top of page

జంభోళ బంభ


'Jambhola Bambha' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar

'జంభోళ బంభ' తెలుగు కథ

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు మోహన్రావుగారు.

ఈ మధ్యనే రిటైర్ కావడంతో ఓటిటిలో సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తూంటారు ఆయన.


ఒకరోజు ఆలా టీవీ చూస్తూనే, భార్య లక్ష్మీదేవి ఫ్రిజ్ లోంచి ఒక గిన్నె పట్టుకొని వంటిట్లోకి వెళ్లడం గమనించారు.


"అన్నట్లు ఈ రోజు వంట ఏమిటో.. " భార్యకు వినపడేలా కాస్త గట్టిగా అడిగారు రావుగారు.


"మీకిష్టమైన బంగాళా దుంపల వేపుడు చేసి, బెండకాయ సాంబారు పెట్టాను" వంటిట్లోనుంచే సమాధానమిచ్చింది లక్ష్మీదేవి.


'కొంపదీసి నిన్నటిదేదైనా వెచ్చబెట్టి ఈ పూట భోజనానికి వడ్డిస్తుందా' అని ఒక్క క్షణం అనుమానం వచ్చింది రావుగారికి.


కానీ బంగాళా దుంపలు వేగేటప్పటి వాసనా, సాంబారులో తిరగమాత వేసినప్పుడు వచ్చే వాసనా ఇందాకే అయన ముక్కు పుటాలను తాకాయి.


'అయితే ఏ పై ఇంటి వాళ్ళకో, పక్క పోర్షన్ వాళ్ళకో నిన్నటి వంట ఏదైనా వెచ్చబెట్టి ఇస్తుందేమో.. అనుమానం రాగానే నెమ్మదిగా వంటిట్లోకి నడిచారు మోహన్రావుగారు.


అనుకున్నట్లే ఫ్రిజ్ నుండి తీసిన గిన్నెలోని ఆకుకూర పప్పును ఒవెన్ గిన్నెలో పోసి వెచ్చబెడుతోంది లక్ష్మీదేవి.


"అదేవిటి లక్ష్మీ! సాంబార్ అన్నావు.. మరీ.. " సందేహంగా అడిగారు రావుగారు.


"మీ అనుమానం పాడుగానూ.. గ్యాస్ స్టవ్ మీద తెర్లుతున్న సాంబార్ చూసికూడా అడుగుతారేమిటి? ఇది మీకు కాదు లెండి. పక్కింటి మధు అన్నయ్యగారికి నేను చేసే ఆకుకూరంటే చాలా ఇష్టమట. వాళ్ళావిడ మోహిని చాలాసార్లు చెప్పింది. అయన కూడా ఒకసారి నాతోనే స్వయంగా చెప్పారు. ఇప్పుడే వెళ్లి ఇచ్చేసి వచ్చి, మీకు భోజనం వడ్డిస్తాను" అంది లక్ష్మీదేవి.


"ఇలా నిలవుంచినవి ఎవరికీ ఇవ్వొద్దని చాలాసార్లు చెప్పాను కదా నీకు.. వాళ్ళకేదైనా అయిందంటే ఆ పాపం మనదే కదా! అంతగా ఇవ్వాలనుకుంటే ఫ్రెష్ గా చేసినవి ఇవ్వు" కాస్త అసహనంగా అన్నారు రావుగారు.


"అయ్యోరామా.. ఈ ఆకుకూర పప్పు ఫ్రెష్ గా చేసిందేనండీ.. మొన్ననే చేసాను" ఒట్టేస్తున్నట్లుగా తలమీద చేయుంచుకొని చెప్పింది లక్ష్మీదేవి.


"మరి మొన్నే ఇచ్చి వుండొచ్చుగా.. రెండు రోజులు ఫ్రిజ్ లో మగ్గితే టేస్ట్ ఏమైనా పెరుగుతుందా?" నవ్వుతూనే చురక వేశారు రావుగారు.


