top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

పుతిన్ బ్రో - జెలెన్ బ్రో


'Puthin Bro Jelen Bro' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 12/10/2023

'పుతిన్ బ్రో - జెలెన్ బ్రో' తెలుగు కథ

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఉదయం 6 గంటలకు శ్రీకాళహస్తిలో కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కాడు పుతిన్ బ్రో..


(అసలు పేరు చెబితే పేరును బట్టి కులాన్ని గెస్ చేసే ప్రబుద్ధులు ఉంటారని రష్యా కి సంబంధించిన పేరు పెట్టబడింది.)


ఒక చేత్తో న్యూస్ పేపర్, మరొక చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఆయాస పడుతూ తన సీట్ దగ్గరకి చేరుకున్నాడు. అయినా అనుమానం తీరక అటుపక్క సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తికి తన టికెట్ చూపించి, ‘నా సీట్ ఇదేనా’ అని అడిగాడు. అదేనని అతను చెప్పడంతో సీట్లో కూర్చొని, ముఖానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు. ఆయనకు దాదాపు యాభై ఏళ్ళుంటాయి. కాస్త రిలాక్స్ అయ్యాక చేతిలోని న్యూస్ పేపర్ ని తెరిచి అందులోని వార్తలని బిగ్గరగా చదవడం మొదలు పెట్టాడు. ఒక్కొక్క వార్త చదువుతూ, దానికి తన కామెంట్లు జోడిస్తూ చుట్టుపక్కల వారిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు.


మొదటి పేజీలోని రాజకీయ వార్తలు, వాటికి ఆయన కామెంట్లు పూర్తి అయ్యేసరికి ఒక గంట గడిచింది. తరువాత లోపలి పేజీలోకి వెళ్ళాడు పుతిన్ బ్రో.


అక్కడ ఒక న్యూస్ అతని దృష్టిని ఆకర్షించింది. బిగ్గరగా చదవడం మొదలు పెట్టాడు.


యువతిపై అత్యాచారం..

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఫలానా గ్రామానికి చెందిన యువతి అత్యాచారానికి గురైంది..


చదవడం ఆపాడు పుతిన్ బ్రో. ఆవేశంతో ఊగిపోతున్నాడు అతను.


"కాల్చి పారేయాలి ఇలాంటి దుర్మార్గుల్ని" అంటూ గట్టిగా అరిచాడు.


ఆ అరుపుకు ట్రైన్లో ఇంకా నిద్ర మత్తులో ఉన్నవాళ్లు ఉలిక్కిపడ్డారు. అతని మాటలు వింటున్న వారు, అతని వంక ప్రశంసాపూర్వకంగా చూశారు.


అతని పక్క సీట్ లో ఉన్న యువకుడు పుతిన్ బ్రో కి షేక్ హ్యాండ్ ఇచ్చి, “మీలాంటి ఆవేశపరులు మన దేశానికి ఎంతో అవసరం” అన్నాడు.


దాంతో పుతిన్ బ్రో మరింత రెచ్చిపోయాడు. తిరిగి పేపర్ చదవడం మొదలుపెట్టాడు.


"అత్యాచారం చేసినవాడు అదే గ్రామానికి చెందిన..”


అంతవరకు పెద్దగా చదువుతున్న పుతిన్ బ్రో అక్కడితో చదవడం ఆపాడు. ఎందుకంటే పేరును బట్టి, అత్యాచారం చేసిన వ్యక్తి తన కులం వాడని గ్రహించాడు.


పేపర్ ను పక్కన పెట్టి, "అయినా ఈరోజుల్లో ఆడవాళ్లు విచ్చలవిడిగా తయారవుతున్నారు. వాళ్లు వేసుకునే దుస్తులు చూస్తూ ఉంటే మగాడన్న వాడు చూస్తూ ఊరకే ఉండగలుగుతాడా? ఈ రోజుల్లో ఇంటర్నెట్ వల్ల కుర్రాళ్ళు పాడైపోయి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు" అన్నాడు.


పక్కనున్న వ్యక్తి "ఆపేశారేం? పూర్తిగా చదవండి" అన్నాడు.


దాంతో మళ్లీ పేపర్ ఓపెన్ చేసిన పుతిన్ బ్రో ఈసారి కాస్త గొంతు తగ్గించి నిందితుడి పేరును బయటికి చదివాడు. తరువాత వార్తను చదవడం కంటిన్యూ చేశాడు.


