top of page

అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు - 2

(అదేనండీ.. అచ్చు తప్పులూ వ్యాకరణ దోషాలూనూ..)


'Appu Tachhulu Vakyarana Doshalu - 2' - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar

'అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు - 2' తెలుగు ధారావాహిక పార్ట్ 2

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ఈ ఎపిసోడ్లో ముందుగా అవసరమైన చోట దీర్ఘాలు తీయడం, వ్యాకరణ చిహ్నాలు ఉంచడం గురించి తెలుసుకుందాం.


మనం ఎవరినైనా సంబోధించేటప్పుడు సాధారణంగా వారి పేరుకు గాని వారిని పిలిచే మాటకు గాని దీర్ఘం తీస్తూ ఉంటాము. రచనలలో కూడా అలాగే దీర్ఘం తీస్తే పాఠకులకు సరిగ్గా అర్థం అవుతుంది. అలాగే, టైపు చేసేటప్పుడు కొన్ని చోట్ల దీర్ఘాలు పడవు. వాటిని కూడా గమనించు కోవాలి. వ్యాకరణ చిహ్నాలు సరైన చోట ఉంచాలి.


ఉదాహరణకు ఈ క్రింది సంభాషణ చూడండి..


సీత కాఫీ ఇవ్వు అన్నాడు రాము.

ఏవండి కాఫి సంగతి సరె ఈరోజు మనం సినిమాకు వెల్దామ అంది సీత

నిన్ననే రిలీజ్ అయ్యింది ఆ పొడుగ్గా ఉండె హీరో సినిమాకేన చస్తే రాను. అయిన అలాంటి హీరోలకు కూడ నిలాంటి ఫ్యాన్స్ తగలడుతారు అదే విచిత్రం ఆ సినిమా కంటే పోయిన వారం రిలీజ్ అయింది డబ్బింగ్ సినిమా దానికి వెళ్లిన బాగుంటుంది అన్నాడు రాము ఎందుకు ఆ వంకర మూతి హీరోయిన్ ఐటమ్ సాంగ్ చూడడం కోసమా మరో వరం ఆగితే ఓటీటీలో చూడొచ్చు చెప్పింది సీత


ఇక్కడిదాకా చదివేసరికే పాఠకులకు విసుగు పుడుతుంది. చదివిన వాక్యాలే అర్థం కాక మళ్లీ వెనక్కి వెళ్లి చదివే ఓపిక, తీరిక ఈ కాలం లో ఎవరికి ఉంటుంది?


భార్యాభర్తల మధ్య సరదా సంభాషణలతో సాగే ఈ హాస్య కథ తప్పులు లేకుండా ఉంటే మొదటి పేరా లోనే ఆసక్తిని కలుగజేస్తుంది. ఒకసారి పై వాక్యాలను సవరించి చూద్దాం.


“సీతా! కాఫీ ఇవ్వు” అన్నాడు రాము.


“ఏవండీ! కాఫీ సంగతి సరే.. ఈరోజు మనం సినిమాకు వెళ్దామా” అంది సీత.


“నిన్ననే రిలీజ్ అయ్యిందీ.. ఆ పొడుగ్గా ఉండే హీరో సినిమాకేనా.. చస్తే రాను. అయినా అలాంటి హీరోలకు కూడా నీలాంటి ఫ్యాన్స్ తగలడుతారు. అదే విచిత్రం! ఆ సినిమా కంటే పోయిన వారం రిలీజ్ అయిందీ.. తమిళ్ డబ్బింగ్ సినిమా.. దానికి వెళ్లినా బాగుంటుంది” అన్నాడు రాము.


“ఎందుకూ.. ఆ వంకర మూతి హీరోయిన్ ఐటమ్ సాంగ్ చూడడం కోసమా? మరో వారం ఆగితే ఓటీటీలో చూడొచ్చు” చెప్పింది సీత.


గమనించారు కదూ! సవరించి రాసిన పేరా, చదివే వాళ్లకు బాగుంటుంది. రచయిత చెప్పాలనుకున్న ఫీల్ ఇక్కడ కనిపిస్తుంది.

మొదటి వాక్యాన్నే మరొకసారి పరిశీలిద్దాం.


మాట్లాడేటప్పుడు 'సీతా! కాఫీ ఇవ్వు' అనే వాక్యంలో ‘సీత’ అనే పదం తరువాత, కాస్త గ్యాప్ ఇస్తాము. ‘కాఫీ, ఇవ్వు’ అనేవి రెండు పదాలు అయినా, వాటిని విడివిడిగా రాసినా, పలికేటప్పుడు వెంటవెంటనే 'కాఫీ ఇవ్వు' అని పలుకుతాం.

ఇక్కడ సీతను పిలుస్తున్నాం కనుక ‘సీతా’ అని రాసి, ఒక ఆశ్చర్యార్థకపు గుర్తు ఉంచవచ్చు.