మొన్న చేసేటప్పుడే వాళ్లకూ కలిపి చేశానండీ. ఆవిడని ఒట్టి అన్నం మాత్రం వండుకోమన్నాను. కానీ అయన బంధువులు ఎవరికో సీరియస్ గా ఉందని తెలీడంతో ఆ రోజు భోజనం కూడా చెయ్యకుండా బయలుదేరారు యిద్దరూ.


మొన్న రాత్రికి తిరిగి ఒచ్చేయొచ్చని ఆ అన్నం ఫ్రిజ్ లో పెట్టిందావిడ. కానీ రావడం కుదరలేదు. నిన్న ఉదయం ఫోన్ చేసి, రావడానికి కుదరలేదనీ, ఫ్రిజ్ లో ఉన్న అన్నం పాడైతే వాసన వస్తుందేమో తీసేయమనీ చెప్పింది.


వాళ్ళింటి తాళాలు ఒక సెట్ మన దగ్గర ఎప్పుడూ ఉంటాయి కదా.. తీసి చూస్తే అన్నం బాగానే ఉంది. నిన్న మధ్యాహ్నం ఆ అన్నమే వెచ్చబెట్టి.. " చెప్పడం ఆపి భర్త ముఖంలోని ఫీలింగ్స్ గమనించి చిన్నగా నవ్వింది లక్ష్మీదేవి.


"ఏమిటా ఫీలింగ్స్? ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఒళ్ళు తూలుతున్నట్లు, కళ్ళు తిరుగుతున్నట్లు ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా? ఆ అన్నం తిన్నది నిన్న మధ్యాహ్నం. నిన్న రాత్రికి అరిగిపోయి ఉంటుంది. పనీపాటా లేకుండా రోజంతా టీవీ ముందర కూర్చుంటారు కాబట్టి కాస్త ఆలస్యమైనా, ఇవాళ పొద్దుటికైనా అరిగిపోయి ఉంటుంది. కాబట్టి మీరేమీ భయపడనక్కరలేదు" అంది తన నవ్వును కొనసాగిస్తూ.


"నువ్వు నమ్మవు గానీ నిన్న రాత్రి కడుపులో కాస్త గడబిడగా అనిపించిందోయ్" అన్నారు మోహన్ రావు గారు.


"నిన్న సాయంత్రం సందు చివరి వరకు వాకింగ్ చేసి అలిసిపోయి, పానీ పూరి తినేసి వచ్చారు కదా. దాని ప్రభావం అయి ఉంటుంది ఆ గడబిడకు కారణం" అంది మూతికి అడ్డు పెట్టిన కొంగు చాటున తన నవ్వును దాస్తూ.


"ఏమో.. పక్కవాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకోవడం నాకు నచ్చదు" అన్నారు రావుగారు.


"అయినా ఈ మధ్య పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా చెట్నీ, సాంబారు ఫ్రిజ్ లో ఉంచుతున్నారు. ఉదయాన్నే బయటికి తీసి, చెట్నీని చల్లదనం తగ్గాకా, సాంబారును మళ్ళీ వెచ్చచేసీ, వడ్డిస్తున్నారు. మొన్నామధ్య హైదరాబాదులో మా చెల్లెలి ఇంటికి వెళ్ళినప్పుడు 'చెట్నీ&సాంబారు' హోటల్ కి ఉదయాన్నే వెళ్తే అలానే చేశారు.


'చూడు బాబూ! చెట్నీ ఫ్రిజ్ లో పెట్టినా పరవాలేదుగానీ ఉల్లిపాయ వేసిన సాంబార్ మాత్రం పెట్టకండి. చద్ది వాసన వచ్చి, తెలిసిపోతుంది' అన్నాను. నాకెలా తెలిసిందోనని ఆశ్చర్యంగా చూసారు హోటల్ వాళ్ళు" అంది లక్ష్మీదేవి.


"థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియెన్స్ ఇక్కడ. ఆ విషయం వాళ్లకు తెలీదుగా.. అన్నట్లు ఈరోజేదో ఫంక్షన్ కి వెళ్తున్నట్లు మధు చెప్పినట్లు గుర్తు. ఓ సారి కాల్ చేస్తాను" అంటూ మధుకి ఫోన్ చేసాడు.