'ఈ విషయమై యువతి భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు'


అక్కడితో పేపర్ మడిచి బ్యాగ్ లో పెట్టేసాడు.


"ఈరోజుల్లో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు" అన్నాడు వేదాంత ధోరణిలో.


పక్కనున్న వ్యక్తి చిన్నగా నవ్వాడు. తర్వాత పుతిన్ బ్రో కి మాత్రమే వినపడేలా "మీరు 'డాష్ డాష్' కులం కదూ!" అన్నాడు.


"అవును. మీకెలా తెలిసింది.. మీరు కూడా మాకులపోడేనా?" ఆశ్చర్యం ఆనందం కలిసిన గొంతుతో అడిగాడు పుతిన్ బ్రో.


కాదన్నట్లు తల అడ్డంగా ఊపేడతను.


అయితే తను నిందితుడి పేరు చెప్పడానికి తటపటాయించినందువలన, అతను 'నేనుకూడా అదే క్యాస్ట్' అని కనిపెట్టేసాడన్నమాట.


ఈ ఆలోచన రాగానే కాస్త సిగ్గుపడ్డాడు.


ఇక తనని సమర్థించుకోవడానికి "నా ఉద్దేశం అది కాదు.. ఈ రోజుల్లో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో ఎవరూ చెప్పలేక పోతున్నారు" అంటూ సమర్ధించుకో జూశాడు.


పక్కనున్న వ్యక్తి పుతిన్ బ్రో వంక సూటిగా చూసి ఇలా అన్నాడు.


"చూడండి.. అత్యాచారానికి గురైన యువతి గాని, అత్యాచారం చేసిన వ్యక్తి గాని మీకు తెలిసిన వాళ్ళు కాదు. తెలియకపోయినా ఒక సాటి మనిషిగా స్పందించి మీ ఆవేశాన్ని వ్యక్తపరిచారు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు నేను మిమ్మల్ని అభినందించాను కూడా. కానీ ఆ వ్యక్తి కులం తెలియగానే చప్పబడిపోయారు.


కాల్చి చంపేయాలని అన్నవాళ్ళు, అతన్ని వెనకేసుకొస్తూ ఆ యువతిని తప్పు పట్టాలని చూశారు. తరువాత ఆ యువతి భర్త పేరును బట్టి, వాళ్లు కూడా మీ కులానికి సంబంధించిన వాళ్లని తెలుసుకున్నారు. అంటే నిందితుడు, బాధితురాలు ఇద్దరూ మీ వాళ్లే. దాంతో మీకు ఎక్కడలేని వైరాగ్యం వచ్చి న్యూస్ పేపర్ బాగ్ లో పెట్టేశారు" చెప్పాడు అతను.


"క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది కదా! ఇంతకీ మీ క్యాస్ట్ ఏమిటో.. మీకు మాత్రం క్యాస్ట్ ఫీలింగ్ ఉండదా" తనను సమర్ధించుకోవడం కంటిన్యూ చేశాడు పుతిన్ బ్రో.


చిన్నగా నవ్వాడు ఆ యువకుడు. “క్యాస్ట్ ఫీలింగ్ ఉండడాన్ని నేను తప్పు పట్టడం లేదు. ప్రతి క్యాస్ట్ లో కోట్లకు పడగలెత్తినవాళ్లు, కూటికి గతి లేని వాళ్ళు ఉన్నారు. మీ క్యాస్ట్ లో ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ సొంత డబ్బులతో వాళ్లను ఆదుకోండి. ఎవ్వరూ మిమ్మల్ని తప్పు పట్టరు. కానీ కేవలం నిందితుడు మీ క్యాస్ట్ అనే ఒకే ఒక్క కారణంతో మీకు ఏమాత్రం పరిచయం లేని, ఎక్కడో నిజామాబాద్ లో ఉన్న వ్యక్తిని సమర్థించాలనుకోవడం, అందుకోసం ఆడవాళ్లు ధరించే దుస్తులను, వాళ్ళ ప్రవర్తనను తప్పు పట్టడం ఏ రకంగా సమంజసం? ఆ వార్తలో తరువాత మీకే తెలిసింది కదా, అత్యాచారానికి గురైంది కూడా మీ క్యాస్ట్ యువతే అని.. మరి అతను క్యాస్ట్ ఫీలింగ్ తో ఆ యువతిని ఎందుకు వదల్లేదు? ఎందుకంటే క్రూరంగా ప్రవర్తించడం అతని స్వభావం. అలాంటి వాడిని సమర్థించాల్సిన అవసరం మీకు ఏముంది? అతన్ని కాల్చి చంపేయాలి అన్నంత ఆవేశం క్షణాల్లోనే ఎందుకు చప్పబడిపోయింది? మీరే ఆలోచించుకోండి..” అన్నాడు ఆ వ్యక్తి.


