు చెప్పాలి. అవసరమైతే కొంత మొత్తం అడ్వాన్స్ గా ఇవ్వాలి. ముందుగా తన అనుచరులను ఆ పార్టీలో చేర్పించాలి. అందులో ద్వారకా ఒకడు అయి ఉండాలి.
అంటే ద్వారకా యాసిడ్ దాడి చేసేనాటికి అతను అధికార పక్షంలో ఉండాలి.
ఈ విషయాన్ని తమ పార్టీ పత్రికల్లో, న్యూస్ ఛానళ్లలో మారు మోగేలా చెయ్యాలి.
తమ పార్టీ అనుబంధ మహిళా సంఘాలు యాసిడ్ దాడి గురించి దేశమంతటా నిరసనలు చెయ్యాలి.
అధిష్టానం ప్రతినిధి చెప్పింది విన్న శరత్ చంద్రకి మాటలు రాలేదు. జరగబోయే దారుణ సంఘటన గురించి ఇన్ని దుర్మార్గపు ఆలోచనలా!
'ఒక అమ్మాయి మీద దాడి జరగబోతోందని తెలిసి కూడా ఆపకుండా దాన్ని రాజకీయంగా వాడుకోవడం నీఛం కదా.. ' మనసులో అనుకోబోయి పైకే అనేశాడు.
"ఏంటయ్యా ఒక్కసారిగా బుద్ధిమంతుడివి అయిపోయావ్? నువ్వు డబ్బులు తీసుకోని పార్టీ టికెట్లకు రికమెండ్ చేసే విషయం మాకు తెలీదనుకున్నావా.. " అన్నాడు ప్రతినిధి.
"నిజమే సర్, మీలాగే మిగతా నాయకుల్లాగే నేను కూడా అవినీతి పరుణ్ణే. కానీ.. " చెప్పబోతున్న శరత్ చంద్రని అడ్డుకున్నాడు ప్రతినిధి.
"చూడు శరత్ చంద్రా.. ఈ యాసిడ్ దాడి మనం చేయించడం లేదు. మనం వద్దంటే వాడు ఆపబోయేదీ లేదు. జరిగేదాన్ని మనం వాడుకుంటున్నాము. అంతే.. అప్పటికి అధికార పార్టీలో చేరి ఉంటాడు కాబట్టి వాళ్ళు వెనకేసుకొస్తారు. మనం పోరాడి అతడికి శిక్ష పడేలా చూస్తాం.
అయినా రోజూ ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటాయి. అన్నిటిని మనం ఆపలేము. నువ్వు వెంటనే నిత్యానందాన్ని కలిసి ఆ పనిమీద ఉండు. ఈ పని సరిగ్గా జరిగేలా చూస్తే అతనికి సీటు గ్యారెంటీ అని చెప్పు. పార్టీ ఫండు కూడా తగ్గించి చెప్పు. ప్లాన్ సక్సెస్ అయితే నీకు కూడా మంచి గిఫ్ట్ ఉంటుంది. ఇక పనిలోకి దిగు" అని చెప్పాడు అధిష్టానం ప్రతినిధి.
నిత్యానందాన్ని వ్యక్తిగతంగా కలిసి అధిష్టానం ప్లాన్ చెప్పాడు శరత్ చంద్ర. సంతోషంగా ఒప్పుకున్నాడు నిత్యానందం. తన బావమరిది రంగనాథాన్ని పిలిచి ప్లాన్ చెప్పాడు.
రంగనాథం. అతడు ద్వారకాను పిలిచి విషయం చెప్పకుండా తాను పార్టీ మారబోతున్నట్లు చెప్పాడు.
ద్వారకాతో సహా కొంతమంది అనుచరులను ముందుగానే అధికార పార్టీలో చేరమన్నాడు. అక్కడ పరిస్థితి బాగుంటే తరువాత తనుకూడా వస్తానని లేకుంటే తరువాత తిరిగి వచ్చేయవచ్చనీ చెప్పాడు.
ద్వారకా కొందరు అనుచరులతో అధికార పార్టీలో అట్టహాసంగా చేరాడు.
అతనికక్కడ కొత్త మిత్రులు, అనుచరులు ఏర్పడ్డారు.
ప్రేమించిన అమ్మాయికి ద్వారకా ఇచ్చిన గడువు ముగియబోతోంది.
జరగబోయే ఆసిడ్ దాడి కోసం ప్రతిపక్షం ఉత్కంఠంగా ఎదురు చూస్తోంది.
వాళ్ళ పత్రికలు ద్వారకా ఫోటోలు, అమ్మాయి ఫోటోలు సేకరించి పట్టుకున్నాయి.
అమ్మాయి కుటుంబ వివరాలు, వాళ్ళది ఏ సామజిక వర్గం లాంటి వివరాలు కూడా రెడీగా ఉంచుకున్నాయి.
రోజులు గడిచాయి.
తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు.
కానీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి ఘటన ఏదీ లేదు కాబట్టి ఏమీ జరగలేదనే ఆశిద్దాం.
సహజంగా అందరికీ మంచి జరగాలని కోరుకునే మనం ఆ అమ్మాయికి ఏమీ జరగలేదనే భావిద్దాం.
కానీ ఎలా?
ఇంతవరకూ కథలో లేని ఒక హీరో సడన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ అమ్మాయిని కాపాడినట్లు అనుకుందామా..
ఈ మధ్య మొరటుగా వికృతంగా ఉండటమే కాకుండా వికృతపు చేష్టలు చేసే హీరోని హీరోయిన్ అమాంతం ప్రేమించేసినట్లు కొన్ని పొరుగు భాషా చిత్రాలు చూపిస్తున్నారు. ఆలా ఆ అమ్మాయి ద్వారకాని ప్రేమించేసిందా..
యాసిడ్ దాడి జరిగి, ఆ వెంటనే అధికార పక్షం ద్వారకాని ఎన్ కౌంటర్ చేసేసిందా..
ఈ విషయానికి ప్రచారం జరిగితే అధికార పక్షానికే మేలని ప్రతిపక్ష పత్రికలు ఉరుకున్నాయా.. అందుకే ఈ విషయం మన రాష్ట్రం దాకా రాలేదా..
ఒకవేళ శరత్ చంద్రకి గానీ, నిత్యానందానికి గానీ మానసిక పరివర్తన కలిగి... ఒకవేళ దారుణాన్ని జరగకుండా ఆపి ఉంటారా..
కొత్త పార్టీలో భవిష్యత్తు ఆశాజనకంగా ఉండటంతో ద్వారకా కొద్ది రోజులు మర్యాదస్తుడిలాగా ఉండాలనుకొని, యాసిడ్ దాడిని మాని వేశాడా.. వాయిదా వేశాడా..
ఏమైనా రాజకీయాలకి ఆ అమ్మాయి బలికాకూడదని ఆశిద్దాం.
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.
(అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comentários