మధు లిఫ్ట్ చేయగానే "జంభోళ బంభ! ఊరినుంచి ఎప్పుడొచ్చారు?" అని అడిగారు.


“ఒక గంటే అయ్యింది. మా ఆవిడకు బడలికగా ఉంటే, చెల్లెమ్మ నాకిష్టమైన ఆకుకూర పప్పు చేసి పంపుతానందట. అన్నం ప్లేట్ లలో పెట్టుకొని వెయిట్ చేస్తున్నాం" చెప్పాడు మధు.


"జంభోళ బంభ! ఫ్రెష్ గా చేసిందిగా. మరీ తెర్లుతోందని ఆగింది. ఇదిగో.. ఇప్పుడే వచ్చేస్తుంది" అని ఫోన్ పెట్టేసి, "వాళ్ళు వెయిట్ చేస్తున్నారట, వెళ్ళు" అన్నారు మోహనరావు గారు.


“వెళ్తాను గానీ మధ్యలో ఈ జంభోళ బంభ ఏమిటి? ఎవరైనా 'హలో' అని పలకరించుకుంటారు. ఈ మధ్య కొందరు 'జై శ్రీరామ్' అని అంటున్నారు. కానీ మన అపార్ట్మెంట్స్ లో వాళ్ళు.. అందునా మగవాళ్ళు 'జంభోళ బంభ' అంటున్నారు. ఆమాటకు అర్థమేమిటో.. " అంది కాస్త అనుమానంగా చూస్తూ.


"అది ఏదో సినిమాలో ఒక ఊతపదం. సరదాగా వాడుతున్నాం. దానికి అర్థమేమీ ఉండదు. కొద్ది రోజులు గడిస్తే రాష్ట్రమంతా వాడుతారు. ముందు నువ్వు వెళ్లి ఆ ఫ్రెష్ వంటకం ఇచ్చేసిరా" అన్నారు రావుగారు నవ్వుతూ.


ఓ వారం తరువాత రావుగారు పడుకొని ఉన్న సమయంలో అయన ఫోన్ మోగింది.


సెకండ్ ఫ్లోర్ నుండి మూర్తిగారు చేస్తున్నారు.


లిఫ్ట్ చేసి, అయన పడుకుని ఉన్నారని చెబుదామనుకుంది లక్ష్మీదేవి.


ఆమె మాట్లాడేలోగానే అటువైపునుండి మూర్తిగారు, "జంభోళ బంభ! ఈరోజు మా ఇంట్లో ఫ్రెష్ గా మజ్జిగపులుసు పెట్టింది మా ఆవిడ. నీకు ఇష్టమని మీ ఇంటికి తీసుకొని వస్తోంది" అన్నారు, ఫ్రెష్ అనే పదం వత్తి పలుకుతూ.


ఏమీ విననట్లుగా భర్తను నిద్రలేపి ఫోన్ అందించి, “సెకండ్ ఫ్లోర్ మూర్తి అన్నయ్యగారు కాల్ చేశారు. కట్ అవుతుందేమోనని లిఫ్ట్ చేసాను. మాట్లాడండి" అంది.


మూర్తితో మాట్లాడాక 'జంభోళ బంభ' అని ఫోన్ పెట్టేసారు రావుగారు.


మరి కాస్సేపటికి మూర్తిగారి భార్య సరళ వీళ్ళింటికి వచ్చింది.

బెడ్ రూమ్ లో ఉన్న మూర్తిగారు ఒక చెవి హాలువైపు తిప్పి ఉంచారు.


"మొన్న చేసాను. అప్పుడే ఇద్దామనుకుంటే మీ ఇంట్లో ఆకుకూర చేశామన్నారు. అందుకని ఈ రోజు ఇస్తున్నాను" అంది సరళ.


"అన్నయ్యగారు ఈయనకు ఫోన్ చేశారు, 'జంభోళ బంభ' అంటూ. అయినా ఆ మాటకు అర్థం అడిగితే ఊరికే వాడుతున్నాం అన్నారీయన" అంది లక్ష్మీదేవి.


