top of page

అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు - 3

(అదేనండీ.. అచ్చు తప్పులూ వ్యాకరణ దోషాలూనూ..)

'Appu Tachhulu Vakyarana Doshalu - 3'((అదేనండీ.. అచ్చు తప్పులూ వ్యాకరణ దోషాలూనూ..) - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar

Published In manatelugukathalu.com On 24/10/2023

'అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు - 3' తెలుగు ధారావాహిక పార్ట్ 3

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


ఈ ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం.


వస్తున్నాడు/ వస్తోన్నాడు/వస్తూన్నాడు

పోతుంది/పోతోంది/పోతూంది

వెళ్తుంది/వెళ్తోంది/వెళ్తూంది

వీటిలో తేడా ఏమైనా ఉందా? ఎప్పుడు ఏది వాడాలో తెలుసుకుందాం.


‘గరుడ’ బస్సు వేగంగా వెళ్తుంది.

ఈ వాక్యంలో ఆ బస్సు లక్షణం వేగంగా వెళ్లడం. కాబట్టి 'వెళ్తుంది' అని వాడుతాం. ఇది ఆ బస్సు విషయంలో మాములుగా జరిగేది.


ఈ క్రింది వాక్యాలు రెండూ సరైనవే..


గరుడ బస్సు వేగంగా వెళ్తుంది.

పల్లె వెలుగు బస్సు నిదానంగా వెళ్తుంది.


ఆ బస్సు వేగంగా వెళ్ళేటప్పుడో లేక నిదానంగా వెళ్ళేటప్పుడో జరిగిన సంఘటన గురించి మనం కథలో చెప్పాలనుకుంటే 'వెళ్తుంది' అని వాడకూడదు.


గరుడ బస్సు వేగంగా వెళ్తూంది/ వెళ్తోంది.

అంతలో ఒక కుక్క బస్సుకు అడ్డు వచ్చింది.

పల్లె వెలుగు బస్సు నెమ్మదిగా వెళ్తూంది/ వెళ్తోంది.

ఒక పాము అడ్డం రావడంతో డ్రైవర్ బ్రేక్ వేసాడు.


పై వాక్యాల్లో మనం చెప్పాలనుకున్నది..

బస్సు వేగంగా వెళ్తూ ఉన్నప్పుడు కుక్క అడ్డు వచ్చింది.

బస్సు నెమ్మదిగా వెళ్తూ ఉన్నప్పుడు పాము అడ్డం రావడంతో డ్రైవర్ బ్రేక్ వేసాడు.


మరి కొన్ని ఉదాహరణలు చూద్దాం.

వానాకాలంలో వర్షం కురుస్తుంది.

ఈ వాక్యంలో 'కురుస్తుంది' అనే పదం కరెక్టే.

కానీ క్రింది వాక్యం చూడండి..

బయట వర్షం కురుస్తుంది. కానీ నేను బైక్ లో బయలుదేరాను.


ఇక్కడ 'కురుస్తుంది' అనే పదం సరికాదని తెలుస్తోంది కదా.

ఆ వాక్యం ఇలా వుంటే బాగుంటుంది..

బయట వర్షం కురుస్తోంది/కురుస్తూంది . కానీ నేను బైక్ లో బయలుదేరాను.

అంటే వర్షం కురుస్తూ ఉన్నప్పుడు నేను బయలుదేరాను అని చెప్పాలనుకున్నప్పుడు 'కురుస్తోంది' లేదా 'కురుస్తూంది' అన్న పదం వాడాలి.

అలాగే

కుక్క వెంబడిస్తోంది.

నేను పరుగెడుతోన్నాను..

జరుగుతూ ఉండే ఒక సందర్భాన్ని చెప్పేటప్పుడు పోతోంది/పోతూంది, వెళ్తోంది/వెళ్తూంది లాంటి పదాలు వాడాలి.


'కుక్క మొరగడం' అనే అంశం మీద ఈ పేరాను చూస్తే కాస్త అవగాహన వస్తుంది.


కుక్క ఎలా మొరుగుతుంది?

కుక్క భౌ భౌ మని మొరుగుతుంది.

దొంగ ఆ ఇంటిని సమీపించాడు.

అప్పుడు కుక్క భౌ భౌ మని మొరిగింది.

ఆ చప్పుడికి ఆ ఇంటావిడకి మెలకువ వచ్చింది.

భర్తను లేపి ఏమని చెబుతుంది?

"ఏమండీ! కుక్క మొరుగుతుంది" అని చెబుతుందా?

"ఆలా చెబితే అయన "కుక్క మొరుగుతుంది.. పిల్లి మ్యావ్ అంటుంది.. ఏనుగు ఘీంకరిస్తుంది..ఇవన్నీ చిన్నప్పుడు చదివానులే. ఆ విషయం నిద్ర లేపి చెప్పాలా" అంటాడు.


"కుక్క మొరుగుతోంది" అని ఆవిడ చెబితే ఆ విషయం అప్పుడు జరుగుతూన్నట్లు అతనికి తెలుస్తుంది.

మరింత అవగాహన కోసం ఈ పేరా చూడండి.

'రేపు ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది" అని ఒక రోజు నా స్నేహితుడితో చెప్పాను. ఇక్కడ 'జరుగుతుంది' అని వాడాను.

మరుసటి రోజు మ్యాచ్ జరిగేటప్పుడు నా శ్రీమతి మార్కెట్ కి వెళ్లి కూరలు తెమ్మంటే "మ్యాచ్ జరుగుతోంది, అయ్యాక తెస్తాను' అని చెబుతాను.


ఇక్కడ జరుగుతోంది అని వాడాను.