కాబట్టి 'సీత కాఫీ ఇవ్వు' అనడం కంటే 'సీతా! కాఫీ ఇవ్వు' అంటే బాగుంటుంది.


దీర్ఘం ఇవ్వడానికి కుదరని పదాలకు కూడా, ఆ పదం తరువాత ఇచ్చే ఆశ్చర్యార్థకాపు గుర్తు ఆ పదాన్ని ప్రత్యేకించి పలకమని తెలియజేస్తుంది.


ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి.


"నా పేరు వినోద్" అన్నాడతడు.


"వినోద్! ఇదివరకు మనమెప్పుడైనా కలిసామా?" అడిగాడు కిశోర్.


"లేదు కిషోర్! నేను మిమ్మల్ని కలవడం ఇదే మొదటిసారి" అన్నాడు వినోద్.


ఇప్పుడు మొదటివాక్యం 'నా పేరు వినోద్' అనే వాక్యంలో 'వినోద్' అనే పదం పలికే విధానానికీ, అలాగే 'వినోద్! ఇదివరకు' అనే వాక్యంలో 'వినోద్' అనే పదం పలికే విధానానికీ ఉన్న తేడాను గమనించండి.


మొదట 'వినోద్' అని చదువుతాము.తరువాత 'వినోద్!' అని చదువుతాము. ఆ తేడా మనం ఉపయోగించే గుర్తువల్ల పాఠకులకు అర్థం అవుతుంది.


అలాగే 'అడిగాడు కిశోర్', 'లేదు కిషోర్!' - ఈ వాక్యాల్లో కూడా మనం ఉపయోగించే '!' గుర్తువల్ల ఆ తేడా అర్థం అవుతుంది.


ఇప్పుడు చేతి వ్రాత కాకుండా టైపింగ్ ఎక్కువయింది. '!' గుర్తు రాయడానికి కీ బోర్డు లో రెండు బటన్లు కలిపి ప్రెస్ చేయాలి కాబట్టి సంబోధన తరువాత కామా(,) లేదా రెండు చుక్కలు వాడుతున్నారు.


అంటే 'సీతా, కాఫీ ఇవ్వు' అనిగానీ, 'సీతా.. కాఫీ ఇవ్వు' అనిగానీ రాస్తున్నారు. అలా రాసినా పరవాలేదు. వీటి ఉద్దేశం కూడా సంబోధన తరువాత కాస్త గ్యాప్ ఇవ్వాలని చెప్పడమే.


మొత్తం మీద మనకు అర్థమయింది ఏమిటంటే రాము అనే అతను సీతను కాఫీ ఇమ్మని అడిగాడు.


ఆమె సమాధానం చూద్దాం.


ఏవండి కాఫి సంగతి సరె ఈరోజు మనం సినిమాకు వెల్దామ అంది సీత.


ఈ వాక్యంలో 'డి' కి దీర్ఘం ఇచ్చి, తరువాత ఆశ్చర్యార్థకపు గుర్తో లేక కామానో ఉంచి, 'కాఫి' ని 'కాఫీ' గా సవరించి, 'సరె' అనే పదాన్ని 'సరే' గా మార్చాలి. అక్కడ ఆమె గ్యాప్ ఇస్తుంది కాబట్టి కామానో రెండు చుక్కలో ఉంచాలి. 'వెల్దామ' ను 'వెళ్దామా' గా మార్చి తరువాత ఒక క్వశ్చన్ మార్క్ ఉంచితే అదే వాక్యం చక్కగా ఇలా మారుతుంది.


“ఏవండీ! కాఫీ సంగతి సరే.. ఈరోజు మనం సినిమాకు వెళ్దామా?” అంది సీత.


ఇప్పుడు ఈ వాక్యం అర్థవంతంగా మారింది కదా!


సాధారణంగా ఎక్కువమంది 'ఇంగ్లీష్ టు తెలుగు టైపింగ్' వాడుతూ ఉంటారు.ఇందులో సాధారణంగా దీర్ఘాలు రావడానికి అదనంగా మరో 'a' ని వాడాలి.

ఉదాహరణకు అమ్మా అని రాయాలంటే 'ammaa' అని టైపు చేయాలి.


***


అని, అనీ - ఈ రెంటిలో ఎప్పుడేది వాడాలో చూద్దాం..


తను కాలేజీకి వెళ్లనని చెప్పింది స్మిత.

ఇక్కడ 'వెళ్లనని' అని వాడాలి.


తనకు చదువంటే ఇష్టంలేదని చెప్పింది స్మిత.


ఇక్కడ 'ఇష్టం లేదని' అని వాడాలి.


ఈ రెండు వాక్యాలనీ వెంటవెంటనే చెప్పేటప్పుడు ఇలా చెప్పవచ్చు.


తను కాలేజీకి వెళ్లనని చెప్పింది స్మిత. తనకు చదువంటే ఇష్టంలేదనీ చెప్పింది.