"మా వారుకూడా ఆ మాట వాడుతూ ఉంటారు.. అర్థం పర్థం లేకుండా. సరే, వస్తాను వదినా" అంటూ వెళ్ళింది సరళ.


ఆ పూట భోజనానికి కూర్చుంటూ "మజ్జిగపులుసు ఇష్టమే కానీ ఈ రోజు తినాలని లేదోయ్! కడుపులో తిప్పుతున్నట్లుగా ఉంది. రాత్రి గానీ, ఉదయంగానీ పానీపూరి తినలేదు, నిజం" అన్నారు రావుగారు ఒట్టు పెడుతున్నట్లుగా తలమీద చెయ్యి పెట్టుకుని.


ఇంతోటిదానికి ఒట్టు దాకా ఎందుకులెండి. ఈరోజే చేశానని చెప్పిందిగా.. ఫ్రిజ్ లో పెడితే నాలుగు రోజులైనా ఉంటుంది. మీ పొట్ట బాగున్నపుడే తినండి" అంటూ ఆ గిన్నె అప్పుడే ఫ్రిజ్ లో ఉంచింది లక్ష్మీదేవి.


జ్వరం తో ఉన్నప్పుడు కూడా చారన్నం తినమంటే సహించదని, మజ్జిగ పులుసు పెట్టమంటారీయన. మరిప్పుడు మూర్తిగారు ఫోన్ లో జంభోళ బంభ అనడం, ఎదురుగా మజ్జిగ పులుసు ఉన్నా ఈయన వద్దనడం.. ఈ రెంటికీ ఏదో లింక్ ఉంది. ‘సాయంత్రం మహిళామండలి మీటింగ్ పెట్టి ఆడాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవాలి’ అని అప్పటికప్పుడు నిశ్చయించుకొంది.


***

వీళ్ళుండే కాంప్లెక్స్ లో మొత్తం పదహారు అపార్ట్మెంట్ లు ఉంటాయి.


గ్రౌండ్ ఫ్లోర్ లో కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ప్రతినెలా మొదటి ఆదివారం అపార్ట్మెంట్ ల వాళ్ళందరూ అక్కడ సమావేశమై, ఏవైనా సమస్యలు ఉంటే చర్చించుకుంటారు.


ఆ రోజు కూడా ముందుగా ఆ కాంప్లెక్ సెక్రెటరీ, ప్రెసిడెంట్ మాట్లాడారు.


తరువాత ఎవరైనా మాట్లాడేవాళ్ళుంటే వేదిక పైకి రమ్మన్నారు.


లక్ష్మీదేవి వేదిక వద్దకు వెళ్లి మైక్ అందుకుంది.

ముందుగా అందరికీ నమస్కారాలు చేసి తన ఉపన్యాసం ప్రారంభించింది.


"జంభోళ బంభ! అర్థం తెలీక పోయినా మా వారు ఈమాట ఎక్కువగా వాడుతూ ఉండటంతో నేను కూడా వాడాను. నా మనస్సును కలచివేసిన ఒక విషయం మీతో పంచుకోవాలనిపించింది.


పెళ్ళికి ముందు మేము తెనాలిలో ఉండేవాళ్ళం. మా పక్కింటో ఒక పేద పురోహితుడి కుటుంబం ఉండేది. వాళ్ళ పెద్దమ్మాయి నా ఈడుదే. ఆ తరువాత మరో ఇద్దరు అడ పిల్లలు వాళ్ళకి. పేదరికంలో ఉన్నా ఆత్మాభిమానం ఉన్నవాళ్లు. ఉన్నంతలో సర్దుకుని పిల్లల్ని చదివించేవారాయన. పిల్లలు ముగ్గురూ వాళ్ళ క్లాసుల్లో ఫస్ట్ రాంక్ లో ఉండేవాళ్ళు. మాకు మంచి ఫామిలీ ఫ్రెండ్స్ కావడంతో మా ఇంట్లో ఏం చేసినా వాళ్లకు ఇచ్చేవాళ్ళం. తరువాత మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావడంతో ఒంగోలుకు వచ్చేసాం. కొద్ది రోజులకు వాళ్ళను కాంటాక్ట్ చెయ్యడం తగ్గిపోయింది.