ఆ మరుసటి రోజు నా స్నేహితుడితో "మ్యాచ్ జరిగింది, ఇండియా గెలిచింది" అని చెబుతాను.

ఇక్కడ 'జరిగింది' అని వాడాను.

కానీ అతడితో మ్యాచ్ జరిగేటప్పుడు జరిగిన సీన్ ని యధాతథంగా చెప్పేటప్పుడు ఇలా చెప్పాను.

"నిన్న ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అప్పుడు మా ఆవిడ కూరలు తెమ్మంది. మ్యాచ్ అయ్యాక తెస్తానన్నాను. 'తరువాతంటే పనిమనిషి ఉండదు, మీరే తరగాల్సి ఉంటుందంది".

అది విని వాడు నవ్వుతూ "ఎంతో నయం! మా ఆవిడైతే మ్యాచ్ పది ఓవర్లలో ముగుస్తుందనగా ఛానల్ మార్చేసింది, 'పతియే ప్రత్యక్ష దైవం సీరియల్ వస్తోం'దంటూ.." అన్నాడు.


ఈ టాపిక్ కి కొసమెరుపు ఏమిటంటే ఈ జరుగుతుంది/జరుగుతోంది గందరగోళం గురించి సరిగ్గా వివరించానో లేదోనని, పై ఇంటి రావుగారికి చూపించాను (రావుగారి గురించి జంభోళ బంభ కథలో పరిచయం చేశాను).


అయన ముఖంలోని ఫీలింగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండటం గమనించిన అయన "ఆ మాత్రం అర్థం చేసుకోలేననుకుంటున్నావటోయ్" అన్నారు.


"అలా అని కాదు.. నేను చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పనా లేదాని.."అంటూ నీళ్లు నమిలాను.


"చక్కగా చెప్పావోయ్.. భర్తలు క్రికెట్ మ్యాచ్ చూస్తూంటే భార్యలు ఒప్పుకోరు. అదేగా నీ ఉద్దేశం.. అర్థమయిందిలే" అన్నారాయన.


మొత్తానికి అప్పుడు జరుగుతూ ఉన్న విషయమైనా, జరిగిన విషయాన్ని అప్పుడు జరుగుతున్నట్లు చెప్పేటప్పుడైనా చెబుతోంది/చెబుతూ ఉంది/చెబుతూంది, వస్తోంది/వస్తూంది, పాడుతోంది/పాడుతూంది ఇలా వాడాలి.

***

వేర్ అర్ యు గోయింగ్

ఆ యామ్ గోయింగ్ టు ఏ మూవీ


'వేర్' అంటే ఎక్కడ అని అర్థం


పై వాక్యాలని ఇలా అనువదించి చూద్దాం.

'నువ్వు ఎక్కడ వెళ్తున్నావు?'

'నేను సినిమా/మూవీ వెళ్తున్నాను'.


మొదటి వాక్యం అసహజంగా ఉన్నట్లు తెలుస్తోంది కదూ!

'నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు' అని ఉంటే సరిగ్గా ఉంటుంది.


ఇక రెండవ వాక్యం సరిగ్గానే ఉన్నట్లు ఇప్పటి తరానికి అనిపిస్తుంది.

కానీ ఎక్కడికి అన్న ప్రశ్నకి సినిమాకి/మూవీకి అని చెప్పడమే కరెక్ట్.

కాబట్టి 'నేను సినిమాకి /మూవీకి వెళ్తున్నాను' అని సమాధానమివ్వాలి.


'ఐ లవ్ మై ఫ్యామిలీ' లో ఫ్యామిలీ అంటే కుటుంబం.

ఈ పదాన్ని పై వాక్యంలో ఇమిడ్చేటప్పుడు నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను అని రాయాలి (కుటుంబం ను/ కుటుంబం ని అని కూడా రాయకూడదు.)


అలాగే ఐ లవ్ మై కంట్రీ అనే వాక్యాన్ని నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అనీ,

ఐ లవ్ ఇండియా అనే వాక్యాన్ని నేను ఇండియాని ప్రేమిస్తున్నాను అనీ రాయాలి.


ఆ పదాన్ని బట్టీ, సందర్భాన్ని బట్టీ దాన్ని అనుసంధానించే అక్షరం మారుతూ ఉంటుంది.


సినిమా ఎలా ఉంది?

ఈ వాక్యంలో ఎలా అంటే ఎలాగా అని అర్థం.

కాబట్టి జవాబులో సినిమా బాగా ఉంది/సినిమా సూపర్ గా ఉంది(సినిమా నిజంగా బాగుంటే) అని రాయాలి.


కొన్ని పదాలను వాక్యంలో ఉపయోగించేటప్పుడు చివరి అక్షరం మారుతుంది.


'స్నేహితులు' అనే పదాన్ని వివిధవాక్యాల్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం.


నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు.

నేను స్నేహితులను తరచూ కలుస్తాను.( స్నేహితులు ను కాదు).


స్నేహితులకు సహాయం చేస్తూ ఉంటాను.( స్నేహితులు కు కాదు.)


'లాభాలు కోసం' అని కాక 'లాభాల కోసం' అని రాయాలి.


'సాయంత్రంకి' అనికాక 'సాయంత్రానికి' అని రాయాలి.


అలాగే 'ఇద్దరునీ' అని కాకుండా 'ఇద్దరినీ' అని రాయాలి.


తదుపరి ఎపిసోడ్ లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

========================================================================

ఇంకా వుంది..

అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు - 4 త్వరలో..

========================================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

(అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).










43 views2 comments

2 Comments


@surekhap4148 • 3 days ago

Compulsory to note

Like

@user-ui9wc4xj3c • 3 days ago

So nice..

Like
bottom of page