అంటే 'తనకి చదువంటే ఇష్టం లేదనీ చెప్పింది' అనే వాక్యానికి అర్థం 'తనకు చదువంటే ఇష్టం లేదని కూడా చెప్పింది' అని.


ఈ రెండు వాక్యాలనీ కలిపి చెప్పాలంటే ఇలా చెప్పవచ్చు.

తను కాలేజీకి వెళ్లననీ, తనకు చదువంటే ఇష్టంలేదనీ చెప్పింది స్మిత.

రెండు వాక్యాలని కలిపినందువల్ల ఇక్కడ 'నీ' అనే అక్షరం వాడాము.


మరో ఉదాహరణ:


ఇంకా ఏమేమి ఇష్టం లేవని అడిగాడు శ్రీకర్.

వంట చెయ్యడం ఇష్టం లేదనీ, వడ్డించడం అసలు ఇష్టం లేదనీ తేల్చి చెప్పింది స్మిత.

నీకు తగ్గవాడు ఏ జూలోనో ఉంటాడని అన్నాడు శ్రీకర్.

అతన్నీ, అతని వంశాన్నీ దుమ్మెత్తి పోసింది స్మిత.

నిన్నెవరూ చేసుకోరనీ, చేసుకున్నా వారంలోనే సన్యాసుల్లో కలుస్తారనీ అన్నాడు శ్రీకర్.


ఈ ఉదాహరణలో ఎక్కడ 'ని' వాడాలో ఎక్కడ 'నీ' వాడాలో తెలిసింది కదా!


దీర్ఘాలు ఎక్కడ ఇవ్వాలో ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం.


ఒకపని ఇంకా జరుగుతూ ఉండగా- అని చెప్పేటప్పుడు కొన్ని పదాలకు దీర్ఘాలు వస్తాయి.

అతడు సాధారణ జీవితం గడుపుతున్నాడు.

అతడు సాధారణ జీవితం గడుపుతూ అందరితో మంచిగా ఉన్నాడు.


అన్నం తింటున్నాడు.

అన్నం తింటూ టివి చూస్తున్నాడు.


ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ పార్ట్ టైం పని చేస్తున్నాడు.

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ పార్ట్ టైం పని చేస్తూ ఎం. ఏ. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.


అతడు పదవిలో కొనసాగుతున్నాడు.

అతడు పదవిలో కొనసాగుతూ బాగా వెనకేసుకున్నాడు.


కొద్దిగా ప్రేమించమన్నాను.

అడిగే కొద్దీ బెట్టు చేసిందామె.


మొదటి వాక్యంలో 'కొద్ది' అని రాసాము.

రెండవ వాక్యంలో 'కొద్దీ' అని రాసాము.ఈరోజు ఆదివారం.

నేను రోజూ పేపర్ చదువుతాను.


నువ్వెప్పుడు వస్తావు?

నేనెప్పుడూ ముందుగానే వస్తాను.


ఎక్కడికి వెళ్ళావు?

ఎక్కడికీ వెళ్ళ లేదు.


ఎవరికి చెప్పావు?

ఎవరికీ చెప్ప లేదు.


అతడు పేపర్లు అమ్ముతుంటాడు.

అతడు పేపర్లు అమ్ముతూ నాకు కనిపించాడు.


అతడు పదిమందికి అన్నం పెట్టాడు.

పదిమందీ అతన్ని అభినందించారు.


అది కష్టమై పని.

ఎంత కష్టమైనా నేను చేస్తాను.


ది కష్టం?

చెయ్యాలనుకుంటే ఏదీ కష్టం కాదు.


ఇలా అవసరమైన పదాలకు దీర్ఘాలు ఇవ్వడంవల్ల ఆ వాక్యం పాఠకులకు సులభంగా అర్థమవుతుంది.


తదుపరి ఎపిసోడ్ లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

========================================================================

ఇంకా వుంది..

అప్పు తచ్చులు వాక్యరణ దోషాలు - 3 త్వరలో..

========================================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

(అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).56 views2 comments

2 commenti


తెలుగు వ్యాకరణాన్ని వివరిస్తూ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, ధన్యవాదాలు సార్.

ఈ episode లో నాకు రెండు doubts వచ్చాయి సార్. మొదటిది quotation marks గురించి. మామూలుగా english లో said అన్నాక comma వస్తుంది కానీ తెలుగులో 'అని అన్నాడు' అనే దానికి ముందు comma పెట్టాలేమో కదా మరి మీరెక్కడా అలా పెట్టలేదు. అంటే తెలుగులో comma పెట్టాల్సిన అవసరం లేదా అనేది నా మొదటి doubt.


రెండవ doubt Ellipsis (,,,) గురించి. Ellipsis ను Englishలో మూడు చుక్కలతో సూచిస్తారు. మీరు అన్ని చోట్లా రెండు చుక్కలతో సూచించారు. రెండింటికీ తేడా వుందా అనేది నా ఇంకో doubt.


Mi piace

@user-ui9wc4xj3c • 6 hours ago

So nice

Mi piace
bottom of page