అనుకోకుండా పోయిన సంవత్సరం తెనాలిలో ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ పురోహితుడి పెద్దమ్మాయి కనిపించింది.


ఆమె చెప్పింది విని నా కంట్లో నీళ్లు వచ్చాయి.


మేము ఉన్నప్పుడు మేమిచ్చే పదార్థాలతో, వాళ్ళ భోజనం ఖర్చు బాగా తక్కువగా ఉండేదట. పౌరోహిత్యంలో వచ్చే కొద్దిపాటి డబ్బులతో పిల్లలు చదువుకోగలిగే వారట.

మేము అక్కడినుండి వచ్చేశాక, వాళ్లకు వచ్చే సంపాదన తిండి ఖర్చులకే సరిపోయేదట.


దాంతో పిల్లల చదువులు ఆగిపోయాయి. ముగ్గురూ ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్లకు తగ్గ సంబంధాలు చేసుకున్నారట. ఈ అమ్మాయి భర్తతో కలిసి పెళ్లిళ్లకు, ఫంక్షన్ లకు వంటలు చేసి జీవనం సాగిస్తున్నారు.


ఒకవేళ మేము అక్కడే ఉండి ఉంటే వాళ్ళ చదువులు కొనసాగేవేమో..


వాళ్ళకోసం మేము అదనంగా చేసిందేమీ లేదు. కానీ మనం వృధా చేసే ఆహారం మరొకరికి ఎంతో ఉపయోగ పడుతుందనిపించింది. అప్పటినుండి మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో.. అదే.. జంభోళ బంభలో భద్రపరిచి ఒకరికొకరం ఇచ్చుకుంటున్నాం.


అన్నం పరబ్రహ్మ స్వరూపమని మీకు తెలియంది కాదు. మిగిలిన ఆహారం డస్ట్ బిన్ లో వేసి డంపింగ్ యార్డ్ కి చేర్చడం కంటే ఎవరో ఒకరికి ఇవ్వడం మేలు కదా! అయితే మనం ఇచ్చే దాంతో బ్రతికేవాళ్లు ఈ కాంప్లెక్ లో ఎవరూ లేరని మీరు అనొచ్చు. కానీ వృధా చెయ్యడం మానితే మనం అదనంగా కొనే ఆహార పదార్థాలు మరొకరికి అందుబాటులో ఉంటాయి కదా. ప్రపంచంలో ఎంతోమంది ఆకలితో మరణిస్తున్నారని న్యూస్ ఛానళ్లలో చూస్తున్నాం కదా. వారికి డైరెక్ట్ గా సహాయపడకపోయినా, ఆహారాన్ని వృధా చెయ్యడం మానితే ఎందరికో సహాయం చేసినట్లు అవుతుంది కదా!


వంట చెయ్యడానికి బద్దకించి మేము ఇలా చేస్తున్నామని మాత్రం దయచేసి అనుకోకండి. ఒక్క ఆహారం విషయంలోనే కాదు.. వృధాగా లైట్లు, ఫ్యాన్లు తిరుగుతున్నా, నీళ్లు వృధా అవుతున్న మా ఆడవాళ్ళం చాలా ఫీల్ అవుతాము. జంభోళ బంభ"


అంటూ తన ఉపన్యాసాన్ని ముగించింది లక్ష్మీదేవి.


ఆ కాన్ఫరెన్స్ హాలంతా చప్పట్లతో మారుమోగి పోయింది.


'జంభోళ బంభ' అనుకుంటూ అందరూ బయటకు వచ్చారు.

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

Profile Link:

Youtube Podcast Link:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

(అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).






76 views1 comment

1 Comment


ramadugu61
Sep 28, 2023

Super Bhava Garu Refregirator story super 🤣😎

Like
bottom of page