ఏమీ మాట్లాడలేదు పుతిన్ బ్రో. కాసేపటికి తేరుకొని, "ఇంతకీ మీ క్యాస్ట్ ఏమిటో చెప్పలేదు" అన్నాడు.


మళ్లీ నవ్వాడు ఆ యువకుడు. "తెలుసుకొని ఏం చేయాలనుకుంటున్నారు? నా క్యాస్ట్ లో ఎవరెవరు తప్పు చేశారో చిట్టా విప్పుతారు. అంతే కదా! ఒక క్యాస్ట్ లో ఉండేవాళ్లే మంచి వాళ్లని, ఇంకో క్యాస్ట్ వాళ్ళు దుర్మార్గులని అనుకోవడం పొరపాటు కానీ తప్పు చేసిన వాడు నా క్యాస్ట్ అయినా నేను సమర్థించను" చెప్పాడు అతను.


"మీరు చెప్పేది నిజమే కానీ ఊరికే తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీ క్యాస్ట్ చెప్పండి" మళ్ళీ అడిగాడు పుతిన్ బ్రో.


"ఒకసారి నా కాళ్ళ వంక చూడండి" అన్నాడు ఆ యువకుడు, తన ప్యాంటును పైకి మడుస్తూ.


అటువైపు చూసి నిర్ధాంత పోయాడు పుతిన్ బ్రో. ఆ యువకుడికి రెండు కాళ్ళూ లేవు. కృత్రిమ కాళ్ళు అమర్చి ఉన్నాయి.


"ఏమైంది? అసలు మీరేం చేస్తూ ఉంటారు" అడిగాడు పుతిన్ బ్రో.


ఆ యువకుడు సమాధానం ఇస్తూ "నేను మిలట్రీలో పనిచేసేవాడిని. నా సహచరుడి మీద బాంబ్ పడబోతుంటే నేను అతన్ని పక్కకు లాగి తప్పించాను. ఆ ప్రయత్నంలో రెండు కాళ్ళూ దెబ్బతిన్నాయి. నేను తప్పించిన సహచరుడు మీ కాస్టే. ఇక ఆ సమయంలో కింద పడ్డ నన్ను కాల్చడానికి వస్తున్న శత్రు సైనికులను మరో సహచరుడు అడ్డగించాడు. ఆ ప్రయత్నంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అతనిది మరో క్యాస్ట్. కానీ మేము ఎప్పుడూ అలా అనుకోలేదు. మాదంతా ఒకే కులం. మేము సైనికులం" చెప్పాడు ఆ యువకుడు.


"నన్ను క్షమించండి. నా ఆలోచన పొరపాటే" ఒప్పుకున్నాడు పుతిన్ బ్రో.


"అర్థం చేసుకోగలను. నేను ఒక గ్రామం నుంచి వచ్చిన వాడిని. చిన్న వయసులోనే మిలట్రీ కి వెళ్ళిపోయాను. నేను వెళ్లే నాటికి మా ఊర్లో అన్ని కులాల వారు, అన్ని మతాలవారు కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు చూస్తే ఎవరికి వాళ్లు వేరై పోయారు. కారణం కులం పేరుతో ఓట్లు సులభంగా సంపాదించుకోవచ్చని ప్రతి పార్టీ వాళ్లు అనుకోవడమే" చెప్పాడు అతను.


"ఇక మిమ్మల్ని క్యాస్ట్ గురించి అడగను. కనీసం మీ పేరైనా చెప్పండి" అడిగాడు పుతిన్ బ్రో.


"పేరును బట్టి క్యాస్ట్ ఊహించడానికి ప్రయత్నిస్తారా.. సరే ట్రై చేయండి. నా పేరు జెలెన్ బ్రో" చెప్పాడు ఆ యువకుడు.

***

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

Profile Link:

Youtube Podcast Link:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

(అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


58 views1 comment

1 Comment


DURGA PRASAD
DURGA PRASAD
Oct 19, 2023

Nice

Like
bottom of page